close

ప్ర‌త్యేక క‌థ‌నం

తడాఖా చూపిస్తాం! 

రాజ్‌పుట్‌ల  మిత్రభేదం 
భాజపా అన్యాయం చేసిందంటూ తీవ్ర ఆగ్రహం 
మళ్లీ తెరపైకి రిజర్వేషన్‌ డిమాండ్‌ 
మారుతున్న రాజస్థాన్‌ రాజకీయం 
చేరువయ్యేందుకు కాంగ్రెస్‌ యత్నాలు 

తడాఖా చూపిస్తాం! 

ఇప్పటికే 17% ఓటర్లున్న గుజ్జర్లతో పాటు బ్రాహ్మణులు, బనియాల మద్దతు పోగొట్టుకున్న కాషాయ పార్టీకి... ఇప్పుడు రాజ్‌పుట్‌లు కూడా దూరమైనట్టే కనిపిస్తోంది. రాజె సర్కారు తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదన్నది వారి అసంతృప్తికి కారణం. సంప్రదాయ మద్దతుదారులను దూరం చేసుకుని తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తుండటం... భాజపాకు కొత్త అనుభవం! ఫలితం ఎలా ఉండనుందో చూడాల్సిందే మరి!! 
తడాఖా చూపిస్తాం! రిజర్వేషన్‌! ఒక జనశ్రేణి ఉద్వేగపూరిత ఆపేక్ష. ఈ ఉత్తుంగ తరంగం ఎటు ‘మీట’తే... అధికారం అటు మొగ్గుతుంది. గెలుపోటములను శాసించగల ఈ డిమాండ్‌ చుట్టూ ఇప్పుడు రాజస్థాన్‌లో ఎన్నికల రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న రాజ్‌పుట్‌లు... తమ చిరకాల ‘కోటా’ డిమాండ్‌ను మళ్లీ వినిపిస్తున్నారు. నమ్మించి నట్టేట ముంచిందంటూ రాజె సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. భాజపాతో వారి మూడు దశాబ్దాల అనుబంధం పూర్తిగా తెగిపోయినట్టే కనిపిస్తోంది. దీనికి తోడు ఇదే వర్గానికి చెందిన నేత, భాజపా వ్యవస్థాపకుల్లో ఒకరైన కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌ సింగ్‌కు సీటు ఇవ్వకపోవడం వారి ఆగ్రహానికి మరో కారణం. ఆయన కుమారుడు మానవేంద్ర సింగ్‌ తాజాగా కాంగ్రెస్‌లో చేరడంతో రాజస్థాన్‌లో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది.
ఎన్నికలు అనగానే వర్గ, రిజర్వేషన్‌ రాజకీయాలు తెరపైకి వచ్చేస్తాయి. రాజస్థాన్‌లో గుజ్జర్లు, జాట్‌లు, రాజ్‌పుట్‌లు చాలాకాలంగా భాజపాకు సంప్రదాయ ఓటర్లుగా ఉన్నారు. అయితే, ఏడాదిగా రాజ్‌పుట్‌లు మాత్రం ఆ పార్టీకి మోహం చాటేస్తున్నారు. పార్టీని కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకొస్తే... తమను అస్సలు ఖాతరు చేయడంలేదనీ, తీవ్రంగా అవమానిస్తోందనీ, బీసీల్లో చేరుస్తామన్న హామీని కూడా తుంగలో తొక్కేసిందని వసుంధర రాజె సర్కారుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు విలువ ఇవ్వనివారికి తామెందుకు మద్దతు ఇవ్వాలంటూ... ఈ ఏడాదిలో జరిగిన మూడు నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో భాజపాకు వ్యతిరేకంగా పనిచేశారు. దీంతో అధికార పార్టీకి ఓటమి తప్పలేదు. దీన్ని గ్రహించిన కాంగ్రెస్‌ పార్టీ... రాజ్‌పుట్‌లను ఎలాగోలా తమవైపు తిప్పుకొని, ఈసారి అధికారం ‘చే’జిక్కించుకోవాలని ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. తమ మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్న పద్మావతి సినిమాపై నిషేధం విధించాలంటూ ప్రదర్శనలు చేపట్టి, ప్రభుత్వానికి చెమటలు పట్టించిన ‘శ్రీరాజ్‌పుట్‌ కర్నీసేన’ అధ్యక్షుడు లోకేంద్రసింగ్‌ కల్వీ, జైపూర్‌ రాజ్‌పుట్‌ సభ అధ్యక్షుడు గిరిరాజ్‌సింగ్‌ లత్వోరాలు.. రాజ్‌పుట్‌ల ఆకాంక్షలను బలంగా వినిపిస్తున్నారు. ఓబీసీ జాబితాలో చేర్చి రాజ్‌పుట్‌లకు విద్య, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్‌ కల్పిస్తామని 2008లోనే వసుంధర హామీ ఇచ్చారనీ, ఎందుకు అమలు చేయడంలేదని తూర్పారబడుతున్నారు. అక్కడితో ఆగలేదు. ‘రాజ్‌పుట్‌ సమాజ్‌ సంఘర్ష్‌ సమితి’ పేరున బికనీర్‌, అజ్‌మేర్‌, కోటా, ఉదయ్‌పూర్‌, భరత్‌పూర్‌లలో భారీ సమావేశాలు నిర్వహించారు. రాజె సర్కారును దించేస్తామంటూ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. రిజర్వేషన్‌ విధానాన్ని సమీక్షించాలని అన్ని పార్టీలనూ డిమాండ్‌ చేస్తున్నారు.

తడాఖా చూపిస్తాం! 

రాజ్‌పుట్‌ల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందంటూ పద్మావతి సినిమాపై నిరసన ప్రదర్శనలు చేపట్టి, ప్రభుత్వానికి చెమటలు పట్టించిన ‘శ్రీరాజ్‌పుట్‌ కర్నీసేన’ ఇప్పుడు రాజకీయంగా కూడా వారి ఆకాంక్షలను బలంగా వినిపిస్తోంది.
కాంగ్రెస్‌ గూటికి మానవేంద్ర సింగ్‌ 
భాజపా ఓటమే లక్ష్యం 

తడాఖా చూపిస్తాం! 

రాజ్‌పుట్‌ల ఇష్ట నాయకుడైన జశ్వంత్‌ సింగ్‌కు 2014 ఎన్నికల్లో బాడ్మెర్‌ లోక్‌సభ స్థానాన్ని నిరాకరించడం వారిని వేదనకు గురిచేసింది. దీనికి తోడు ఆయన కుమారుడు, శివ్‌ శాసనసభ్యుడు మానవేంద్ర సింగ్‌ను కూడా రాజె పక్కనపెడుతూ వచ్చారు. రాష్ట్ర, జాతీయ నాయకత్వం తమ కుటుంబాన్ని పట్టించుకోకపోయినా... ఆయన నాలుగేళ్ల పాటు భాజపాలోనే కొనసాగారు. తన తండ్రికి జరిగిన అవమానానికి తోడు రాజ్‌పుట్‌లకు వ్యతిరేకంగా రాజె సర్కారు తీసుకున్న పలు చర్యలతో పార్టీ మారే విషయమై ఆయన తర్జనభర్జన పడ్డారు. రాజ్‌పుట్‌ వర్గానికి చెందిన ఆనంద్‌పాల్‌ సింగ్‌ను రాష్ట్ర పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చడం వారి ఆగ్రహానికి ఆజ్యం పోసినట్టయింది. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అంటూ పలువురు ఆందోళనలు చేపట్టగా... ప్రభుత్వం వారిపై కేసులు పెట్టింది. మరోవైపు- రాష్ట్ర భాజపా అధ్యక్షునిగా తమ సామాజికవర్గ నేత, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను నియమించేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రతిపాదించినా, రాజె అందుకు నిరాకరించారు. పైగా, తమకు గిట్టని రాజ్యసభ సభ్యుడు మదన్‌ లాల్‌ సైనీకి ఆ పదవి కట్టబెట్టడం వారి మనోభావాలను ఘోరంగా దెబ్బతీసింది. ఇది చాలదన్నట్టు ‘రాజ్‌పుట్‌ సభ’ సంస్థపై వసుంధర సర్కారు రూ.4 కోట్ల సేవా పన్ను విధించింది. దీంతో మూడు దశాబ్దాలుగా భాజపాకు బహిరంగ మద్దతు ఇస్తూ వచ్చిన రాజ్‌పుట్‌లు... పూర్తిగా భిన్న స్వరం వినిపిస్తున్నారు. కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచి, రాజె సర్కారును ఎలాగైనా గద్దె దించేస్తామని అంతే బాహాటంగా ప్రకటిస్తున్నారు. సొంత సామాజిక వర్గం నుంచి ఒత్తిడి రావడంతో, అంతా ఊహించినట్టే మానవేంద్ర కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు!

తడాఖా చూపిస్తాం! 

భాజపా వ్యవస్థాపకుల్లో ఒకరుగా, వాజ్‌పేయీ హయాంలో కేంద్ర మంత్రిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జశ్వంత్‌ సింగ్‌... రాజ్‌పుట్‌ల ఇష్ట నాయకుడు. ‘మేజర్‌ సాహెబ్‌’ అని ఆప్యాయంగా పిలుచుకునే తమ నేతకు 2014 ఎన్నికల్లో సీటు ఇవ్వక పోవడం రాజ్‌పుట్‌లను వేదనకు గురిచేసింది. చాలాకాలంగా పార్టీకి మద్దతిస్తున్న సానుభూతిపరులకూ ఈ పరిణామం రుచించలేదు.

రాజ్‌పుట్‌లంతా దూరమైపోయినట్టే 

తడాఖా చూపిస్తాం! 

జశ్వంత్‌సింగ్‌కు పార్టీలో జరిగిన ఘోర అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలన్నదే రాజ్‌పుట్‌ల లక్ష్యం. వసుంధర వర్గం ఆయనకు టికెట్‌ ఎలా నిరాకరించిందో, ఆయనను ఎలా పక్కన పెట్టిందో అందరికీ తెలుసు. కాంగ్రెస్‌లో చేరడం ద్వారా మానవేంద్రసింగ్‌ మంచి సంకేతాలు పంపారు. ఇప్పుడు సమయం వచ్చింది. ఇది రాజ్‌పుట్‌లకూ, వసుంధర తలబిరుసు నైజానికీ మధ్య జరుగుతున్న పోరు. భాజపాను ఓడించడమే మా లక్ష్యం. రాజ్‌పుట్‌లంతా ఆ పార్టీకి దూరమైపోయినట్లే. భాజపా తరఫున పోటీచేసే రాజ్‌పుట్‌లకు మా మద్దతు ఉండదు. వారికి మా నుంచి ఒక్క ఓటు కూడా పడదు. కాంగ్రెస్‌ అభ్యర్థులకే మా సంపూర్ణ మద్దతు.’’
 

-గిరిరాజ్‌ సింగ్‌ లొత్వారా, రాజ్‌పుట్‌ సభ అధ్యక్షుడు
 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.