Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

జెండా పండగకు సిద్ధమైన కశ్మీరం

 నేడు శ్రీనగర్‌లో పెద్ద ఎత్తున వేడుక
 అధికరణం 370 రద్దు తర్వాత  తొలి భారీ కార్యక్రమం
 త్రివర్ణ పతాకం ఎగరవేయనున్న గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌

ఈనాడు, దిల్లీ: అధికరణం 370ని తొలగించి జమ్మూ-కశ్మీర్‌ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత జరుగుతున్న తొలి స్వాతంత్య్ర దినోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు. శ్రీనగర్‌తోపాటు జిల్లాల్లో జెండా పండగకు రంగం సిద్ధమైంది. అన్ని పంచాయతీల్లో సర్పంచులు పతాకాన్ని ఎగరేసేలా ఆదేశాలు జారీ చేయాలని డిప్యూటీ కమిషనర్లను గవర్నర్‌ మాలిక్‌ ఆదేశించారు. షేర్‌-ఇ-కశ్మీర్‌ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో గవర్నర్‌ మాలిక్‌ జాతీయపతాకాన్ని ఎగరవేస్తారు. జమ్మూలో గవర్నర్‌ సలహాదారు, మాజీ ఐపీఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. మూడు ప్రాంతాల కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఆర్‌పీఎఫ్‌, రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు. గవర్నర్‌ ప్రతి కార్యక్రమంలోనూ బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్‌ ధరించి పాల్గొననున్నారు. ఆయన కోసమే 200 మందితో ప్రత్యేక భద్రతాదళాన్ని ఏర్పాటుచేశారు. ప్రస్తుతానికి జమ్మూ-కశ్మీర్‌ వ్యాప్తంగా పరిస్థితులు నియంత్రణలో ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి, రాష్ట్ర ప్రణాళిక, అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రోహిత్‌ కన్సాల్‌ తెలిపారు. శ్రీనగర్‌లోని పలుప్రాంతాలతోపాటు, ఇతర జిల్లాల్లో స్థానికంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయని, వాటిని స్థానికంగానే నియంత్రిస్తున్నామని రాష్ట్ర శాంతిభద్రతల వ్యవహారాల అదనపు డీజీ మునీర్‌ఖాన్‌ చెప్పారు. పెల్లెట్‌ గాయాలు తగిలిన కొందరికి వెంటనే చికిత్స అందించి ఇంటికి పంపేశామన్నారు. జమ్మూ డివిజన్‌లో ఆంక్షలు పూర్తిగా ఎత్తేసినా.. కశ్మీర్‌ ప్రాంతంలో కొనసాగుతున్నాయి. 2009 సివిల్స్‌లో అగ్రస్థానంలో నిలిచి.. ఐఏఎస్‌ ఉద్యోగాన్ని వదులుకుని పార్టీ స్థాపించిన కశ్మీరీ నేత షాఫైజల్‌ను పోలీసులు దిల్లీ విమానాశ్రయంలో అడ్డుకున్నారు. ఆయన విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకొని కశ్మీర్‌కు పంపి గృహనిర్బంధం చేశారు.

ఎప్పుడు రావాలి: రాహుల్‌
జమ్మూ-కశ్మీర్‌ పర్యటనకు ఎప్పుడు రావాలని గవర్నర్‌ మాలిక్‌ను రాహుల్‌గాంధీ అడిగారు. ఎలాంటి షరతుల్లేకుండా వస్తానని, ఎప్పుడు రావాలని ట్వీట్‌ చేశారు. రాహుల్‌ ట్వీట్‌పై గవర్నర్‌ మాలిక్‌ స్పందిస్తూ.. ప్రస్తుతం రాష్ట్ర అధికార యంత్రాంగం స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లలో నిమగ్నమై ఉందని, సరైన సమయంలో అధికారులే సంప్రదిస్తారని పేర్కొన్నారు.


లాల్‌చౌక్‌లో జెండా ఎగరేస్తారా?

ఈనాడు, దిల్లీ: ప్రతిసారీ స్వాత్రంత్య్ర దినోత్సవాల వేళ.. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌ ఉద్రిక్త పరిస్థితులకు వేదికగా మారుతుంది. అక్కడ ఎలాగైనా జెండా ఎగరేయాలని భాజపా నేతలు ప్రయత్నించడం, అధికారులు అడ్డుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంటుంది. ఈసారి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని కొన్ని మాధ్యమాల్లో వార్తలు రావడంతో వేడి రాజుకొంది. ఆ వార్తలను రాష్ట్ర గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ఖండించడంతో అది చల్లారింది. ‘‘అదో వదంతి. హోంమంత్రికి అలాంటి ఆలోచనలేమీ లేవు. లాల్‌చౌక్‌ లాల్‌ఖిల్లా కాదు. శ్రీనగర్‌లో దానికో గుర్తింపు ఉంది. అంతమాత్రాన అక్కడ జెండా ఎగరేసి రాజకీయ ప్రకటనలు చేయలేం’’ అని మాలిక్‌ స్పష్టం చేయడంతో ఇప్పుడెవ్వరూ మాట్లాడటం లేదు. అయితే.. అక్కడ జాతీయ పతాకం ఆవిష్కరించేందుకు దేశం నలుమూలల నుంచి 35 మంది యువకులు తరలి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అక్కడున్న ఆంక్షలను దాటుకొని జెండా ఎగరేయడం అంత సులువేమీ కాదని తెలుస్తోంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.