close

ప్ర‌త్యేక క‌థ‌నం

కాలుతున్న కరెంటు ధర 

తుపాను తాకిడికి విద్యుత్తు లైన్లు ధ్వంసం 
ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య సరఫరాకు అంతరాయం 
ఇంధన ఎక్స్ఛేంజీలో ఆకాశాన్నంటిన ధరలు 
గరిష్ఠ ధర యూనిట్‌కు రూ.19 
తుపానుతో రూ.600 కోట్లదాకా అదనపు ఆర్థిక భారం 
కోతల్లేని సరఫరాకు తెలంగాణ డిస్కంల అవస్థలు 
ఈనాడు - హైదరాబాద్‌ 

తిత్లీ తుపానుతో ‘భారత ఇంధన ఎక్స్ఛేంజీ’ (ఐఈఈ)లో కరెంటు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒక యూనిట్‌ కరెంటు గరిష్ఠ విక్రయ ధర రూ.19.87కి చేరింది. తుపానుతో ఉత్తరాంధ్రలో విద్యుత్తు టవర్లు, లైన్లు ధ్వంసం కావడంతో ఉత్తర, ‘దక్షిణ భారత రాష్ట్రాల’(ఎస్‌ఆర్‌) మధ్య విద్యుత్తు సరఫరా ఈ నెల 15 నుంచి 5 రోజుల పాటు నిలిచిపోయింది. ఈ క్రమంలో శుక్రవారం నుంచి పునరుద్ధరించినట్లు ‘జాతీయ పవర్‌ గ్రిడ్‌ సంస్థ’(పీజీసీఎల్‌) ఎస్‌ఆర్‌ విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కం)లకు సమాచారం ఇచ్చింది. ఉత్తరాది నుంచి విద్యుత్తు రాకపోవడంతో నిరంతర సరఫరా కొనసాగించేందుకు తెలంగాణ డిస్కంలు అవస్థలు పడ్డాయి. అధిక ధరలకు విద్యుత్తు కొనాల్సి రావడంతో అదనంగా రూ.600 కోట్లదాకా ఆర్థిక భారం పడినట్లు అంచనా. కేంద్ర విద్యుత్కేంద్రాల నుంచే కాకుండా, ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ డిస్కంలు నేరుగా కొంటున్న వెయ్యి మెగావాట్లు సైతం రాకపోవడంతో ఎక్కువ విద్యుత్తును ఐఈఈలోనే కొన్నారు. మరోవైపు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో జల విద్యుదుత్పత్తి చేయడం వల్ల ఈ నెల 15 నుంచి 17 వరకూ విద్యుత్తు డిమాండును తీర్చే స్థాయిలో సరఫరా చేయగలిగారు. జల విద్యుత్తు రాకపోతే కరెంటు సరఫరాకు మరిన్ని ఇబ్బందులు ఏర్పడేవి. దసరా పండగ సెలవులతో హైదరాబాద్‌ నగరం నుంచి ప్రజలు ఊళ్లకు వెళ్లడంతో గురువారం నుంచి నగరంలో వినియోగం ఏకంగా 500 మెగావాట్ల వరకూ తగ్గింది. కొరత సమయంలో ఈ తగ్గుదల మరింత ఊరటనిచ్చింది. గత బుధవారం నుంచి కొన్నిచోట్ల భారీ వర్షాల వల్ల వాతావరణం చల్లబడి విద్యుత్తు డిమాండు తగ్గుతూ వస్తోంది. రాష్ట్రంలో అత్యధిక విద్యుత్తు డిమాండు 229 మిలియన్‌ యూనిట్లు(ఎంయూ) ఈ నెల 8న నమోదైంది. అప్పటి నుంచి దానికి దగ్గరగా డిమాండు కొనసాగుతోంది.

ఇంధన ఎక్స్ఛేంజీలో గత ఆగస్టులో సగటున రోజుకు 128 ఎంయూల విద్యుత్తును అన్నీ రాష్ట్రాల డిస్కంలు కొన్నాయి. గరిష్ఠంగా యూనిట్‌ విద్యుత్‌ను రూ.8.87కు అమ్మారు. ఇప్పుడు 220 ఎంయూల వరకూ కొంటున్నారు. గరిష్ఠ ధర ఈ నెల 17న రూ.19.87కు చేరింది.  రోజులో ప్రతి 15 నిమిషాల సమయాన్ని ఒక విభాగంగా విక్రయ ధరను ఐఈఈలో ప్రకటిస్తారు. మరుసటి రోజు ఏయే సమయాల్లో కరెంటు అవసరమో తెలుపుతూ ముందురోజే  దేశవ్యాప్తంగా డిస్కంలు రేట్లను కోట్‌ చేస్తాయి. వాటి మధ్య ఏర్పడే పోటీతో ఐఈఈలో ధర పెరుగుతూ పోతుంది. ఎక్కువ ధరను కోట్‌ చేసిన వారికి అందుబాటులో ఉన్న కరెంటును సరఫరా చేస్తారు. ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకూ గరిష్ఠ డిమాండు ఉంటున్నందున ఆ సమయంలోనే ఎక్కువ రేట్లు కోట్‌ అవుతున్నాయి. తిరిగి రాత్రి 11 గంటల తరవాత యూనిట్‌ ధర రూ.3 నుంచి రూ.4కు పడిపోతోంది. తుపాను కారణంగా ఈస్థాయి అత్యధిక ధర నమోదైందని ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ‘ఈనాడు’కు తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో అధిక ధరకు సైతం కొని సరఫరా చేసినట్లు చెప్పారు.

కాలుతున్న కరెంటు ధర 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.