close

ప్ర‌త్యేక క‌థ‌నం

కరవు మేఘం.. కమ్ముకొస్తోంది   

అన్నదాత శ్రమ నిష్ఫలం 
అడుగంటిన చెరువులు, బావులు, బోర్లు 
నీరు లేక ఎండుతున్న పంటలు 
17 జిల్లాల్లో తీవ్ర వర్షాభావం 
మెదక్‌, సిద్దిపేట జిల్లాల నుంచి ‘ఈనాడు’ ప్రతినిధి 
కరవు మేఘం.. కమ్ముకొస్తోంది 
 

రాష్ట్రంపై కరవు రక్కసి కోరలు చాస్తోంది. వరుణుడి కరుణ లేక వ్యవసాయానికి చేటుకాలం ముంచుకొస్తోంది. సరైన వానల్లేక బోర్లు, బావులు అడుగంటిపోయి.. వానాకాలం పంటలు బతికి బట్టకట్టలేని దుస్థితి నెలకొంది. పూత, కాతకొచ్చే దశలోనూ పైరు కళ్ల ముందే ఎండిపోతున్న  తీరు అన్నదాతను నిస్సహాయుణ్ని చేస్తోంది. వర్షాధార భూముల్లో పంటలే కాదు.. బోర్లు, బావుల కింద సాగు చేసినవీ పూర్తిగా పండే పరిస్థితి లేక రైతన్న నిలువునా నీరుగారిపోతున్నాడు. పూర్తిగా ఎండిన పంటలను పశువుల మేతకు వదిలేస్తుండటం పరిస్థితి తీవ్రతకు నిలువుటద్దం. ఒకటీ రెండూ కాదు రాష్ట్రంలోని 17 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నాయని ప్రభుత్వమే ప్రకటించడం కరవు తీవ్రతను కళ్లకు కడుతోంది.

ఈ రబీ సీజన్‌లో రైతులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. వర్షాల్లేక బోర్లు, బావులు ఎండిపోయాయి. వానదేవుణ్ని నమ్ముకుని సాగు చేసిన పంటల్లో దిగుబడి సగం దాటే పరిస్థితి  లేదు. కొన్నిచోట్ల వేసిన పైరు మొత్తం ఎండిపోవడంతో పెట్టుబడి పైసలు కూడా తిరిగొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. వంద శాతం దిగుబడి నష్టపోయిన రైతులూ ఉన్నారంటే కరవు తీవ్రత అర్థమవుతుంది. మెదక్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌ తదితర జిల్లాల్లో కూరగాయల తోటలకు నీరందించలేక వదిలేస్తున్నారు. వానాకాలం చివరికే బోర్లు, చెరువులు ఎండిపోయాయి. దీంతో పైర్లు ఎండిపోతున్నాయని, ఇక యాసంగి (రబీ)పైన ఆశలే లేవని రైతులు వాపోతున్నారు. చాలా బోర్లలో పది నిముషాలు కూడా ఏకధాటిగా నీరు రావడం లేదు. 2, 3 నిమిషాలు వస్తే.. మళ్లీ కొద్దిసేపు నిలిచిపోతోంది. పైరును కాపాడుకునేందుకు ఆ బోరుతోనే రోజంతా నడుపుతున్నారు. వచ్చే నీటితో మొత్తం పంటకు అరకొర తడి ఇవ్వడం కంటే సగం పంటకైనా పూర్తిగా నీళ్లిచ్చి కాపాడుకోవాలని తాపత్రయపడుతున్నారు.

కరవు మేఘం.. కమ్ముకొస్తోంది 
 

20 శాతం దిగుబడి పోయినట్లే 
వర్షాభావం, సాధారణం కన్నా మూడు నాలుగు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవడంతో పంట ఎండిపోతుంది. మొత్తమ్మీద 20 శాతం వరకూ దిగుబడి తగ్గవచ్చని అనధికార అంచనా. పంటలు ఎండిపోయిన చోట్ల వ్యవసాయ పనులు తగ్గిపోయాయి.  ‘వ్యవసాయ పనికి రోజుకు రూ.200 ఇచ్చేవారు. ఇప్పుడు రూ.150కే పనిచేస్తామన్నా పిలిచేవాళ్లు లేరు. డ్వాక్రాలో తీసుకున్న అప్పులు తిరిగి కట్టలేకపోతున్నాం’ అని మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలంలో స్వయంసహాయక సంఘం మహిళలు వాపోయారు.

కరవు మేఘం.. కమ్ముకొస్తోంది 
 

లక్షన్నర అప్పు మిగిలిందికరవు మేఘం.. కమ్ముకొస్తోంది 
 

వానలపై ఆశ, మూడు బోర్లున్నాయన్న ధీమాతో మూడెకరాల్లో వరి వేశాను. ఒక బోరు పూర్తిగా ఎండిపోయింది. మిగిలిన రెండింటిలో నీరు సన్నగా వస్తోంది. పంట ఎండకూడదని నాలుగు కొత్త బోర్లు వేయించాను. ఒక్క దాంట్లోనూ నీరు పడలేదు. వరి పైరు ఎండిపోవడంతో గొర్రెల మేతకు వదిలేశాను. సాగుకు రూ.34 వేలు, బోర్ల తవ్వకానికి రూ.1.20 లక్షలు అప్పు చేశా. ఇవన్నీ తీర్చాలంటే దివ్యాంగుడినైన నాకు ఐదేళ్లు పడుతుంది.

- ఆనేం వెంకటయ్య, కంచన్‌పల్లి, గండీడ్‌ మండలం, మహబూబ్‌నగర్‌ జిల్లా

వరి, మక్క ఎండిపోయాయికరవు మేఘం.. కమ్ముకొస్తోంది 
 

నాకు నాలుగెకరాల పొలం ఉంది. బోరు ఉన్నా నీరు పెద్దగా రాదు. వర్షాలు కురుస్తాయనే ఆశతో రెండెకరాల్లో మొక్కజొన్న, ఎకరాలో వరి సాగుచేశా. రూ.26 వేలు పెట్టుబడి పెట్టాను. వర్షాలు లేక రెండు పంటలూ ఎండిపోవడంతో పశువుల మేతకు వదిలేశాను. పశువులకు తాగడానికి కూడా మా మండలంలో నీరు లేదు.

-గంజి తిమ్మ, సల్లోనిపల్లి, హన్వాడ మండలం. మహబూబ్‌నగర్‌ జిల్లా

పత్తి వేస్తే పెట్టుబడీ దక్కలేదు

రూ.40 వేల ఖర్చుతో నాలుగెకరాల్లో పత్తి సాగు చేశాను. ఎకరాకు 15 క్వింటాళ్ల చొప్పున 60 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి రావాలి. సకాలంలో వానల్లేక పైరు ఎండిపోయింది. దిగుబడి ఆరు క్వింటాళ్లే వచ్చింది.

-ఎన్‌.కస్నీయా, తెల్దేవరపల్లి గ్రామం, నల్గొండ జిల్లా

8 నల్గొండ జిల్లా రామునిగుండ్ల తండాలో రామావత్‌ మాతృ ఐదెకరాల్లో పత్తి సాగుకు రూ.90 వేలు ఖర్చు పెట్టాడు. పంట ఎండిపోవడంతో రూ.50 వేలు అప్పు మిగిలిందని వాపోయారు.

మొక్కజొన్నకే ఎక్కువ నష్టం

ర్షాలు సరిగా కురవని ప్రాంతాల్లో మొక్కజొన్నకు నష్టం ఎక్కువగా ఉందని జిల్లా వ్యవసాయాధికారులు తెలిపారు. ఈ పంట దిగుబడి 20 నుంచి 25 శాతం  తగ్గుతుందని అంచనా. మిగిలిన పంటలపై ఇంకా అంచనాలు వేయలేదు. వానాకాలం సీజన్‌ ఆరంభంలో వేసిన పంటలు కోతకు వచ్చినందున వాటికి పెద్దగా నష్టం లేదు. వాతావరణశాఖ నుంచి వివరాలు తీసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం.

-పార్థసారథి, ముఖ్య కార్యదర్శి, వ్యవసాయశాఖ, తెలంగాణ

కరవు మేఘం.. కమ్ముకొస్తోంది 
 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.