Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

సీయే.. మోజు తగ్గిపాయె!

ఫౌండేషన్‌ కోర్సుకు 2012-13లో నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 1,61,084
2017-18లో ఈ సంఖ్య 73,804 మాత్రమే
తెలుగు రాష్ట్రాల్లో అధిక శాతం తగ్గుదల!
నిబంధనల మార్పూ ఓ కారణం అంటున్న నిపుణులు
ఈనాడు, హైదరాబాద్‌, అమరావతి

ఛార్టర్డ్‌ అకౌంటెన్సీ (సీఏ) కోర్సు పూర్తి చేయడం కష్టమే కానీ.. పూర్తయితే జీవితాంతం ఆదాయమే. మన దేశంలోనే 5 లక్షల మంది సీఏల కొరత ఉంది. దుబాయి, సింగపూర్‌ వంటి దేశాల్లోనూ మన సీఏలకు డిమాండ్‌ ఉంది. అయినా ఈ కోర్సుపై క్రమేణా విద్యార్థులు ఆసక్తి చూపడంలేదని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) గణాంకాలు చెబుతున్నాయి.

ఈ అనాసక్తికి కారణాలేంటి?
ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ) కోర్సు పూర్తి చేసేందుకు ఏళ్ల తరబడి కుస్తీ పట్టే బదులు.. ఇంజినీరింగ్‌ వంటి కోర్సులను ఎంచుకోవడానికే విద్యార్థులు, తల్లిదండ్రులు ఇష్టపడుతున్నట్లు అర్థమవుతోంది. రిజిస్ట్రేషన్ల సంఖ్యలో ఏటా 4-5 శాతం హెచ్చుతగ్గులుంటాయని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) ప్రతినిధులు చెబుతున్నా.. 2012-13 గణాంకాలను 2017-18తో పోలిస్తే.. ఈ కోర్సులో ప్రవేశాలకు నమోదు చేసుకున్న వారి సంఖ్య దేశవ్యాప్తంగా 87,280 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ తగ్గుదల మరింత ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫౌండేషన్‌, ఇంటర్‌, ఫైనల్‌ కలిపి మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్య 2012-13లో 3,11,207 ఉండగా.. 2017-18లో ఈ సంఖ్య 2,10,289 మాత్రమే. అంటే లక్ష మందికి పైగా విద్యార్థులు తగ్గారు.

ఎందుకీ అనాసక్తి?
సీఏ కోర్సుని ఇంటర్‌ తర్వాత నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయవచ్చు. కానీ అలాంటి వారి సంఖ్య ఏళ్లపై లెక్కపెట్టే స్థాయిలోనే ఉంటుందని శిక్షణ అధ్యాపకుడు ఆకెళ్ల శివకుమార్‌ చెప్పారు. ఎక్కువ మందికి కనీసం అయిదేళ్ల సమయం పడుతుంది. అప్పటికీ పూర్తవుతుందనే గ్యారంటీ లేదు. ఎక్కువ మందికి అనేక దండయాత్రల తర్వాతే ఈ కోర్సు వశమవుతోంది.

కోర్సులో మూడు దశలు
*  మొదట ఫౌండేషన్‌ పరీక్ష రాయడానికి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇందుకు ఇంటర్‌మీడియట్‌ అర్హత. 2017కు ముందు పదో తరగతి పూర్తి కాగానే రిజిస్ట్రేషన్‌ చేసుకునేవారు. ఇంటర్‌మీడియట్‌ పూర్తి కాగానే మే-జూన్‌లో ఫౌండేషన్‌ పరీక్ష రాసేవారు. 2017 జులై 1 నుంచి ఈ నిబంధన మార్చారు. ఇంటర్‌ పూర్తయిన 6 నెలల తర్వాతే రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. దీంతో విద్యార్థుల్లో ఏడాది సమయం వృథా అవుతుందన్న భావన కలుగుతోంది. పరీక్షల విధానమూ మారింది. ప్రవేశ కోర్సుని కఠినతరం చేశారు. గతంలో సీపీటీ (ఇప్పుడు ఫౌండేషన్‌)లో కేవలం బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ఉండేవి. ఇప్పుడు రెండు ప్రశ్నపత్రాలు బహుళ ఐచ్ఛికం, మరో రెండు ప్రశ్నపత్రాలు వ్యాసరూప ప్రశ్నలు ఉంటున్నాయి. ప్రవేశ స్థాయిలోనే ఎక్కువ మందిని వడపోయాలన్న అభిప్రాయంతో ఇలా మార్చినట్లు అధ్యాపకులు చెబుతున్నారు.
*  ఫౌండేషన్‌లో అర్హత సాధించాక సీఏలో ఇంటర్‌కు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఏడాది శిక్షణతో ఇంటర్‌ పరీక్షలకు హాజరుకావచ్చు.
*  ఇంటర్‌లో అర్హత సాధిస్తే.. మూడేళ్లు ఏదైనా సంస్థలో శిక్షణ (ఆర్టికల్‌షిప్‌) పూర్తి చేయాలి. తర్వాత ఫైనల్‌కు నమోదు చేసుకోవాలి. సీఏ ఇంటర్‌, ఫైనల్‌లో ఒక్కో దాంట్లో గ్రూపు-1, 2 ఉంటాయి. అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత (40 శాతం) సాధించాలి. మొత్తం మీద 50 శాతం మార్కులు రావాలి. ఇంత కష్టపడితే ఉత్తీర్ణులవుతున్న వారి సంఖ్య స్వల్పం. 2015, 2016 సంవత్సరాల్లో ఉత్తీర్ణత శాతం మరీ తక్కువగా ఉండటంతో విద్యార్థులు షాక్‌కు గురైన పరిస్థితి.

సీఏ ఇంటర్‌తోనూ మంచి ఉద్యోగాలు
సివిల్స్‌లో ప్రతిభ చూపితే ఐఏఎస్‌ లేకుంటే ఐపీఎస్‌, ఇతర గ్రూపులు వస్తాయి. సీఏకు మాత్రం ఒక్కటే ఆప్షన్‌. కాకపోతే సీఏ ఇంటర్‌ పూర్తయితే సర్టిఫికెట్‌ ఇస్తారు. దాంతోనూ మంచి ఉద్యోగాలు పొందవచ్చు. సీఏ ఫైనల్‌ పూర్తి చేస్తే జీవితాంతం ఆదాయం ఉంటుంది.

బీటెక్‌ మంచిదా? సీఏనా?
ఇంటర్‌మీడియట్‌ తర్వాత జేఈఈ పరీక్షలకు సిద్ధమైతే అదే సంవత్సరం భవిష్యత్తు తేలిపోతుంది. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో సీటు దక్కకుంటే ఎంసెట్‌ ద్వారా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేరే అవకాశం ఉంది. మంచి పర్సంటేజ్‌తో మంచి కళాశాలలో బీటెక్‌ పూర్తి చేసినవారికి దేశవిదేశాల్లో భారీ ప్యాకేజీతో కొలువులు వస్తున్నాయి. అదే సీఏలో చేరితే పూర్తి చేస్తామన్న గ్యారంటీ లేకపోవడంతో తమ పిల్లల్ని ఆ కోర్సు వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు నచ్చజెబుతున్నారు. సీఏ ఫౌండేషన్‌ పరీక్షలో తేలిగ్గానే ఉత్తీర్ణులైనా ఇంటర్‌, ఫైనల్‌ పూర్తి చేయడం అధిక శాతం మందికి గగనమైపోతోంది. మధ్యలో వదిలేస్తే సాధారణ కొలువుతో స్థిరపడాల్సి వస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జేఈఈ పరీక్షలకు ఇంటర్‌ తర్వాత గరిష్ఠంగా ఒకటి రెండేళ్లు శిక్షణ తీసుకుంటారు. సీఏకు మాత్రం పూర్తయ్యేవరకు శిక్షణ తీసుకోవాలి. శిక్షణ రుసుము కూడా భారీగా ఉంటోంది. ఇటీవల రిజిస్ట్రేషన్‌ రుసుములు కూడా బాగా పెరిగాయి.

కొంత హెచ్చుతగ్గులు ఉంటాయి

రిజిస్ట్రేషన్ల సంఖ్యలో కొంత హెచ్చుతగ్గులుంటాయి. గణాంకాలను పరిశీలిస్తే 4-5 శాతం తగ్గుతోంది. దీని ఆధారంగా సీఏకు ఆదరణ తగ్గుతుందని చెప్పలేం. ఇప్పటికీ మన దేశంలో 5 లక్షల మంది సీఏలు అవసరం. మన సీఏలకు సింగపూర్‌, దుబాయి వంటి ఎన్నో దేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. సీఏలోకి వచ్చి ఉత్తీర్ణులు కాలేకుంటే ఐసీడబ్ల్యూఏ, కంపెనీ సెక్రటరీ, ఎంకాం వంటి కోర్సుల్లో చేరాలని చెబుతుంటాం.

- దేవరాజరెడ్డి, ఐసీఏఐ మాజీ ఛైర్మన్‌

నిబంధనలు మార్చాలి

2017 జులై 1 నుంచి కొత్త విధానం వచ్చింది. సిలబస్‌ మార్చారు. గతంలో పదో తరగతి పూర్తయిన తర్వాత సీపీటీ (ఇప్పుడు ఫౌండేషన్‌) పరీక్షకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం ఉండేది. 2017 నుంచి ఇంటర్‌ తర్వాత... అదీ 6 నెలల వ్యవధి అనంతరం రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా నిబంధన విధించారు. ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఇంటర్‌ రెండో ఏడాది పూర్తికాకముందే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాస్తుంటే ఇక్కడ ఈ నిబంధన ఎందుకు? ఇలాంటివి మార్చాలి. దీనివల్ల ఈ రెండేళ్లలో వేలాది మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదు. ఈ ఏడాది నుంచి మళ్లీ పుంజుకుంటుంది. కొత్త విధానం, సిలబస్‌ మారాక ఉత్తీర్ణత శాతం బాగా పెరిగింది.

- మోహన్‌, డైరెక్టర్‌, మాస్టర్‌ మైండ్స్‌ కళాశాల

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.