close

ప్ర‌త్యేక క‌థ‌నం

గాలికూట విషం

పంటలు పండవు.. చేపలు బతకవు
యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న పరిశ్రమలు
అప్పుడప్పుడూ మూసివేత ఉత్తర్వులు.. కనిపించని మార్పు
రసాయన వ్యర్థ జలాలతో నిర్వీర్యమవుతున్న నీటివనరులు
కాలుష్య కాటుతో దుర్భర జీవితం వెళ్లదీస్తున్న ప్రజలు

* చుట్టూ ఎటుచూసినా పచ్చదనం.. అటునుంచి చల్లగాలి పల్లె వైపు వస్తోందంటే చాలు.. ఆస్వాదించాల్సింది పోయి.. ముక్కులు మూసుకుంటున్నారు. ఇళ్ల తలుపులు తెరవడంలేదు.. ఇందుకు కారణం.. దుర్వాసనతో కూడిన వాయు కాలుష్యం.
* చెరువుల్లో నీళ్లుంటాయి.. ఆ నీటిని పశువులు కూడా తాగలేవు. కొన్ని చెరువుల దగ్గరకు వెళితే.. భయంకరమైన వాసన.. కడుపులో తిప్పినట్లు, వాంతులు అవుతున్నట్లు అనిపిస్తుంది. జల కాలుష్యమే హేతువు.

‘ఈనాడు’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడి
ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని పటాన్‌చెరు, అమీన్‌పూర్‌, జిన్నారం, కొండాపూర్‌, జహీరాబాద్‌, హత్నూర తదితర మండలాల్లో నెలకొన్న జల, వాయు కాలుష్యం కారణంగా ఆ ప్రాంత ప్రజల జీవనం కష్టంగా మారింది. అనేక మంది బతుకుతెరువు కోల్పోతున్నారు.  ఆయా ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. కష్టాలపై ‘ఈనాడు’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ఫలితాన్నివ్వని తనిఖీలు

కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అప్పుడప్పుడూ తనిఖీలు చేస్తుంటుంది. ఫ్యాక్టరీలలో లోపాలను గుర్తించినప్పుడు.. మూసివేత ఉత్తర్వులిస్తుంది. మళ్లీ లోపాలు సరిదిద్దుకున్నారంటూ అనుమతులిస్తుంది. కాలుష్య సమస్య అలాగే ఉంటోందని స్థానికులు వాపోతున్నారు. కంపెనీలు ఎఫ్లియంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఈటీపీ)లను ఏర్పాటుచేసుకుని వ్యర్థాల్ని శుద్ధి చేయాలి. కొన్ని యాజమాన్యాలు ఖర్చు తగ్గించుకునేందుకు ఈటీపీలను వాడకుండా వ్యర్థాల్ని ప్రస్తుతం వర్షపు నీటిలో కలిపి బయటకు వదులుతున్నాయి.

ఐదేళ్లలో 385 పరిశ్రమలపై చర్యలు

నిబంధనలు పాటించని కంపెనీలపై చర్యలు తీసుకుంటున్నట్లు పీసీబీ చెబుతోంది. తీవ్రతను బట్టి ఉత్పత్తి నిలిపివేత.. తాత్కాలికంగా మూసివేత ఆదేశాలు జారీచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే 2014 జూన్‌ నుంచి.. నిబంధనలు ఉల్లంఘిస్తున్న 385 కంపెనీలపై చర్యలు తీసుకున్నట్లు పీసీబీ గణాంకాలు చెబుతున్నాయి.

గండిగూడెం చెరువులో గరళం

అమీన్‌పూర్‌ మండలం గండిగూడెం చెరువుది 266 ఎకరాల విస్తీర్ణం. 4 గ్రామాలు దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. 1500 ఎకరాల సాగుకు.. 150 మత్స్యకార కుటుంబాలకు ఈ చెరువు నీరే ఆధారం. సమీపంలో పరిశ్రమల నుంచి వచ్చిన రసాయన వ్యర్థాలతో 2017 అక్టోబరులో రెండేళ్ల క్రితం భారీగా చేపలు మరణించాయి. 26 పరిశ్రమలకు నోటీసులిచ్చారు. మూడింటికి తాత్కాలికంగా మూసివేత ఉత్తర్వులు అందించారు. 14 ఫార్మా కంపెనీల నుంచి రూ.1.03 కోట్ల పరిహారాన్ని వసూలు చేసి మత్స్యకార కుటుంబాలకు ఇచ్చారు. కాలుష్య తీవ్రత తగ్గేవరకు చేపపిల్లలు ఇవ్వాలని మత్స్యశాఖ చెబుతోందని మత్స్యకారులు విన్నవిస్తున్నా ఫలితం శూన్యం. గండిగూడెం చెరువులోకి వచ్చే కాలువలను పరిశీలించగా శుద్ధి చేయని రసాయన వ్యర్థ జలాలు కాలువ నీటితో కలిసి చెరువులోకి వెళుతున్నాయి.

తీరు మారని పరిశ్రమలు 

కొండాపూర్‌ మండలంలోని మల్లేపల్లి శివారులో ఎనిమిది వరకు పైరాలసిస్‌ పరిశ్రమలున్నాయి. వీటికి గతంలో మూసివేత ఉత్తర్వులిచ్చారు. కొన్నాళ్ల తర్వాత పరిస్థితి మామూలే. టైర్ల నుంచి ఆయిల్‌ తీసే క్రమంలో భయంకరమైన వాసనలు ముక్కుపుటాలను అదరగొడతాయి. 
* పాశమైలారం పెద్ద చెరువులో ఒకప్పుడు చేపలు బాగా బతికేవి. ఇప్పుడది కాలకూట విషంగా మారింది. వేసిన చేపపిల్లలు వెంటనే చనిపోతున్నాయి. పరిశ్రమల నుంచి వ్యర్థజలాలు ఇందులోకి చేరుతున్నాయి. 
* హత్నూర మండలం బోర్పట్ల, గుండ్లమాచనూరు సమీపంలో ఔషధ పరిశ్రమలున్నాయి. వీటినుంచి వెలువడే రసాయన వ్యర్థ జలాలను వాననీటితో పాటు కలిపేసి నక్కవాగులోకి వదులుతున్నారు. ఓ పరిశ్రమ పక్కన ఉన్న రెండు కుంటలు వ్యర్థజలాలతో నిండిపోయాయి. బోర్పట్లలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు సమీపంలో ఉన్న పరిశ్రమ నుంచి వచ్చే ఘాటైన వాసనల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఫిర్యాదు చేసినప్పుడు కొంత వాసన తగ్గినా.. మళ్లీ కొద్దిరోజులకు అదే పరిస్థితి నెలకొంటోంది. ఈ పాఠశాలలో పనిచేసే ఏడుగురు ఉపాధ్యాయులు గతేడాది బదిలీపై వెళ్లిపోయారు.
* నిబంధనలు ఉల్లంఘించినందుకు జహీరాబాద్‌ ప్రాంతంలోని మూడు పరిశ్రమలకు ఈ ఏడాది ప్రారంభంలో మూసివేత ఉత్తర్వులిచ్చారు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్లీ అనుమతులిచ్చారు. భూగర్భజలాలు పూర్తిగా కలుషితమయ్యాయని, కనీస అవసరాలకు కూడా నీళ్లు వాడుకోలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. 

కూలీగా పనిచేస్తున్నా 

నేను బాహ్యవలయ రహదారిపై మొక్కలను కత్తిరించే కూలీగా పనిచేస్తున్నాను. చెరువు నీరు కలుషితం కానప్పుడు చేతినిండా పని ఉండేది. ఇప్పుడు రోజుకు రూ.300లకు పనిచేస్తున్నా.. సమస్య వెలుగులోకి వచ్చినప్పుడు హడావుడి చేసిన అధికారులు తర్వాత పట్టించుకోవట్లేదు.  

-జనార్దన్‌. గండిగూడెం, మత్స్య సహకారం సంఘం అధ్యక్షుడు

తలుపులు మూసుకుంటున్నాం 

మా గ్రామానికి సమీపంలో టైర్లను కాల్చి ఆయిల్‌ తీసే పరిశ్రమలున్నాయి. భరించలేని దుర్వాసన వస్తోంది. ఆ సమయంలో గ్రామ ప్రజలంతా ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకోవాల్సి వస్తోంది. పంట పొలాల మీద బూడిద పేరుకుపోతోంది. పనిచేయడానికి కూలీలు రావట్లేదు. 

- గోపాల్‌, ఎదురుగూడెం, కొండాపూర్‌
-ఈనాడు-హైదరాబాద్‌, సంగారెడ్డి

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.