close

ప్ర‌త్యేక క‌థ‌నం

పోరాటాల ఖిల్లాలో హోరాహోరీ 

ఉమ్మడి నల్గొండ జిల్లాపై పట్టుకోసం తెరాస, కాంగ్రెస్‌ తీవ్ర యత్నాలు 
ప్రచారంలో తెరాస ముందంజ 
జిల్లా మొత్తం ఊపందుకోని కాంగ్రెస్‌ ప్రచారం 
2014లో చెరి సగం సీట్లు... నేడు అన్ని సీట్లపై తెరాస, కాంగ్రెస్‌ దృష్టి 
కాంగ్రెస్‌ అగ్రనేతలు ఉత్తమ్‌, జానా, కోమటిరెడ్డి ఈ జిల్లా వారే 
తెరాసలో మంత్రి జగదీష్‌రెడ్డి, గుత్తా 
జీడిపల్లి దత్తురెడ్డి 
ఈనాడు, నల్గొండ 
పోరాటాల ఖిల్లాలో హోరాహోరీ  
ఉమ్మడి నల్గొండ జిల్లా ముఖచిత్రం

పోరాటాల పురిటిగడ్డ పూర్వపు నల్గొండ జిల్లాలో ఎన్నికల పోరు ఉత్కంఠను రేపుతోంది. ముఖ్యనేతలు కొలువుదీరిన ఈ జిల్లాలోని 12 శాసనసభ స్థానాల్లో మెజారిటీ సీట్లను దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్‌లు పావులు కదుపుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మంత్రి జగదీశ్‌రెడ్డిలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. 2014 ఎన్నికల్లో ఈ జిల్లాలో తెరాస 6 స్థానాల్ని గెలుచుకుంది. మిత్రపక్షం సీపీఐతో కలిసి కాంగ్రెస్‌ 6 స్థానాలకు కైవసం చేసుకుంది.

ప్రచారంలో తెరాస ముందంజ 
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిథ్యం వహించిన హుజూర్‌నగర్‌, ఆయన సతీమణి పద్మావతి ప్రాతినిథ్యం వహించిన కోదాడ స్థానాలు మినహా మిగిలిన 10 స్థానాలకు తెరాస ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇక జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో ఆరేడు స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులు అనధికారికంగా ఖరారైనట్లే. తప్పకుండా టిక్కెట్టు వస్తుందన్న నమ్మకంతో పలువురు కాంగ్రెస్‌ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మహకూటమి పొత్తుల్లో భాగంగా తెదేపా కోదాడ స్థానాన్ని, సీపీఐ దేవరకొండ, మునుగోడు స్థానాల్ని కోరుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే నల్గొండ జిల్లాలో తెరాస ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్‌ ముఖ్యనేతలు పలువురు ఈ జిల్లాలోనే ఉండటంతో.. ఇక్కడ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు తెరాస తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తుండగా... మరోసారి సత్తా చాటడానికి కాంగ్రెస్‌ సిద్ధమైంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన తెరాస అభ్యర్థుల గెలుపునకు శ్రమిస్తున్నారు.

నల్గొండ: కోమటిరెడ్డి కోటపై తెరాస కన్ను 
పోరాటాల ఖిల్లాలో హోరాహోరీ 

జిల్లా కేంద్రమైన నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున 1999 నుంచి వరుసగా ఎన్నికవుతూ వస్తున్న, క్షేత్రస్థాయిలో గట్టి పట్టున్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధిపత్యానికి చెక్‌పెట్టడానికి తెరాస వ్యూహాన్ని రూపొందిస్తోంది. గత ఏడాది తెదేపా నుంచి తెరాసలో చేరిన కంచర్ల భూపాల్‌రెడ్డిని ఇక్కడ తెరాస అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గత ఎన్నికల్లో తెరాస నుంచి పోటీచేసిన దుబ్బాక నర్సింహారెడ్డితో భూపాల్‌రెడ్డికి సయోధ్య లేక, అసమ్మతి ప్రారంభమైన నేపథ్యంలో.. తెరాస అధిష్ఠానం రంగంలోకి దిగి ఇద్దరి మధ్య సర్దుబాటుచేసింది. ఈ నెల 4న నల్గొండలో జరిగిన ప్రజాశీర్వాద సభకు అందరూ హాజరై ఐక్యతారాగం వినిపించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని భూపాల్‌రెడ్డి, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత, తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని కోమటిరెడ్డి ఎవరివారే విశ్వాసంతో ఉన్నారు.

భువనగిరి:  కాంగ్రెస్‌లో పోటాపోటీ 
పోరాటాల ఖిల్లాలో హోరాహోరీ 

తాజా మాజీ ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి వరుసగా రెండోసారి భువనగిరి బరిలో దిగారు. అభివృద్ధి పనులపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. తెరాసకు అసమ్మతి నేతలు చికాకులు తెప్పిస్తున్నారు. భువనగిరి కాంగ్రెస్‌లో వర్గపోరు తీవ్రస్థాయిలో ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వర్గం తరఫున ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌ఛార్జి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి టిక్కెట్‌ ఆశిస్తుండగా.. మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి తరఫున గత ఎన్నికల్లో పోటీచేసిన పోతంశెట్టి వెంకటేశ్వర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. భాజపా నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌ బరిలో దిగనున్నారు. యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో ముందున్నారు.

మునుగోడు:  మూడు పార్టీల కన్ను

తెరాస సిట్టింగ్‌ స్థానమైన మునుగోడుపై తెరాసతో పాటు కాంగ్రెస్‌, సీపీఐలు దృష్టిసారించాయి. తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి తెరాస టికెట్‌ దక్కడంతో ఆయన ప్రచారంలో ఉన్నారు. తెరాస అసమ్మతి నేతల్ని ఇటీవల పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. మహాకూటమి పొత్తుల్లో భాగంగా ఈ స్థానాన్ని సీపీఐ కోరుతోంది. మాజీ ఎమ్మెల్యే పల్లావెంకటరెడ్డిని బరిలో దింపడానికి సీపీఐ ఏర్పాట్లు చేసుకుంటోంది. కాంగ్రెస్‌ టికెట్‌ కోసం మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ ముఖ్యనేత దివంగత పాల్వాయి గోవర్దన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. భాజపా రాష్ట్ర కోశాధికారి గొంగడి మనోహర్‌రెడ్డి కూడా పోటీచేసే అవకాశం ఉంది.

దేవరకొండ: కీలక పరిణామాల వేదిక

సంచలనాల నియోజకవర్గం దేవరకొండ(ఎస్టీ) ఈ సారి కూడా కీలక పరిణామాలకు వేదికగా మారింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుతో సీపీఐ తరఫున గెలిచిన రవీంద్రనాయక్‌ ఆ తర్వాత తెరాసలో చేరారు. ఇప్పుడు తెరాస అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 2009లో కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గిన ప్రస్తుత జడ్పీ ఛైర్మన్‌ బాలునాయక్‌ 2014 ఎన్నికల తర్వాత తెరాసలో చేరారు. ఈ మారు తెరాస టిక్కెట్‌ రాకపోవడంతో.. కాంగ్రెస్‌లో టిక్కెట్టు వస్తుందన్న నమ్మకంతో ఆ పార్టీలో చేరారు. ఆయన ఇప్పటికే ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. మరోవైపు తెదేపా నుంచి కాంగ్రెస్‌లో చేరిన, గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బిల్యానాయక్‌ కాంగ్రెస్‌ టిక్కెట్టు కోసం పట్టుబడుతున్నారు. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఈ ప్రాంతంలో పట్టు ఉండటం తెరాసకు ఉపకరిస్తుందని భావిస్తున్నారు. రవీంద్రనాయక్‌పై సీపీఐ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయని, అది తమకు అనుకూలిస్తుందని కాంగ్రెస్‌ భావిస్తోంది.

నకిరేకల్‌ప్రచారం ముమ్మరం 
పోరాటాల ఖిల్లాలో హోరాహోరీ 

నకిరేకల్‌ రిజర్వ్‌డ్‌ శాసనసభ స్థానాన్ని గత ఎన్నికల్లో దక్కించుకున్న తెరాస ఈ సారి కూడా నిలబెట్టుకోవడానికి సర్వశక్తులొడ్డుతోంది. తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశానికే తెరాస టికెట్‌ దక్కండతో.. ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు. ఆరు మండలాల్లో ఇప్పటికే చాలావరకు మొదటివిడత ప్రచారాన్ని ముగించారు. వీరేశం నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉండటం, కాంగ్రెస్‌ నుంచి తెరాసలోకి కొనసాగిన వలసలు తమకు అనుకూలతను పెంచాయని తెరాస భావిస్తోంది. సంస్థాగతంగానూ తెరాస పట్టుపెంచుకుంది. టిక్కెట్‌ కోసం మరికొందరు నేతలు ప్రయత్నిస్తున్నా.. కాంగ్రెస్‌ టికెట్‌ దక్కుతుందనే విశ్వాసంతో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్‌లో వర్గపోరు లింగయ్యకు సమస్యగా మారింది. పొత్తుల్లో భాగంగా తెదేపా ఇక్కడ్నుంచి పోటీ చేయడానికి ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి పోటీచేసి ఓడిపోయిన పాల్వాయి రజనీకుమారి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నియోజకవర్గానికి చెందిన చెరకు సుధాకర్‌ నేతృత్వంలోని తెలంగాణ ఇంటి పార్టీ తరఫున అభ్యర్థి బరిలో ఉండనున్నారు.

నాగార్జునసాగర్‌: జానా X నోముల 
పోరాటాల ఖిల్లాలో హోరాహోరీ 

పూర్వపు చలకుర్తి, ప్రస్తుతం నాగార్జునసాగర్‌ సెగ్మెంట్‌ల నుంచి వరుసగా నాలుగుసార్లు, మొత్తంమీద ఏడుసార్లు నెగ్గిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.జానారెడ్డి సాగర్‌ బరిలో మరోమారు నిలుస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆయనకు గట్టిపట్టు ఉండటంతో పాటు, నియోజకవర్గ ప్రజలకు చిరకాలం నుంచి సుపరిచితులు కావడం జానాకు ఉపయోగపడనుంది. గత ఎన్నికల్లో తెరాస తరఫున పోటీచేసిన నోముల నర్సింహయ్య వరుసగా రెండోసారి జానాకు ప్రత్యర్థిగా నిలిచారు. జానారెడ్డి అనుచరవర్గం కొంత తమవైపు రావడం ఉపకరిస్తుందని తెరాస భావిస్తోంది. బలమైన యాదవ సామాజిక వర్గం ఓట్లపై తెరాస విశ్వాసంతో ఉంది.

మిర్యాలగూడ: తేలని కాంగ్రెస్‌ అభ్యర్థి 
పోరాటాల ఖిల్లాలో హోరాహోరీ 

మిర్యాలగూడలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు. 2014లో కాంగ్రెస్‌ తరఫున నెగ్గిన నల్లమోతు భాస్కర్‌రావు తెరాసలో చేరి.. ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ముమ్మర ప్రచారం చేస్తున్నారు. 2014లో తెరాస అభ్యర్థిగా నిలిచిన  ఎ.అమరేందర్‌రెడ్డి నుంచి భాస్కరరావుకు చిక్కులు ఎదురవుతున్నాయి. పార్టీ అధిష్ఠానం అమరేందర్‌రెడ్డిని పిలిచి మాట్లాడినా.. సర్దుబాటు కాలేదు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని గతంలోనే ప్రకటించారు. 2016 నుంచి మిర్యాలగూడ సెగ్మెంట్‌కు  కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా సీనియర్‌ నేత జానారెడ్డి వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను లేదంటే, తన తనయుడు రఘువీర్‌ను ఇక్కడ్నుంచి బరిలో దించాలని జానారెడ్డి యోచిస్తున్నట్లు, ఆ మేరకు కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిసింది. 
సీపీఎం బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి బరిలో దిగుతున్నారు. కోదండరాం నేతృత్వంలోని తెజస మహాకూటమి పొత్తులో భాగంగా ముఖ్యనేత సివిల్‌ సర్వీసెస్‌ మాజీ అధికారి విద్యాధర్‌రెడ్డిని ఇక్కడ్నుంచి బరిలో దింపాలని ప్రయత్నిస్తోంది.

ఆలేరు:  మళ్లీ పాత ప్రత్యర్థులే? 
పోరాటాల ఖిల్లాలో హోరాహోరీ 

ఆలేరు బరిలో మాజీ ప్రత్యర్థులే మరోమారు తలపడే అవకాశం ఉంది. తెరాస తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత బరిలో దిగారు. అభివృద్ధి అజెండాగా తెరాస ప్రచారంలో ఉంది. గుండాల మండలం జనగామ జిల్లాలో కలవడం ఇక్కడ తెరాసకు ఇబ్బందులు తెస్తోంది. మరోవైపు జిల్లా కాంగ్రెస్‌(డీసీసీ) అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్‌ కాంగ్రెస్‌ టికెట్‌ తనదే అనే ధీమాతో అసెంబ్లీ రద్దయిన రోజునుంచే ప్రచారంలో దిగారు. తెదేపా మాజీ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించారు.

తుంగతుర్తి:  కాంగ్రెస్‌లో వర్గపోరు!

తాజా మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ తెరాస తరఫున మరోసారి తుంగతుర్తి బరిలో నిలిచారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నమ్మకంతో తెరాస ఉంది. అసమ్మతిని సద్దుమణచడం కిశోర్‌కు ఉపకరించనుంది. కాంగ్రెస్‌ టికెట్‌ను 2014లో పార్టీ తరఫున పోటీచేసిన అద్దంకి దయాకర్‌తో పాటు, మరికొందరు ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌కు వర్గపోరు తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సూర్యాపేట: ముక్కోణపు పోటీ 
పోరాటాల ఖిల్లాలో హోరాహోరీ 

మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సూర్యాపేటలో హోరాహోరీ పోరుకు తెరలేస్తోంది. తెరాస, కాంగ్రెస్‌, భాజపా మధ్య ముక్కోణపు పోరుకు సూర్యాపేట వేదిక కానుంది. తెరాస అభ్యర్థిగా బరిలో ఉన్న మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు బరిలో నిలవనున్నారు. గత ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి రెండో స్థానంలో నిలిచిన సంకినేని ఇప్పటికే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌ టికెట్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నారు. గత ఏడాది కాంగ్రెస్‌లో చేరిన తెదేపా జిల్లా మాజీ అధ్యక్షుడు పటేల్‌ రమేష్‌రెడ్డి సైతం కాంగ్రెస్‌ టిక్కెట్టుకు ప్రధాన పోటీదారుగా ఉన్నారు. సీపీఎం నేతృత్వంలోని బీఎల్‌ఎఫ్‌ తరఫున ప్రజా సంఘాల నాయకుడు రాపర్తి శ్రీనివాస్‌గౌడ్‌ పోటీ చేయనున్నారు.

కోదాడ: కాంగ్రెసా? తెదేపానా? 
పోరాటాల ఖిల్లాలో హోరాహోరీ 

కోదాడ సెగ్మెంట్‌ నుంచి 2014లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతి నెగ్గారు. ఈ సారి ఈ స్థానాన్ని తెదేపా కోరుతోంది. దీంతో ఇక్కడ కాంగ్రెస్‌ తరఫున బరిలో పద్మావతి ఉంటారా? లేదంటే తెదేపా అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్‌ ఉంటారా? అనేది తేలాల్సి ఉంది. గత ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి మల్లయ్యయాదవ్‌ పార్టీ తరఫున పోటీచేసి రెండో స్థానంలో నిలిచారు. పద్మావతి రెండువారాలుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ తెరాస అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌ఛార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు టిక్కెట్‌ ఆశిస్తున్నారు. సీపీఎం ఇప్పటికే బుర్రి శ్రీరాములును అభ్యర్థిగా ప్రకటించింది.

హుజూర్‌నగర్‌: ఉత్తమ్‌తో తలపడేది ఎవరు? 
పోరాటాల ఖిల్లాలో హోరాహోరీ 

2009, 2014ల్లో వరుసగా హుజూర్‌నగర్‌ నుంచి ఎన్నికైన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యర్థి ఎవరనేది తేలాల్సి ఉంది. ఉత్తమ్‌ ఏడాది కిందటి నుంచే ఇక్కడ ప్రచారాన్ని మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రచారం చేయాల్సి వస్తున్న దృష్ట్యా.. నియోజకవర్గంలో తాను ఎక్కువగా ప్రచారంలో పాల్గొననని, ప్రజలే తనను గెలిపించాలని కోరారు. మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిపై ఉత్తమ్‌ విశ్వాసంతో ఉన్నారు. ఇక్కడ తెరాస అభ్యర్థిని ప్రకటించలేదు. తెరాసలో వర్గపోరు ఉంది. గత ఎన్నికల్లో ఉత్తమ్‌కు పోటీగా బరిలో దిగిన తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, ఎన్‌ఆర్‌ఐ సైదిరెడ్డిలు టిక్కెట్‌ దక్కుతుందనే విశ్వాసంతో ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.