Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

రంగస్థలం రంగారెడ్డి 

రంగస్థలం రంగారెడ్డి 

పూర్వపు రంగారెడ్డి జిల్లా ముఖచిత్రం 
రాష్ట్ర రాజధాని నగరం చుట్టూ అల్లుకున్న రాజకీయం 
ముఖ్యనేతల పోరుబరి 
అభ్యర్థులే కీలకం 
తొలి జాబితాలో టికెట్లు దక్కని ముగ్గురు తాజా మాజీలు 
నగరం... గ్రామీణ ప్రాంతాల మేలుకలయిక ఈ జిల్లా 
కె. శివరామకృష్ణ, ఈనాడు - హైదరాబాద్‌ 

రంగస్థలం రంగారెడ్డి 

పూర్వపు రంగారెడ్డి జిల్లాకు రాజకీయంగా పలు ప్రత్యేకతలున్నాయి. ఈ జిల్లాలోని సగానికి పైగా స్థానాలు హైదరాబాద్‌ మహానగరంలోనే ఉన్నాయి. చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతాలతో పాటు భాగ్యనగరంతో ఈ నియోజకవర్గాలు అల్లుకుని ఉన్నాయి. రాష్ట్ర రాజధాని చుట్టుపక్కల ప్రాంతం కావడంతో.. సహజంగానే ఇక్కడి నియోజకవర్గాల్ని సొంతం చేసుకోవడం తెరాస, కాంగ్రెస్‌, భాజపా, తెదేపా తదితర పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. పూర్వపు రంగారెడ్డి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో అన్ని పార్టీలకూ ప్రాతినిధ్యం దక్కింది. తెలుగుదేశం పార్టీ అత్యధికంగా ఏడు స్థానాల్ని దక్కించుకోగా.. తెరాస నాలుగు చోట్ల నెగ్గింది. కాంగ్రెస్‌ రెండు స్థానాల్లో, భాజపా ఒక స్థానంలో గెలిచాయి. ఎన్నికల అనంతర పరిణామాల్లో తెదేపా నుంచి గెలిచిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఆరుగురు తెరాసలో చేరారు. ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలూ తెరాస తీర్థం పుచ్చుకున్నారు. దీంతో సభ రద్దయ్యే నాటికి ఈ జిల్లాలో తెరాస బలం 12కు చేరింది.
పట్టు నిలుపుకోవడమే లక్ష్యంగా... 
పూర్వపు రంగారెడ్డి జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకోవడానికి తెరాస, కాంగ్రెస్‌, తెదేపా, భాజపా సర్వశక్తులొడ్డుతున్నాయి. తెరాస ఇప్పటికే 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులపై మహాకూటమిలో చర్చలు జరుగుతున్నాయి. నగర శివార్లలోని తమకు పట్టున్న మెజారిటీ స్థానాలను కేటాయించాలని తెలుగుదేశం పార్టీ కోరుతోంది. మహాకూటమిలో అభ్యర్థుల్ని ప్రకటించకపోవడంతో ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఉప్పల్‌ నియోజకవర్గంలో గెలుపొందిన భాజపా ఈసారి ఈ నియోజకవర్గంతో పాటు మరికొన్ని స్థానాల్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. బీఎల్‌ఎఫ్‌ అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను దింపుతోంది.

రంగస్థలం రంగారెడ్డి 

ముందుగానే వేడెక్కిన రాజకీయం 
తెలంగాణ శాసనసభను రద్దుచేయడానికన్నా ముందే తెరాస రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొంగరకలాన్‌లో అత్యంత భారీ బహిరంగ సభను నిర్వహించి ఎన్నికల ప్రచారానికి నాంది పలికింది. తమ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులనూ అందరికన్నా ముందుగానే తెరాస ప్రకటించింది. అసంతృప్తుల్ని బుజ్జగిస్తూ ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో ముందున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రెండు సభలను అసెంబ్లీ రద్దుకు ముందే నిర్వహించిన కాంగ్రెస్‌- ప్రచారంలో తామూ వెనుకబడి లేమని నిరూపించడానికి ప్రయత్నించింది. మహాకూటమి తరఫున బరిలో నిలిచే అవకాశం ఉన్న అభ్యర్థులూ ప్రచారం చేసుకుంటున్నారు.

ఇబ్రహీంపట్నం అధికార, విపక్షాలకు అసమ్మతి సెగ

రంగస్థలం రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి గత రెండు ఎన్నికల్లో తెదేపా తరఫున గెలిచిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆ తర్వాత తెరాసలో చేరారు. ఇప్పుడు తెరాస అభ్యర్థిగా రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో తెరాస తరఫున పోటీచేసిన శేఖర్‌రెడ్డితో పాటు మరికొందరు నేతలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. కొందరు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసేందుకు డీసీసీ అధ్యక్షుడు క్యామమల్లేశ్‌, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిలు ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా వీరిద్దరూ టిక్కెట్టు కోసం పోటీపడగా.. క్యామ మల్లేశ్‌ను ఇబ్రహీంపట్నం నుంచి, మల్‌రెడ్డి రంగారెడ్డిని మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ బరిలో నిలిపింది. క్యామ మల్లేశ్‌కు వ్యతిరేకంగా మల్‌రెడ్డి రంగారెడ్డి సోదరుడు రామిరెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేయడంతో.. ఓట్లు చీలిపోయి మల్లేశ్‌ ఓటమిని చవిచూశారు. తెలంగాణ జన సమితి కూడా ఇక్కడ్నుంచి పోటీ చేయాలని భావిస్తోంది. భాజపా కూడా పోటీలో ఉంటుంది.

ఎల్‌బీ నగర్‌ తేలని మహాకూటమి అభ్యర్థి

తెరాస అభ్యర్థిగా మద్దగౌని రామ్మోహన్‌గౌడ్‌ని ప్రకటించడంతో ఆయన ప్రచారం ప్రారంభించారు. మహాకూటమిలో ఇంకా సీట్ల సర్దుబాటు తేలకపోవడంతో...ఇక్కడ్నుంచి ఎవరు బరిలో దిగుతారన్న ఖరారుకాలేదు. గత ఎన్నికల్లో తెదేపా తరఫున గెలిచిన బీసీ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య మళ్లీ పోటీ చేస్తారా? ఒకవేళ చేస్తే ఏ పార్టీ తరఫున బరిలో దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. మహాకూటమి అభ్యర్థిగా బరిలో ఉంటారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, తెదేపా నుంచి సామ రంగారెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ ఇద్దరూ టిక్కెట్టు కోసం గట్టి ప్రయత్నాలే చేసుకుంటున్నారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయిస్తారా లేక తెదేపాకా? అన్నది చర్చనీయాంశంగా ఉంది.

శేరిలింగంపల్లి ఎవరికి దక్కేనో!

శేరిలింగంపల్లి నియోజవకర్గం నుంచి గత ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా నెగ్గిన అరెకపూడి గాంధీ ఆ తర్వాత తెరాసలో చేరారు. ఇప్పుడు తెరాస అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈయనకు టికెట్‌ ప్రకటించిన వెంటనే కొందరు తెరాస కార్పొరేటర్లు ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి శిబిరం నిర్వహించారు. అసమ్మతీయుల్ని మంత్రి కేటీఆర్‌ బుజ్జగించారు. మహాకూటమిలో ఇంకా సీట్ల సద్దుబాటు వ్యవహారం తేలకపోవడంతో.. ఇక్కడ కాంగ్రెస్‌, తెదేపాల్లో ఎవరు పోటీచేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్‌ తనకే టిక్కెట్టు లభిస్తుందన్న విశ్వాసంతో ప్రచారం కూడా చేసుకుంటున్నారు. సీమాంధ్ర ఓటర్లు గణనీయ సంఖ్యలో ఉండటం, అనుకూలమైన సామాజికవర్గం ఇక్కడ గెలుపోటముల్ని ప్రభావితం చేసే స్థితిలో ఉండటంతో.. శేరిలింగంపల్లి స్థానాన్ని తమకే కేటాయించాలని తెదేపా గట్టిగా పట్టుబడుతోంది. పార్టీ టిక్కెట్టు కోసం మొవ్వ సత్యనారాయణ, భవ్య కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత ఆనంద్‌ ప్రసాద్‌లు ప్రయత్నిస్తున్నారు.

రాజేంద్రనగర్‌ ప్రకాశ్‌గౌడ్‌తో ఢీకి కార్తీక్‌రెడ్డి రెడీ!

రంగస్థలం రంగారెడ్డి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ప్రకాశ్‌గౌడ్‌ ఆ తర్వాత తెరాసలో చేరారు. మూడోసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం కోసం తెరాస తరఫున బరిలోకి దిగారు. ప్రకాశ్‌గౌడ్‌కు వ్యతిరేకంగా తానూ పోటీ చేస్తానంటూ తెరాసకే చెందిన శ్రీశైలంరెడ్డి బహిరంగంగా ప్రకటించారు. ప్రకాశ్‌గౌడ్‌ ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధమై ప్రచారాన్ని  మొదలు పెట్టారు. ఇక్కడ కార్తీక్‌రెడ్డి పోటీ ఖాయమని సబితారెడ్డి వర్గీయులు స్పష్టంచేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎంఐఎం కీలక పాత్ర పోషిస్తుంది. మైనారిటీ వర్గానికి చెందిన ఓటర్లు లక్షమంది దాకా ఉంటారు. ఎంఐఎం అభ్యర్థి బరిలో ఉంటారా లేదా అనే దానిని బట్టి అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉంటాయి.

మహేశ్వరం సబిత వ‌ర్సెస్‌ తీగల 
రంగస్థలం రంగారెడ్డి రంగస్థలం రంగారెడ్డి 

మహేశ్వరం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తెదేపా తరఫున గెలిచిన తీగల కృష్ణారెడ్డి ఈ మారు తెరాస అభ్యర్థిగా బరిలో నిలిచారు. ప్రచారాన్నీ ప్రారంభించారు. తెరాస నేత కొత్త మనోహర్‌రెడ్డి పార్టీ తరఫున పోటీచేసే అవకాశం రాకపోవడంతో.. ప్రత్యామ్నాయాల దిశగా దృష్టిసారించారు. కాంగ్రెస్‌ తరఫున మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి టిక్కెట్టు ఇవ్వకూడదన్న కాంగ్రెస్‌ అధిష్ఠాన నిర్ణయం ఆమె పోటీకి ఆటంకం అవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో కూడా ఆమె తన తనయుడి కోసం పోటీ నుంచి తప్పుకున్నారు. ఈసారి సబితా ఇంద్రారెడ్డి టికెట్‌పై ధీమాతో ప్రచారాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్‌ నాయకుడు దేప భాస్కర్‌రెడ్డి కూడా బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. టిక్కెట్టు కేటాయించకపోతే తిరుగుబాటు అభ్యర్థిగా పోటీచేస్తానని చెబుతున్నారు. మహేశ్వరం నుంచి బలమైన అభ్యర్థిని పోటీకి నిలపడానికి భాజపా ప్రయత్నిస్తోంది. ఈ స్థానాన్ని తెదేపా కూడా ఆశిస్తోంది.

ఉప్పల్‌ ముక్కోణపు పోరు ఖాయం

ఉప్పల్‌ నియోజకవర్గంలో ముక్కోణపు పోటికి రంగం సిద్ధమైంది. తెరాస, మహాకూటమి, భాజపా అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉండనున్నారు. తెరాస నుంచి బేతి సుభాష్‌రెడ్డి పోటీచేస్తున్నారు. భాజపాకు చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ మరోసారి పోటీకి సిద్ధమై ప్రచారం చేసుకుంటున్నారు. మహాకూటమి అభ్యర్థిగా తెదేపా తరఫున మాజీ హోంమంత్రి దేవేందర్‌గౌడ్‌ తనయడు వీరేందర్‌గౌడ్‌ పోటీ చేస్తారని తెదేపా వర్గాలు పేర్కొంటున్నాయి. దేవేందర్‌గౌడ్‌ నియోజకవర్గంలో తన అనుచరగణాన్ని కలసి తన తనయుడికి అనుకూలంగా మద్దతు కూడగడుతున్నారు. ఉప్పల్‌ టికెట్‌ ఇవ్వనందుకు నగర మేయర్‌ బొంతురామ్మోహన్‌, ఆయన వర్గం కార్పొరేటర్లు అలక పూనారు. తెరాస అగ్రనాయకత్వం జోక్యం చేసుకోవడంతో.. మేయర్‌ అసమ్మతిబాట వీడి అభ్యర్థి ప్రచారంలో పాల్గొంటున్నారు. అంతర్గతంగా అసమ్మతి సెగ ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన బండ రాజిరెడ్డి తెరాసలో చేరారు.

మేడ్చల్‌ ఏ పార్టీ నుంచి ఎవరో?

మేడ్చల్‌ నియోజకవర్గంలో తెరాస ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. తాజామాజీ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పించి పోటీచేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తనకే టిక్కెట్టు వస్తుందని ధీమాగా ఉన్నారు. ఇక్కడ ఎంపీ మల్లారెడ్డిని తెరాస తరఫున బరిలో దింపుతారనే ప్రచారం కూడా జరిగింది. మల్లారెడ్డి రెండు మూడు రోజులు ప్రచారంలో కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఇక్కడ్నుంచి పోటీకి మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి సన్నద్ధమవుతున్నారు. కాంగ్రెస్‌ ఇతర నాయకులు జంగయ్యయాదవ్‌, ఉద్దమర్రి నర్సింహారెడ్డి, స్కైలాబ్‌రెడ్డి తదితరులు కూడా తమకే టిక్కెట్టు ఇవ్వాలని కోరుతున్నారు. లక్ష్మారెడ్డికి టిక్కెట్టు ఇస్తే తాము సహకరించబోమని హెచ్చరికలు చేస్తున్నారు.

కూకట్‌పల్లి తెరాసకు అసమ్మతి బెడద

అన్ని పార్టీల కన్నూ కూకట్‌పల్లి నియోజకవర్గంపైనే పడింది. ఇక్కడ్నుంచి తెరాస అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో తెదేపా నుంచి బరిలో దిగిన ఆయన ఈ సారి తెరాస తరఫున పోటీలో ఉన్నారు. మాధవరం కృష్ణారావుకు తెరాస నుంచి అసమ్మతి సమస్యగా మారింది. బాలాజీగనర్‌ కార్పొరేటర్‌ కావ్యరెడ్డి భర్త హరీశ్‌రెడ్డి తనకే టిక్కెట్టు ఇవ్వాలని పట్టుపట్టి చివరికి పార్టీని వీడి వెళ్లారు. స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ స్థానాన్ని మహాకూటమి తరఫున తెదేపా ఆశిస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు పెద్దిరెడ్డి ఇక్కడ్నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. తెదేపాకు చెందిన ఏకైక కార్పొరేటర్‌ మందడి శ్రీనివాసరావు కూడా ఈ స్థానం నుంచి పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ స్థానాన్ని తెదేపాకే కేటాయించే అవకాశం ఉందని కాంగ్రెస్‌ నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. భాజపా తరఫున మాధవరం కాంతారావు పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.

కుత్బుల్లాపూర్‌ పాత ప్రత్యర్థుల ప్రచార జోరు

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్థిగా తాజామాజీ ఎమ్మెల్యే వివేకానంద బరిలో దిగారు. ప్రచార జోరు పెంచారు. ఆయనకు పార్టీలో అసమ్మతి సమస్యగా మారింది. ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ఇతరులు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించగా.. మంత్రి కేటీఆర్‌ జోక్యం చేసుకోవడంతో అసమ్మతివాదులు మెత్తబడ్డారు. తెరాసలో మరో నాయకుడు కొలను హనుమంతరెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా పోటీలో ఉంటారని చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ టికెట్‌ దక్కుతుందనే ధీమాతో మాజీ ఎమ్మెల్యే కూనశ్రీశైలంగౌడ్‌ ప్రచారం చేసుకుంటున్నారు. తెదేపా కూడా పొత్తుల్లో ఈ స్థానాన్ని ప్రతిపాదించింది. భాజపా, ఇతర పార్టీలు అభ్యర్థులపై దృష్టిసారించాయి.

పరిగి జోరుగా ప్రచారం

పరిగి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి తనయుడు మహేశ్‌రెడ్డి తెరాస అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి ఇప్పటికే ప్రచారంలో చురుకుగా ఉన్నారు. తెరాస టికెట్‌ దక్కకపోవడంతో కుల్కచర్ల జడ్పీటీసీ సభ్యడు మనోహర్‌రెడ్డి అలకవహించారు. భాజపా జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాదరావు కూడా  పరిగి నుంచి పోటీకి సన్నద్ధమవుతున్నారు.

చేవెళ్ల వారు వీరయ్యారు

చేవెళ్ల(రిజర్వుడు)లో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన కాలె యాదయ్య ఆ తరువాత తెరాసలో చేరారు. ఆయననే ఈసారి తెరాస తన అభ్యర్థిగా ప్రకటించింది. యాదయ్య ఇప్పటికే ప్రచారమూ ప్రారంభించారు. గత ఎన్నికల్లో తెరాస తరఫున పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే రత్నం పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా రత్నం పోటీచేయొచ్చనే ప్రచారం ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పడాల వెంకటస్వామి కూడా పార్టీ టిక్కెట్టును ఆశిస్తున్నారు.

మల్కాజిగిరి పోటాపోటీ

మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల్ని ప్రకటించకపోవడంతో టికెట్ల కోసం పలువురు తీవ్రంగా ప్రయత్నిస్నున్నారు. తాజామాజీ ఎమ్మెల్యే కనకారెడ్డికి తెరాస టికెట్‌ ప్రకటించలేదు. కనకారెడ్డి మాత్రం తనకు లేదంటే తన కోడలు విజయశాంతికి టిక్కెట్టు ఇవ్వాలని పార్టీని గట్టిగా కోరుతున్నారు. తమకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఈ స్థానాన్ని తెరాస నేత మైనంపల్లి హనుమంతరావుకు ఇవ్వడానికి పార్టీ నిర్ణయించిందనే ప్రచారం జరుగుతోంది. ఆయన ప్రచారం కూడా చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌ తరఫున నందికంటి శ్రీధర్‌, ఇటీవలే పార్టీలో చేరిన ఆకుల రాజేందర్‌, సురేశ్‌యాదవ్‌లు టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఇక్కడ బలమైన అభ్యర్థి కోసం భాజపా దృష్టిసారించింది.

తాండూరు ప్రచారంలో మంత్రి

రంగస్థలం రంగారెడ్డి తాండూరు నియోజకవర్గంలో ఈ సారి హోరాహోరీగా పోరు సాగే వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడ్నుంచి మరోసారి మంత్రి మహేందర్‌రెడ్డి తెరాస అభ్యర్థిగా బరిలో దిగారు. విస్తృత ప్రచారం చేస్తున్నారు. తెరాస నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రోహిత్‌రెడ్డితో పాటు డీసీసీబీ మాజీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి కూడా కాంగ్రెస్‌ టిక్కెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెండు పార్టీల్లోని అంతర్గత విభేదాలు ప్రత్యర్థులకు లబ్ధి చేకూరుస్తాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తెరాసలో కొందరు నేతలు రోహిత్‌రెడ్డి అభ్యర్థి అయితే పరోక్షంగా సహకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్‌ ఇక్కడ రెండు గ్రూపులుగా విడిపోయింది. రోహిత్‌రెడ్డికి టిక్కెట్టు ఎలా ఇస్తారంటూ లక్ష్మారెడ్డి వర్గం ప్రశ్నిస్తోంది. తెలంగాణ జన సమితి తరఫున మర్రి శశిధర్‌రెడ్డి కొడుకు ఆదిత్యరెడ్డి పోటీ చేస్తారని తెలుస్తోంది.

జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ తర్వాత కొత్త జిల్లాల వారీగా నియోజకవర్గాలు

రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం, ఎల్‌.బి.నగర్‌, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, చేవెళ్ల(ఎస్సీ), కల్వకుర్తి, షాద్‌నగర్‌ 
వికారాబాద్‌ జిల్లా: పరిగి, వికారాబాద్‌, తాండూరు, కొడంగల్‌ 
మల్కాజ్‌గిరి-మేడ్చల్‌ జిల్లా : మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, ఉప్పల్‌

వికారాబాద్‌ బరిలో నిలిచేదెవరు?

వికారాబాద్‌ నుంచి కూడా పోటీలో నిలిచే అభ్యర్థులు ఎవరో ఇంకా తేలలేదు. ఇక్కడ గత ఎన్నికల్లో నెగ్గిన సంజీవరావుకు ఈ సారి తెరాస మొదటి జాబితాలో స్థానం దక్కలేదు. సంజీవరావు మాత్రం తనకు, లేదంటే తన సతీమణి మధురవాణికి తెరాస టిక్కెట్టు ఇవ్వాలని కోరుతున్నారు. సబితా ఆనంద్‌, మరికొందరూ టిక్కెట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ టికెట్‌ కోసం మాజీ మంత్రులు గడ్డం ప్రసాద్‌, చంద్రశేఖర్‌లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

రంగస్థలం రంగారెడ్డి 

రంగస్థలం రంగారెడ్డి 

రంగస్థలం రంగారెడ్డి 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.