Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

బలగాల నీడలో...

కశ్మీర్‌లో కొనసాగుతున్న నిషేధాజ్ఞలు
లోయలో 300 మంది ఉగ్రవాదులు
భారీగా మోహరించిన భద్రతా బలగాలు
ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

దాదాపు 300 మంది ఉగ్రవాదులు.. 3 లక్షల మంది భద్రతా సిబ్బంది.. ఇప్పటికైతే పరిస్థితి ప్రశాంతం.. కానీ ఎప్పుడేమవుతుందోనన్న భయం. ఇప్పటివరకు అవాంఛనీయ ఘటనలేవీ చోటుచేసుకోకున్నా.. కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఉగ్రవాదులకు మద్దతిచ్చే ప్రజల సంఖ్య ఎక్కువగా ఉండటమే అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో నిషేధాజ్ఞలను సడలించాలని భావిస్తున్నా.. అల్లరిమూకలు రెచ్చిపోయే అవకాశం ఉంది కాబట్టి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులంతా దక్షిణ కశ్మీర్‌లోని ఏడు జిల్లాల్లోనే ఉంటారన్నది పోలీసుల అంచనా.  ఈమేరకు భద్రతాసిబ్బందిలో సగం మందిని ఇక్కడే మోహరించారు. సోమవారం బక్రీద్‌ కావడంతో ఆంక్షలు సడలించకపోతే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సడలించినపుడు పరిస్థితి అదుపుతప్పితే దారిలోకి తేవడం కష్టమని భావిస్తున్నారు. పరిస్థితిని అదుపుచేసేందుకు ముందుగానే కేంద్రం భారీగా బలగాలను తరలించింది. జిల్లా, డివిజన్‌ స్థాయిల్లోను, శ్రీనగర్‌లోని పౌర సచివాలయంలోను పనిచేసే ఉద్యోగులంతా శుక్రవారం నుంచి విధులకు హాజరు కావాలని జమ్మూ-కశ్మీర్‌ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఆదేశించారు. సాంబా జిల్లాలో విద్యాసంస్థలూ తెరుచుకోనున్నాయి.

ముందస్తు అరెస్టులు..
కశ్మీర్‌లోయలో సమస్యలు సృష్టిస్తారనుకున్న వారినే అదుపులోకి తీసుకుంటున్నామని, ఇలాంటి వారి సంఖ్య వందల్లోనే ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా జమ్మూ-కశ్మీర్‌కు బాహ్యప్రపంచంతో సంబంధాలు లేవు. ఉగ్రవాద సమస్య ఎక్కువున్న జిల్లాల్లో చరవాణులూ పనిచేయట్లేదు. పోలీసు అధికారులకు దాదాపు 200 శాటిలైట్‌ ఫోన్లు అందజేశారు. 370వ అధికరణం రద్దుకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి, నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందుకు కార్గిల్‌లో పలువురిని అరెస్టుచేశారు. కాగా సెక్షన్‌ 144ను ఉల్లంఘించి, పోలీసులతో ఘర్షణ పడినందుకు ఐక్య కార్యాచరణ కమిటీకి చెందిన 300 మందిని అరెస్టు చేశారు. జమ్మూ-కశ్మీర్‌లో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. ప్రజారవాణా స్తంభించింది. ప్రైవేటు వాహనాలూ అంతంతమాత్రమే. శ్రీనగర్‌ నుంచి బారాముల్లా వెళ్లేందుకు భార్యాభార్తలు 17 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వచ్చింది. తన కుమార్తె ఆందోళనగా కబురుపెట్టడంతో శ్రీనగర్‌కు చెందిన మొహ్మద్‌ రంజాన్‌ 35 కి.మీ. దూరంలోని బద్గాం వెళ్లాలనుకున్నారు. వాహనాలు దొరక్క 12 కి.మీ.లు నడిచి, స్పృహతప్పి పడిపోయారు. భద్రతాసిబ్బంది ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. లోయలో చాలామంది పరిస్థితిదే.

విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం
దిల్లీ: కశ్మీర్‌ పరిణామాల క్రమంలో దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈనెల 10 నుంచి 30 వరకు సందర్శకుల రాకపై నిషేధం విధించారు. ఈ మేరకు బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బీసీఏఎస్‌) ఒక ప్రకటన జారీ చేసింది. సందర్శకులకు ప్రవేశ టిక్కెట్ల విక్రయాన్ని శనివారం నుంచి నిలిపివేయనున్నారు. విమానం బయలుదేరటానికి 3 నుంచి 4 గంటలు ముందుగానే ప్రయాణీకులు విమానాశ్రయానికి చేరుకోవాలని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాధికారులు ప్రయాణీకులకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.