Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

మభ్యపెడితే దండనే..

వినియోగదారుల హక్కులు ఇకపై మరింత పదిలం 
కేంద్ర స్థాయిలో తాజాగా రక్షణ అథారిటీ 
అనుబంధంగా ఓ దర్యాప్తు సంస్థ కూడా 
అనైతిక ప్రకటనలకూ చెక్‌ 
మోసపూరిత ప్రకటనల్లో ఉన్న సెలబ్రిటీలపైనా చర్యలు 
వినియోగదారుల ఫోరంల స్థానే కమిషన్లు 
కొత్త చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర

ఈనాడు, హైదరాబాద్‌: అనైతిక వ్యాపారాలు...ఉత్పత్తులు...ప్రకటనలకు చెక్‌ పెట్టి వినియోగదారుడికి అండగా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త వినియోగదారుల చట్టాన్ని తెచ్చింది. 1986నాటి వినియోగదారుల చట్టానికి మరింత పదును పెడుతూ ఆధునిక వ్యాపారాలకు అనుగుణంగా మార్చింది. ఉభయ సభలు ఆమోదించిన ఈ చట్టాన్ని ఈ నెల 9న నోటిఫై చేశారు. శనివారం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం ఉన్న వినియోగదారుల ఫోరాలు ఇకపై కమిషన్లుగా పనిచేయనున్నాయి. వినియోగదారుల హక్కులను కాపాడడానికి... అనైతిక వ్యాపారాలను... తప్పుదారి పట్టించే ఆకర్షణీయమైన ప్రకటనలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం కింద ఓ రక్షణ అథారిటీని ఏర్పాటు చేయనుంది. చీఫ్‌ కమిషనర్‌ నేతృత్వం వహిస్తారు. మరికొందరు కమిషనర్లు ఉంటారు. దీని ఆధ్వర్యంలో ఓ దర్యాప్తు సంస్థ ఏర్పాటవుతుంది.

దర్యాప్తు రంగంలో అనుభవం ఉన్న డైరెక్టర్‌ జనరల్‌, అదనపు డైరెక్టర్‌ జనరల్‌, డైరెక్టర్‌, జాయింట్‌ డైరెక్టర్‌, డిప్యూటీ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌లు ఇందులో నియమితులవుతారు. దర్యాప్తులో భాగంగా సీఆర్‌పీసీ నిబంధనల ప్రకారం దీనికి సోదాలు, జప్తు చేసే అధికారం ఉంది. అథారిటీ వాణిజ్య ప్రకటనలను ఎప్పటికప్పుడు సునిశితంగా పరిశీలిస్తుంది. అందులో మోసం, దగా వంటివి ఉన్నట్టు భావిస్తే సుమోటోగా కేసులు తీసుకొని దర్యాప్తు చేయిస్తుంది. వినియోగదారుల హక్కులకు భంగం వాటిల్లినట్లు తేలితే అలాంటి సర్వీసులు, ఉత్పత్తులను నిలిపివేసే అధికారం ఈ అథారిటీకి ఉంది. ఏవైనా తప్పుడు ప్రకటనలు, అనైతిక వ్యాపారాలపై ఫిర్యాదులందితే వాటిని జిల్లా కలెక్టర్లకు పంపి నివేదిక కోరవచ్చు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ఆయా మంత్రిత్వ శాఖలకు సిఫార్సులు చేయవచ్చు.  వాణిజ్య ప్రకటనలు మోసపూరితమని భావిస్తే సాధారణ పౌరులు కూడా రక్షణ అథారిటీని ఆశ్రయించవచ్చు.

వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు జారీ చేసిన తయారీదారు, ప్రకటనలో ఉన్న వ్యక్తులకు రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అధికారం అథారిటీకి ఉంది. 
మోసపూరిత ప్రకటనల్లో ఉన్న సెలబ్రిటీలు మరే వాణిజ్య ప్రకటనల్లో పాల్గొనకుండా ఏడాది నుంచి మూడేళ్ల వరకు నిషేధం విధించవచ్చు. 
అథారిటీ ఆదేశాలను అమలు చేయని పక్షంలో 6 నెలల వరకు జైలు శిక్ష, రూ.20 లక్షల వరకు జరిమానా, లేదంటే రెండూ విధించవచ్చు. 
వినియోగదారుల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే ఉత్పత్తిదారు, సర్వీసు ప్రొవైడర్‌, తప్పుడు ప్రకటనలు జారీ చేసినవారికి రెండేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధించవచ్చు. అదే తప్పు పునరావృతం చేస్తే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా ఉంటుంది. 
కల్తీలకు పాల్పడటం ద్వారా ఏదైనా హాని సంభవిస్తే ఆరు నెలల జైలు, లక్ష జరిమానా. 
తీవ్ర హాని కలిగిస్తే ఏడాది జైలు; రూ.3 లక్షల జరిమానా. మరీ తీవ్రమైతే ఏడేళ్ల జైలు, రూ. 5 లక్షల జరిమానా; ప్రాణహాని సంభవిస్తే ఏడేళ్లకు తగ్గకుండా జీవిత ఖైదు, రూ.10 లక్షల జరిమానా విధించవచ్చు.

మధ్యవర్తిత్వ కేంద్రాలు 
రాష్ట్ర కమిషన్‌తోపాటు ప్రతి జిల్లా కమిషన్‌లో మధ్యవర్తిత్వ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయాల్సి ఉంది. గుర్తింపు పొందిన మధ్యవర్తులు ఇక్కడ ప్యానెల్‌ సభ్యులుగా ఉంటారు. మూడు నెలలకోసారి ఈ కేంద్రం.. జిల్లా కమిషన్‌, రాష్ట్ర, జాతీయ కమిషన్‌లకు నివేదిక పంపాలి. కమిషన్‌ ముందుకు వచ్చే ఫిర్యాదులు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమవుతాయని భావిస్తే వాటిని మీడియేషన్‌ సెంటర్‌కు సిఫార్సు చేయాలి. మధ్యవర్తి రెండు పార్టీల మధ్య ఒప్పంద పత్రం రూపొందించి సంతకం చేయాలి. గడువులోగా మధ్యవర్తిత్వం సఫలం కానిపక్షంలో కమిషన్‌కు నివేదించాలి.

అప్పీలు చేయాలంటే... 
జిల్లా కమిషన్‌ల తీర్పులపై రాష్ట్ర కమిషన్‌లో అప్పీలు చేయాలంటే చెల్లించాల్సిన సొమ్ములో 50 శాతం డిపాజిట్‌ లేదంటే రూ.25 వేలు ఏది తక్కువైతే దాన్ని చెల్లించాలి. 
రాష్ట్ర  కమిషన్‌ తీర్పుపై జాతీయ కమిషన్‌లో అప్పీలు చేయాలంటే 50 శాతం లేదంటే రూ.35 వేలు చెల్లించాలి. 
తన తీర్పులను పునఃసమీక్షించే అధికారం రాష్ట్ర కమిషన్‌లకు చట్టం కట్టబెట్టింది. 
అప్పీలుకు గతంలో ఉన్న 30 రోజుల గడువును 45 రోజులకు పెంచింది.

పరిధి పెరిగిందిలా... 
జిల్లా కమిషన్‌ పరిధి రూ.20 లక్షల నుంచి రూ.కోటికి 
రాష్ట్ర కమిషన్‌ది రూ.కోటి నుంచి రూ.10 కోట్లకు

ప్రత్యేక రక్షణ: న్యాయవాది వేముల గౌరిశంకర్‌ 
తప్పుడు ప్రకటనలతో కల్తీ వస్తువులు, సేవలను అంటగట్టేవారికి ఈ చట్టం గుణపాఠం చెప్పేలా ఉంది. కేంద్ర అథారిటీ ద్వారా వినియోగదారులకు ప్రత్యేక రక్షణ లభిస్తుంది. కమిషన్‌ల పరిధి పెంచడం ద్వారా కేసుల సంఖ్య ఎక్కువ కావచ్చు. అప్పీళ్ల సమయంలో 50 శాతం డిపాజిట్‌ చేయాలన్న నిబంధన కొంత ఇబ్బందికరం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.