Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

నీ పాపనమ్మా.. ఏం పాపం చేశానమ్మా..? 

పురిటి బిడ్డలను విసిరేసే కర్కశత్వం ఎక్కడిది? 
ప్రతీ 4 రోజులకో బిడ్డను వదిలేస్తున్న తల్లిదండ్రులు 
జంతువులకు బలవుతున్న పసిప్రాణాలు మరెన్నో 
ఉయ్యాలలను ఏర్పాటు చేసినా ఫలితం శూన్యం! 
ఈనాడు - అమరావతి 

నీ పాపనమ్మా.. ఏం పాపం చేశానమ్మా..? 

అమ్మ కడుపులోంచి బయటపడటమే ఆ పసికందులు చేసిన పాపం.. చెత్తకుప్పలు, మురుగుకాల్వలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు.. ఇలా ఎక్కడబడితే అక్కడ ప్రత్యక్షం.. కొన్ని సందర్భాల్లో రోజులు, గంటల వయసున్న.. తడారని బిడ్డలనూ నిర్దయగా విసిరేసిపోతున్న కర్కశత్వం.. 
కళ్లు తెరచి కనీసం లోకాన్నయినా చూడలేని ఆ లేలేత మొగ్గలను అలా పురిట్లోనే వదిలించుకునేంత కాఠిన్యం అమ్మకుంటుందా?..నాన్నకుంటుందా? ఎవరో తెలియనివారి పిల్లలకు.. మన కళ్ల ముందు కాస్త దెబ్బ తగిలితేనే అయ్యో అంటూ జాలి చూపుతాం.. మరి నవ మాసలూ మోసి, పేగు తెంచుకు పుట్టిన బిడ్డలను ఎలా చెత్తకుప్పలు పాలు చేయగలుగుతున్నారో కదా!

మన రాష్ట్రం.. ఇదీ దైన్యం! 
ప్రతీ నాలుగు రోజులకో పసికందు వీధిపాలు 
ఏడాది వ్యవధిలో 87 మంది చిన్నారులు శిశువిహార్‌లకు తరలింపు 
నెల్లూరు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో నలుగురు పురిటి బిడ్డలను విడిచి  వెళ్లిన తల్లులు. 
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 15 మంది చిన్నారులు రోడ్డుపాలు 
గుంటూరులో 2010 నుంచి 2017 మధ్య రోడ్లు, చెత్తకుప్పలు, కల్వర్టుల వద్ద దొరికిన బాలికల సంఖ్య 53, బాలుర సంఖ్య 37 
చిత్తూరు జిల్లాలో అనాథ పసికందులు లభిస్తున్న ప్రధాన ప్రాంతాలు..తిరుపతి, మదనపల్లె 
విశాఖలో ప్రధానంగా డ్రైనేజీలు, కల్వర్టులు, ఆసుపత్రుల్లో పసికందులను వదిలి వెళుతున్న వైనం

నీ పాపనమ్మా.. ఏం పాపం చేశానమ్మా..? 

గాల్లో కలిసిపోతున్న ఆయువు 
వీధిపాలయ్యే చిన్నారులను ఎవరైనా గమనించి శిశు సంక్షేమాధికారులకు అప్పగిస్తే వారి సôరక్షణకు అవకాశం ఉంటుంది. కానీ, ఎవరి దృష్టికీ రాని పసికందులు ఏమవుతున్నారనేది ప్రశ్నార్థకమే. విజయనగరం జిల్లాలో జి.ములగాం పెద్దచెరువు సమీపంలో గత ఫిబ్రవరిలో అప్పుడే పుట్టిన బిడ్డ మృతదేహం లభ్యమైంది. ఇదే జిల్లాలోని గజపతినగరం వద్ద తుప్పల్లో ఏప్రిల్‌లో మగశిశువు మృతదేహం దొరికాయి. సంచుల్లో కుక్కి, బట్టల్లో మూటకట్టి వదిలేస్తున్న పసికందుల్లో ఇలా మృత్యువాత పడుతున్నవారెందరో? ఆసుపత్రుల వద్ద కుక్కలు, పందులు, పందికొక్కులు పీక్కుతిన్న సందర్భాలూ ఉంటున్నాయి. ఇలా ఎంతమంది పసికందుల ఆయువు గాలిలో కలిసిపోతోందనేదీ తేలని విషయమే.

ఆ...డపిల్లలేనా? 
రాష్ట్రంలో గత ఏడాది వ్యవధిలో నెలలు, ఏడాదిలోపు వయసున్న 87 మంది పిల్లలను వదిలేశారు. ఇది కేవలం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఆచూకీ లభించిన చిన్నారుల సంఖ్య మాత్రమే. వీరిలో సగానికి సగం మంది ఆడశిశువులే! ఒక్క చిత్తూరు జిల్లాలో 9మంది ఆడపిల్లలను తల్లిదండ్రులు కాదనుకున్నారు. పురిట్లోనే ఇప్పటికీ ఆడపిల్లలను వదిలించుకుంటున్నారనేందుకు ఈ సంఖ్యే నిదర్శనం. అదే మగ పిల్లలనైతే ఆరోగ్య సమస్యలు, అవకరాలు ఉన్నవారిని ఎక్కువగా వదిలి పోతున్నారు.

అవగాహన కార్యక్రమాలు.. 
పసికందులను అనాథలను చేయవద్దంటూ ప్రభుత్వ శాఖల ద్వారా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నా.. అవి పెద్దగా జనాలకు చేరడం లేదన్నది చేదు నిజం.. కార్యక్రమాల విస్తృతి పెంచాల్సిన అవసరం ఉంది. ఆసుపత్రుల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపడితే ఇలా వదిలేస్తున్న పిల్లలను కొంతవరకైనా ఆదుకునే అవకాశం ఉంటుంది. ఇలా పిల్లలను వదిలేసి వెళుతున్నవారిని పట్టుకుని వారికి అవగాహన కల్పించి, ఇలాంటి చర్యలను ప్రచారంలోకి తీసుకువస్తే కొంతవరకు ఉపయుక్తంగా ఉంటుందన్నది బాలల హక్కుల పరిరక్షణ ప్రతినిధులు చెబుతున్న మాట.

బిచ్చగాళ్ల పాలు.. 
ఆసుపత్రులు, చెత్తకుప్పల్లో పడేసిన/వదిలేసిన పసికందులు ఎక్కువగా యాచకుల పాలవుతున్నారు. వారు ఈ పసిబిడ్డలను రోడ్లపై పడుకోబెట్టి, వారిని ఎరగా వేసి దందా నడుపుతున్నారు. ఇటీవల రాజమహేంద్రవరంలో ఒక బిచ్చగాడి వద్ద ఉన్న నెలల పాపను పశ్చిమ గోదావరి నుంచి ఎత్తుకెళ్లిన బిడ్డగా గుర్తించారు. హైదరాబాద్‌లో మరో యాచకుడి వద్దనున్న మూడేళ్ల పాపనూ అలాగే గుర్తించినట్లు తెలిసింది.

కనీసం.. ఇక్కడ విడిచిపొండి 
పసికందులను ఎక్కడెక్కడో విసిరేసో, వదిలేసో వెళ్లిపోయే నిర్దయులు.. అలాంటి పిల్లలను కనీసం సంరక్షణకు వెసులుబాటుండే శిశుగృహాల వద్ద విడిచివెళితే బాగుంటుంది. మరోవైపు ఆసుపత్రులు, బస్‌, రైల్వేస్టేషన్లు, శిశు గృహాలు ఇలా వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఉయ్యాలలను మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేశారు. కానీ, వీటిలో ఇప్పటివరకూ ఎక్కడా పసిబిడ్డలను వదిలివెళ్లిన దాఖలు లేవు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 115 ఉయ్యాలలను ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు. వీటిలోనూ చాలావాటిని కొంతకాలం కొనసాగించి తర్వాత తీసేశారు. చిత్తూరు జిల్లాలో 66 ఉయ్యాలలు పెట్టినట్లు అధికారులైతే చెబుతున్నారు.. కానీ జిల్లాలో ఎక్కడా ఇలాంటివి లేవని క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందే స్పష్టం చేసిన పరిస్థితి!

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.