close

ప్ర‌త్యేక క‌థ‌నం

17 ఏళ్ల చరిత్రలో 11 సార్లు బరిలో

తెరాస ఎన్నికల ప్రస్థానమిదీ.. 
17 ఏళ్ల చరిత్రలో 11 సార్లు బరిలో

ఎన్నికలు ఆ వెంటనే ఉప ఎన్నికలు... తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) ఎన్నికల బంధమిది. 17 ఏళ్ల ప్రస్థానంలో తెరాస 11 సార్లు శాసనసభ ఎన్నికల్లో, ఏడుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసింది. ఇప్పుడు 12వ సారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. 8 సార్లు శాసనసభ ఉప ఎన్నికలను, నాలుగుసార్లు లోక్‌సభ ఉప ఎన్నికలను తెరాస ఎదుర్కొంది. నిర్ణీత కాలవ్యవధిలో వచ్చే ఎన్నికలకు ఆకస్మికంగా సిద్ధంకావడం ఆ పార్టీకి ఆనవాయితీగా ఉంది. ఉద్యమ ప్రస్థానంలో పదవీ కాలం ముగియకముందే రాజీనామాలు చేయడంతోపాటు ఎన్నికల ద్వారా ప్రజల ఆకాంక్షను చాటేందుకు తెరాస యత్నించింది. తెలంగాణను సాధించి, ప్రభుత్వం ఏర్పాటుచేశాక కూడా... తొమ్మిది నెలల గడువుకు ముందే శాసనసభను రద్దుచేసి ఆ పార్టీ ఎన్నికలకు వెళ్తోంది.

17 ఏళ్ల చరిత్రలో 11 సార్లు బరిలో

తెలంగాణ రాష్ట్ర సమితి 2001 ఏప్రిల్‌ 27న ఆవిర్భవించింది. దానికి ఆరు రోజుల ముందు ఏప్రిల్‌ 21న తెలుగుదేశం పార్టీకి, ఏపీ ఉపసభాపతి పదవికి, శాసన సభ్యత్వానికి కేసీఆర్‌ రాజీనామా చేశారు. ఆ తర్వాత అయిదు నెలలకు అంటే సెప్టెంబరు 22న ఎన్నికలు జరిగాయి. అందులో కేసీఆర్‌ విజయం సాధించారు. 2004 ఏప్రిల్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో తెరాస పొత్తు కుదుర్చుకుంది. అప్పుడు 54 శాసనసభ, ఆరు పార్లమెంటు స్థానాలకు పోటీచేసి 26 శాసనసభ, 5 పార్లమెంటు స్థానాలను తెరాస గెలిచింది. ఆ తర్వాత కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో తెరాస చేరింది. తెలంగాణ ఏర్పాటు డిమాండుపై కాంగ్రెస్‌ మాట మార్చిందని తెరాస అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి వైదొలగింది. 2006 సెప్టెంబరు 23న కేసీఆర్‌ కరీంనగర్‌ ఎంపీ పదవికి రాజీనామా చేసి, డిసెంబరు 7న జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత 2008 మార్చిలో మరోసారి కేసీఆర్‌ సహా ముగ్గురు ఎంపీలు, 16 ఎమ్మెల్యే, మూడు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశారు. జూన్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో తెరాస రెండు ఎంపీ, ఏడు ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచింది. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెరాస మహాకూటమిలో చేరి, తెదేపాతో కలిసి పోటీచేసింది. 45 శాసనసభ స్థానాల్లో పోటీ చేయగా.. 10 చోట్ల గెలిచింది. 9 ఎంపీ స్థానాల్లో పోటీచేసి, రెండింటిలోనే విజయం సాధించింది. 2010 ఫిబ్రవరిలో 11 మంది తెరాస ఎమ్మెల్యేలు రాజీనామాచేసి ఉప ఎన్నికల్లో నెగ్గారు. 2012లో రెండు దఫాలు జరిగిన ఉప ఎన్నికల్లోనూ తెరాస విజయం సాధించింది. 2014లో తెలంగాణ వచ్చాక జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 110 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీచేసిన తెరాస 63 ఎమ్మెల్యే, 11 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఆ తర్వాత రెండు స్థానాల్లో గెలిచిన సీఎం కేసీఆర్‌ మెదక్‌ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో తెరాస గెలిచింది. కడియం శ్రీహరి రాజీనామాతో వరంగల్‌ ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. ఆ తర్వాత పాలేరులో, నారాయణఖేడ్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మరణించగా.. జరిగిన ఉప ఎన్నికల్లో తెరాస పోటీచేసి గెలుపొందింది.

17 ఏళ్ల చరిత్రలో 11 సార్లు బరిలో

17 ఏళ్ల చరిత్రలో 11 సార్లు బరిలో

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.