close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఆ ఇద్దరిదీ ఒకటే ధోరణి! 

ఆ ఇద్దరిదీ ఒకటే ధోరణి! 
ఇద్దరూ ప్రజల మాట వినరు 
వారి ఆకాంక్షలను అస్సలు పట్టించుకోరు 
వ్యవస్థలను ధ్వంసం చేసేశారు 
తెలంగాణ ప్రజల ఆశల సౌధాన్ని కేసీఆర్‌ కూల్చేశారు 
ఒక్క కుటుంబమే రాష్ట్రాన్ని ఏలుతోంది 
నిరుద్యోగులకు చేసిందేం లేదు 
దేశాన్ని ఆరెస్సెస్‌ పాలిస్తోంది 
రాహుల్‌ గాంధీతో ‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖి 
ఎం.ఎల్‌.నరసింహారెడ్డి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి 
ఆ ఇద్దరిదీ ఒకటే ధోరణి! 

మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ ఒకటే.. మోదీకి చిన్న రూపమే కేసీఆర్‌.. వీళ్లిద్దరూ ఎవరి మాటా వినరు. ప్రజలు చెప్పేది అస్సలు వినరు. రాజ్యాంగ వ్యవస్థలను ఒక పద్ధతి ప్రకారం ధ్వంసం చేస్తూ.. ప్రజలకు చేటు చేస్తున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేదలను పట్టించుకోని మోదీ ప్రభుత్వం సంపన్నుల కోసమే పని చేస్తోందని విమర్శించారు. ఏ లక్ష్యంతో, ఏ ఆకాంక్షతో తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని సాధించుకున్నారో దాన్ని నెరవేర్చడంలో కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని, ఆయన పాలనంతా కుటుంబ వ్యవహారమైందని ఆరోపించారు. నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్‌ తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలన్నింటినీ ధ్వంసం చేశారని దుయ్యబట్టారు. అటు కేంద్రం, ఇటు తెలంగాణ.. రెండూ అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపించారు. తెలంగాణతో సహా 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దిల్లీలోని 12, తుగ్లక్‌లేన్‌లోని నివాసంలో రాహుల్‌గాంధీ ‘ఈనాడు’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

 


కొత్త రాష్ట్రం గురించి ప్రజలు కన్న కలలను, ఆ ప్రజాకాంక్షను.. ఈ నాలుగున్నరేళ్లలో తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూర్తిగా ధ్వంసం చేసేశారు. అసలు తెలంగాణ అంటేనే ప్రజల భావోద్వేగాలు.. వారి ఆకాంక్షలు. కానీ కేసీఆర్‌కు అసలు వినటమనేదే నచ్చదు! ప్రజల ఆకాంక్షలను ఆయన పట్టించుకోలేదు.

నా వరకూ దేశాన్ని ప్రస్తుతం నెలకొన్న దారుణ పరిస్థితుల నుంచి బయటపడేయటమే పెద్ద ఛాలెంజ్‌. సీబీఐలో ఏం జరుగుతుందో మీరు చూస్తూనే ఉన్నారు. అలాగే సుప్రీంకోర్టులో ఏం జరిగిందో చూశాం.. దేశంలోని అత్యున్నత సంస్థలన్నింటినీ ఆరెస్సెస్‌, భాజపాలు ధ్వంసం చేసుకుంటూ వచ్చాయి.


కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా మీరు మొదటిసారిగా లోక్‌సభ సాధారణ ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. దీన్ని మీ రాజకీయ జీవితంలో పెద్ద సవాల్‌గా భావిస్తున్నారా? 
నా వరకూ దేశాన్ని ప్రస్తుతం నెలకొన్న దారుణ పరిస్థితుల నుంచి బయటపడేయటమే పెద్ద ఛాలెంజ్‌. సీబీఐలో ఏం జరుగుతుందో మీరు చూస్తూనే ఉన్నారు. దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలోని ఓ సీనియర్‌ అధికారిపైనే ఇప్పుడు విచారణ జరుగుతోంది. అలాగే సుప్రీంకోర్టులో ఏం జరిగిందో చూశాం. దేశ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బహిరంగంగా బయటకొచ్చి.. తమ పని తమను చేసుకోనీయటం లేదని వాపోయారు. న్యాయమూర్తి లోయా హత్య కేసులో నేరుగా భాజపా అధ్యక్షుడి వైపే వేలెత్తి చూపారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా.. దేశంలోని అత్యున్నత సంస్థలన్నింటినీ ఆరెస్సెస్‌, భాజపాలు ధ్వంసం చేసుకుంటూ వచ్చాయి. దేశాన్ని రకరకాల ముక్కలుగా విభజించారు. దేశంలో ప్రజలు రాష్ట్రం, మతం, వర్గం, భాష, ప్రాంతం.. ఇలా రకరకాల పేర్లతో ఘర్షణలు పడే పరిస్థితి తెచ్చారు. మనం ప్రజల పట్ల ఎంత న్యాయంగా ఉంటున్నాం.. వాళ్ల అభిప్రాయాలకు ఎంత విలువ ఇస్తున్నామన్నది ముఖ్యం. తమ గొంతు వినిపించే ప్రజల తరఫున నిలబడాలి. దేశంలో రైతులు, యువకులు, కూలీలు, దేశంలోని చిన్న, మధ్యతరహా వ్యాపారులకు కూడా తమ అభిప్రాయం చెప్పే పరిస్థితి ఉండాలి. దేశ భవిష్యత్తుకు అదే కీలకం. నా వరకూ.. వీళ్ల కోసం పోరాడటమే అత్యంత ప్రధానం!

ఇటీవల తెలంగాణ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను ఆదుకోలేదని, కేవలం పది వేల ఉద్యోగాలే ఇచ్చారని మీరు ఆరోపించారు. కానీ తెరాస ప్రభుత్వం మీ ఆరోపణలను ఖండిస్తూ లక్షకు పైగా ఉద్యోగాల భర్తీకి 
అనుమతులిచ్చినట్లు పేర్కొంది. దీనిపై మీరేమంటారు? 
నేను వాస్తవాలు, గణాంకాల ఆధారంగా మాట్లాడానే తప్ప కల్పించిందేం కాదు. దీని గురించి మీరు నన్నో, ముఖ్యమంత్రినో అడగాల్సిన అవసరమేం లేదు. చిన్న పని చేస్తే చాలు. హైదరాబాద్‌లోనో లేదంటే... తెలంగాణలోని మరేదైనా ముఖ్యమైన నగరానికో వెళ్లి.. వీధిలో నిలబడి ఎవరిని అడిగినా చెబుతారు. తెలంగాణలో యువకులు ఏమనుకుంటున్నారో అక్కడే తెలిసిపోతుంది. రాష్ట్రంలోని ఏ ఒక్క నిరుద్యోగ యువకుడూ ప్రభుత్వం తమకు ఉద్యోగాలు కల్పించినట్లు భావించడం లేదు. కాబట్టి ఇక్కడ రాహుల్‌ గాంధీ లేదా కేసీఆర్‌ ఏం చెప్పారన్నది కాదు.. తెలంగాణలో ప్రజలు, యువత ఏమనుకుంటున్నారన్నది ముఖ్యం. అది మీరే తెలుసుకోవచ్చు!

మోదీకి కేసీఆర్‌ మరో రూపం... చిన్న రూపం.. అంతే! మోదీ ఎలా ఆలోచిస్తున్నారో కేసీఆర్‌ కూడా అలాగే ఆలోచిస్తున్నారు. వాళ్లిద్దరి ధోరణీ ఒకటే. వాళ్ల మధ్య సారూప్యం.. కేవలం రాష్ట్రంలో ధనికులు మాత్రమే సీఎం కార్యాలయంలోకి ప్రవేశించగలరు. దేశంలో సంపన్నులు మాత్రమే నేరుగా మోదీ కార్యాలయంలోకి ప్రవేశిస్తుంటారు. వాళ్లిద్దరికీ మిగతావేం పట్టవు! 
 

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ, పెట్టుబడి కొనసాగిస్తామని ప్రకటించారు. మరి వ్యవసాయ కూలీలు, కౌలు రైతుల పరిస్థితి ఏంటి? 
ప్రస్తుత పరిస్థితి చూస్తే అసలు దేశంలో రైతులు తమ జీవనం కోసం వ్యవసాయం మీద ఆధారపడేలాగే లేదు. కాబట్టి ముందు అతనికి మద్దతు కావాలి. అదీ ఆరంభం నుంచీ కావాలి. ఏదో రుణమాఫీ ఒక్కటే కాదు. రైతుకు, రైతు కూలీకి ఒక బంధువులా ఏడాది మొత్తం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. విత్తనాల నుంచి మొదలుపెట్టి.. ఎరువులు, బ్యాంకు రుణాలు, సాగుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, దగ్గర్లోనే వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయటం.. ఇవన్నీ కావాలి. రుణమాఫీ అన్నది ముఖ్యమైనదే. అందులో అనుమానమేం లేదు. అసలు రుణ మాఫీ విషయంలో నేను చెప్పేది ఒకటే. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని అత్యంత సంపన్నులకు ఇచ్చిన దాదాపు రూ.3.5 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చెయ్యగా లేనిది.. దేశంలో అత్యంత సంపన్నులకు చెందిన నిరర్ధక ఆస్తులు రూ.12.5 లక్షల కోట్ల వరకూ ఉండగా లేనిది.. పేద రైతులకు రుణ మాఫీ ఎందుకు చేయరు? ఇదే నా వాదన. నిజానికి రైతుల కోసం, వాళ్ల ఆర్థిక పురోగతి కోసం ఒక కచ్చితమైన విధానం ఉండాలి. కాంగ్రెస్‌ పార్టీ దీనికి కట్టుబడి ఉంది. దీనికోసం రైతులకూ, ప్రభుత్వానికీ మధ్య  విస్తృత చర్చ జరగాలి. రైతుల సమస్యలు ఏమిటో ప్రభుత్వానికి లోతైన అవగాహన ఉండాలి. దీన్నంతా ఒక విధాన ప్రక్రియలా చూడాలి. అంతేగానీ ఇదంతా ప్రభుత్వం రైతులకు ఇస్తున్న తాయిలాల్లా చూడకూడదు. ఇది వాళ్లది. ప్రభుత్వం వాళ్లకేదో ఉద్దరగా ఇస్తున్నది కాదు, ఇది వాళ్ల హక్కు!

కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత     నాలుగన్నరేళ్లలో దేశంలో రైతుల పరిస్థితి మెరుగైందంటారా? దిగజారిందంటారా? 
ఇక్కడ నేను ఏమనుకుంటున్నానన్నది కాదు ముఖ్యం.. వాస్తవాలు ఏమిటన్నది చూడాలి. రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నది వాస్తవం. దేశంలో 15 పెద్ద వ్యాపార కంపెనీలకు రూ.మూడున్నర లక్షల కోట్లు వదిలేశారన్నది వాస్తవం. రూ.45 వేల కోట్ల అప్పుల్లో ఉన్న అనిల్‌ అంబానీ జేబులో నేరుగా రూ.30 వేల కోట్లు వేశారన్నది వాస్తవం. ఈ డబ్బు ఎవరిదో కాదు.. ఈ దేశంలో పన్ను చెల్లింపుదారులది, రైతులది. ఇది పూర్తి అక్రమంగా దోచిపెట్టిన సొమ్ము! మెహుల్‌ చోక్సీ నుంచి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కుమార్తె ఖాతాలోకి డబ్బులు వచ్చిపడ్డాయన్నది వాస్తవం. ప్రభుత్వం కేవలం విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ, అనిల్‌ అంబానీ వంటి 15 - 20 మంది ధనికులకు సహాయం చేసేందుకే పని చేస్తోందన్నది వాస్తవం. వాళ్లు రైతుల గురించి పూర్తిగా మర్చిపోయారు. రైతులకు కనీస మద్దతు ధర లేదు. బోనస్‌ ఇవ్వకుండా రైతు నుంచి తీసేసుకొన్నారు. రైతుల నుంచి బీమా డబ్బు కట్టించుకోవటమే తప్పించి వెనక్కు ఇచ్చేదేం ఉండటం లేదు. ఈ ప్రభుత్వం ఒక్క రైతు వ్యతిరేకి మాత్రమే కాదు, పేదలు, దళితులు, గిరిజనులు.. ఇలా ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరికీ వ్యతిరేకమే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విధానాలూ ఇంతే. ఆయనా పూర్తిగా ఇవే విధానాలను    అవలంబిస్తున్నారు.

భూసేకరణ, పరిహారానికి సంబంధించి 2013లో తెచ్చిన చట్టంలో మీరు కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ప్రభుత్వం దీనిని సవరించి కొత్త చట్టాన్ని తెచ్చింది. మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అది దేశంలోనే ఉత్తమ చట్టమని తెలంగాణ చెబుతోంది, దీనిపై మీరేమంటారు? 
ఎప్పుడూ కూడా అదెవరికి ఉత్తమం? అన్నది కీలక ప్రశ్న. కచ్చితంగా అది రైతుల నుంచి భూములు లాక్కొనేవారికి ఉత్తమంగానే ఉంది! మేం ప్రతిపాదించిన భూసేకరణ చట్టం రైతులకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించినది. రైతుల నుంచి తీసుకునే భూమికి మార్కెట్‌ ధరకు నాలుగు రెట్లు ఇచ్చేందుకు ఉద్దేశించినది అది. దాన్ని రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం నీరుగార్చింది. మోదీ కూడా అదే ప్రయత్నం చేసి విఫలమయ్యారు.. అప్పుడు గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ సీఎంలతో మాట్లాడి అక్కడ దాన్ని నీరుగార్చేలా చేశారు. వాళ్ల ఆలోచన ఒకటే. రైతుల సంపదను వారి నుంచి లాక్కొని.. బాగా పలుకుబడి ఉన్న వాళ్లకు, కంపెనీలకు కట్టబెట్టటమే!

అది జీఎస్టీ కావొచ్చు, ఆర్థిక సంస్కరణలు కావొచ్చు.. మోదీ ప్రభుత్వం తీసుకొన్న ప్రతి చర్యనూ మీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ఏ ఒక్క చర్యా సానుకూల ప్రభావం చూపలేదంటారా? 
కొన్ని ఆలోచనలు మంచివే. కానీ అమల్లోకి వచ్చేప్పటికే దయనీయం. ఉదాహరణకు ‘మేకిన్‌ ఇండియా’ అనేది విధానపరంగా మంచి ఆలోచనే. దేశంలో యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించటమన్నది కీలకం, ఆర్థిక పురోగతిలో వారిని భాగస్వాములను చేయటం అవసరం. అందుకోసం లక్షలాది ఉద్యోగాలు కల్పించాలి. కాబట్టి ‘మేకిన్‌ ఇండియా’ అన్న ఆలోచన మంచిదే. కానీ అమల్లోకి వచ్చేసరికే అదో దారుణంలా తయారైంది. లక్షల మందికి ఉపాధి కల్పించాల్సింది పోయి అది ధనికులను మరింత లాభం చేకూర్చిపెట్టేదిగా తయారు చేసేశారు. అలాగే స్వచ్ఛభారత్‌ అన్నది కూడా మంచి ఆలోచనే. కానీ అమలే దారుణం. దేశవ్యాప్తంగా మరుగుదొడ్లు నిర్మించటం మంచిదేగానీ.. నీళ్లు లేకుండా వాటిని నిర్మిస్తే ఉపయోగం ఏముంటుంది? అలాగే జీఎస్టీ కూడా మంచి ఆలోచనే. కానీ ఎవరి మాటా వినకుండా.. ప్రజలు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోకుండా అమలు చేసిన విధానమే దుర్మార్గం. మేం జీఎస్టీకి మద్దతిచ్చాం.. కానీ ఈ రూపంలో కాదు. ఉద్దేశం ఎంత మంచిదైనా.. రాజకీయాల్లో ప్రజలు చెప్పేది వినకుండా అమలు చేస్తే ఫలితాలు ఉండవు. నా ప్రధాన ఫిర్యాదు ఏంటంటే అటు మోదీ, ఇటు కేసీఆర్‌ ఇద్దరూ ఎవరూ చెప్పేది వినరు!

ప్రధాన మంత్రి మోదీ స్వయంగా అనేక దేశాలు పర్యటించారు.. విదేశీ సంబంధాల విషయంలో తాము ఎంతో సాధించామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మీరేమంటారు? 
మీరు జోక్‌ చేస్తున్నట్టున్నారు... ప్రధాని నేపాల్‌ వెళ్లారు.. అది మనకు దూరమైపోయింది. మాల్దీవులు దూరమైపోయింది. ఆఫ్గానిస్థాన్‌ మన గురించి ఫిర్యాదులు చేస్తోంది. చైనా సైన్యం అయితే నేరుగా డోక్లాంలోకి నడుచుకుంటూ వచ్చేసింది. ఆ దేశం శ్రీలంకలో నౌకాశ్రయం పెట్టుకుంది. ప్రధాని మోదీ ఎలాంటి అజెండా లేకుండానే చైనా ప్రభుత్వంతో చర్చలు జరిపేశారు. మోదీ విదేశాంగ విధానం పెద్ద వైఫల్యం. ఆయన నేతృత్వంలో మన విదేశీ విధానం అత్యంత అధ్వానంగా తయ్యారైందో.. మీరు విదేశీ మంత్రిత్వ శాఖలో ఎవరిని అడిగినా చెబుతారు. ఎవరినో ఎందుకు.. మంత్రి సుష్మా స్వరాజ్‌ను వేరేగా అడిగినా ఇదే విషయం చెబుతారు!

కొద్ది వారాల్లోనే తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్‌కు గెలిచే అవకాశాలు ఏమాత్రం ఉన్నాయంటారు? ఈ ఎన్నికల ప్రభావం లోక్‌సభ ఎన్నికలపైనా ఉంటుందా? 
కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుంది. తెలంగాణలో కచ్చితంగా గెలుస్తాం. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరంలలో కూడా కాంగ్రెస్‌ పరిస్థితి చాలా బాగుంది. మేం గెలుస్తాం. అయితే నా వరకూ ఈ ఎన్నికల్లో ప్రధాన అంశం ఇంతకు ముందు చెప్పినట్లే.. మన వ్యవస్థలపైన జరుగుతున్న దాడి! ఇది ఓ పద్ధతి ప్రకారం జరుగుతోంది. ఈ దాడిని దిల్లీలో ఆరెస్సెస్‌, భాజపాలు చేస్తుంటే తెలంగాణలో కేసీఆర్‌ వంటి వాళ్లు చేస్తున్నారు. వీళ్లు ప్రజల అభిప్రాయాలను వినే పరిస్థితిలో లేరు. భారత ప్రజల, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు పాలనలో ప్రాధాన్యం ఇవ్వటం లేదు. వ్యవస్థలను ఒక్కటొక్కటిగా ధ్వంసం చేసేస్తున్నారు.

తెలంగాణను ఇచ్చింది తామేనని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది. ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణ ఇచ్చామో అది నెరవేరలేదని మీ పార్టీ నాయకులు తరచూ విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆశలను తెరాస ప్రభుత్వం నెరవేర్చలేదంటారా? 
‘తెలంగాణ’ అన్నది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ఈ ప్రజల ఆకాంక్షను బలంగా వ్యక్తీకరించటంలో కాంగ్రెస్‌ కచ్చితంగా అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. రాష్ట్రం ఏర్పాటయ్యేలా చూడటం ద్వారా బలమైన అండగా నిలబడింది కూడా. కానీ ఇప్పుడు చూస్తే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో తమ ఆశలు, ఆకాంక్షలు నెరవేరుతున్నాయని భావించేవాళ్లు రాష్ట్రంలో ఎవ్వరూ కనబడటం లేదు. ఒక కొత్త రాష్ట్రం గురించి ప్రజలు కన్న కలలను, ఆ ప్రజాకాంక్షను.. రాష్ట్రం ఏర్పడిన ఈ నాలుగున్నరేళ్లలో తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూర్తిగా ధ్వంసం చేసేశారు. అసలు తెలంగాణ అంటేనే ప్రజల భావోద్వేగాలను, ప్రజల ఆకాంక్షలను వినటం! కానీ ముఖ్యమంత్రికి అస్సలు వినటమనేదే నచ్చదు! తెలంగాణ సమస్యలన్నింటికీ తన దగ్గరే పరిష్కారాలున్నాయన్నది ఆయన ప్రగాఢ నమ్మకం. దీంతో గత ఐదేళ్లుగా ఆయన తెలంగాణ సౌధాన్ని తన కలలకు అనుగుణంగా నిర్మించుకునే పనులే చేస్తున్నారుగానీ ప్రజల కలలు ఏమిటి? వారి ఆకాంక్షలేమిటన్నది ఆయన అస్సలు పట్టించుకోలేదు. అందుకే ఈ ప్రభుత్వ హయాంలో తమ ఆకాంక్షలు నెరవేరుతాయన్న భావన, నమ్మకం ప్రజల్లో ఎక్కడా కలగటం లేదు.


నాకొకటి చెప్పండి.. 
ఆ ఇద్దరిదీ ఒకటే ధోరణి! 

రైతుకు ఇవ్వటానికి రాష్ట్రంలో మద్దతు ధర లేదు, ఉపాధి కల్పనకు మీ వద్ద డబ్బుల్లేవు.. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కోసం రూ.300 కోట్లతో భవనం కడతారు! ఇది మనకేం చెబుతోంది? తెలంగాణకు ఏది ముఖ్యమో.. మీ ప్రభుత్వానికి అది ముఖ్యం కాదు. పూర్తి అవినీతి వ్యవస్థను నడుపుతున్నారు. ఒక్క కుటుంబం కోసం, ఆ కుటుంబం కేంద్రంగానే అంతా నడుస్తోంది. మరో మాట వినిపించే పరిస్థితి లేదు. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ఇది మన ముందున్న ఛాలెంజ్‌. దీనిపైనే పోరాడుతున్నాం. 


మోదీ రూ.500, రూ.1000 నోట్ల రద్దు గురించి ఆర్‌బీఐని అడిగారా? ఆర్థిక మంత్రిని అడిగారా? అన్ని ఆర్థిక సంస్థలను పక్కనపెట్టి.. సొంత నిర్ణయం తీసుకుని.. అమలు చేసేసి.. దేశానికి తీవ్రమైన నష్టం కలిగించారు. దీనివల్ల 2% జీడీపీ కోల్పోయాం. పరిశ్రమలు కోలుకోలేనంతగా దెబ్బతిన్నాయి.

దేశంలో మహారాష్ట్ర, గుజరాత్‌, కేరళ, తెలంగాణ, తమిళనాడు.. ఇలా ఆందోళనలు లేని రాష్ట్రమనేది లేదు. దీనంతటికీ కారణం భాజపా, ఆరెస్సెస్‌.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వంటి వారు బలంగా ముందుకు తెచ్చిన ఆలోచనలే. వీళ్లకు ప్రజల ఆకాంక్షలు, ఆలోచనలేం పట్టవు. ఏం చేసినా, ఎంత అన్యాయంగా ప్రవర్తించైనా సరే.. తమ మాట చెల్లుబాటు అయ్యేలా చేసుకోవటమే వీళ్ల పంథా.

ఆ ఇద్దరిదీ ఒకటే ధోరణి! 

మోదీ సర్కార్‌ ప్రణాళికా సంఘం, సుప్రీంకోర్టు.. ఇలా ఎన్నో సంస్థలపై దాడి చేసింది. ప్రభుత్వం చేస్తున్నదల్లా ఆరెస్సెస్‌ చెప్పినట్లుగా నడుచుకోవడం, రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేయడం! ఇదీ ప్రధాని మోదీ పని చేసే పద్ధతి! దీనికి ఆయన మూల్యం చెల్లిస్తారు.

ఆ ఇద్దరిదీ ఒకటే ధోరణి! 

సంపన్నులకు రుణమాఫీలు చేసి పేద రైతులకు లేదనటమేమిటి? ఈ లాజిక్‌ ఏమిటో అర్థం కాదు. పోనీ రుణ మాఫీ అన్నది ఎవరికీ ఉండదంటే అది వేరే విషయం. కానీ రైతుల దగ్గరకు వచ్చేసరికి వేరేగా ఎందుకు చూస్తారు? మనం చేసేది సమంజసంగా ఉండాలనే నేను అడుగుతున్నాను. ధనికులకు మాఫీలు చేసి పేదలకు చేయకపోతే ఎలా? నిజానికి వాళ్లకు ఇంకా ఎక్కువ చేయాలి కదా! 

అన్ని వర్గాల ప్రజలనూ భాగస్వాములను చేస్తూ తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్‌ నాయకత్వం వహించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కనీస నిరసనను కూడా తట్టుకోలేకుండా అణచివేసే ప్రయత్నం చేశారని మీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో మీరు ఏకీభవిస్తారా? 
కచ్చితంగా! అంతేకాదు, తీవ్రస్థాయిలో అవినీతి జరిగింది. కుటుంబ పాలన నడుస్తోంది. ఒకే కుటుంబం రాష్ట్రాన్ని నడిపిస్తోంది. రాష్ట్రమంతా నిరుద్యోగ సమస్య తాండవిస్తోంది. మిర్చి రైతులు తమ కనీస హక్కులు, ధరలు అడిగితే చేతులకు బేడీలు వేసి నానా హింసలు పెట్టారు. ఇలా ఒకటి కాదు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఎన్నో వైఫల్యాలు చోటుచేసుకున్నాయి.

ప్రస్తుతం కేంద్రంలో పరిపాలన అంతా ఆరెస్సెస్‌ కనుసన్నల్లో నడుస్తోందని ఆరోపించారు..? 
అవును, కేంద్రంలోని ప్రతి మంత్రిత్వ శాఖలోనూ ఆరెస్సెస్‌ నుంచి ఓ ప్రత్యేక అజమాయిషీ అధికారి (ఓఎస్‌డీ) ఉన్నారు. దేశంలోని విశ్వవిద్యాలయాలకు వైస్‌ ఛాన్సలర్లు, రాష్ట్రాలకు గవర్నర్లూ ఆరెస్సెస్‌ నుంచే వస్తున్నారు. అన్నిచోట్లా ఆరెస్సెస్‌ వ్యక్తులే నియమితులవుతున్నారు. విధానాలను వాళ్లే నిర్ణయిస్తున్నారు. అంతెందుకు, ప్రధాని మోదీ కూడా ఆరెస్సెస్సే కదా.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒంటరి పోటీ కంటే ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకే ప్రాధాన్యం ఇస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికలకు కూడా ఇదే వ్యూహం అనుసరిస్తారా? 
దేశంలో సిద్ధాంతపరంగా అనేక పార్టీలతో కాంగ్రెస్‌కు అవగాహన, అంగీకారం ఉంది. వారితో కలిసి పనిచేసే వెసులుబాటు మాకుంది. ఎవరితో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడం మా విధానం కాదు. కాలక్రమంలో ఇవి వ్యూహాత్మకంగా ఉపయోగపడొచ్చు, కాదననుగానీ.. వీలైనంత ఎక్కువ మందిని కలుపుకొని వెళ్లాలన్నదే మా లక్ష్యం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.