Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఆర్టీసీకి గుదిబండి

అద్దె బస్సులతో ఏటా రూ.200 కోట్ల దాకా నష్టాలు
చాలాచోట్ల నడుపుతున్నది అధికారులు, ప్రజాప్రతినిధులే
గణాంకాలు మొత్తుకుంటున్నా దిద్దుబాటు సున్నా
ఈనాడు, హైదరాబాద్‌

ఆర్టీసీ రోజురోజుకీ నష్టాల ఊబిలో కూరుకుపోతుంటే బయటకు లాగాల్సిన చేతులే ఇంకాఇంకా లోలోనికి నెట్టేస్తున్నాయి. ఇంటాబయటా కొందరి స్వలాభాపేక్ష... ఉన్నతాధికారుల్లో లోపించిన ముందు చూపు కొన ఊపిరితో కునారిల్లుతున్న సంస్థకు ప్రాణసంకటంగా తయారయ్యాయి. ముఖ్యంగా ఆర్టీసీలో అద్దెబస్సులు సంస్థకు పెద్ద గుదిబండగా మారాయి. చాలాచోట్ల అధికారులు, ప్రజాప్రతినిధులే వాటిని నడుపుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో మాత్రం కనిపించవు. తమ బస్సుల టైర్లు అరగకుండా మంచి రోడ్లు ఉన్న రూట్లనే ఎంచుకుంటున్నారు. ఆదాయమన్నా బాగుంటుందా అంటే అదేంలేదు. అధ్వానమైన రోడ్లపై మారుమూల రూట్లలో తిరిగే ఆర్టీసీ సర్వీసుల కంటే తక్కువ ఆదాయం లభిస్తోంది. పైగా ఈ బస్సుల నిర్వహణకు అయ్యే ఖర్చుతోపాటు మోటారు వాహనాల పన్ను, బీమా ప్రీమియం.. ఇలా అన్నింటి బాధ్యత ఆర్టీసీదే. ఈ అద్దె బస్సుల వల్ల ఏటా సంస్థకు కోట్లల్లో నష్టం వస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ నష్టాలను పూడ్చుకోవడంలో... ఆదాయాలను పెంచుకోవడంలో.. ప్రయాణికులకు మరింత చేరువ కావడంలో వ్యూహరచనా రీతులు కరవయ్యాయి. కష్టనష్టాల విషయం దృష్టిలో లేకపోతే వేరే విషయం. ఒక నెల కాదు... ఒక ఏడాది కాదు... ఏళ్లుగా కళ్ల ముందే అంకెలు కలవర పెడుతున్నా నష్ట నివారణ చర్యలు లేవు. 2018-19 సంవత్సరంలో ఆర్టీసీ సర్వీసులు, అద్దె బస్సుల ఆదాయ వ్యయాల ప్రకారం రూ.200 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందనేది తాజా వాస్తవ చిత్రం.

8 అద్దె బస్సులు తిప్పేదీ ఆయనే...
ఆర్టీసీ నుంచి సొమ్ము చెల్లించేదీ ఆయనే!
ఆర్టీసీ బస్సుల కంటే అద్దె బస్సుల ద్వారా తక్కువ ఆదాయం రావడం గురించి యాజమాన్యం ఆలోచించడం లేదని, దిద్దుబాటు చర్యలు లేవని కార్మిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2014-15వ సంవత్సరంలో 1,466 అద్దె బస్సులు ఉంటే 2018-19 నాటికి వీటి సంఖ్య 2,133కి పెరిగింది. ఆర్టీసీ బస్సుల సంఖ్య మాత్రం 8,993 నుంచి 8,351కి తగ్గింది. లోతుగా విచారిస్తే కొందరు ఉద్యోగులు, మరి కొందరు రాజకీయనాయకులు కూడా బినామీ పేర్లతో బస్సులను భారీగా అద్దెకిచ్చినట్లు తెలిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక సీనియర్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఎనిమిది బస్సులను అద్దెకిచ్చినట్లు సమాచారం. ఈ బస్సులకు ఆర్టీసీ నుంచి అద్దె చెల్లించేది కూడా ఈయనే అని తెలిసింది. రాజకీయ నాయకులకు సంబంధించినవి కూడా ఎక్కువగానే ఉన్నట్లు సమాచారం. మొత్తమ్మీద అద్దెబస్సులు ఆర్టీసీని మరింత నష్టాల్లోకి నెడుతున్నట్లు స్పష్టమవుతోంది.

2018-19 సంవత్సరంలో ఒక ఆర్టీసీ బస్సు సగటున రోజుకు రూ.13,121 సంపాదిస్తే అద్దె బస్సు ద్వారా వచ్చింది రూ.10,544. తేడా రూ.2,577. రోజువారీ మొత్తం నష్టం 54.97 లక్షలు. ఏడాది మొత్తం తీసుకొంటే రూ.200.63 కోట్లు. తెలంగాణ ఆర్టీసీ నడిపే బస్సుల్లో 20 శాతం అద్దె బస్సులున్నాయి.


అద్దె బస్సు యజమానులకు ప్రయోజనమే పరమావధిగా...

అద్దె బస్సుల వల్ల సంస్థకు నష్టం వాటిల్లుతుంటే వాటి యజమానులకు మరింత ప్రయోజనం కలిగేలా ఆర్టీసీ యాజమాన్యం ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందన్న విమర్శలున్నాయి. అద్దె బస్సులకు అవసరమైన డీజిల్‌ను కూడా ఆర్టీసీ డిపోల నుంచే తీసుకొంటారు. ఒక లీటరుతో నిర్ణయించిన కిలోమీటర్ల కన్నా ఎక్కువ తిరగడం ద్వారా ఆదా అయ్యే ప్రయోజనం అద్దె బస్సు యజమానికే చెందుతుంది. ఉదాహరణకు రాజేంద్రనగర్‌ డిపోకు చెందిన బస్సుకు సంబంధించిన టెండర్‌ నోటిఫికేషన్‌లో లీటర్‌ డీజిల్‌తో 4.7 కి.మీ తిరుగుతుందని ఉంది. నెల మొత్తం 8,050 కి.మీ తిరగాల్సి ఉంటే 1,713 లీటర్ల డీజిల్‌ అవసరం. నెలలో 1,683 లీటర్లు వాడితే మిగిలిన 30 లీటర్లకు సంబంధించి ప్రస్తుత ధర ప్రకారం రూ.రెండువేలకు పైగా ప్రయోజనం బస్సు యజమానికి కలుగుతుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.