Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

చలానాకేనా పోలీస్‌!

దారి తప్పుతున్న ట్రాఫిక్‌ నియంత్రణ 
వాహనాల రద్దీని వదిలేసి కేసులు నమోదుకే ఆరాటం 
ఎక్కడికక్కడ స్తంభిస్తున్న ట్రాఫిక్‌.. 
ఈనాడు - సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

హైదరాబాద్‌ మహానగరం.. నిత్యం లక్షలాది వాహనాలతో కిటకిటలాడే రోడ్లు.. ఏ గంటలో ఎక్కడ ట్రాఫిక్‌ ఆగిపోతుందో.. ఎన్ని గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటామో తెలియని పరిస్థితి. కిక్కిరిసిన మార్గాల్లో తరచు ప్రమాదాలు చోటుచేసుకుని రహదారులు రక్తమోడుతున్నాయి. అస్తవ్యస్తమైన ట్రాఫిక్‌తో లక్షల మంది వాహనదారులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. లక్షల పనిగంటలు, మరెంతో ఇంధనం వృథా. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన ట్రాఫిక్‌ పోలీసులు మాత్రం చలానాల వేటలో మునిగిపోతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా వేయడం తప్పు కాదు. కానీ పోలీసులు దాదాపుగా ఉన్న సిబ్బంది మొత్తాన్ని చలానా వసూళ్లకు, కెమెరాలతో ఉల్లం‘ఘనుల’ చిత్రీకరణకే వెచ్చిస్తుండడం దారుణం. అసలు ట్రాఫిక్‌ పోలీసులంటే చలానాల వసూళ్లకేనా అనేలా తయారైంది పరిస్థితి. ఫలితంగా రాజధానిలోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్‌ ఇబ్బందులతో వాహనదారులు రోడ్డెక్కాలంటేనే భయపడుతున్నారు. రాజధానిలోని ట్రా‘ఫికర్‌’పై ‘ఈనాడు’ కొన్ని కీలక ప్రాంతాల్లో పరిశీలించినప్పుడు ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూశాయి..

హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఏదో ఒక మూల నిత్యం చిన్నా పెద్దా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఏటా దాదాపు వెయ్యిమంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. మరో నాలుగైదు వేలమంది గాయపడి ఆస్పత్రిపాలవుతున్నారు. హైదరాబాద్‌ నగరంలో రోడ్ల విస్తరణ అంతంతమాత్రంగానే ఉంది. విస్తరించని రోడ్లపై ఇన్ని లక్షల వాహనాలు తిరుగుతుండటంతో ప్రతి రోజూ ఎక్కడోచోట ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. క్షేత్రస్థాయిలోనే ఉండి ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను నియంత్రించాల్సిన పోలీసులు మాత్రం పెద్దగా పట్టించుకోవడంలేదు. హైదరాబాద్‌ నగర పరిధిలో మొత్తం 7,100 కిలోమీటర్ల రోడ్లు ఉండగా అందులో కీలకమైన రహదారులు 1,500 కిలోమీటర్లు. ప్రధానమైన రోడ్లపై ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడకుండా చేస్తే కాలనీ రోడ్లలో ట్రాఫిక్‌ సజావుగా సాగిపోతుంది. మూడు కమిషనరేట్లలో ట్రాఫిక్‌ పోలీసుల సంఖ్య తక్కువగా ఉందా అంటే అదీ లేదు. ఈ మూడుచోట్ల హోంగార్డులతో కలిసి  65 ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్ల కింద 3,550 మంది పోలీసులు ఉన్నారు. వీరంతా రోడ్ల మీదకు వచ్చి విధి నిర్వహణ చేస్తే చాలా ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది.

ఎందుకు రోడ్డు మీదకు రావడం లేదు! 
వేలాదిమంది పోలీసుల్లో క్షేత్రస్థాయిలో జంక్షన్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ఉండి ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించే వారు 500 మంది కూడా ఉండటం లేదు. మిగిలిన వారంతా 350 ప్రాంతాల్లో రోడ్ల పక్కనే ఉండి వాహనదారులను ఆపి జరిమానాల వసూలు పైనే దృష్టి సారిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఇలా చేస్తేనే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. కానీ ట్రాఫిక్‌ పోలీసులు రోజంతా ఏదో ఒక జంక్షన్‌ పక్కనే నిలబడి వాహనదారులను బలవంతంగా ఆపడం జరిమానాలు విధించడమే పనిగా భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పోలీసులు లేక చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది.

చలానాలూ విధుల్లో భాగమే 
- అనిల్‌కుమార్‌, అదనపు నగర పోలీసు కమిషనర్‌, హైదరాబాద్‌ 

ట్రాఫిక్‌ పోలీసులంతా క్షేత్రస్థాయిలోనే ఉంటున్నారు. ముఖ్యమైన జంక్షన్ల దగ్గర ఒక ఎస్‌ఐ ఇద్దరు ముగ్గురు కానిస్టేబుళ్లను ఏర్పాటు చేశాం. రద్దీ రోడ్లపై ట్రాఫిక్‌ సమస్య ఏర్పడకుండా ఎక్కువమందిని ఏర్పాటు చేశాం. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయడం కూడా ట్రాఫిక్‌ పోలీసుల విధుల్లో ఒకటి. దీనివల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. ఎక్కడ ట్రాఫిక్‌ సమస్య ఏర్పడినా తెలుసుకుని అక్కడికి అదనపు సిబ్బందిని పంపిస్తున్నాం.

జరిమానాల వాత! 
క్షేత్రస్థాయి విధులను వదిలేయడంతో 3 కమిషనరేట్లలో జరిమానాల మోతమోగుతోంది. ఏటా లక్షల్లో కేసులు నమోదవుతుండగా ఈ ఏడాది కోటి వరకు కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, జరిమానా కింద రూ. 300 కోట్ల వరకు వసూలయ్యే అవకాశం ఉందని  అధికారులు చెబుతున్నారు.

‘ఈనాడు’ పరిశీలనలో తేలిన నిజాలు ఇవీ..

* సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ జంక్షన్‌ అత్యంత రద్దీ కూడలి. ఇక్కడ కూడా గంటకు 16,000 నుంచి 22,000 వాహనాలు తిరుగుతుంటాయి. ఇక్కడ శనివారం పరిశీలిస్తే ఒక్క పోలీసులు కూడా లేరు. కొద్దిదూరంలో ఆరేడుగురు పోలీసులు కేసులు నమోదు చేస్తూ కూర్చున్నారు. దీంతో ఈ జంక్షన్‌లో పలుమార్లు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

* పంజగుట్ట జంక్షన్‌లో రద్దీ సమయాల్లో గంటకు 32,000 నుంచి 35,000 వాహనాలు తిరుగుతుంటాయి. వంద అడుగుల దూరంలోనే పోలీసు స్టేషన్‌ కూడా ఉంది. ఈ జంక్షన్‌లోనే ట్రాఫిక్‌ పోలీసులు అడ్డుగా నిలబడి కేసులు నమోదు చేయడమే తప్ప ఇక్కడ అడ్డదిడ్డంగా వెళ్తున్న వాహనదారులపై చర్యలు తీసుకోవడం లేదు.. ట్రాఫిక్‌ నియంత్రించే పని తమది కాదన్నట్లు వ్యవహరించారు.

* ఖైరతాబాద్‌ దగ్గర రద్దీ సమయంలో గంటకు 25,000 నుంచి 32,000 వాహనాలు వెళుతుంటాయి. ఈ జంక్షన్‌లో ఇద్దరు మాత్రమే ట్రాఫిక్‌ పోలీసులు ఉంటున్నారు. వీరిద్దరు సిగ్నల్స్‌ ఆపరేటింగ్‌లోనే నిమగ్నమయ్యారు. అక్కడికి పావు కిలోమీటరు దూరంలో నెక్లెస్‌ రోడ్డుకు వెళ్లే కూడలిలోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నిల్చున్న 10 మంది పోలీసులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అటుగా వచ్చే వాహనదారులను బలవంతంగా ఆపి వందలమందిపై కేసులు నమోదు చేస్తూ కనిపించారు.

* ఇవేకాదు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, మాసాబ్‌ట్యాంక్‌, పబ్లిక్‌గార్డెన్స్‌ తదితర అనేక రద్దీ రోడ్లలోనే కూడా ఇదే పరిస్థితి. సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లలోని ట్రాఫిక్‌ పోలీసులూ దీనికి ఏమీ తీసిపోవడం లేదు.


 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.