Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

కనీస పింఛను పెంచుతాం

శ్రీనగర్‌, లద్దాఖ్‌లలో ఈపీఎఫ్‌వో కార్యాలయాలు
 ఇకపై ప్రైవేటు బాండ్లలో ఈపీఎఫ్‌వో పెట్టుబడులు పెట్టం
సామాజిక భద్రత కోడ్‌లో ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ పరిమితి పెంపు
 ‘ఈనాడు’తో కేంద్ర కార్మికశాఖ మంత్రి గంగ్వార్‌
ఈనాడు - హైదరాబాద్‌

వేతన జీవులకు ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్‌) కనీస పింఛను పెంచే ఆలోచనలో ఉన్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ తెలిపారు. త్వరలోనే కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించి ఎంత మేరకు పెంచాలో నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈపీఎఫ్‌పై ఉద్యోగులకు 8.65 శాతం వడ్డీ చెల్లించేందుకు త్వరలో ఆర్థికశాఖ అనుమతి రానుందని చెప్పారు. దేశంలో ఉద్యోగిత రేటు పెరుగుతోందని ఈపీఎఫ్‌వో చందాదారుల సంఖ్య 6 కోట్ల నుంచి 8 కోట్లకు పెరగడమే ఇందుకు నిదర్శనమని వివరించారు. బుధవారమిక్కడ ఈఎస్‌ఐసీ సనత్‌నగర్‌ ఆసుపత్రి ఓపీడీ భవనాన్ని ప్రారంభించారు. ఈఎస్‌ఐసీ పనితీరు సమీక్షించారు. హైదరాబాద్‌లో ఈపీఎఫ్‌వో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌(సీబీటీ) సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌ ఈఎస్‌ఐ ఆసుపత్రికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని, ఇక్కడి కార్మికుల సంఖ్య మేరకు అవసరమైతే 1,500 పడకల ఆసుపత్రిగా మార్చుతామని ప్రకటించారు. విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. ‘సచివాలయానికి రావడం లేదు. ఫామ్‌హౌస్‌లో ఉంటున్నారు. ఇలాగైతే సామాన్యులకు ప్రభుత్వ పాలన అందుతుందా’ని ప్రశ్నించారు. దేశం అభివృద్ధి వైపు వెళ్తుంటే, తెలంగాణ తిరోగమనంలో వెళ్తోందన్నారు. అనంతరం వివిధ అంశాలపై ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

* సీబీటీ సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి?
ఈపీఎఫ్‌ వడ్డీ రేటు; పెట్టుబడులు; కార్మికుల కనీస పింఛను పెంపు; ఆర్టికిల్‌ 370 రద్దుతో శ్రీనగర్‌, లద్దాఖ్‌లలో ఈపీఎఫ్‌వో కార్యాలయాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించాం. మూణ్నెల్లలోగా అక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేస్తాం.
* కనీస పింఛనుపై గత సమావేశంలోనే ప్రతిపాదన వచ్చింది కదా?
ప్రస్తుతం కనీస పింఛను వెయ్యి రూపాయలు ఉంది. రూ.2వేలు, రూ.3వేలు, రూ.5వేల వరకు పెంచాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. పెంచాలంటే కొంత కేంద్ర ప్రభుత్వం భరించాలి. 15 రోజుల్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రితో సీబీటీ చర్చించాక ఒక నిర్ణయానికి వస్తాం.
* వాస్తవిక వేతనంపై పింఛను చెల్లించాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అమలు చేస్తారా? ఇప్పటికే ఆ మేరకు పింఛను తీసుకుంటున్నవారికి నిలిపివేశారు కదా?
దీనిపై ఈపీఎఫ్‌వో రివ్యూ పిటిషన్‌ వేసింది. ఇప్పటికే వాస్తవిక వేతనంపై పింఛను పొందుతున్న విశ్రాంత కార్మికులు ఇందులో భాగస్వాములవుతారు. అందుకే వారికి పెరిగిన పింఛను నిలిచిపోయింది. సుప్రీంకోర్టు ఇచ్చే సూచన మేరకు నిర్ణయం తీసుకుంటాం.
* రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో మందులు, పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు మీ దృష్టికొచ్చాయా?
తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. పశ్చిమబెంగాల్‌లో కొంత పరిస్థితి మెరుగ్గా ఉంది. ఈఎస్‌ఐసీ బోర్డు సమావేశంలో ఆయా రాష్ట్రాల అధికారుల నుంచి వివరాలు తీసుకుని తగిన చర్యలు తీసుకుంటాం.
* ఈఎస్‌ఐ ఆసుపత్రుల నిర్మాణంపై ఎలా ముందుకెళ్లబోతున్నారు?
తెలంగాణతో పాటు ఏపీలోనూ ఈఎస్‌ఐ కార్మికుల సంఖ్య మేరకు ఆసుపత్రులను నిర్మించాలని నిర్ణయించాం. ప్రతిపాదనలు తెప్పించుకుంటున్నాం. 50వేల మంది ఈఎస్‌ఐ కార్మికులు ఉన్నచోట 100 పడకలు, 20వేల మంది ఉన్నచోట 30 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేస్తాం.
* ఈపీఎఫ్‌వో పెట్టుబడులపై ఏమైనా పునరాలోచన జరిగిందా?
ఈపీఎఫ్‌వో పెట్టుబడులు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ బాండ్లలో కొన్ని ఉన్నాయి. వాటిని వెనక్కు తీసుకునేందుకు చర్యలు తీసుకుంటాం. ఇక నుంచి ప్రైవేటు బాండ్లలో పెట్టుబడులు పెట్టకూడదని సీబీటీ నిర్ణయించింది.
* ఈపీఎఫ్‌వో, ఈఎస్‌ఐ కేటగిరీల్లో గరిష్ఠ వేతన పరిమితి పెంచే ఆలోచన ఉందా?
త్వరలోనే సామాజిక భద్రత కోడ్‌ను తీసుకురానున్నాం. ఇందులో ఈపీఎఫ్‌వో గరిష్ఠ అర్హత వేతనం రూ.15వేల నుంచి, అలాగే ఈఎస్‌ఐ పరిమితి రూ.21 వేల నుంచి ఎంత మేరకు పెంచాలన్న విషయమై నిర్ణయం తీసుకుంటాం.
* పీఎం శ్రమ్‌యోగి మంథన్‌ యోజనలో చేరికలు ఆశాజనకంగా లేవెందుకని?
దేశంలో 40కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. వారికోసం ఈ పథకం ప్రవేశపెట్టిన వెంటనే ఎన్నికల కోడ్‌ వచ్చింది. దీంతో సభ్యుల సంఖ్య 32 లక్షలకు పరిమితమైంది. ఇక నుంచి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.