close

ప్ర‌త్యేక క‌థ‌నం

కేసులు తూచ్‌..!   

ధనబలమే గెలుస్తోందా? 
ఎన్నికల్లో పట్టుబడిన నగదు, మద్యం కేసుల్లో పురోగతి శూన్యం 
జైలు శిక్షల ఊసేలేదు 
శిక్ష పడినవీ అప్పీళ్లకు వెళుతున్నాయి 
చట్టం కఠినంగా ఉన్నా.. అమలే కష్టం 
ఈనాడు - హైదరాబాద్‌

ఓటర్లను ప్రలోభ పెట్టడానికి నేతలు ఎన్నికల్లో డబ్బు పంచడం నిబంధనల ప్రకారం నేరం. దీనిపై కేసు నమోదైతే శిక్ష పడుతుంది. కానీ డబ్బు పట్టుబడకుండా నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవేళ దొరికినా లొసుగుల్ని అడ్డంపెట్టుకొని తప్పించుకుంటున్నారు. దీనివల్ల నిబంధనలకు విలువలేకుండా పోయి.. ధనబలానిదే రాజ్యమన్న వాతావరణం నెలకొంటోంది.

కేసులు తూచ్‌..! 
 

న్నికలు వచ్చాయంటే చాలు.. అక్కడ కోట్లకొద్దీ నగదు పట్టుబడింది.. ఇక్కడ మద్యం దొరికింది.. అంటూ ఎన్నికల సంఘం, పోలీసులు ప్రకటిస్తుంటారు. కేసులు నమోదుచేస్తుంటారు. మరి అలా నమోదుచేసిన కేసులు ఆ తర్వాత ఏమౌతున్నాయి? నిందితులకు శిక్షలు విధిస్తున్నారా? అని పరిశీలించి చూస్తే మాత్రం.. ఆశ్చర్యకర సమాధానాలే దర్శనమిస్తున్నాయి. ఓటర్లకు డబ్బు పంచిన నేరం కింద ఏడాది దాకా జైలు శిక్ష విధించొచ్చు. కానీ ఈ చర్య కింద ఇప్పటిదాకా ఒక్కరంటే ఒక్కరు కూడా జైలుశిక్ష అనుభవించలేదంటే అతిశయోక్తికాదు!!

ఎన్నికల నిబంధనల్ని అడ్డగోలుగా ఉల్లంఘిస్తున్నా.. పోలీసులు దృష్టి పెట్టేవి పదుల సంఖ్యలో కూడా ఉండవు. ఒకవేళ దృష్టిపెట్టి కేసులు నమోదుచేసినా.. వాటిపై దర్యాప్తు పూర్తయ్యేది అనుమానమే. అందుకే ఎన్నికల నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నా నాయకులు వీటిని పూచిక పుల్ల కింద తీసిపడేస్తున్నారు. యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులు ఇప్పటికీ దర్యాప్తు దశలోనే ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. మళ్ళీ ఎన్నికలు వచ్చినా కేసులు మాత్రం ముందుకు కదలడంలేదు.

ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా జరిగేందుకు కఠిన నిబంధనలు రూపొందించారు. కానీ వాటి అమలు బలహీనంగా ఉండటంతో పరిస్థితి మళ్ళీ మొదటికే వస్తోంది. జైలు శిక్షలు పడవులే అనే ధీమాతో డబ్బు పంపిణీకి ఎవరూ వెనుకాడటం లేదు. గడువు ముగిసిన తర్వాత ప్రచారం నిర్వహించడం, బహిరంగ సభల్లో దురుసుగా మాట్లాడటం లాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త పాటిస్తున్నా.. తెరచాటుగా జరిగే ఉల్లంఘనలు వేటికీ తెరపడటం లేదు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించేవారిపై పోలీసులు కేసులు నమోదుచేసి.. దర్యాప్తు పూర్తిచేసి న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేస్తారు. వీరిపై న్యాయ విచారణ పూర్తిచేసి ఆధారాలుంటే నిబంధనల ప్రకారం జైలుశిక్ష వేయాలి. కానీ ఇన్నేళ్ళుగా ఎన్నికలు జరుగుతున్నా.. ప్రతీసారీ వందల కొద్దీ కేసులు నమోదవుతున్నా శిక్షపడ్డ వారు మాత్రం కనిపించడంలేదు. చాలా కేసులు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. విచారణ పూర్తై జైలుశిక్ష పడిన కేసులు కూడా పై న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉంటున్నాయి.

గత ఎన్నికల్లో రూ.76 కోట్ల నగదు పట్టుబడగా.. వాటిలో సరైన రసీదులు చూపించిన వారికి రూ.49 కోట్లు తిరిగి ఇచ్చేశారు. మిగతా డబ్బుపై ఆదాయపు పన్నుశాఖ జరిమానా విధించింది.

2 లక్షల లీటర్ల మద్యాన్ని పట్టుకుని ధ్వంసం చేశారు. లిక్కర్‌కు సంబంధించి 1649 కేసులు నమోదైతే నాలుగున్నరేళ్ళ తర్వాతా వాటిలో 639 పెండింగ్‌లో ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జరుగుతున్న ఉల్లంఘనలతో పోల్చుకుంటే నమోదవుతున్న కేసులు 10% కూడా ఉండవు. ఏళ్ళు గడుస్తున్నా వాటి దర్యాప్తు అతీగతీ ఉండదు.

కేసులు తూచ్‌..! 
 

చట్టం కఠినమే

కేసులు తూచ్‌..! 
 పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచే ఎన్నికల ప్రచారాన్ని ఆపేసేయాలి. లౌడ్‌స్పీకర్ల ద్వారా మాత్రమే కాదు, టీవీ, రేడియో, సినిమాల్లోనూ ప్రచారం చేయయకూడదు. ఈ నిబంధన ఉల్లంఘించిన వారికి ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్‌ 126 ప్రకారం రెండేళ్ళ జైలు శిక్ష విధించవచ్చు.

ఎన్నికల్లో ఓటర్లను తరలించేందుకు ఎవరైనా ఉచితంగా వాహనాలు సమకూరిస్తే సెక్షన్‌ 127 ప్రచారం ఆరు నెలల జైలు శిక్ష.

ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బు ఇవ్వడం, ఆశచూపడం భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్‌ 171బి/171ఇ ప్రకారం ఒక సంవత్సరం జైలు శిక్ష.

దొంగ ఓటు వేస్తే ఐపీసీ సెక్షన్‌ 171డి/171ఎఫ్‌ ప్రకారం ఒక సంవత్సరం జైలు శిక్ష.

వివిధ మతాలు, ప్రాంతాలు, కులాల, జాతుల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేసినా, కరపత్రాలు పంపిణీ చేసినా ఐపీసీ సెక్షన్‌ 505 ప్రకారం ఐదేళ్ళ జైలుశిక్ష.

నామినేషన్‌ పత్రంలో తప్పుడు సమాచారం ఇస్తే ప్రజాప్రతినిధ్య చట్టంలోని 125ఎ ప్రకారం ఆరు నెలలు జైలుశిక్ష.

ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడికి పాల్పడితే ఐపీసీ సెక్షన్‌ 332, 333, 353 ప్రకారం పదేళ్ళు జైలుశిక్ష.

పట్టుబడిన డబ్బు ఏమవుతుంది?

ఎన్నికలప్పుడు డబ్బు పంపిణీ యథేచ్ఛగా సాగుతోంది. అత్యధికంగా డబ్బు పంపిణీచేసే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు దేశం మొత్తంలోనే ముందుంటాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కో నియోజకవర్గంలో రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల దాకా ఖర్చుపెడుతుంటారు. ఇంత పెద్దమొత్తంలో డబ్బు పంపిణీ జరుగుతున్నా పట్టుబడుతున్నది నామమాత్రమే. 2014 ఎన్నికల సమయంలో రూ.76 కోట్ల మొత్తాన్ని పట్టుకున్నారు. ఈసారి ఇప్పటిదాకా రూ.30 కోట్లు దొరికాయి.

కేసులు తూచ్‌..! 
 

ఏం జరగాలి? 
పట్టుబడిన డబ్బు ప్రలోభాలకు సంబంధించినదే అని పోలీసులు నిర్ధారణకు వచ్చినపుడు ఆ డబ్బును ఆదాయపు పన్ను శాఖ అధికారులకు దఖలు పరుస్తారు. ఐటీ అధికారులు కొన్ని విధానాల్ని పాటిస్తారు. ఖాతాలు, ఆదాయపు పన్ను రిటర్న్‌లను సమర్పిచాలంటూ సంబంధిత వ్యక్తుల్ని ఐటీ శాఖ కోరుతుంది. అలా సమర్పించిన ఖాతాలను పరిశీలించి.. అవి లెక్కలోని మొత్తాలేనా కాదా? అని సరిచూస్తారు. కాదని తేలితే.. ఆ మొత్తాన్ని లెక్కచూపని ఆదాయంగా పరిగణించి.. 30% పన్ను విధిస్తారు. ఒకవేళ పన్ను చెల్లించకపోతే ఆ మొత్తాన్ని ట్రెజరీలో జమచేస్తారు. పన్ను చెల్లించాక.. సంబంధిత వ్యక్తులకు మిగతా మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు.

ఏం జరుగుతోంది? 
ఎన్నికల కోసం చేస్తున్న ఖర్చులో పట్టుబడుతున్న డబ్బు ఒకశాతం కూడా ఉండట్లేదు. డబ్బు పంపిణీని పోలీసులు అడ్డుకోలేకపోతున్నారు. ఒకవేళ నేతలు డబ్బుతో దొరికినా తెలివిగా తప్పించుకుంటున్నారు. పోలీసుల తనిఖీల్లో డబ్బు దొరికినప్పుడు దానికి సంబంధించి రసీదులు చూపిస్తే వదిలేస్తారు. నాయకులు దీన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. డబ్బు పట్టుబడినపుడు అప్పటికప్పుడే ఏదో రసీదు పుట్టిస్తున్నారు. ఆస్తి అమ్మినట్లు స్టాంపు పేపర్‌మీద నోట్‌ రాసి, దానికి సంబంధించిన అడ్వాన్సు డబ్బే ఇది అని పోలీసులను బురిడీ కొట్టిస్తున్నారు. ఆధారం ఉందని చెబుతూ ఉన్నతాధికారుల ద్వారా ఒత్తిడి తెచ్చి తప్పించుకుంటున్నారు. వాస్తవానికి ఆ డబ్బు ఓటర్లకు పంచడానికే అనే విషయాన్ని పోలీసులు రుజువు చేయాలి. తాము పట్టుకున్న డబ్బు ఎవరిది, ఆ వ్యక్తి ఎవరి మనిషి, డబ్బు ఎక్కడ్నుంచి తీసుకువెళుతున్నారు? ఎవరి కోసం తీసుకువెళుతున్నారు? ఏ బ్యాంకు నుంచి తెచ్చారు?.. తదితర విషయాలన్నింటిపై దర్యాప్తు చేయాలి. ఆ డబ్బు ఏ ఉద్దేశంతో తీసుకెళుతున్నారో ఆధారాలతో సహా నిరూపిస్తే సంబంధిత వ్యక్తులకు శిక్ష పడుతుంది. కానీ పోలీసులు డబ్బు పట్టుకోవడంలో చూపుతున్న శ్రద్ధ దర్యాప్తులో చూపడంలేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.