close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఎలుకల ఎక్స్‌ప్రెస్‌ 

ఎలుకల బండిగా మారిన  ఏపీ ఏసీ రైలు 
బోగీల్లోని విద్యుత్తు తీగల్ని  కొరికేస్తున్న మూషికాలు 
ప్రయాణంలో తరచూ ఏసీకి ఎదురవుతున్న అంతరాయాలు 
ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని 
   రైల్వే అధికారులు 

ఎలుకల ఎక్స్‌ప్రెస్‌ 

ఈనాడు-విశాఖపట్నం: విశాఖ, విజయవాడ, వరంగల్‌ మీదుగా దిల్లీకి వెళ్లే రాష్ట్రంలోని అత్యంత కీలకమైన రైలు ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌. ప్రస్తుతం ఇది ఎలుకల బండిగా పేరుగాంచింది. ఇందులోని బోగీల్లోకి ఎలుకలు వచ్చి అటూ ఇటూ తిరుగుతూ ప్రయాణికులను ఇబ్బంది పెడుతుండటం దీనికి ప్రధాన కారణం. అంతేకాకుండా విద్యుత్తు, ఏసీ తీగల వ్యవస్థ ఉండే యూనిట్లలోకి మూషికాలు చొరబడి వాటిని ఎక్కడపడితే అక్కడ కొరికేస్తున్నాయి. దీంతో ప్రతీ ప్రయాణంలో ఏదో ఒక బోగీలో విద్యుత్తు సమస్యో, ఏసీ ఆగిపోయిన సమస్యో తలెత్తుతోంది. దీనిపై గత ఏడాది కాలంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా రైల్వే అధికారులు పెడచెవినపెడుతూ వస్తున్నారు. తాజాగా ఆదివారం ఈ రైలులోని ఏ3 బోగీకి అనకాపల్లి, విజయవాడ, ఖమ్మం, డోర్నకల్‌లో సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే.

ఎలుకల ఎక్స్‌ప్రెస్‌ 

ఫీడర్లే ఆగిపోతున్నాయి 
ఈ రైలులో (22415/16) రెండు చివర్లా విద్యుత్తు ఫీడర్లను మోసుకెళ్లే పవర్‌కార్లు ఉంటాయి. ఇక్కడి నుంచి రైలు మొత్తానికి విద్యుత్తు సరఫరా చేసే తీగలుంటాయి. పలు పరిమాణాల్లో రైల్లోకి వచ్చిన ఎలుకలు.. అందులోని బోగీల్లో ఫ్యూజ్‌ఛాంబర్‌, ఇతర పరికరాలున్న చోట్లకీ వెళ్తున్నాయి. రైలు పైభాగంలో ఉన్న తీగల వ్యవస్థ కోసం వదిలిన సందుల్లో నుంచి వెళ్లి.. ఎక్కడపడితే అక్కడ తీగల్ని కొరికేస్తున్నాయి. ఇలా కొరికినప్పుడు ఒక్కోసారి షార్ట్‌సర్క్యూట్‌ అవ్వడం.. ఆ వెంటనే విద్యుత్తు ఫీడర్లు ఆగిపోవడం జరుగుతోంది. ఇలా విద్యుత్తు ట్రిప్‌ అయిన ప్రతిసారీ 14 కోచ్‌లున్న ఈ రైలులో ఎక్కడ ఎలుకలు కొరికాయనేది గుర్తించేందుకే సుమారు అరగంట సమయం వృథా అవుతోందని అధికారులు అంటున్నారు. ఈ సమయంలో జనాలు గగ్గోలు పెట్టడం, అధికారుల మీద, సాంకేతిక నిపుణుల మీద తీవ్ర ఒత్తిళ్లు రావడం ఈ రైలులో సహజంగా మారింది. ఎలుకలు ఎక్కడ కొరికిందీ గుర్తించి, అక్కడ బాగుచేసిన తర్వాతే మళ్లీ విద్యుత్తు, ఏసీ సరఫరాల్ని పునరుద్ధరించడం రివాజుగా మారింది. విద్యుత్తు సరఫరా అయ్యే 3ఫేజ్‌ కంట్రోల్‌ ప్యానళ్లలో కూడా ఎలుకలు వెళ్లి బీభత్సం సృష్టించిన దాఖలాలు ఉన్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు.

ఎలుకల ఎక్స్‌ప్రెస్‌ 

ఎక్కడివీ ఎలుకలు 
రోజువారీ తిరిగే ఈ రైలును దిల్లీ రైల్వేస్టేషన్‌ పక్కనే ఉన్న షకుర్‌బస్తీ యార్డులో నిలిపి ఉంచుతున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అడవిని తలపిస్తుండటం, పైగా మురుగు కుంటలు, చెత్తాచెదారం ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి ఈ ఎలుకలు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రైలు పైభాగాన ఉన్న ఏసీ యూనిట్‌ టన్నెల్స్‌ నుంచి ఇవి వెళ్తున్నట్లు గుర్తించామని, అక్కడి నుంచి ఇవి ఎక్కడ దారిదొరికితే అక్కడ తీగల వ్యవస్థల నుంచి వెళ్తున్నాయని వారంటున్నారు. దీని బోగీల్లో తీగల వ్యవస్థే సరిగా లేదని, వాటన్నింటినీ బాగుచేయడానికి కనీసం 2, 3 నెలల సమయం పడుతుందని వాల్తేరు రైల్వే అధికారులు సమాధానమిస్తున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.