close

ప్ర‌త్యేక క‌థ‌నం

కొత్తబాటలో కశ్మీరం

జమ్మూ-కశ్మీర్‌ విషయంలో రాజ్యాంగపరమైన కీలక ఘట్టం ముగిసింది. అక్టోబర్‌ 31 నుంచి కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ-కశ్మీర్‌ ప్రయాణం మొదలవుతుంది. లద్దాఖ్‌దీ ఇదేతరహా ప్రయాణమైనా దేశవాసుల ఆసక్తి అంతా కశ్మీర్‌పైనే ఉంది. పరిపాలనాపరంగా కశ్మీర్‌ ఉండే పరిస్థితి గురించి పునర్‌వ్యవస్థీకరణ బిల్లులోనే స్పష్టంగా ఉంది. పుదుచ్ఛేరిలో లాగా అక్కడ పరిపాలన వ్యవస్థ ఉంటుంది. ఎన్నికైన ప్రతినిధులతో కూడిన అసెంబ్లీ ఉన్నా దాని అధికారాలు పరిమితం. మంత్రివర్గం సలహాను కచ్చితంగా పాటించాల్సిన అవసరం లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉండదు. తన విచక్షణను వినియోగించి మంత్రివర్గం సలహాలేకుండానే కొన్ని కీలక చర్యలు తీసుకోవచ్చు. స్వయంగా కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీచేయొచ్చు. అందుకే బిల్లులో కూడా పుదుచ్ఛేరికి వర్తించే రాజ్యాంగ నిబంధనలు జమ్మూ-కశ్మీరుకూ వర్తిస్తాయని పేర్కొన్నారు. రాజ్యాంగంలో రాష్ట్రజాబితా కింద ఉన్న అంశాలపై జమ్మూ-కశ్మీర్‌ అసెంబ్లీ చట్టాలు చేస్తుంది. ఇతర రాష్ట్రాల్లాగే ఈ హక్కు ఉన్నా అవసరమనుకుంటే రాష్ట్ర జాబితాలోని ఏ అంశంపైనైనా పార్లమెంటుకు చట్టంచేసే అధికారం ఉంటుంది. శాంతిభద్రతలు, పోలీసు వ్యవస్థపై నిర్ణయాధికారం కేంద్రానికే ఉంటుందని బిల్లులో చెప్పారు. శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని నిర్ణయానికి వచ్చాకే ఎన్నికలు జరుగుతాయి. ఆలోగా నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణను చేపడతారు. నిషేధాలు, ఆంక్షలు తొలగి, రాజకీయ నాయకులకు స్వేచ్ఛ లభించినప్పుడు గాని అక్కడి ప్రజల ప్రతిస్పందన తెలియదు. దాన్నిబట్టే కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్రహోదా ఇచ్చే అంశంపై కేంద్రం ఆలోచన చేసే అవకాశముంటుంది. ఇది ఇప్పుడే జరిగే పనికాదు.

సంక్షేమ చర్యలే కీలకం

అధికరణం 370 అమలును ఆపివేయటం, రాష్ట్ర హోదాను తీసివేయటాన్ని కశ్మీర్‌ ప్రజలు జీర్ణించుకోవాలంటే అక్కడ సంక్షేమ చర్యలు పెద్దఎత్తున చేపట్టాలి. గవర్నర్‌ పాలనలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు మంచి ఫలితాలు ఇచ్చాయన్న అంచనాతో ప్రభుత్వం ఉంది. స్థానిక సంస్థలకు ఇచ్చే నిధులు సమర్థంగా పంపిణీ చేయగలిగామనీ ఆ సంస్థల ప్రతినిధుల్లో ఇంతకుముందు ఎన్నడూ లేని విశ్వాసాన్ని కల్గించామని కేంద్రం నమ్ముతోంది. ఎన్నికలకు ముందు రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనకబడిన వారికి కల్పించిన 10 శాతం రిజర్వేషన్లను కశ్మీర్‌లో వర్తింపచేసే విషయాన్ని కూడా పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిన నాటి నుంచి 106 కేంద్రచట్టాలు కశ్మీర్‌లో అమల్లోకి వస్తాయి. బహుశా అక్టోబర్‌ 31 నుంచే ఈ చట్టాల అమలు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న 153 చట్టాలు రద్దవుతాయి. గవర్నరు పరిపాలనలో వచ్చిన 11 చట్టాలూ అటకెక్కుతాయి. జమ్మూ-కశ్మీర్‌లో అమల్లో ఉన్న మరో 166 చట్టాలు యథాతథంగా కొనసాగుతాయి. మరో ఆరు చట్టాలు కొన్ని తీసివేతలతోనూ కొన్ని చేర్పులతోనూ కొనసాగుతాయి. ఈ ఆరు చట్టాలే చాలా కీలకమైనవి. ఇందులో అయిదు చట్టాలు జమ్మూ-కశ్మీర్‌ శాశ్వత నివాసి కాని వారికి భూబదలాయింపులు నిషేధించేవి. మరొకటి సహకార సంఘాల సభ్యత్వానికి సంబంధించినది. శాశ్వత నివాసి కాని వ్యక్తికి సహకార సంఘాల్లో సభ్యత్వం కూడా నిషేధమే. రాజ్యాంగంలోని 35-ఎ ద్వారా శాశ్వత నివాసి ఎవరో, అతన్ని శాశ్వత నివాసిగా పరిగణించటానికి ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలో నిర్ణయించే అధికారం జమ్మూ-కశ్మీర్‌ ప్రభుత్వానికి లభించింది. దాని ఆధారంగానే శాశ్వత నివాసి చుట్టూ చాలా చట్టాలను తిప్పుకొంటూ వచ్చారు. అందుకే శాశ్వత నివాసి పదబంధాన్ని తొలగించటమే లక్ష్యంగా ఈ చట్టాల్లో సవరణలను పొందుపరిచారు. జమ్మూ-కశ్మీర్‌లో ఇకపై అమలయ్యే 106 చట్టాల ద్వారా కొత్త వ్యవహారమే జరుగుతుందని చెప్పలేం. ఈ చట్టాల్లోని చాలా నిబంధనలను రాష్ట్ర చట్టాల్లో పొందుపరుచుకున్నారు. అధికరణం 370 కారణంగా చాలా కేంద్ర చట్టాల్లో జమ్మూ-కశ్మీర్‌ మినహా అనే పదబంధాన్ని పెట్టారు. పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ఈ పదబంధాన్ని తొలగిస్తూ 106 చట్టాల జాబితాను పేర్కొన్నారు. ఇకపై ఈ చట్టాలు ఇతర రాష్ట్రాలకు మాదిరిగా కశ్మీర్‌కు కూడా వర్తిస్తాయి. కేంద్ర చట్టాల నిబంధనలతో సారూప్యత కలిగిన రాష్ట్ర చట్టాలు వైదొలగుతాయి. కశ్మీర్‌ మహిళలు ఇతర రాష్ట్రాల వ్యక్తులను వివాహం చేసుకుంటే ఆస్తి హక్కు కోల్పోవటం లాంటి వాటిపై విడిగా చట్టాలు చేసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో 50% వరకూ రిజర్వేషన్లను కల్పించే అంశంపై దృష్టిపెట్టనున్నారు.

విశ్వాసం కలిగితేనే పెట్టుబడులు

అధికరణం 370 వల్ల కశ్మీరు అన్ని రకాలుగా వెనకబడిపోయిందని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలు చెప్పినా కొన్ని పెద్ద రాష్ట్రాల కంటే అక్కడ పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 1950 తర్వాత జరిగిన అనేక ఎన్నికల్లో అప్రజాస్వామ్య చర్యల వల్ల కశ్మీర్‌ పాలనా వ్యవస్థలో చాలా రుగ్మతలు ప్రవేశించాయి. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే ఆశ్రిత పక్షపాతం తారస్థాయికి చేరింది. దీనిగురించి 1950, 1960ల్లోనే పలువురు హెచ్చరించారు. కిందిస్థాయి నుంచి యంత్రాగాన్ని ప్రక్షాళన చేయకుండా ప్రజలతో మార్పులను అంగీకరింపచేయటం అంత తేలిక కాదు. భూములపై నిషేధాల్ని తొలగించినంత మాత్రానే ప్రైవేటు పెట్టుబడులు రావు. శాంతిభద్రతలు పూర్తిగా పాదుకున్నాయన్న విశ్వాసం కలిగితేనే వస్తాయి. అవి వచ్చేలోపు ప్రభుత్వ పెట్టుబడులు మౌలిక సదుపాయాల రంగంలో పెద్దఎత్తున పెట్టాల్సి ఉంటుంది. పర్యాటకరంగానికి ఇది చాలా అవసరం.

 
 
- ఎన్‌.రాహుల్‌ కుమార్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.