close

ప్ర‌త్యేక క‌థ‌నం

హాంకాంగ్‌ వాసుల అస్తిత్వ పోరాటం

అప్పగింత బిల్లుపై ఆగ్రహావేశాలు
తొమ్మిది వారాలుగా నిరసనలు

హాంకాంగ్‌.. ఈ పేరు చెప్పగానే ఆకాశాన్ని తాకే భవంతులు కళ్లముందు కదలాడుతాయి. బ్రిటిష్‌ వారు 1997లో ఈ ప్రాంతాన్ని చైనాకు అప్పగించారు. ఇప్పుడు అక్కడే హాంకాంగ్‌ వాసులు స్వీయ అస్తిత్వం కోసం పోరాడుతున్నారు. నేరస్థుల అప్పగింత బిల్లుపై భగ్గుమంటున్నారు. మొదట్లో ‘ఉప్పు’ పంటకు పెట్టింది పేరైన ఈ ప్రాంతం.. ప్రస్తుతం నిప్పులకొలిమిని తలపిస్తోంది. ప్రజాస్వామ్య సంస్కరణలు, సార్వత్రిక ఓటుహక్కు తదితర డిమాండ్లను ఆందోళనకారులు వినిపిస్తున్నారు. బ్రిటిష్‌ వారి నుంచి బదిలీ అయ్యాక అమల్లోకి వచ్చిన ‘బేసిక్‌ లా’ ముసుగులోనే చైనా ప్రభుత్వం తమను కబళించే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు. బిల్లును సస్పెండ్‌ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించినా.. ఆందోళనలు ఆగడం లేదు.

తాజా వివాదం
నేరస్థులను చైనా సహా ఇతర దేశాలకు అప్పగించే బిల్లును హాంకాంగ్‌ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రతిపాదించింది. దీంతో బిల్లును నిరసిస్తూ హాంకాంగ్‌లో ఆందోళనలు మొదలయ్యాయి. తైవాన్‌లో ఓ హత్య కేసు నిందితుడు హాంకాంగ్‌లో తలదాచుకుంటున్నట్లు సమాచారం. సరైన చట్టం లేనందున హాంకాంగ్‌ ప్రభుత్వం అతడిని అప్పగించలేని పరిస్థితి. ‘ఒక దేశం, రెండు వ్యవస్థలు’ ఉండడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం తాజా బిల్లును ప్రవేశపెట్టించింది. ఈ బిల్లు ముసుగులో చైనా ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతుందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తే చైనాకు తీసుకువెళ్లి అణచివేసే ప్రమాదం ఉందని ఆందోళనకారులు చెబుతున్నారు. హాంకాంగ్‌ న్యాయవ్యవస్థ స్వతంత్రతకు సైతం ముప్పు పొంచి ఉందంటున్నారు. దాదాపు తొమ్మిది వారాలుగా ప్రతి ఆదివారం రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. చైనాతో అనుసంధానమైన హైస్పీడ్‌ రైలు నెట్‌వర్క్‌లో భాగంగా హాంకాంగ్‌లో నిర్మించిన రైల్వేస్టేషన్‌లో చైనా వలసల విభాగం కార్యాలయం ఏర్పాటుచేయడం తదితర అంశాలు హాంకాంగ్‌ వాసుల ఆగ్రహానికి కారణమయ్యాయి. నిరసనల్లో భాగంగా సోమవారం బంద్‌కు పిలుపునివ్వడంతో దాదాపు 250 వరకు విమాన సర్వీసులు రద్దయ్యాయి. రహదారులపైకి వచ్చిన నిరసనకారులు రాత్రి వరకు ఆందోళనలు కొనసాగించారు. పోలీస్‌స్టేషన్లను ముట్టడించారు. చైనా మద్దతుదారులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కొందరు పొడవాటి కర్రలతో నిరసనకారులపై దాడి చేశారు. దీంతో అక్కడ పరిస్థితి చేయిదాటిపోయింది. ఈ సందర్భంగా 148 మంది ఆందోళనకారులను అరెస్టుచేసినట్లు పోలీసులు తెలిపారు. బాష్పవాయు గోళాలను, రబ్బర్‌ బుల్లెట్లను ప్రయోగించారు.

చైనా ప్రమేయం ఏమిటంటే..
క్విన్‌ రాజవంశం పాలనలో ఓ రూపు సంతరించుకున్న హాంకాంగ్‌ మొదటి నల్లమందు యుద్ధం సమయంలో బ్రిటిష్‌వారి పరమైంది. అనంతరం కొద్దిరోజులు జపనీయులు ఆక్రమించుకున్నారు. చివరగా.. 1984లో బ్రిటన్‌-చైనాల మధ్య కుదిరిన ‘సైనో-బ్రిటిష్‌ ఉమ్మడి ప్రకటన’ ప్రకారం హాంకాంగ్‌ జులై 1, 1997 నుంచి చైనా పరమైంది. అప్పటినుంచి ఓ స్వతంత్ర ప్రాంతంగా మనుగడ సాగిస్తోంది. 1997లో కుదిరిన ఒప్పందం ప్రకారం అమల్లోకి వచ్చిన చైనా బేసిక్‌ లా మరో 28 ఏళ్ల తర్వాత అంటే 2047లో (ఒప్పందం కుదిరినప్పటి నుంచి 50 సంవత్సరాలు) ముగుస్తుంది. ఆ తర్వాత పరిస్థితి ఏమిటనే విషయమై ప్రస్తుతానికి స్పష్టత లేదు. బేసిక్‌ లా ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, న్యాయమూర్తులు, కీలక అధికారుల నియామకాలు వంటివి చైనా చూస్తుంది. ఇందుకోసం హాంకాంగ్‌లో చైనా తరఫున సీఈవో ఉంటారు.

సైన్యం కల్పించుకుంటుందా!
చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ బలగాలు హాంకాంగ్‌లో ఉన్నా.. తాజా వివాదంలో తలదూర్చకపోవచ్చునని పరిశీలకులు చెబుతున్నారు. పరిపాలనను గాడిలో పెట్టడానికి, విపత్తు సహాయక చర్యల వంటి విషయాల్లో సైన్యం సాయానికి హాంకాంగ్‌ చట్టాలు అనుమతిస్తాయి. ఇదే విషయాన్ని చైనా ప్రతినిధి గుయాంగ్‌ వద్ద ప్రస్తావించగా.. హాంకాంగ్‌ పోలీసులు పరిస్థితిని చక్కదిద్దగలరని విశ్వాసం వ్యక్తంచేశారు.

మేం చైనీయులం కాదు
హాంకాంగ్‌లో ఉంటున్న వారిలో చాలా మంది చైనీయులం అని చెప్పుకోడానికి ఇష్టపడరు. హాంకాంగ్‌ విశ్వవిద్యాలయం సర్వేలో ఇదే విషయం వెల్లడైంది. ఆ సర్వేలో పాల్గొన్నవారిలో 11% మందే తమను చైనీయులుగా పిలిస్తే అంగీకరిస్తామని చెప్పగా.. 71% మంది దాన్ని వ్యతిరేకిస్తామన్నారు.

ప్రధాన డిమాండ్లు
* బిల్లును సంపూర్ణంగా ఉపసంహరించుకోవాలి.
* ఆందోళనల సందర్భంగా పోలీసుల హింసాత్మక చర్యలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలి.
* హాంకాంగ్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి కెర్రీ లామ్‌ రాజీనామా చేయాలి
* అరెస్టుచేసిన వారిపై ఎలాంటి అభియోగాలు మోపకుండా బేషరతుగా విడుదల చేయాలి.

నిప్పుతో చెలగాటం వద్దు

హాంకాంగ్‌లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ప్రదర్శనలతో ఆ ప్రాంతం ప్రమాదపు అంచున నిలిచింది. సంయమనాన్ని బలహీనత అనుకోవద్దు. ఆందోళనకారులు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు.

-యాంగ్‌ గుయాంగ్‌, హాంకాంగ్‌, వ్యవహారాల కార్యాలయ అధికార ప్రతినిధి (చైనా)

బిల్లు ఓ సాకు మాత్రమే..

హాంకాంగ్‌ను ధ్వంసం చేయడమే ఆందోళనకారుల నిజమైన లక్ష్యం. ఇందుకోసం వారు నేరస్థుల అప్పగింత బిల్లును ఓ సాకుగా మాత్రమే చూపుతున్నారు. 

- కెర్రీ లామ్‌, హాంకాంగ్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.