close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఆమెను తొలిచేస్తోంది

కుటుంబాలను ఛిద్రం చేస్తున్న క్యాన్సర్‌ భూతం
కబళిస్తున్న రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు
18.70% చికిత్సలు రొమ్ము సంబంధిత సమస్యలకు
30.25% మందికి గర్భాశయ ముఖద్వార ఇబ్బందులు
అవగాహనతో ముందుగా గుర్తింపు సాధ్యమంటున్న నిపుణులు
ఈ నెలంతా నివారణపై చైతన్య కార్యక్రమాలు
ఆమెను తొలిచేస్తోంది

రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబాల్లో క్యాన్సర్‌ మహమ్మారి చీకట్లు నింపుతోంది. ప్రధానంగా నిరుపేద మహిళల్ని నిర్దయగా కబళిస్తోంది. రాష్ట్రంలో దీని కోరల్లో చిక్కుకుని పట్టణ, గ్రామీణమనే తేడా లేకుండా దారిద్య్ర రేఖకు దిగువనున్న మహిళలు విలవిల్లాడుతున్నారు. రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు శాపంగా మారుతున్నాయి. గత నాలుగేళ్లలో  ఆరోగ్యశ్రీ పథకం కింద క్యాన్సర్‌కు పొందిన చికిత్సల సమాచారాన్ని పరిశీలిస్తే 49 శాతం మహిళలు ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు వెల్లడవుతోంది. ఇందులో రొమ్ము క్యాన్సర్‌ చికిత్సలు 18.70 శాతం కాగా, గర్భాశయ ముఖద్వార చికిత్సలు 30.25 శాతం ఉండడం గమనార్హం. రాష్ట్రంలో రొమ్ము క్యాన్సర్‌ బాధితులు హైదరాబాద్‌లో అత్యధికులు ఉండగా.. గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ బాధితుల సంఖ్య ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎక్కువగా నమోదైంది. ప్రభుత్వ రంగంలో పేరొందిన ఎంఎన్‌జే ఆసుపత్రిలో నమోదైన గణాంకాలను పరిశీలించినా.. రొమ్ము క్యాన్సర్‌ కేసులు ఏటా పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. 2013లో కొత్తగా 710 రొమ్ము క్యాన్సర్‌ కేసులు నమోదవగా.. 2017కొచ్చేసరికి 1172కు పెరిగింది. ఇవి ఒక్క ఎంఎన్‌జే ఆసుపత్రి గణాంకాలే. ఇంకా ప్రైవేటులో చికిత్స పొందుతున్న మహిళల గణాంకాలు పరిశీలిస్తే.. వ్యాధిగ్రస్తుల సంఖ్య రెట్టింపు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అక్టోబరును ‘రొమ్ము క్యాన్సర్‌ నివారణపై అవగాహన’ మాసంగా  నిర్వహిస్తున్న నేపథ్యంలో ‘ఈనాడు’ ప్రత్యేక కథనం ఇదీ.

ఆమెను తొలిచేస్తోంది

గ్రామీణంలోనూ మహమ్మారి
గత నాలుగేళ్లలో క్యాన్సర్‌ చికిత్సలను పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో రొమ్ము క్యాన్సర్‌ (7528) చికిత్సలు ఎక్కువగా నమోదవుతుండగా.. ఆ తర్వాత స్థానాల్లో కరీంనగర్‌, రంగారెడ్డి, వరంగల్‌ జిల్లాలున్నాయి. తెలంగాణలో అతి తక్కువగా రొమ్ము క్యాన్సర్‌ చికిత్సలు ఆదిలాబాద్‌(2842)జిల్లాలో జరిగాయి. వరంగల్‌ జిల్లాలో (10064)గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ చికిత్సలు అత్యధికంగా నమోదవుతుండగా.. కరీంనగర్‌, నల్గొండ జిల్లాలు తదుపరి స్థానాల్లో నిలిచాయి. ఆరోగ్యశ్రీలో చికిత్స పొందుతున్నది నిరుపేదలే. మహిళలు ఇంత పెద్దఎత్తున క్యాన్సర్‌ కోరల్లో చిక్కుకోవడానికి సామాజిక, ఆర్థిక పరిస్థితులూ కారణమేనని నిపుణులు చెబుతున్నారు.

ఆమెను తొలిచేస్తోంది

ఆమెను తొలిచేస్తోంది

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు కారణాలు
జననాంగాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం
పదే పదే సుఖవ్యాధులు సోకడం
పౌష్టికాహారం లోపించడం
18 ఏళ్ల లోపే పెళ్లి కావడం, పిల్లలు పుట్టడం

దృష్టి సారించాల్సిన అంశాలు
ప్రభుత్వమే చొరవ తీసుకొని విస్తృతంగా అవగాహన కల్పించాలి.
9-18 ఏళ్ల మధ్య వయసు బాలికలకు హెచ్‌పీవీ టీకాను ఇప్పించాలి.
రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లను గుర్తించడానికి నర్సులు, ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇవ్వాలి.
గ్రామాల్లో ఏఎన్‌ఎంలు, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి మహిళలను పరీక్షించాలి.
ఆరోగ్య కార్యకర్తల సహకారంతో మహిళలే స్వయంగా తమ రొమ్ములను పరీక్షించుకునే విధానాన్ని విస్తృతపర్చాలి.

నివారణ ఎలా?
ముందస్తుగా గుర్తించేందుకు స్వీయ రొమ్ము పరీక్షలను ప్రోత్సహించడం
రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం
జీవనశైలిలో మార్పులు చేసుకోవడం
తల్లిపాలను బిడ్డకు పట్టడం
మామోగ్రామ్‌ పరీక్షను చేయించుకోవడం

ఆమెను తొలిచేస్తోంది

విస్తృత అవగాహన అవసరం
-డాక్టర్‌ జయలత, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి సంచాలకులు

ఆమెను తొలిచేస్తోందినిజానికి వ్యాధులను ముందస్తుగా గుర్తిస్తే చికిత్స సులభమే. మహిళలు సాధారణంగా తమ అనారోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. సమస్య తీవ్రమైతే తప్ప చాలామంది ఆసుపత్రికి వెళ్లరు. అలాంటి వారిలో చైతన్యం కలిగించేందుకు ఈ నెలంతా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. కాలనీ, అపార్టుమెంట్ల సంక్షేమ  సంఘాల వారు ఆహ్వానించినా వెళ్లి పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం. ప్రత్యేకంగా క్యాన్సర్‌ అవగాహనపై పుస్తకాలు ముద్రించి ఉచితంగా అందజేస్తున్నాం. కళాశాలల్లోనూ శిబిరాలు నిర్వహిస్తున్నాం.

70 శాతం మందిలో ముదిరిన తర్వాతే..
-డాక్టర్‌ రఘురామ్‌, సీఈఓ, ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్‌ ఫౌండేషన్‌

ఆమెను తొలిచేస్తోందిమన దేశంలో ఏటా  1.50 లక్షల మందిలో కొత్తగా రొమ్ము క్యాన్సర్‌ను గుర్తిస్తుంటే వీరిలో 70వేల మంది వరకూ మృతి చెందుతున్నారు. దాదాపు 70 శాతం మందిలో వ్యాధి పూర్తిగా ముదిరిన తర్వాతనే బయటపడుతోంది. అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించే కార్యక్రమాలను గత పదేళ్లుగా నిర్వహిస్తున్నాం. గులాబీ రిబ్బన్‌ నడకలో పదేళ్ల కిందట 50 మంది పాల్గొంటే ఈ ఏడాది 5వేల మంది పాల్గొనడం విశేషం. అవగాహన పెంపొందించడమే కాకుండా.. వ్యాధి నుంచి కోలుకున్నవారితో స్ఫూర్తిదాయక ప్రసంగాలనూ ఇప్పిస్తున్నాం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.