Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

నిలబడుతుందా.. రాజెస్థాన్‌? 

రాజెపై రాజుకుంటున్న అసంతృప్తి... పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత 
తమను పట్టించుకోవట్లేదని కార్యకర్తల్లో తీవ్ర అసహనం 
ఈ దఫా గెలుపుపై నేతల్లోనూ కనిపించని భరోసా 
పథకాలే గట్టెక్కిస్తాయన్నది వసుంధర ధీమా 
మెజార్టీ తగ్గినా పీఠం ఖాయమంటున్న భాజపా

నిలబడుతుందా.. రాజెస్థాన్‌? 

డిసెంబరు 11

 రాజస్థాన్‌లో వసుంధర రాజె సర్కారు నిలబడుతుందో.. నిష్క్రమిస్తుందో తేలిపోయే రోజు! 
అనేక సంక్షేమ పథకాల ద్వారా లక్షలాది మందికి లబ్ధి చేకూర్చామనీ, రాష్ట్రంలో అధికారం మళ్లీ తమదేనని భాజపా గాంభీర్యం వ్యక్తం చేస్తున్నా... ఆ ధీమా మాత్రం పార్టీ శ్రేణుల్లో కనిపించట్లేదు. ప్రజా వ్యతిరేకతకు తోడు, సొంత కార్యకర్తల నుంచే తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తమవుతున్నాయి. వీటిని పసిగట్టిన పార్టీ నాయకత్వం... శ్రేణులను బుజ్జగించి, ప్రజలను మెప్పించే కార్యక్రమాలు చేపడుతున్నాయి. 
అవి ఎంతవరకూ ఫలిస్తాయోగానీ, ప్రత్యర్థి కాంగ్రెస్‌ను చిత్తుచేయడం వసుంధరకు ఈసారి నల్లేరు మీద నడకైతే కాదు. రాజెకు ఈ ఎన్నికలు చావో! రేవో!!

నిలబడుతుందా.. రాజెస్థాన్‌? 

‘ఆమె అందుబాటులో ఉండరు’- ఇదీ ముఖ్యమంత్రి వసుంధర రాజెపై పడిన ముద్ర. క్రమంగా ప్రజలు కూడా ఆమెకు దూరమవుతూ వచ్చారు. గత ఫిబ్రవరిలో అజ్‌మేర్‌, అల్వార్‌ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. రెండు చోట్లా భాజపా అభ్యర్థులు మట్టి కరిచారు. ప్రత్యర్థి కాంగ్రెస్‌ భారీ ఆధిక్యం నమోదు చేసింది. వీటి పరిధిలో మొత్తం 16 విధానసభ స్థానాలుండగా... 2013 ఎన్నికల్లో భాజపా 15 గెలుచుకుంది.

నిలబడుతుందా.. రాజెస్థాన్‌? కానీ, లోక్‌సభ ఉప ఎన్నికల్లో మాత్రం వీటిలో ఒక్కచోట కూడా ఆధిక్యం సంపాదించుకోలేకపోయింది. కాషాయ పార్టీ కంచుకోటలుగా భావించే అజ్‌మేర్‌ నార్త్‌, సౌత్‌ స్థానాలు సహా అన్నిచోట్లా కాంగ్రెస్‌కే ఆధిక్యం లభించింది. బూత్‌ ఇన్‌ఛార్జులుగా స్థానికులనే నియమించినా... కనీసం పది చోట్ల భాజపాకు ఒక్కటంటే ఒక్క ఓటు కూడా పడలేదు! కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉండీ... సాక్షాత్తూ మంత్రులు ప్రాతినిధ్యం వహించే సెగ్మెంట్లలోనైనా ఆశించినంతగా ఓట్లు రాకపోవడంతో భాజపా అగ్ర నాయకత్వానికి బొప్పి కట్టింది. వసుంధర తీరు వల్లే ఈ దుస్థితి వచ్చిందనీ, ఉన్నతాధికారులు ఆమెను తమకు అందుబాటులో లేకుండా చేస్తున్నారనీ... జిల్లాల్లోని అధికారులకు తామంటే లెక్కలేకుండా పోయిందని ఎమ్మెల్యేలు ఆరోపించారు. తమ మాట చెల్లుబాటు కావట్లేదనీ, ప్రజలకు పనులు చేసి పెట్టలేకపోతున్నామంటూ కార్యకర్తలు కూడా సమీక్షల్లో ఆవేదన, ఆగ్రహం వెళ్లగక్కారు. చాపకింద నీరులా ప్రజా వ్యతిరేకత విస్తరిస్తోందని గ్రహించిన రాజె... తనపై పడ్డ ‘ముద్ర’ను చెరిపేసుకోవడానికి మార్చి నాటి బడ్జెట్‌తో శ్రీకారం చుట్టారు. అన్ని వర్గాలనూ సంతృప్తి పరిచే ‘మేలురకం’ ఆదాయవ్యయ ప్రణాళికను తెచ్చారు. ఆ తర్వాత ‘జన్‌ సంవాద్‌’ పేరుతో 16 జిల్లాల్లోని 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేపట్టారు. స్థానిక కార్యకర్తలను కలుస్తూ, వారి ఫిర్యాదుతో వందలాది మంది జనం చూస్తుండగానే పలువురు అధికారులను సస్పెండ్‌ చేశారు. ప్రజల గోడును ఓపిగ్గా వింటూ, ఎక్కడికక్కడ పరిష్కారాలు చూపడం, పథకాలను ప్రకటించడం ద్వారా వారికి చేరువయ్యేందుకు ప్రయత్నించారు. కుల, వర్గాల వారీగా జనాన్ని సమీకరించి, కలుసుకోవడానికి ఈ పర్యటన రాజెకు బాగా ఉపయోగపడింది. 

ఉప ఎన్నికల్లో వైఫల్యం ఎదురైనా, అగ్ర నాయకత్వాన్ని ఎదిరించి తనకు అనుకూలమైన రాష్ట్ర అధ్యక్షుడిని నియమించుకున్న రాజెకు ఈ ఎన్నికలు చాలా కీలకం. జయం తనదైతే ఇకపైనా ఆమె మాటే చెల్లుతుంది. లేకుంటే.. 
...... 67 ఏళ్ల రాజపుత్రిక రాజకీయ భవిష్యత్తులో మార్పులు తప్పకపోవచ్చు.

పట్టువదల్లేదు 
ఉప ఎన్నికల్లో పరాజయం పాలైనా... రాజె తన ఆధిపత్యాన్ని వదులుకోలేదు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ‘మోదీ మనిషి’గా పేరొందిన కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించేందుకు ఆమె ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో నిర్ణయం జాప్యమై, పార్టీకి వ్యవస్థాగత కష్టాలు తప్పలేదు.
బయట పడ్డ లుకలుకలు 
రాజె మంత్రివర్గ సహచరుల్లో సఖ్యత లేదన్న సంకేతాలు పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఉపాధ్యాయుల బదిలీల విషయంలో మంత్రి వాసుదేవ్‌, బన్షీదర్‌ బాజియాల నడుమ బహిరంగంగానే తోపులాట చోటుచేసుకుంది. అయితే, ఇవన్నీ చాలా చిన్న అంశాలనీ, ఎన్నికల నాటికి అన్నీ సర్దుకుంటాయని సీనియర్‌ నేతలు అంటున్నారు.

నిలబడుతుందా.. రాజెస్థాన్‌? 

చేసిన పనులు గెలిపిస్తాయా? 
‘‘మునుపెన్నడూ లేనంతగా రాజస్థాన్‌లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. అభివృద్ధి దృష్టితోనే ఎన్నికలు జరిగితే... కదలకుండానే అధిక స్థానాలను కైవశం చేసుకుంటాం. కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారన్నదానిపై దృష్టి సారించాం. వారు కూడా కలిసొస్తే.. ఎన్నికల్లో మా పార్టీ ఘన విజయం ఖాయం’’ అని సీనియర్‌ మంత్రి ప్రభులాల్‌ సైనీ ధీమా చెబుతున్నారు. కానీ, చాలామంది శాసనసభ్యుల పనితీరు ఏమాత్రం బాగోలేదని కొందరు నేతలే బాహాటంగా వినిపిస్తున్నారు. పనితీరు, క్షేత్రస్థాయి కార్యకర్తల అభిప్రాయం మేరకే ఈసారి సీట్లను కేటాయించాలని అధినాయకత్వం యోచిస్తోంది. అయితే... చికిత్స చాలా ఆలస్యమైందనీ, భాజపాకు గడ్డు పరిస్థితి ఎదురుకావొచ్చని రాజస్థాన్‌ విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యుడు, రాజకీయ కోవిదుడు నారియన్‌ భరత్‌ అభిప్రాయపడ్డారు. 
 

ప్రతికూలతలు 
రాజ్‌పుట్‌లలో ఆగ్రహం 

నిలబడుతుందా.. రాజెస్థాన్‌? 

 రాష్ట్ర జనాభాలో రాజ్‌పుట్‌లు 6%

దశాబ్దాల తరబడి భాజపాకు మద్దతిస్తున్న బలమైన రాజ్‌పుట్‌ సామాజికవర్గం ప్రస్తుతం ఆ పార్టీ వైఖరి పట్ల అసంతృప్తితో ఉంది. తమ వర్గానికి చెందిన గజేంద్ర షెకావత్‌కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్‌ను పార్టీ నెరవేర్చకపోవడమే ఇందుక్కారణం. గ్యాంగ్‌స్టర్‌ ఆనంద్‌సింగ్‌ను నకిలీ ఎన్‌కౌంటర్‌లో హతమార్చారన్నది వారికి ఆగ్రహం తెప్పించిన మరో అంశం. దీంతో ఇప్పుడు రాజ్‌పుట్‌ల దారెటు అన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి రాజేంద్ర రాథోర్‌ మాత్రం కాంగ్రెస్‌ కంటే తమ ప్రభుత్వమే రాజ్‌పుట్‌లకు ఎక్కువ మేలు చేసిందనీ, వారు తమవైపే ఉన్నారని చెబుతున్నారు. భాజపాకు దన్నుగా నిలిచే గుజ్జర్లలోనూ ఈసారి అసంతృప్తి కనిపిస్తోంది. రాజె సర్కారు తమకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్‌ కల్పించలేదనీ, హామీని తుంగలో తొక్కిందని గుర్రుగా ఉన్నారు.

పైలట్‌ దూకుడు...

నిలబడుతుందా.. రాజెస్థాన్‌? రాజస్థాన్‌ పీసీసీ పగ్గాలు చేపట్టిన సచిన్‌ పైలట్‌... భాజపాకు మరో పెద్ద సవాలుగా మారారు. వ్యవసాయం, ఉద్యోగం, అభివృద్ధి సహా అన్ని విషయాల్లోనూ రాజె సర్కారు ఘోరంగా విఫలమైందనీ, లెక్కలతో సహా వీటిని ప్రజలకు పూస గుచ్చినట్టు వివరిస్తామంటున్నారు. పరోక్షంగా కొందరు భాజపా నేతలు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తుండటం చెప్పుకోవాల్సిన అంశం. రాజె పథకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావట్లేదనీ, ప్రజా వ్యతిరేకత ఉన్న మాట నిజమేనని చెబుతున్నారు.

పార్టీలో అసంతృప్తి

సొంత పార్టీలోనే అసంతృప్తి గూడుకట్టుకోవడం సమస్యగా తయారైంది. భాజపా రాష్ట్ర అధ్యక్షునిగా మదన్‌లాల్‌ సైనీ బాధ్యతలు చేపట్టే వేళ ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆయన మాట్లాడుతుండగా... ఓ కార్యకర్త అడ్డు తగిలారు. తమ గోడు వినే నాయకుడు లేకపోయాడనీ, ముందు కార్యకర్తల మాటకు ఎమ్మెల్యేలు, మంత్రులు విలువ ఇవ్వాలంటూ గట్టిగా అరిచాడు. దీంతో మిగతా కార్యకర్తలంతా కూడా అతనితో గొంతు కలిపారు.
ముస్లింలు దూరం 

రాష్ట్ర జనాభాలో ముస్లింలు 9%

నిలబడుతుందా.. రాజెస్థాన్‌? 

గోవధ నిషేధం, అనంతరం దాడులతో ముస్లింలకు భాజపా మరింత దూరమైంది.ఈ సామాజికవర్గం... ఈసారి ఓట్లు చీలకుండా జాగ్రత్తపడి, గంపగుత్తగా కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అవకాశం లేకపోలేదు.

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.