close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఈ గోల చేసేద్దాం   

ఎన్నికల ప్రచారానికి కొండంత అండగా కృత్రిమ మేధ 
చేయూతనిస్తున్న మిషన్‌ లెర్నింగ్‌, బిగ్‌డేటా అనలిటిక్స్‌ 
ప్రజల నాడి తెలుసుకోవడంలో కీలకం 
మెరుపు వేగంతో అభ్యర్థుల గెలుపు వ్యూహాలు 
విస్తృతంగా పనిచేస్తున్న ఐటీ బృందాలు, ఏజెన్సీలు 
ఈనాడు - హైదరాబాద్‌ 
ఈ గోల చేసేద్దాం 
 

న్నికలనే పద్మవ్యూహంలో సమాచార సాంకేతిక పరిజ్ఞానం తిరుగులేని ఆయుధంగా మారింది. అభ్యర్థుల విజయంలో ఇది అత్యంత కీలకం. ఓటరును ఎలా ఆకట్టుకోవాలి, అనుకూలమైన అంశాలను అత్యంత సమర్థంగా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, ప్రత్యర్థి బలహీనతలను తనకు బలంగా ఎలా మలచుకోవాలి, మెరుపు వేగంతో వ్యూహాలను ఎలా రూపొందించాలనే విషయంలో రాజకీయ పార్టీలకు కొండంత అండగా నిలుస్తోందీ సాంకేతికత. వ్యూహాలను రచించటం, వాటిని తక్షణమే అమలుపరచటం, అవసరమైతే మార్పులు, చేర్పులు చేయటం వంటి సేవలన్నిటినీ ఐటీ నిపుణుల బృందాలు, సామాజిక మీడియా ఏజెన్సీలు అందిస్తున్నాయి. చిన్న, పెద్ద పార్టీలనే భేదంలేకుండా అన్ని రాజకీయ పక్షాలూ ఈ సాంకేతిక బృందాల సేవలను పొందుతూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని వేడెక్కిస్తున్నాయి. ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో వివిధ అంశాలను వైరల్‌ చేయడం, అవసరమైన సమాచారాన్ని(ఫీడ్‌బ్యాక్‌) తీసుకుని విశ్లేషించడంలో కీలకపాత్ర వహిస్తున్న నిపుణుల బృందాలు.. కృత్రిమమేధ, మిషన్‌లెర్నింగ్‌, బిగ్‌డేటాఅనలిటిక్స్‌ వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నాయి.

అస్త్రం కోసం భారీ కసరత్తు 
నిపుణుల బృందాలు ఎప్పటికప్పుడు తాజా స్థితిని చర్చిస్తుంటాయి. తాజాగా ప్రత్యర్ధుల చేసిన వ్యాఖ్యలు, వాదనలు, పరిణామాల వంటి వాటన్నింటినీ పరిశీలిస్తారు.

ఆ రోజు ఏ అంశం మీద విమర్శలతో విరుచుకుపడాలో ఎంపిక చేస్తారు. ఆగమేఘాల మీద పాత వీడియోలు, చిత్రాలు, పాటల వంటివాటన్నింటినీ గాలిస్తారు. వాటన్నింటినీ గుదిగుచ్చి గ్రాఫిక్‌లు, వీడియోలు, పాటలు, కామెంట్లు, కార్టూన్ల వంటివన్నీ చేర్చి.. సూటిగా ఈటెలా దిగే ప్రచారాస్త్రాన్ని సిద్ధం చేస్తారు.

ఈ గోల చేసేద్దాం 
 

ప్రయోగ పరీక్షలో నెగ్గుతుందా? 
తాము రూపొందించిన ప్రచారాస్త్రం జనాన్ని ఆకట్టుకుంటోందా? లేదా? అన్నది తెలుసుకునేందుకు ముందుగా కొన్ని ‘టెస్టింగ్‌ గ్రూప్స్‌’లోకి వదులుతారు.

ఆ గ్రూపుల్లో ఎలాంటి స్పందన వస్తోందన్నది చూస్తారు. అది వారిని ఆకట్టుకుంటే.. వెంటనే దాన్ని మిగతా గ్రూపులు, పార్టీ అనుబంధ పేజీలు, వెబ్‌సైట్లలో పోస్ట్‌ చేస్తారు. ఒకవేళ టెస్టింగ్‌ గ్రూపుల్లో పెద్దగా స్పందన లేకుంటే మరిన్ని మెరుగులు దిద్దుతారు.

తమ ప్రచారాస్త్రం సాధ్యమైనన్ని గ్రూపులను చుట్టబెడుతూ వైరల్‌ అయ్యేలా చూసేందుకు పార్టీ కార్యకర్తలకు చెప్పి వీలైనన్ని ఎక్కువ లైకులు వచ్చేలా చేస్తారు. దీంతో దాన్ని అంతా ఒకరికొకరు పంపించుకుంటూ... ఆ రోజంతా అదే చర్చనీయాంశంగా తయారవుతోంది.

వీటిని వైరల్‌ చేసి.. వీలైనన్ని ఎక్కువ గ్రూపుల్లో పోస్ట్‌ చేసేందుకు ముందుగా పార్టీల అనుమతి అవసరం. తాము రూపొందించిన ప్రచారాంశం వికటిస్తే మొదటికే మోసం వస్తుందన్న జాగ్రత్తతోనే ఈ విధానం పాటిస్తున్నారు. అయినా సోషల్‌ మీడియాలో వస్తున్న కొన్ని రాజకీయ, వ్యక్తిగత విమర్శలు వివాదాలకు దారి తీస్తున్నాయి. కొన్నిచోట్ల ప్రత్యర్థి వర్గీయుల నుంచి బెదిరింపులు, దాడులు కూడా చోటుచేసుకుంటున్నాయి. ప్రతిష్ఠకు భంగకరంగా ఉన్న పోస్టింగ్‌లపై పోలీసు కేసులూ నమోదవుతున్నాయి.

ప్రజలతో అనుసంధానానికి కృత్రిమ మేధ 
ఇంటర్నెట్‌ విస్తృతమైన తరువాత సామాజిక మీడియా రూపంలో రాజకీయ ప్రచారానికి అదనపు వనరులు వచ్చాయి. ఇప్పటికే కొన్ని రాజకీయపార్టీలు గ్రామ, మండల, నియోజకవర్గస్థాయిలో సభ్యత్వ వివరాలు, సామాజిక మీడియా డేటాను సిద్ధం చేసుకున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ చార్మ్స్‌ పేరిట కృత్రిమ మేధ(ఏఐ) వినియోగం విస్తృతం చేసింది. మిగతాపార్టీలు నూతన టెక్నాలజీలు వినియోగిస్తూ ముందుకు వెళ్తున్నాయి. పార్టీ కార్యకర్తలు, ప్రజలు, పార్టీకి మధ్య అనుసంధానం పెంచడంలో కృత్రిమ మేధ, మిషన్‌ లెర్నింగ్‌ కీలకపాత్ర పోషిస్తున్నాయి. పార్టీల దగ్గర అందుబాటులో ఉన్న డేటాను విశ్లేషించి, సంబంధిత వర్గాలకు అవసరమైన ప్రచార సమాచారాన్ని ఇవి ఎప్పటికప్పుడు పంపిస్తుంటాయి. అంతేకాదండోయ్‌... నిరుద్యోగులు, యువత, కార్మికులు, మహిళలు, రైతులకు సంబంధించిన వర్గీకరణ చేస్తాయి. కంఠ స్వర లఘుసందేశాలు (వాయిస్‌ ఎస్‌ఎంఎస్‌), ఏకమొత్తంలో లఘు సందేశాలు (బల్క్‌ ఎస్‌ఎంఎల్‌) పంపటం, ఐవీఆర్‌, టెలీ కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నాయి.

డ్రోన్‌లకు పెరిగిన గిరాకీ.. 
ఈ గోల చేసేద్దాం 
 

అభ్యర్థులు ఇంటింటి ప్రచారం, చిన్నపాటి మండల సమావేశాల కవరేజీకి డ్రోన్‌లను వినియోగిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా కొందరు అభ్యర్థులు ప్రత్యేకంగా డ్రోన్‌ల ద్వారా తీసే వీడియోలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ దృశ్యాల ఆధారంగా రెండు, మూడు నిమిషాల్లో తమ గురించి తెలియజేసే ప్రోమోలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు వీడియో గ్రాఫర్లతో కవరేజీల వారీగా, ప్యాకేజీల వారీగా ఒప్పందాలు చేసుకొని ధరలు నిర్ణయించుకుంటున్నారు. రెండు, మూడు నిమిషాల ప్రోమో తయారీకి రూ.25వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు చేస్తున్నారు.

పనితీరు అంచనా

ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని, అభ్యర్థి పనితీరునూ కృత్రిమ మేధ అంచనా వేస్తుంది. తద్వారా ఏయే వర్గాల ప్రజల్లో అభ్యర్థి వెనుకబడి ఉన్నారు? లోపాలేమిటి, వాటిని అధిగమించడం ఎలా? తదితర విషయాలు తెలుసుకోవడంలో నూతన టెక్నాలజీలు చేయూతనిస్తున్నాయి. వైరల్‌చేసిన అంశాన్ని చూస్తున్నవారెందరు? వారి అభిప్రాయమేమిటి? మరింతగా ఆకట్టుకునేందుకు ఏమి చేయాలి వంటి అంశాలనూ కృత్రిమ మేధ అంచనావేస్తుంది.

వాట్సాప్‌ మీరు వదిలినా వాళ్లు వదలరు

ప్రతి ఒక్కరూ బోలెడన్ని వాట్సాప్‌ గ్రూపుల్లో ఉంటున్నారు. దీంతో ఎక్కువ నిడివి వీడియోలు, పెద్దసైజు ఫొటోలు, అనవసర సమాచారం వంటివి వచ్చి చేరిపోతూ తలనొప్పిగా తయారవుతోంది. దీంతో గ్రూపుల నుంచి బయటకు వెళ్లిపోయేవారి సంఖ్య పెరుగుతోంది. దీనిని గుర్తించిన నిపుణుల బృందాలు పరిష్కారం దిశగా కసరత్తులు చేస్తున్నాయి. తక్కువ పరిమాణం, ఎక్కువ సమాచారంతో కూడిన ఫ్లాష్‌ ఫైళ్లను వైరల్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.