close

ప్ర‌త్యేక క‌థ‌నం

నాణ్యత లేదు.. సరకు రాదు   

కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి 
చిల్లర ధర పెరుగుదలతో ప్రజలపై భారం 
మహారాష్ట్ర నుంచి సరకు తగ్గడంతో హైదరాబాద్‌లో పెరిగిన ధర 
కర్నూలు మార్కెట్‌లో సరకు నాణ్యతలేక ధర రూ.2కు పతనం 
నాణ్యత లేదు.. సరకు రాదు 
 

ఈనాడు- హైదరాబాద్‌, ఈనాడు డిజిటల్‌- కర్నూలు: ఉల్లిగడ్డలు అటు రైతులకు, ఇటు సామాన్య ప్రజలకు కూడా కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మార్కెట్లో కిలో రూ.22 వరకు ధర పలుకుతుండగా.. పండించిన రైతుకు మాత్రం రూ.2 కూడా దక్కడంలేదు. మధ్యలో రూ.20 ఎక్కడికి పోతున్నట్లు? ఎవరికి దక్కుతున్నట్లు? మహారాష్ట్ర నుంచి నాణ్యమైన ఉల్లిగడ్డలు రావడం లేదని తెలంగాణలో చిల్లర ధర పెంచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి రైతులు మార్కెట్‌కు సరకు తీసుకెళ్లాలంటేనే ఉలిక్కి పడుతున్నారు. కర్నూలు జిల్లాలో రోజుల తరబడి కొనుగోలు జరగక పంట దెబ్బతింటోంది. చివరకు నాణ్యతలేని ఉల్లిగడ్డలంటూ కిలోకు రూ.2కి మించి ఇవ్వడం లేదు. హైదరాబాద్‌లో కిలో చిల్లరగా రూ.20 నుంచి 25 వరకూ ప్రాంతాలను బట్టి అమ్ముతున్నారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో వర్షాల్లేక ఉల్లి దిగుబడి తగ్గింది. కర్నూలు మార్కెట్‌లో వ్యాపారులు ఉల్లి కొనుగోళ్లు తగ్గించడంతో ధర రూ.2కు పతనమైంది.

ఇప్పటికే దెబ్బతిన్న ఆరువేల క్వింటాళ్లు 
కర్నూలులోని ఉల్లి మార్కెట్‌కు ఈ జిల్లాతో పాటు తెలంగాణ, కర్ణాటకల నుంచి పంట వస్తోంది. వారం రోజులుగా ఉల్లి కొనుగోళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. వేలంలో వ్యాపారులు ఆసక్తి చూపకపోవడంతో అమ్ముడవ్వక నిల్వలు పేరుకుపోతున్నాయి. సాధారణంగా ఇక్కడ ప్రతిరోజూ ఆరేడువేల క్వింటాళ్లు కొంటారు. కొద్దిరోజులుగా నాలుగువేల క్వింటాళ్లలోపే కొనుగోలు చేస్తున్నారు. గడిచిన వారం రోజుల్లో ఆరువేల క్వింటాళ్ల ఉల్లిగడ్డలు కుళ్లిపోవడంతో రైతుకు నష్టం తప్పడం లేదు. ఉల్లి మార్కెట్‌లో వ్యాపారులు కొనుగోలు చేయకపోవడానికి లారీ కిరాయిల పెరుగుదల ప్రభావం ఎక్కువగానే ఉంది. గతంలో కోల్‌కతాకు ఉల్లిగడ్డలు పంపడానికి ఒక్కో లారీకి రూ.60-70వేల కిరాయి ఇచ్చేవారు. డీజిలు ధరలు పెరగడంతో కిరాయి రూ.1.25 లక్షల వరకూ డిమాండ్‌ చేస్తున్నారు. కర్నూలు నుంచి ఎక్కువగా బంగ్లాదేశ్‌కు ఉల్లి ఎగుమతి అవుతోంది. అక్కడ సమ్మె జరుగుతుండటంతో ఇక్కడి నుంచి పంపిన లారీలు కొన్ని వెనక్కి వచ్చేశాయి.

మహారాష్ట్ర నుంచి రావడం తగ్గింది

నాసిక్‌ టోకు మార్కెట్ల నుంచి హైదరాబాద్‌కి నాణ్యమైన ఉల్లిగడ్డ రాక తగ్గింది. ఏపీలోని రైతులు మలక్‌పేట మార్కెట్‌కు తెచ్చే ఉల్లిగడ్డ సైజుచిన్నగా ఉన్నా టోకు ధర రూ.18 వరకూ పలుకుతోంది.
-జె.అనంతయ్య, కార్యదర్శి, మలక్‌పేట టోకు మార్కెట్‌, హైదరాబాద్‌.

మార్కెట్‌కు తెస్తే కుళ్లుతోంది

నాణ్యత లేదు.. సరకు రాదు 
 ఎకరా పొలంలో ఉల్లి సాగు చేయడానికి రూ.45 వేలు ఖర్చు పెట్టాను. వంద బస్తాల పంటను కర్నూలు మార్కెట్‌కు ఏడ్రోజుల క్రితం తీసుకొచ్చా.  కొనుగోలు జరగకపోవడంతో సగం ఉల్లిగడ్డలు కుళ్లిపోగా చేతికి రూ.4 వేలు వచ్చాయి.
-కాశీం, లద్దగిరి, కర్నూలు జిల్లా

పెట్టుబడి కూడా రాలేదు

నాణ్యత లేదు.. సరకు రాదు 
 ఎకరాలో 80 క్వింటాళ్ల దిగుబడివచ్చింది. కర్నూలు మార్కెట్‌లో క్వింటా రూ.1400 పలుకుతుందని వచ్చాను. సరకు కుళ్లడంతో క్వింటా రూ.280 పలికింది. ఈ ధరకు అమ్మితే పెట్టుబడి రాలేదు.
-రత్నమయ్య, ఉండవెల్లి, జోగులాంబ గద్వాల జిల్లా

నాణ్యత లేదు.. సరకు రాదు 
 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.