Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

కాసులేవి కల్యాణలక్ష్మీ!

 డిమాండ్‌కు సరిపోని ‘ఓటాన్‌’ చెల్లింపులు
  90,000 మంది లబ్ధిదారుల ఎదురుచూపు
ఈనాడు - హైదరాబాద్‌

పేదింటి ఆడపిల్లల వివాహానికి సాయం చేయడం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకానికి కాసుల కటకట ఎదురవుతోంది. ఆరు నెలలుగా లబ్ధిదారులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఓటాన్‌ అకౌంట్‌ కింద పేర్కొన్న నిధులు సరిపోక ఈ పరిస్థితి నెలకొంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తొలి నాలుగు నెలలు సాధారణ, పంచాయతీ ఎన్నికల కోడ్‌ కారణంగా దరఖాస్తుల పరిశీలన నిలిచిపోయింది. ఇప్పుడు పరిష్కరిస్తున్నా అందుబాటులో బడ్జెట్‌ నిధులు సరిపోని పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 2019-20 ఏడాదికి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో మూడోవంతు పరిశీలన దశలో ఉన్నాయి. ఈ పథకాల కింద దాదాపు 90,000 లబ్ధిదారులకు సహాయం అందాల్సి ఉంది. త్వరలో మున్సిపల్‌ ఎన్నికల కోడ్‌ మొదలైతే దరఖాస్తుల పరిశీలనకు మళ్లీ ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది.

రూ. 1,00,116 చొప్పున సాయం
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద ప్రభుత్వం రూ. 1,00,116 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 1.60 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటి పరిష్కారానికి రూ. 1,581 కోట్లు అవసరమని అంచనా. దరఖాస్తును గరిష్ఠంగా 45 రోజుల్లో పరిష్కరించి, వివాహం సమయానికి సహాయం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పుడు నెలలు గడుస్తున్నా సహాయం లభించడం లేదు. కల్యాణలక్ష్మి పథకం ప్రాచుర్యం పొందడంతో దరఖాస్తులు భారీగా పెరుగుతున్నాయి. ఈ పథకానికి ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ కింద రూ. 675 కోట్లు పేర్కొంది. కానీ డిమాండ్‌ను బట్టి అంతకు రెండింతలకు పైగా అవసరమని అధికారులు అంచనా వేశారు. కేటాయింపుల్లోనూ రూ. 620 కోట్లే విడుదల అయ్యాయి. ఆ మేరకు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్నారు. మిగతా నిధులు విడుదల చేయాలంటే పూర్తిస్థాయి బడ్జెట్‌ పెట్టినపుడే సాధ్యమని సంక్షేమవర్గాలు తెలిపాయి. ఈ పథకానికి అందిన దరఖాస్తుల పరిశీలనలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎమ్మార్వో కార్యాలయాల్లో దాదాపు రెండు నెలల వరకు పెండింగ్‌లో ఉంటున్నాయి. ఎమ్మార్వో ఆమోదం తరువాత ఎమ్మెల్యేల వద్దకు పంపిస్తున్నారు. ఇక్కడ ఆమోదం కోసం నెలరోజులకు పైగా సమయం పడుతోంది. ఆ తరువాత ఆర్డీవో ఆమోదం కోసం మరో 15 రోజులు అవుతోంది. చెక్కు సిద్ధం చేసి పంపిణీకి మరో 15 రోజులు పడుతోంది. ఈ లెక్కన ఒక్కో దరఖాస్తు పరిష్కారానికి దాదాపు మూడు నుంచి నాలుగు నెలలు వేచి చూడాల్సి వస్తోంది.

శాఖల వారీగా లెక్కలివి..
* బీసీలు, ఈబీసీలకు కల్యాణలక్ష్మి పథకం కింద చెల్లించాల్సిన సహాయం అంచనా రూ. 961 కోట్లుగా లెక్కతేలింది. ఓటాన్‌ అకౌంట్‌లో రూ. 350 కోట్లు మాత్రమే ఆర్థికశాఖ పేర్కొంది. అందులోనూ ఇప్పటివరకు రూ. 316 కోట్లు మాత్రమే వచ్చాయి.
* ఎస్సీ సంక్షేమశాఖ పరిధిలో డిమాండ్‌ రూ. 200 కోట్లు దాటింది. ప్రభుత్వం రూ. 161 కోట్లు మంజూరు చేసింది.  ఖర్చుచేసింది రూ. 82 కోట్లు మాత్రమే.
* మైనార్టీ వర్గాల నుంచి  25,000 దరఖాస్తులు వచ్చాయి.  ఈ శాఖకు రూ. 250 కోట్లు అవసరం. ప్రభుత్వం రూ. 100 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. అందులోనూ ఇచ్చిన నిధులు రూ. 92 కోట్లు. గిరిజన లబ్ధిదారులకు రూ. 170 కోట్లు చెల్లించాల్సిన ఉంటే.. ప్రభుత్వం రూ. 75 కోట్లతో సరిపెట్టింది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.