close

ప్ర‌త్యేక క‌థ‌నం

ముందుకు రండి.. మేమున్నాం 

‘మీటూ’ బాధితులకు పోలీసుల బాసట 
లైంగిక వేధింపుల సమాచారం తెలపాలని సూచన 
ముందుకు రండి.. మేమున్నాం 

ఫిర్యాదు 
మేడమ్‌.. ఐదురోజుల నుంచి నన్ను గుర్తు తెలియని వ్యక్తి వెంబడిస్తున్నాడు. కళాశాలకు వెళ్లినా.. ట్యూషన్‌కు వెళ్తున్నా, వెంటాడుతున్నాడు.. నీతో ఒంటరిగా మాట్లాడాలి.. నేను చెప్పిన సమయానికి రాకపోతే చంపేస్తానంటూ రెండురోజుల క్రితం భయపెట్టాడు.. స్పందించకపోవడంతో నా ఫోటో ఫేస్‌బుక్‌లో పెట్టి అసభ్యకరంగా ప్రచారం చేస్తానంటూ హెచ్చరించాడు. ఇంట్లో చెబితే తిడతారు.. దయచేసి నన్ను రక్షించండి.. నా వివరాలు బయటపెట్టొద్దు.         
-హైదరాబాద్‌ పోలీసులకు ట్విట్టర్‌ ద్వారా ఓ విద్యార్థిని ఫిర్యాదు

ఫలితం 
విద్యార్థిని ట్విట్టర్‌ ఫిర్యాదుకు ‘షి’ బృందం సభ్యులు వెంటనే స్పందించారు. బాధితురాలితో ఫోన్‌లో మాట్లాడారు. గంటల వ్యవధిలో నిందితుడిని పట్టుకున్నారు. ఆమెను వేధించిన యువకుడు బాధితురాలి ఇంటికి సమీపంలో నివసిస్తున్నాడని గుర్తించారు. అనంతరం అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు.

ముందుకు రండి.. మేమున్నాం 

నిత్యం ఈవ్‌టీజింగ్‌, వేధింపులు ఎదుర్కొంటున్న యువతులు, మహిళలు తమ ఆవేదనను సామాజిక మాధ్యమాలు, మరే రూపంలో తెలిపినా, వెంటనే పోలీస్‌ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈవ్‌ టీజింగ్‌, వేధింపులను నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టి సారించిన పోలీస్‌ ఉన్నతాధికారులు ట్విట్టర్‌, వాట్సాప్‌ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చంటూ ప్రచారం చేస్తున్నారు. తాజా ‘మీటూ’ ఉద్యమం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బాధితులు తమకు ఫిర్యాదు చేస్తే.. నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు.

ముందుకు రండి.. మేమున్నాం హింసిస్తూ.. భయపెడుతూ.. 
వేధింపులు, ఈవ్‌టీజింగ్‌లకు పాల్పడుతున్న పోకిరీలను పట్టుకునేందుకు ‘షి’బృందాలు పనిచేస్తున్నా.. చరవాణులు, అంతర్జాల ఆధారిత నేరాలకు పాల్పడేవారు విద్యార్థినులు, యువతులను ఇంకా వేధిస్తూనే ఉన్నారు. తెలిసిన వారున్నా.. లేకున్నా.. కేవలం ఫోన్‌ నంబరుంటే చాలు.. అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నారు. బాధితులు మాట్లాడకున్నా.. నంబరు గుర్తించి జవాబివ్వకపోయినా వేర్వేరు నంబర్ల నుంచి మాట్లాడి భయపెడుతున్నారు. పైశాచిక మనస్తత్వం ఉన్న కొందరు నేరగాళ్లు అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. అసభ్య, అశ్లీల వీడియోలను చరవాణులకు పంపుతున్నారు. ఇంకొందరు అర్ధరాత్రి దాటాక ఒంటిగంట నుంచి మూడు గంటల వరకూ ఫోన్లు చేస్తూ హింసిస్తున్నారు. ఇలాంటి చిత్రహింసలు ఎదుర్కొంటున్న వారిలో కొందరు వైద్యులు కూడా ఉన్నారు. ఫోన్లు, సామాజిక మాధ్యమాల్లో వేధిస్తే బాధితులు ఫిర్యాదు చేస్తేనే తప్ప పోలీసుల దృష్టికి సమస్య రాదు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. చిరునామాలను సేకరించి మరీ వెంటాడి వేధిస్తున్నారు.

కుంగిపోవద్దు.. ముందుకు రండి 
చరవాణులు, సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులు ఎదుర్కొంటున్న వారికోసమే వాట్సాప్‌, ట్విట్టర్‌ సేవలను పోలీసులు అందుబాటులోకి తీసుకువచ్చారు. నిందితులు మాట్లాడిన మాటలు(రికార్డు చేసుంటే), అసభ్య సందేశాలు, వీడియోలను వాట్సాప్‌, ట్విట్టర్‌ ద్వారా పంపితే చాలు. మిగిలిన వ్యవహారమంతా ‘షి’ బృందం సభ్యులు చూసుకుంటారు. బాధితులు ఎవరికీ చెప్పుకోలేక కుంగిపోకూడదన్న భావనతో ఈ సౌకర్యాన్ని కల్పించారు.  వివరాలను పోలీసులు మాత్రమే తీసుకుని  బాధితుల పేర్లు ఎక్కడా బహిర్గతం కాకుండా గోప్యత పాటిస్తున్నారు. ఇతరుల ఫోన్ల నుంచి ఫిర్యాదు చేసినా సరే వారితో మాట్లాడి వివరాలు సేకరించి వెంటనే కేసు నమోదు చేస్తున్నారు. ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసినా వెంటనే బాధితులతో మాట్లాడి నిందితులు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారన్నది ఆరా తీస్తున్నారు. ఒకవేళ సమీపంలోనే నిందితులుంటే  సత్వరమే అదుపులోకి తీసుకునేందుకు వీలుగా అక్కడున్న ‘షి’ బృందాలకు సమాచారం ఇస్తున్నారు.

 

ముందుకు రండి.. మేమున్నాం 

సామాజిక మాధ్యమాలు.. లఘు చిత్రాలు 
మెట్రో నగరాల్లో ఈవ్‌టీజింగ్‌, వేధింపులు క్రమంగా పెరుగుతున్నాయి. వీటికి అదనంగా పని ప్రాంతాల్లో లైంగిక వేధింపులు తప్పడం లేదు. పోకిరీలు, రౌడీలు, ఈవ్‌టీజర్లను ఎదిరిస్తే పరువు పోతుందన్న భావనతో బాధితులు మౌనంగా భరిస్తున్నారు. చట్టం వీరికి రక్షణగా ఉన్నా.. పోలీసులంటే భయం కారణంగా వారికీ ఫిర్యాదు చేయలేకపోతున్నారు. మరోవైపు లైంగిక వేధింపులను బయటపెడితే.. తమదే తప్పని చిన్నచూపు చూస్తారని స్నేహితులతోనూ చెప్పుకునేందుకు భయపడుతున్నారు.

అవగాహన కార్యక్రమాలతో చైతన్యం 
మరోవైపు ఈవ్‌టీజింగ్‌, వేధింపులపై పోలీసులు అవగాహన శిబిరాలు, చైతన్య కార్యక్రమాలు నిర్వహించడంతో కొంత కదలిక వస్తోంది. ఇక ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, బస్‌స్టాప్‌లు, బస్సులు, మహిళా వసతి గృహాలు, షాపింగ్‌ మాల్స్‌లో ‘షి’ బృందాల సభ్యులు వెళ్లి యువతులు, మహిళలతో మాట్లాడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో కరపత్రాలు ఇస్తున్నారు. పోస్టర్లు, స్టిక్కర్లు అంటిస్తున్నారు. ట్రాఫిక్‌ కూడళ్ల వద్ద డిజిటల్‌ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. వేధింపులు భరించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని వారిని చైతన్యపరిచేందుకు లఘు చిత్రాలను రూపొందించారు. వాస్తవిక ఘటనల స్ఫూర్తితో వీటిని చిత్రీకరించారు. చరవాణులు వినియోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో వాట్సాప్‌, ట్విట్టర్‌ ద్వారా కూడా ఫిర్యాదులు చేసే వెసులుబాటును కల్పించారు.

ముందుకు రండి.. మేమున్నాం 

ఒక్కమాట చాలు

ముందుకు రండి.. మేమున్నాం లైంగిక వేధింపులు.. ఈవ్‌టీజింగ్‌ బాధితులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా వారికి జరిగిన అన్యాయాన్ని బహిర్గతం చేస్తున్నారు. యువతులు, మహిళలు ఇలా ముందుకు రావడం అభినందనీయం. ఒక్కమాట ‘షి’ బృందాలకు చెబితే చాలు.. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. నిందితులపై కఠినంగా వ్యవహరిస్తాం. బాధితులకు మేం భరోసా ఇస్తున్నందుకే ఫిర్యాదులు క్రమంగా పెరుగుతున్నాయి. మూడు నెలల వ్యవధిలో వాట్సాప్‌ ద్వారా 180 ఫిర్యాదులు, ట్విట్టర్‌ ద్వారా 96 ఫిర్యాదులు వచ్చాయి.
 
 
 
 
 
 
 
 
 
 
-షికా గోయల్‌, అదనపు పోలీస్‌ కమిషనర్‌ (నేర పరిశోధన)

ముందుకు రండి.. మేమున్నాం 

- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.