close

ప్ర‌త్యేక క‌థ‌నం

పాలమూరు పోరుజోరు 

పాలమూరు పోరుజోరు  
మహబూబ్‌నగర్‌పై అన్ని పార్టీల దృష్టి 
14 నియోజకవర్గాలకూ అభ్యర్థులను ప్రకటించిన తెరాస 
పలుచోట్ల తెరాస-కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ 
అందరి దృష్టీ కొడంగల్‌పైనే 
నర్సింగోజ్‌ మనోజ్‌కుమార్‌ 
ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌ 
పాలమూరు పోరుజోరు 

వలసలు, కరవు అనగానే గుర్తుకు వచ్చే ఉమ్మడి పాలమూరు జిల్లాను రాజకీయ ఉద్దండుల ఖిల్లాగా కూడా అభివర్ణించవచ్చు. కృష్ణవేణి ముఖద్వారమైన ఈ జిల్లాలో ఏ ఎన్నికలైనా పోరు.. నువ్వా-నేనా అన్నస్థాయిలో ఉంటుంది. రాష్ట్ర మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్‌గౌడ్‌, ఏఐసీసీ అధికార ప్రతినిధి జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ తదితరులంతా ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో తమ తమ పార్టీలను విజయతీరాలకు చేర్చే విషయమై వ్యూహాల్లో మునిగితేలుతున్నారు. సాగునీటి పథకాలు కాంగ్రెస్‌, తెరాసలకు ప్రధాన అస్త్రాలుగా మారుతున్నాయి. పూర్వ మహబూబ్‌నగర్‌ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా.. విభజన తర్వాత మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, జోగులాంబ గద్వాల, వనపర్తి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 13 నియోజకవర్గాలు చేరాయి. కొడంగల్‌ నియోజకవర్గం ప్రస్తుతం మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. తెలంగాణ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి బరిలో ఉన్న కొడంగల్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

శాసనసభను రద్దు చేసిన రోజే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మొత్తం 14 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ తొలి, మలిదశ ఎన్నికల ప్రచారాలను ఈ జిల్లా నుంచే ప్రారంభించడం విశేషం. పాలమూరును సెంటిమెంట్‌ జిల్లాగా భావించే భాజపా సైతం ఇక్కడి నుంచే ముందస్తు ఎన్నికల సమరశంఖం పూరించింది. తెదేపా, భాజపా, తెజసలు కనీసం ఒకటి లేక రెండు స్థానాల్లోనైనా గెలుపొంది తమ పార్టీ జెండాను ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతున్నాయి.

పాలమూరు పోరుజోరు 

జడ్చర్ల 
పాత ప్రత్యర్థుల మధ్యే పోరు

పాలమూరు పోరుజోరు జడ్చర్ల నియోజకవర్గం మరోమారు పాత ప్రత్యర్థుల మధ్య పోరు కేంద్రంగా మారనుంది. తెరాస అభ్యర్థి, రాష్ట్ర మంత్రి డా.లక్ష్మారెడ్డి అన్ని గ్రామాల్లో మొదటి విడత ప్రచారాన్ని పూర్తి చేశారు. మరోవైపు మహాకూటమిలో భాగంగా పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి గ్రామాల్లో తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మహాకూటమిలో భాగంగా కొందరు పార్టీ టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.

అచ్చంపేట 
కాంగ్రెస్‌ అభ్యర్థి తేలాలి

అచ్చంపేట నుంచి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బరిలో నిలిచారు. ఆయన ఇప్పటికే ప్రచారంలో ముందున్నారు. ఇక్కడి నుంచి తెరాస టికెట్‌ను ఆశించిన మాజీ మంత్రి రాములు నిరాశకు గురయ్యారు. ఆయన్ను బుజ్జగించి ప్రచారంలో పాల్గొనేలా చేశారు. కాంగ్రెస్‌ నియోజకవర్గ బాధ్యుడు, మాజీ ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నారు. ఇటీవల తెరాసకు చెందిన శ్రీనివాసరావు కాంగ్రెస్‌లో చేరడం చర్చనీయాంశమైంది. భాజపా తరఫున ఎం.మల్లేశ్వర్‌ పోటీచేస్తున్నారు.

కొల్లాపూర్‌ 
జూపల్లితో ఢీ కొట్టేది ఎవరు? 
పాలమూరు పోరుజోరు 

మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఒక విడత ప్రచారాన్ని పూర్తి చేసుకున్నారు. ఇక్కడి నుంచి పలు పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పలువురు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన బీరం హర్షవర్ధన్‌ రెడ్డి, ఇటీవల పార్టీలో చేరిన సీఆర్‌ జగదీశ్వర్‌రావు టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. రెడ్‌కో మాజీ ఎండీ సుధాకర్‌రావు కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.

మహబూబ్‌నగర్‌ 
శ్రీనివాస్‌గౌడ్‌ ప్రత్యర్థి తేలలేదు

మహబూబ్‌నగర్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. టికెట్‌ ప్రకటించిన రోజు నుంచే ఎన్నికల ప్రచారంలోకి దిగారు బలమైన సామాజికవర్గానికి చెందిన నాయకుడు కావడం, ఉద్యోగ సంఘాల మద్దతు ఉండడం ఆయనకు అనుకూల పరిణామం. శ్రీనివాస్‌గౌడ్‌ ప్రత్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు.  డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌, మైనారిటీ నేత ఇబ్రహీంలు కాంగ్రెస్‌ టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మహాకూటమి తరఫున తెదేపా జిల్లా అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచిన ఇబ్రహీం ఇటీవల తెరాస నుంచి కాంగ్రెస్‌లో చేరడం నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామంగా నిలుస్తోంది. మన ఇంటి పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ జన సమితి నుంచి టీఎన్‌జీవో నేత రాజేందర్‌రెడ్డి మహాకూటమి నుంచి బరిలో దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. భాజపా నుంచి కూడా పలువురు ఆసక్తి చూపుతున్నారు.

మక్తల్‌ 
బరిలో ఎవరు?

మక్తల్‌ నియోజకవర్గంలో తెరాస నుంచి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేరు ఖరారు అయ్యింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన చిట్టెం తర్వాత తెరాసలో చేరారు. రామ్మోహన్‌రెడ్డి మాజీ మంత్రి డీకే అరుణ సోదరుడు. చిట్టెంకు తెరాస నుంచే అసమ్మతి సమస్యగా మారింది. అసంతృప్తి నేతలతో కేటీఆర్‌ సమావేశమై చర్చించడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి నుంచి మహాకూటమి భాగస్వామి తెదేపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి టికెట్‌పై ధీమాతో ప్రచారాన్ని ప్రారంభించారు,  మరో వైపు కాంగ్రెస్‌ టికెట్‌ కోసం పలువురు పోటీపడుతున్నారు. జడ్పీటీసీ సభ్యుడు శ్రీహరి, డీసీసీబీ ఛైర్మన్‌ వీరారెడ్డి, మాజీ మంత్రి డి.కె.అరుణ కుమార్తె స్నిగ్ధారెడ్డిలతో బాటు మరికొందరు ప్రయత్నం చేస్తున్నారు.

అలంపూర్‌ 
సంపత్‌ శ్రీ అబ్రహం

అలంపూర్‌ సెగ్మెంట్‌ నుంచి ఏఐసీసీ కార్యదర్శి, తాజా మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ ప్రచారంలో ముందున్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం, అభివృద్ధి పనులు గెలిపిస్తాయనే నమ్మకంతో సంపత్‌కుమార్‌ ఉన్నారు. గత ఎన్నికల్లో తెదేపా నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే డా.అబ్రహం బరిలో నిలిచారు. 2014లో తెరాస తరఫున పోటీ చేసిన మంద జగన్నాథం కుమారుడు మంద శ్రీనాథ్‌కు ఈ సారి టికెట్‌ దక్కలేదు. మంత్రులు సర్దిచెప్పడంతో శ్రీనాథ్‌ వర్గం తెరాస ఎన్నికల ప్రచారంలో కలిసి సాగుతోంది.  ఈ నియోజకవర్గంలో రాజకీయాల్లో కీలకమైన మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రాంరెడ్డి మద్దతు ఎవరికి లభిస్తుందనేది రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

కల్వకుర్తి 
ముక్కోణపు పోరు

కల్వకుర్తి నియోజకవర్గం తెరాస అభ్యర్థి జైపాల్‌యాదవ్‌ ప్రచారంలో ముందున్నారు. జైపాల్‌ యాదవ్‌కు టికెట్‌ను ప్రకటించగానే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అసంతృప్తి నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. మరోవైపు తెరాసకు చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగే లక్ష్యంతో తన అనుచరులతో సమావేశం కావడం తెరాస వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో 72 ఓట్ల తేడాతో ఓటమి పాలైన భాజపా అభ్యర్థి టి.ఆచారి ఈ సారీ భాజపా నుంచి బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గం ముక్కోణపు పోటీకి సిద్ధమవుతోంది.

షాద్‌నగర్‌ 
పోరు ఆసక్తికరం

షాద్‌నగర్‌ నియోజకవర్గంలో ఆసక్తికరపోరుకు తెరలేస్తోంది. తెరాస అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ మరోసారి బరిలో నిలిచి ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి ఈ సారి కూడా కాంగ్రెస్‌ టికెట్‌ తనకే దక్కుతుందనే విశ్వాసంతో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అంజయ్యయాదవ్‌కు ఆ పార్టీలోని అసమ్మతితో సమస్యలు ఎదురవుతున్నాయి. పార్టీ టికెట్‌ దక్కని వీర్లపల్లి శంకర్‌ తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగుతానంటూ ప్రచారాన్ని ప్రారంభించారు.  కాంగ్రెస్‌ టికెట్‌కు ప్రతాప్‌రెడ్డితోపాటు ఆ పార్టీ నేత కె.శ్రీనివాస్‌గౌడ్‌ ప్రయత్నిస్తున్నారు. ఇదే సందర్భంలో షాద్‌నగర్‌ నుంచి నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు శంకర్‌రావు.. తనకు గాని, తన కుమార్తెకు గాని టికెట్‌ ఇవ్వాలంటూ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.

నాగర్‌కర్నూలు 
మర్రి జనార్దనరెడ్డిపై నాగం

సీనియర్‌ నేత నాగం జనార్దనరెడ్డి బరిలో ఉండే నాగర్‌కర్నూలు నియోజకవర్గం ఆసక్తికర పరిణామాలకు వేదిక అవుతోంది. తెరాస అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ప్రచారంలో జోరుగా ముందుకు సాగుతున్నారు. భాజపాలో ఉన్న మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరారు. ఇది తెరాసకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి బరిలో నిలవడానికి సిద్ధంగా ఉన్న నాగం జనార్దన్‌రెడ్డి గతంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఆయనకు కలిసొచ్చే అంశంగా ఉంది. జిల్లా కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు మణెమ్మ పోటీకి ఆసక్తి చూపుతున్నారు.

నారాయణపేట 
పోటాపోటీ

నారాయణపేట నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి రాజేందర్‌రెడ్డి ఇప్పటికే గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. గతంలో తెదేపా నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజేందర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.  దీంతో తిరిగి ఆయనకే కేసీఆర్‌ టికెట్‌ కేటాయించారు. కాంగ్రెస్‌ నుంచి అర డజను మందికిపైగా టికెట్‌ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో తెరాస నుంచి పోటీ చేసిన శివకుమార్‌రెడ్డి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. మహాకూటమిలో భాగంగా తనకే టికెట్‌ వస్తుందన్న ధీమాతో శివకుమార్‌రెడ్డి విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.  నారాయణపేట పట్టణంలోని భాజపా బలంతో ఆ పార్టీ నేత కె.రతంగ్‌ పాండురెడ్డి బరిలో నిలిచారు.

దేవరకద్ర 
తేలని తెరాస ప్రత్యర్థి

దేవరకద్రలో తాజా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రచారంలో ముందున్నారు. పార్టీలో చేరికలతో ప్రచారంలో జోరు పెంచారు. కాంగ్రెస్‌ నుంచి గతంలో పోటీ చేసిన పార్టీ నియోజకవర్గ బాధ్యుడు పవన్‌కుమార్‌, ఇటీవల పార్టీలో చేరిన న్యాయవాది జి.మధుసూదన్‌రెడ్డి టికెట్‌ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. మహాకూటమిలో మిత్రపక్షమైన తెదేపాకు ఈ స్థానం కేటాయించే అవకాశం ఉందని, రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఇక్కడి నుంచి బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాంగ్రెస్‌ చేపట్టిన ప్రచార చైతన్యయాత్ర కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.

గద్వాల 
అత్తా... అల్లుళ్ల సవాల్‌

పాలమూరు పోరుజోరు కాంగ్రెస్‌ ముఖ్య నాయకురాలు, మాజీ మంత్రి డి.కె.అరుణ నియోజకవర్గంపై తెరాస ఈ సారి ప్రత్యేక దృష్టి సారించింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన డి.కె.భరతసింహారెడ్డి మేనల్లుడు కృష్ణమోహన్‌రెడ్డిని మరోమారు తెరాస అభ్యర్థిగా బరిలో దింపింది. కృష్ణమోహన్‌రెడ్డి ప్రచారంలో జోరుగా ముందుకు సాగుతున్నారు. అసంతృప్తివాదులను సర్దుబాటు చేసుకుని వెళుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి డి.కె.అరుణ గెలుపుపై ధీమాతో ప్రచారాన్ని చాలా వరకూ పూర్తి చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే గద్వాలలో కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో సభ నిర్వహించారు. అంతకుముందు గద్వాలలో నిర్వహించిన నడిగడ్డ ప్రగతి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు. ఆ హామీలు తనకు లాభిస్తాయని తెరాస అభ్యర్థి విశ్వాసంతో ఉన్నారు.

వనపర్తి 
మళ్లీ పాత ప్రత్యర్థులే

వనపర్తి నుంచి పాత అభ్యర్థులే మళ్లీ బరిలో నిలవనున్నారు. తాజామాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ సీనియర్‌నేత జి.చిన్నారెడ్డి కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగనుండగా  తెరాస నుంచి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి ఇప్పటికే ప్రచారంలో ముందున్నారు. నిరంజన్‌రెడ్డి కుల సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఓట్లను అభ్యర్థిస్తూ ముందుకు పోతున్నారు. వనపర్తిలో సీఎం కేసీఆర్‌ ఆశీర్వాద సభ నిర్వహించడం తెరాస వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది.  కేఎల్‌ఐ ద్వారా సాగునీటిని తీసుకొచ్చానని, తెరాసకే ప్రజల మద్దతు ఉంటుందనే భరోసాతో ఆయన ఉన్నారు. మహాకూటమిలో భాగంగా టికెట్‌ చిన్నారెడ్డికి వస్తుందా? లేక రావుల చంద్రశేఖర్‌రెడ్డికి వస్తుందా అనేది తేలాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో తెరాస, మహాకూటమి మధ్య నువ్వా, నేనా అంటూ పోరు సాగేలా ఉంది. భాజపా నుంచి ఇటీవల ఆర్డీవో పదవికి రాజీనామా చేసిన లక్ష్మీనారాయణ, ఎన్‌ఆర్‌ఐ అమరేందర్‌ రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి.

కొడంగల్‌ 
ఆసక్తికర పోరు

పాలమూరు పోరుజోరు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తాజా మాజీ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి బరిలో ఉన్న కొడంగల్‌ నియోజకవర్గం ఆసక్తికర పరిణామాల కేంద్రంగా మారింది. కొడంగల్‌ స్థానాన్ని తెరాస అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తమ్ముడు, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డిని తెరాస బరిలో దింపింది. నియోజకవర్గ బాధ్యుడు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డికి టికెట్‌ దక్కకపోవడం ఆయన వర్గీయులను అసంతృప్తికి గురిచేసినా ప్రచారం కొనసాగిస్తున్నారు. నరేందర్‌రెడ్డి సమావేశాలతో ప్రచారంలో ఉన్నారు. రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఓ విడత ప్రచారం ముగించారు.

పాలమూరు పోరుజోరు 

పాలమూరు పోరుజోరు  
పాలమూరు పోరుజోరు 

పాలమూరు పోరుజోరు 

పాలమూరు పోరుజోరు 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.