Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

వాహన రంగం కుయ్యో మొర్రో

తెలుగు రాష్ట్రాల్లో ఘోరంగా పడిపోతున్న అమ్మకాలు
ఈనాడు - అమరావతి, హైదరాబాద్‌

తెలుగు రాష్ట్రాల్లో ఆటో రంగం మాంద్యంలోకి కూరుకుపోతోందా? తాజా వాహన విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య కేంద్రం విజయవాడ. టోకు వ్యాపారాలకు పెట్టింది పేరు. ఇక్కడి నుంచి భారీగా సరకు రవాణా ఉంటుంది. లారీలు, ట్రక్కుల క్రయవిక్రయాలు ఇక్కడే ఎక్కువ. కొన్ని నెలలుగా ఇవి గణనీయంగా పడిపోయాయి. ఏదైనా కార్ల కంపెనీ కొత్త మోడల్‌ కారుని మార్కెట్‌లోకి తెచ్చిందంటే చాలు... దానిని కొనేందుకు హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ వంటి నగరాల్లో పోటీపడి ముందుకొస్తుంటారు. అలాంటిది అనూహ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వీటి విక్రయాలు మందగించాయి. ప్రస్తుతమున్న కారుతోనే సర్దుకుపోదామనే ధోరణిలో ఎక్కువ మంది ఉంటున్నారు.

దేశవ్యాప్తంగా మోటారు వాహన రంగంలో కొద్ది నెలలుగా ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. దాని ప్రభావం ఏపీ, తెలంగాణలపైనా కనిపిస్తోంది. కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. కార్లతోపాటు, సరకు రవాణా వాహనాల కొనుగోళ్లలో తగ్గుదల కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పాత వాహనాలు మార్చుకొని, కొత్తవి కొనేవారూ కరవవుతున్నారు. ద్విచక్ర వాహనాల విక్రయాల్లో తగ్గుదల అధికంగా లేనప్పటికీ, క్రమంగా ఇందులోనూ కొంత క్షీణత కనిపిస్తోంది. వినాయక చవితి తర్వాత పెరుగుదల నమోదు కాని పక్షంలో పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని తెలంగాణలోని వ్యాపారులు చెబుతున్నారు.

ఎందుకీ పరిస్థితి?
ప్రభుత్వ విధానాల్లో వస్తున్న మార్పులు సైతం విక్రయాల మందగమనానికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
* వచ్చే ఏడాదినుంచి బీఎస్‌-6 వాహనాలే మార్కెట్లోకి రావాలనే నిబంధన
* విద్యుత్తు వాహనాలను ప్రోత్సహించాలన్న కేంద్ర నిర్ణయం
* వేచి చూసి కొనుగోళ్లకు దిగడం మంచిదనే వినియోగదారుల ధోరణి
* భారీగా పెరిగిన బీమా మొత్తాలు
* ప్రజల వద్ద నగదు లభ్యతలో మందగమనం
* కొన్ని వాహనాలపై 28 నుంచి 31 శాతం వరకు ఉన్న జీఎస్టీ
* వాహన రుణాల వడ్డీరేట్లలో చెప్పుకోదగ్గ మార్పు లేకపోవటం

 

మాంద్యం భయాలు

మళ్లీ ఆర్థిక మాంద్యం వస్తుందనే భయం ప్రజల్లో ఉంది. ఆచితూచి ఖర్చు చేస్తున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వ వైఖరి ఎలా ఉండనుందనేది వేచి చూసే ధోరణిలో ఎక్కువ మంది ఉన్నారు. నగదు చలామణి తగ్గింది. వీటన్నింటి నేపథ్యంలో కొనుగోళ్లు మందగించాయి.

- సత్యనారాయణ, ఈడీ, వరుణ్‌ మోటార్స్‌ గ్రూప్‌

ఫైనాన్స్‌ సంస్థల వెనకడుగు

వాహనాల కొనుగోలుదారులకు, డీలర్లకు నాన్‌ బ్యాంకింగ్‌ ఆర్థిక సంస్థలు ఎక్కువగా ఫైనాన్స్‌ చేస్తుంటాయి. ప్రస్తుత తరుణంలో ఈ సంస్థలు వెనకడుగు వేస్తున్నాయి. ఇసుక కొరత కూడా లారీల వంటి పెద్ద వాహనాల కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తోంది.

- ప్రకాశ్‌, వాహనాల డీలర్‌ రాంకోర్‌ సంస్థ వ్యాపార భాగస్వామి, విజయవాడ

30 లక్షల మందిపై ప్రభావం

ఏపీలో మూడు లక్షల లారీలున్నాయి. రాష్ట్రంలో ఇసుక లభ్యత లేకపోవడంతో ఆ లారీలే కాకుండా, సిమెంట్‌, కంకర, స్టీల్‌ వంటివి తరలించే లారీలపైనా ప్రభావం చూపిస్తోంది. వివిధ వ్యాపారాలు తగ్గాయి. విజయవాడ నుంచి కోల్‌కతాకు నిత్యం ఉండే సరకు రవాణా బాగా తగ్గింది. కొత్త లారీల కొనుగోలు ప్రస్తావన ఉండటం లేదు. మొత్తంగా 30 లక్షల మందిపై ఇది ప్రభావం చూపుతోంది.

- ఈశ్వరరావు, ఏపీ లారీ అసోసియేషన్‌ అధ్యక్షుడు

విక్రయాలు పెరగకపోతే కష్టమే

ఏడాది మొత్తంలో ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, డిసెంబరు, మార్చి నెలల్లో విక్రయాల జోరు ఉంటుంది. అందులోనూ 50% విక్రయాలు ఆగస్టు-అక్టోబరు మధ్యే ఉంటాయి. ఇవి పుంజుకోకపోతే డీలర్‌షిప్‌లు నిర్వహించటం కష్టమవుతుంది. బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించకపోవటంతో కొనుగోళ్లపై ప్రభావం పడింది.

- యలమంచిలి రాము, తెలంగాణ-ఏపీ ఆటోమొబైల్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు

ఉద్యోగాలు ఊడుతున్నాయ్‌!
దేశంలో గత 6 నెలల్లో 3.5 లక్షల కొలువులు ఉఫ్

‌ ‘‘భారతదేశంలో 1710 మంది ఉద్యోగులను తొలగిస్తాం...’’
- వారం క్రితం నిస్సాన్‌ మోటార్స్‌ ప్రకటన.

వాహన పరిశ్రమ మందగమనం వల్ల మారుతీ సుజుకీలో 3000కు పైగా తాత్కాలిక ఉద్యోగాలకు కోత పడింది.  అయితే శాశ్వత ఉద్యోగులపై ఎటువంటి ప్రభావం పడలేదు.
- ఆర్‌సీ భార్గవ, మారుతీ ఛైర్మన్‌

‘‘మేం ఇప్పటికే 500 మందిని తీసివేశాం, సీఈఓనూ రావద్దని చెప్పాం, రెండు షోరూమ్‌లు మూసివేశాం, ఒక్కో షోరూమ్‌లో ఖర్చులు తగ్గింపుపై కసరత్తు చేస్తున్నాం’’
- ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న అగ్రశ్రేణి ఆటోమొబైల్‌ డీలర్‌.

...దేశీయంగా ఆటోమొబైల్‌ రంగం ఎంతటి సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నదీ స్పష్టంచేసే ఉదంతాలు ఇవి. ఎన్నడూ లేనంత కష్టకాలాన్ని ఈ పరిశ్రమలోని కంపెనీలు, విడిభాగాల తయారీదార్లు, డీలర్లు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు పోతున్నాయి. కేవలం ఆటోమొబైల్‌ కంపెనీల ఫ్యాక్టరీల్లోనే కాకుండా అమ్మకాలు/మార్కెటింగ్‌ విభాగాల్లో... అదే సమయంలో డీలర్‌షిప్‌లలో తాత్కాలి సిబ్బంది ఉద్యోగాలకు పెనుముప్పు ఏర్పడింది. నష్టాలు భరించలేక సిబ్బంది భారాన్ని తగ్గించుకోవటానికి మొగ్గుచూపుతున్న వైనం ఈ రంగంలోని అన్ని స్థాయుల్లో కనిపిస్తోంది. తమ స్థాయిలో 15,000 ఉద్యోగాలు పోయినట్లు ఓఈఎం(ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మానుఫ్యాక్చరర్స్‌) తయారీదార్ల జాతీయ సంస్థ అయిన సియామ్‌ (సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మానుఫ్యాక్చరర్స్‌) ఇటీవల స్పష్టంచేసింది. ప్రభుత్వం వెంటనే స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే 10 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోతాయని ఆటోమోటివ్‌ కాంపోనెంట్‌ మానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ గత నెలలో హెచ్చరించింది.  దేశవ్యాప్తంగా ఆటోమొబైల్‌ పరిశ్రమలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 3.5 కోట్ల మంది పనిచేస్తున్నట్లు అంచనా. వచ్చే ఏడాది నుంచి దేశంలో బీఎస్‌-6 కాలుష్య ప్రమాణాలు అమల్లోకి రాబోతున్నాయి. ఈ నూతన ప్రమాణాలకు తగ్గట్లుగా ఇంజన్లు తయారు చేయటంపై పరిశ్రమ ముందస్తుగా సన్నాహాలు చేయలేదనే విమర్శలున్నాయి. ఈ తరుణంలోనే ఎలక్ట్రిక్‌ వాహనాలు తెరమీదకు వచ్చాయి.  2030 నాటికి దేశవ్యాప్తంగా అన్ని రకాలైన వాహనాల్లో ఎక్కువ భాగం ఎలక్ట్రిక్‌ వాహనాలే ఉండాలనే సంకేతాలు ప్రభుత్వం నుంచి అందుతున్నాయి. దీంతో తయారీ సంస్థలు గందరగోళంలో చిక్కుకుపోయాయి. వాహన కొనుగోలుదార్లకు అప్పు ఇచ్చే విషయంలో బ్యాంకులు/ ఆర్థిక సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. తత్ఫలితంగా వాహన పరిశ్రమ ఒక్కసారిగా సంక్షోభం చిక్కుకుపోయింది. పెద్దపెద్ద కార్ల తయారీ కంపెనీలు అమ్మకాలు తగ్గి ఉత్పత్తిలో కోత వేస్తుంటే వాటికి విడిభాగాలు అందించే చిన్న, మధ్యస్థాయి కంపెనీలకు సెగ తగులుతోంది. గత నాలుగు నెలల వ్యవధిలో అమ్మకాలు 90 శాతం పడిపోయినట్లు విడిభాగాల తయారీదార్లు పేర్కొంటున్నారు. ఆటోమొబైల్‌ క్లస్టర్లు చెన్నై, పూణె, దిల్లీలో కేంద్రీకృతమై ఉన్నాయి. పెద్ద సంఖ్యలో విడిభాగాల తయారీదార్లు ఈ నగరాల్లో ఉన్నారు. ఇంజన్‌ బ్లాకులు, పిస్టన్లు- రింగులు, ఫిట్లర్లు, ఆయిల్‌ సీల్స్‌ వంటి పలు రకాలైన విడిభాగాలు తయారుచేసే యూనిట్లు హైదరాబాద్‌లోని బాలానగర్‌, చర్లపల్లి పారిశ్రామిక వాడల్లో ఉన్నాయి. గత కొద్దికాలంలోనే విడిభాగాల విక్రయాలు బాగా తగ్గినట్లు సంబంధిత వర్గాలు వివరిస్తున్నాయి. దీని ప్రభావం ఉద్యోగాలపై కనిపిస్తోంది.

దేశంలో గత ఆరు నెలల్లో 3.5 లక్షల ఉద్యోగాలు పోయినట్లు అంచనాలున్నాయి

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.