close

ప్ర‌త్యేక క‌థ‌నం

పాగా పైలట్‌కే?   

యువనేతకు రాజస్థాన్‌ ఎన్నికల సారథ్యం 
కాంగ్రెస్‌ గెలిస్తే ముఖ్యమంత్రి ఆయనే? 
గహ్లోత్‌ను మెప్పించి, తప్పించే యోచనలో కాంగ్రెస్‌ అధిష్ఠానం 
పాగా పైలట్‌కే? 
 

పరిస్థితుల్ని చూస్తుంటే రాజస్థాన్‌లో ఈసారి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ, సీఎం అభ్యర్థిని ఆ పార్టీ ఇంతవరకూ ఎందుకు ప్రకటించనట్టు! దశాబ్దానికిపైగా రాష్ట్రంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ, రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అశోక్‌ గహ్లోత్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయవచ్చు కదా? పోనీ... యువనేత సచిన్‌ పైలట్‌నే సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని రాహుల్‌గాంధీ భావిస్తే, ఆయన పేరునైనా ప్రకటించాలి కదా? 
ఈ విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం వ్యూహాత్మకంగా ఎందుకు మౌనం వహిస్తున్నట్టు? 
ఏ వర్గాన్నీ నొప్పించకుండా అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కుదామనా? 
ఫలితాలొచ్చాక పరిస్థితిని బట్టి నిర్ణయించుకోవచ్చనా? లేక... 
గహ్లోత్‌ ద్వారా ఎన్నికల ప్రయోజనం పొంది, ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల నుంచి ఆయన్ను తప్పిద్దామనా?

రాజస్థాన్‌లో ప్రధాన పార్టీల్లో ‘నాయకత్వ మార్పు’ గుంభనంగా కమ్ముకుంది. విధానసభ ఎన్నికల తర్వాత- భాజపాలో ముఖ్యమంత్రి వసుంధర రాజె, కాంగ్రెస్‌లో మాజీ సీఎం అశోక్‌ గహ్లోత్‌లు రాష్ట్ర రాజకీయ తెర నుంచి కనుమరుగు కావచ్చన్నది కొన్ని విశ్లేషణల సారాంశం. ఈసారి తప్పకుండా అధికారం తమదేననీ, సర్వేలూ ఇదే చెబుతున్నాయని ధీమా నెలకొన్న కాంగ్రెస్‌లో... గహ్లోత్‌ వారసునిగా, సీఎంగా యువనేత సచిన్‌ పైలట్‌ను తెరపైకి తేవాలన్నది పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యూహమని తెలుస్తోంది. ఇటీవలి ప్రచార ర్యాలీలు, బహిరంగ సభల్లో ఆయన చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలే ఇందుకు సంకేతం. ‘‘రాజస్థాన్‌లోని మునుపటి కాంగ్రెస్‌ సర్కారు కార్మికులు, ప్రజల మాటను పెడచెవిన పెట్టింది. కానీ, ఈసారి వచ్చే మన ప్రభుత్వం మాత్రం అలా చేయనే చేయదు’’ అని ఆయన పదేపదే ఉద్ఘాటిస్తున్నారు.

ఈసారి తప్పకుండా అధికారం తమదేనని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో సీఎంగా యువనేత సచిన్‌ పైలట్‌ను తెరపైకి తేవాలన్నది రాహుల్‌గాంధీ వ్యూహమని తెలుస్తోంది.

గహ్లోత్‌ నేతృత్వంలో ఇక ప్రభుత్వం ఉండబోదనీ, కొత్త తరహా పాలన అందిస్తామని రాహుల్‌ తన మాటల ద్వారా చెప్పకనే చెబుతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆయనీ సంకేతాలివ్వడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి: 2018 విధానసభ ఎన్నికల్లో భాజపా కంటే కాంగ్రెస్‌కు కనీసం 80 సీట్లు అధికంగా వస్తాయని చాలా సర్వేలు భరోసా చెప్పడం. రెండు: గహ్లోత్‌ కంటే ఎక్కువగా, చెప్పాలంటే ప్రత్యర్థి రాజె కంటే ఎక్కువ ప్రజాకర్షక నేతగా పైలట్‌ ఎదగడం. వీటికి తోడు ఆయనకు పగ్గాలు అప్పగించాలని యువ కార్యకర్తల నుంచి డిమాండ్లు రావడం. కానీ, పార్టీ అధికారంలోకి వచ్చే ఈ కీలక సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా... అధిష్ఠానానికి తలనొప్పి తప్పదు. పైలట్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారుచేస్తే... రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ భారీ సంఖ్యలో వ్యక్తిగత మద్దతుదారులు, వేగులు, బూత్‌స్థాయి కార్యకర్తలు ఉన్న గహ్లోత్‌ ఊరుకుంటారా? ఆయన వర్గానికి ఈ నిర్ణయం అస్సలు మింగుడు పడదు. పైగా భారీగా ఓట్లున్న మాలి సామాజికవర్గానికి గహ్లోత్‌ మాటే శిరోధార్యం! అలాగని ఆయనను మూడోసారి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టేందుకు పార్టీ అధినాయకత్వం ఆసక్తిగా లేదు. ఈ విషయాన్ని గత మేలోనే రాహుల్‌గాంధీ గహ్లోత్‌కు నర్మగర్భంగా చెప్పారు కూడా. కానీ, ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ఆయనకున్న అవకాశాలను అధిష్ఠానం పూర్తిగా విస్మరించలేదు. ఎందుకంటే... పైలట్‌ ముఖ్యమంత్రి కావాలని 11% మంది కోరుకుంటే, గహ్లోత్‌కే ఆ పీఠం దక్కాలని ఏకంగా 35% మంది కోరుకుంటున్నట్లు తాజా సర్వే ఒకటి తేల్చింది!

పైలట్‌ ప్రత్యేకతేంటి?

2014లో పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ వ్యవహారాల్లో సచిన్‌ పైలట్‌ మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా యువతను ఆకర్షించేందుకూ, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు చురుగ్గా కృషి చేస్తున్నారు. కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ తనదైన నాయకత్వ ప్రతిభ చూపుతున్నారు. గత ఫిబ్రవరిలో అల్వార్‌, అజ్‌మేర్‌ లోక్‌సభ స్థానాలకు, మండల్‌గఢ్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో... పార్టీని విజయం దిశగా నడిపించారు. అక్కడ భాజపా అభ్యర్థులు మట్టికరవక తప్పలేదు. పైలట్‌ వ్యూహాలు ఫలించడంతో ఆయన పట్ల రాహుల్‌కు మరింత గురి కుదిరింది. కేంద్ర, రాష్ట్రాల్లోని భాజపా ప్రభుత్వాల వైఫల్యాలను ఎప్పటికప్పుడు పైలట్‌ ఎండగడుతూనే ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్ట నిబంధనలను సడలింపు; పెట్రోధరల పెంపు వంటి అంశాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రజల దృష్టిని ఆకర్షించారు. తన సొంత సామాజిక వర్గమైన గుజ్జర్లను తిరిగి కాంగ్రెస్‌వైపు తిప్పడంలో విజయం సాధించారు. భాజపాపై గుర్రుగా ఉన్న రాజ్‌పుట్‌లను ఆకర్షించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, యువ ఓటర్లను ఆకట్టుకున్నంతగా ఆయన సీనియర్లను ఆకట్టుకోలేకపోతున్నారని వినిపిస్తోంది.

రాహుల్‌గాంధీ సమన్వయ ధోరణి 
పాగా పైలట్‌కే? 
 

రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో పైలట్‌, గహ్లోత్‌ వర్గాల మధ్య ఆధిపత్య పోరు నివురుగప్పిన నిప్పులా నెలకొంది. ఈసారి కాంగ్రెస్‌ విజయానికి అనుకూల పరిస్థితులున్నట్లు సర్వేల్లో తేలడంతో- రెండు వర్గాల నుంచి టికెట్లు ఆశిస్తున్నవారి సంఖ్య గతంలో కంటే మూడింతలు ఎక్కువగానే ఉంది. గెలుపే ధ్యేయంగా వ్యూహాలు రచిస్తున్న రాహుల్‌గాంధీ... రాష్ట్రంలో వర్గవిభేదాలకు తావులేకుండా అభ్యర్థుల వడపోతకు ప్రత్యేక కమిటీని నియమించారు. గ్రామీణ నియోజకవర్గాల్లో గహ్లోత్‌ వర్గానికి, పట్టణ ప్రాంతాల్లో పైలట్‌ మద్దతుదారులకు టికెట్లు ఇస్తే మంచిదన్న అభిప్రాయం ఆ కమిటీలో వ్యక్తమవుతోంది. గెలుపు అంచున ఉన్నందున... విభేదాలను పక్కనపెట్టి, అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని రాహుల్‌ ఇద్దరి నేతలను కోరినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. తదనుగుణంగానే తమ మధ్య విభేదాల్లేవంటూ నేతలిద్దరూ తరచూ ప్రకటనలు చేస్తుండటం గమనార్హం. నిజానికి గహ్లోత్‌-పైలట్‌ వర్గాల మధ్య సఖ్యత సాధించేందుకు గత మేలోనే రాహుల్‌ వారితో విడివిడిగా భేటీలు నిర్వహించారు. కీలకమైన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చినందున... ఇక రాజస్థాన్‌ వ్యవహారాల్లో తలదూర్చవద్దని గహ్లోత్‌కు రాహుల్‌ తేల్చి చెప్పారు. మరోవైపు- గహ్లోత్‌కు సన్నిహితుడైన అవినాష్‌ పాండేను రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడి హోదా నుంచి తప్పించాలని సచిన్‌ కోరగా, అందుకు రాహుల్‌ అంగీకరించలేదు. పైగా ముగ్గురు నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఏకతాటిపై నడవాలని వారికి సూచించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవర్ని ప్రకటించినా మిగతా వర్గంలో ఆగ్రహం పెల్లుబకడం ఖాయమని భావించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం... ఈ విషయంలో ప్రస్తుతానికి ‘వ్యూహాత్మక మౌనమే’ మేలన్న నిర్ణయానికి వచ్చింది.

గహ్లోత్‌ వర్గానికే ఎక్కువ సీట్లు?

గుండెల నిండా మహాత్మాగాంధీ స్ఫూర్తిని నింపుకొని, తూర్పు బెంగాలీ శరణార్థులకు సపర్యలు చేస్తూ 20 ఏళ్ల వయసులో ఇందిర కళ్లకు చిక్కిన కుర్రాడు- అశోక్‌ గహ్లోత్‌! కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం నేతగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి... నేడు పార్టీకి పెద్ద దిక్కుగా ఎదిగారు. రెండుసార్లు భాజపాను గద్దె దించి, కాంగ్రెస్‌ పాలనకు సారథ్యం వహించారు. అంతటి నేతను ఈసారి ఎన్నికల సారథ్యం నుంచి తప్పించాలి. కానీ నొప్పించకూడదు. అందుకే మెప్పించే మార్గం ఎంచుకున్నట్టు కనిపిస్తోంది రాహుల్‌గాంధీ. పార్టీ జాతీయ వేదికపై గహ్లోత్‌కు కొన్నేళ్లుగా ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. పార్టీ గుజరాత్‌ ఇన్‌ఛార్జిని చేశారు. తర్వాత కర్ణాటక బాధ్యతలు అప్పగించారు. అనంతరం ప్రతిష్ఠాత్మక పార్టీ జాతీయ కార్యదర్శి పదవి కట్టబెట్టారు. 1990 నుంచి రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సారథ్యం వహిస్తున్న గహ్లోత్‌కు- తనను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పిస్తున్నారన్న విషయం గ్రహించలేనిదేం కాదు. అధిష్ఠానం తీసుకున్న ఈ చర్యలేవీ ఆయన మెత్తబడటానికి సరిపోకపోవచ్చు. అందుకే, గహ్లోత్‌ సూచించిన వారికి ఈసారి భారీగా టికెట్లు ఇవ్వాలని అగ్రనాయకత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

బీబీసీ విలేకరిగా

కాంగ్రెస్‌ దివంగత నాయకుడు రాజేశ్‌ పైలట్‌, రమా దంపతుల కుమారుడైన సచిన్‌... 1977 సెప్టెంబరు 7న యూపీలోని సహరాన్‌పూర్‌లో జన్మించారు. దిల్లీలోని ఎయిర్‌ ఫోర్స్‌ బాలభారతి పాఠశాలలో చదివారు. అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీయే చేశారు. రాజకీయాల్లోకి రాకముందు దిల్లీలో బీబీసీ పాత్రికేయునిగా పనిచేశారు. తర్వాత జనరల్‌ మోటార్స్‌లో రెండేళ్లు విధులు నిర్వర్తించారు.

ఫరూక్‌ అబ్దుల్లా అల్లుడు 
పాగా పైలట్‌కే? 
 

మెరికాలో చదువుకునేటప్పుడు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత, జమ్ము-కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా కుమార్తె సారా అబ్దుల్లా సచిన్‌కు పరిచయమయ్యారు. అదికాస్త వారి మధ్య ప్రేమగా మారింది. కానీ, వారి పెళ్లికి అమ్మాయి కుటుంబం నుంచి అంగీకారం లేకపోయింది. వారి అభీష్టానికి విరుద్ధంగానే జనవరి 15, 2004లో సచిన్‌-సారాలు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అబ్దుల్లా వారి ప్రేమను, వివాహాన్ని అంగీకరించారు. ప్రస్తుతం ఇద్దరు కుమారులు ఆరన్‌, వెహాన్‌లతో కలిసి పైలట్‌ కుటుంబం గాజియాబాద్‌లో నివాసముంటోంది.

అజ్‌మేర్‌ ఎంపీగా అరంగేట్రం

తండ్రి మరణంతో రాజకీయ ప్రవేశం చేసిన సచిన్‌... 2004లో డౌసా నియోజకవర్గం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయనకు అప్పుడు 26 ఏళ్లు! 2009 లోక్‌సభ ఎన్నికల్లో అజ్‌మేర్‌ నుంచి బరిలోకి దిగిన ఆయన... భాజపా అభ్యర్థిపై 76 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. యూపీఏ-2 హయాంలో కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2014లో అదే నియోజకవర్గం నుంచి పోటీచేశారు. కానీ, మోదీ ప్రభంజనంతో ఆయనకు ఓటమి తప్పలేదు.

తండ్రి కోరికతో లెఫ్టినెంట్‌ 
పాగా పైలట్‌కే? 
 

న తండ్రి ఆశయం మేరకు 2012 సెప్టెంబరు 6న పైలట్‌ ప్రాదేశిక సైన్యంలో చేరి లెఫ్టినెంట్‌గా సేవలు అందించారు. కేంద్ర మంత్రిగా ఉంటూ.. సైన్యంలో తాత్కాలిక సేవలు అందించిన ప్రథమ వ్యక్తి సచినే కావడం విశేషం. తన తాత, తండ్రి కూడా సైన్యంలో పనిచేశారనీ, వారి వారసత్వాన్ని కొనసాగించడం తనకెంతో ఆనందంగా ఉందని సైన్యంలో చేరిన సందర్భంగా ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. పల్లెలు అంటే పైలట్‌కు ఎంతో మక్కువ. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను నిత్యం అధ్యయనం చేస్తుంటారు. సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంటారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని పారదోలేందుకు ‘సిటిజన్‌ అలయెన్స్‌’ అనే సంస్థను ప్రారంభించారు.

 

 

 

- ఈనాడు, ఎన్నికల విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.