Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

అమ్మ కడుపులోనే.. నవ భారత పునాది

సచిన్‌ సందేశం

పరిచయం అక్కర్లేని పేరు... సచిన్‌ తెందుల్కర్‌. తన ప్రవర్తనతో, ప్రతిభతో కోట్ల మంది హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా... నవ భారత నిర్మాణానికి ఒక చక్కని సందేశంతో ముందుకొచ్చారు. సుదృఢ భారత్‌కు-పిల్లల పెంపకానికి మధ్య ఉన్న సంబంధాన్ని విడమరిచి చెప్పారు. ఇప్పుడు బాలలకు అందించే పోషకాహారం, ప్రేమానురాగాలే రేపటి శక్తిమంతమైన భారత్‌కు పునాది అని వివరించారు. గర్భంలో ఉన్నప్పట్నుంచే పిల్లల వికాసానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లల వైద్య నిపుణురాలైన తన సతీమణి నుంచి తెలుసుకున్న విషయాలతో పాటు... ఐక్యరాజ్య సమితి బాలల విభాగం (యునిసెఫ్‌)తో కలిసి పనిచేసిన అనుభవం తెచ్చిన సాధికారతతో సచిన్‌... చిన్నారుల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన సూచనలు చేశారు. పిల్లల పెంపకానికి సంబంధించి ఎన్నో విషయాలను ‘ఈనాడు’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.

బాల భారతమే భాగ్య భారతం

భావి సమాజానికి భారత్‌ సమర్థ నాయకత్వం వహించాలంటే... అది నేటి బాలలతోనే ఆరంభం కావాలని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ ఆకాంక్షించారు. బిడ్డల పోషణ తల్లిదండ్రుల సమబాధ్యత అని, ఇద్దరి ప్రేమానురాగాలూ పిల్లలకు సమానంగా అందాలని సూచించారు. తల్లిపాలు, పౌష్టికాహారం, అమ్మ లాలన, నాన్న పాలన, ఆహ్లాదకరమైన పరిసరాలు... బిడ్డల ఎదుగుదలకు, తద్వారా నవ సమాజ నిర్మాణానికి
అవశ్యమన్నారు. భావి భారత నిర్మాణానికి తన మదిలోని మాటలను ‘ఈనాడు’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.

స్వాతంత్య్రం సిద్ధించినప్పట్నుంచి మనమెంతో పురోగతి సాధించాం. అంతర్జాతీయ క్రీడల్లో రాణిస్తున్నాం. అంతరిక్షంలోకి దూసుకెళ్తున్నాం. అంతర్జాతీయ వర్తకంలో ముందుకెళ్తున్నాం. బాలీవుడ్‌ సినిమాలతో ప్రపంచాన్ని అలరిస్తున్నాం. అయినా... మనమింకా ‘అత్యుత్తమం’ కావాల్సి ఉంది. మన ప్రాచీన మేధస్సుకు యువత సామర్థ్యం కూడా తోడైతే... రేపటి రోజుకు మన దేశమే సారథి!
నేటి బాలలు ఆనందభరితులుగా, ఆరోగ్యవంతులుగా, వివేకవంతులుగా మారితే... రేపటి మన సమాజం ఎంతో దృఢంగా, సమృద్ధిగా ఉంటుంది. నా భార్య శిశు వైద్యురాలు కావడం, నేను స్వయంగా యునిసెఫ్‌ కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల శిశువుల అభివృద్ధిపై సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరమైన అంశాలు ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది తెలుసుకోగలిగాను.

ఆలనా పాలనే వికాసానికి తొలి మెట్టు

తల్లిదండ్రుల ఆలనాపాలనే వారి వికాసానికి తొలిమెట్టు. పిల్లల బాగోగుల కోసం మనం ఖర్చుపెట్టే ప్రతి రూపాయీ సమాజానికి పదింతల ప్రతిఫలం చేకూర్చుతుంది. శిశువులు పిండ దశలో ఉన్నప్పుడు ఏర్పడే మెదడు... పుట్టిన తర్వాత రెండేళ్లలో 80% అభివృద్ధి చెందుతుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు బిడ్డ కోసం వెచ్చించే సమయం, మెలిగే తీరు... ఆ చిన్నారి భవితకు బాటలు వేస్తుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం మన దగ్గర ‘గర్భ్‌ శంకర్‌’ అనే సంప్రదాయం ఉండేది. దీనర్థం కడుపులోని బిడ్డకు బోధించడం. మహాభారతంలో అభిమన్యుడు తల్లి కడుపులో ఉండగానే యుద్ధకళను నేర్చుకున్నాడని తెలుసుగా. అలా. పిల్లల వికాసానికి ఎంతో భద్రమైన, ఆహ్లాదకరమైన పరిసరాలు ఉండాలి. పౌష్టికాహారాన్ని అందించాలి.
తల్లిదండ్రులు ఒకరితో ఒకరు అన్యోన్యంగా ఉంటూ పిల్లలకు అనురాగం పంచాలి. అప్పుడే బిడ్డలు మానసికంగా దృఢంగా ఉంటారు.

గర్భంలో ఉన్నప్పట్నుంచే మొదలవ్వాలి

దేశ ఆర్థికవృద్ధి.. సుస్థిర, శాంతియుత సమాజ స్థాపన.. పేదరికం, అసమానతల నిర్మూలన- వీటన్నింటి సాధనకు శిశువుల సరైన ఎదుగుదల ఎంతో కీలకం. ఇందుకు తగినన్ని ఆర్థిక వనరులు అవసరం. పిల్లలకు సరైన ఆహారం పెట్టడం, ఆటల ద్వారా కొత్త విషయాలు నేర్పడం, తల్లిదండ్రులిద్దరూ అపరిమిత ప్రేమను పంచడం ద్వారా భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దగలం. 2050 నాటికి మన దేశాన్ని సూపర్‌ పవర్‌గా రూపొందించగలం. మరిన్ని ఒలింపిక్‌ స్వర్ణాలు, నోబెల్‌ బహుమతులు, ప్రపంచ కప్పులు, ట్రిలియన్‌ డాలర్‌ సంస్థలు మన భవిష్యత్తు తరాల నుంచి రావాలని ఆశిస్తున్నా. తల్లి గర్భంలో ఉన్నప్పుడు వినిపించే పాటల నుంచే ఇదంతా మొదలవుతుందని గుర్తుంచుకోండి.

సురక్షిత వాతావరణంలో ఉండాలి

పిల్లలు సురక్షిత వాతావరణంలో ఉండాలి. హింస, అఘాయిత్యాలు వాళ్ల మానసిక ఎదుగుదలపై దీర్ఘకాలంలో ప్రభావం చూపిస్తాయి. తల్లిదండ్రులు ఒకరితో ఒకరు అన్యోన్యంగా ఉంటూ పిల్లలకు అనురాగం పంచాలి. అప్పుడు వారికి ‘ఫెయిర్‌ ప్లే’ అవార్డు రావడంతో పాటు బిడ్డలకు మంచి మానసిక ఆరోగ్యం దక్కుతుంది. పిల్లల మొదటి రెండేళ్ల వయసులో ఆరోగ్యం, పరిశుభ్రత చాలా కీలకం. పరిశుభ్రమైన తాగునీరు, మంచి పారిశుద్ధ్య అలవాట్లు, తగిన సమయానికి టీకాలు.. వీటివల్ల పిల్లలు మలేరియా, డయేరియా లాంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. ‘చికిత్స కంటే నిరోధం మంచిది’ అనే నానుడి పిల్లల పెంపకంలో సందర్భోచితం. పోషకాహారం విషయం చూస్తే, గర్భంతో ఉన్నప్పుడు తల్లి తినే ఆహారమే గర్భస్థశిశువుకూ అందుతుంది. అందువల్ల ఆహారం విషయంలో వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. ప్రసవం తర్వాత తల్లిపాలు పిల్లలకు కావల్సిన పోషకాలతో పాటు రోగనిరోధక శక్తినీ అందిస్తాయి. అవి తల్లీపిల్లల మధ్య బంధాన్ని బలపరుస్తాయి కూడా. కార్యాలయాలు, బహిరంగస్థలాల్లో తల్లులు పిల్లలకు పాలిచ్చే వాతావరణం ఉండాలి.

పోషణ సమబాధ్యత

పిల్లల పోషణ అన్నది తల్లిదండ్రుల సమబాధ్యత. తల్లితో సమానంగా తండ్రి కూడా వారికి ప్రేమానురాగాలను పంచిపెట్టాలి. చిన్నప్పట్నుంచి తండ్రి చూపించే ఆదరణ... పిల్లలపై అన్ని విధాలా అనుకూల ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు. తల్లి క్షేమం కూడా ముఖ్యమే. పిల్లల పెంపకం విషయంలో ఆమెపైనే భారమంతా మోపడం సరికాదు. క్రికెట్‌ పిచ్‌లో మాదిరే... పిల్లల పోషణ బాధ్యతను కూడా తల్లి, తండ్రి మార్చుకుంటూ ఉండాలి. చాలా సంస్థలు దీన్ని గుర్తించి మెటర్నిటీ లీవులను తండ్రులకూ మంజూరు చేస్తుండటం శుభ పరిణామం.

వారితో ఆడిపాడండి

పిల్లలతో ఆడుకోడానికి కొంత సమయం కేటాయించండి. వాళ్లకు నవ్వడం వచ్చినప్పటి నుంచే ఊహ వస్తుందని మనం అనుకుంటాం. కానీ, పుట్టినప్పటి నుంచే వాళ్లకు అన్నీ అర్థమవుతాయి. అందువల్ల చిన్నవయసు నుంచే వారితో సమయం గడపాలి. వాళ్లకు చాలా ఆసక్తి ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే సరదా కూడా. వాళ్లపై పూర్తిగా దృష్టి సారించండి. వాళ్ల మొహంలోకి చూస్తూ మాట్లాడండి. మంచి సంగీతం, ఆహ్లాదకరమైన పాటలు వినిపించండి. ఇది పిల్లలు తల్లిగర్భంలో ఉన్నప్పుడు కూడా చేయాలి. స్నానం చేయించేటపుడు, పాలిచ్చేటపుడు, ఆడుకునేటపుడు వాళ్లతో మాట్లాడండి. దానివల్ల వాళ్ల భాష, కదలిక నైపుణ్యాలు బాగా మెరుగవుతాయి. కొత్తగా ఏ పని చేసినా వాళ్లను ప్రోత్సహించడం, బాగుందని చెప్పడం వల్ల మరింత ఉత్సాహం లభిస్తుంది. మీ అందరికీ స్వాతంత్య్రదిన శుభాకాంక్షలు. జై హింద్‌!

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.