close

ప్ర‌త్యేక క‌థ‌నం

విపక్షాల బలహీనతే మోదీకి అస్త్రం 

దళితులు, మైనారిటీలు ఆగ్రహంగా ఉన్నారు 
భారీ హామీలు తీర్చలేకే భారీ విగ్రహాలు 
భాజపా బలం తగ్గడం తథ్యం 
వామపక్షాల ఆలోచనలు వెనకబడ్డాయి 
సమస్యలను వదిలేసి రాహుల్‌ గుళ్లకు ఎందుకు వెళ్తున్నారో అర్థం కాదు 
ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహతో ఈనాడు ప్రత్యేక ముఖాముఖి 
ఎం.ఎల్‌.నరసింహారెడ్డి 
ఈనాడు - హైదరాబాద్‌

విపక్షాల బలహీనతే మోదీకి అస్త్రం 

‘‘నరేంద్ర మోదీ సారథ్యంలో గత ఎన్నికల్లో భాజపా భారీ హామీలు ఇచ్చింది. కానీ చేసిందేమీ లేదు. దీంతో తన ప్రభుత్వం చేసిన మంచి పనులేవీ చెప్పుకొనే అవకాశం లేకే.. దేశంలో ఎన్నికలను ‘అధ్యక్ష తరహా ఎన్నికల్లా’ ప్రచారానికి పూనుకుంటోంది. అయితే విపక్షంలో విశ్వాసం కలిగిన సమర్థ నాయకుడు ఎవరూ లేకపోవటంతో ‘వారి కంటే నేనే మేలు కదా’ అని చెప్పుకొంటూ మోదీ ఓట్లు అడిగే పరిస్థితి నెలకొంది’’అని ప్రముఖ చరిత్రకారుడు, సామాజిక విశ్లేషకుడు రామచంద్ర గుహ అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో గతంలో కంటే భాజపాకు సీట్లు తగ్గుతాయని, అయితే ఎన్ని తగ్గుతాయన్నది ఇప్పుడే అంచనా వేయటం కష్టమని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీ మార్గం ఇప్పటికీ అనుసరణీయమేననీ, భారతదేశం ఆయనను విస్మరించినా ప్రపంచం ఆయనను అక్కున చేర్చుకొంటుందని, బుద్ధుని విషయంలో అదే జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఎన్నికల వ్యయం, నేరమయ రాజకీయాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ, సామాజిక పరిస్థితులపై ‘ఈనాడు’కు ఆయన ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖి..

మనం ఏ లక్ష్యాల కోసం పోరాడి, స్వతంత్రం తెచ్చుకున్నామో.. ఆ లక్ష్యాలను సాధించే దిశగానే ప్రయాణిస్తున్నామంటారా? భారత స్వాతంత్రోద్యమ్యం గురించి అధ్యయనం చేసిన మేధావిగా మీ అభిప్రాయం ఏమిటి? 
భారత్‌ అనేది చాలా పెద్ద దేశం. ఇక్కడ ఎంతో భిన్నత్వం ఉంది. కాబట్టి ఈ దేశం పురోగమించే వేగం కూడా అంతా ఒకే రకంగా ఉండదు. గత కొన్ని దశాబ్దాలనే తీసుకుంటే కొన్నికొన్ని రంగాల్లో ఎంతో ప్రగతి సాధించాం. కొన్ని విషయాల్లో తిరోగమించాం కూడా! కీలకమైన విషయం ఏమంటే నెమ్మదిగా కులం, వృత్తుల మధ్య లంకె తెగి.. కులవృత్తులకు దూరం జరగటం కనిపిస్తోంది. దళితులు చదువుకొని ఉపాధ్యాయులుగా, ఇంజినీర్లుగా వృత్తులు చేపడుతున్నారు. దళిత ఉద్యమం సంఘటితమవుతోంది. ఇవి మనకు కనిపిస్తున్న, మంచి ప్రజాస్వామిక పరిణామాలు. అయితే మరోవైపు మన వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. పరిపాలన, న్యాయ విభాగాల పైన ఒత్తిడి పెరుగుతోంది. మతాల పరంగా సమాజంలో సమీకరణలు, ఏకీకరణలు జరుగుతుండటం ప్రమాదకరంగా కనిపిస్తోంది. మొత్తం మీద స్వతంత్రానికి పూర్వంతో పోలిస్తే చాలా రంగాల్లో కచ్చితంగా సామాజిక ప్రగతి ఉంది. చారిత్రకంగా ఎంతో సామాజిక వివక్ష ఎదుర్కొన్న దళితులు, మహిళలకు ఇప్పుడు ఓటు హక్కులున్నాయి, వారి పరిస్థితి ఎంతో మెరుగైంది. ఎన్నో చారిత్రక, సాంస్కృతిక, సామాజిక కార్యాచరణ తర్వాత సాధికారత, ఆర్థిక ప్రగతి కనబడుతున్నా.. కొన్ని ఆందోళనకరమైన పరిణామాలూ లేకపోలేదు. అంతా మంచే జరిగిందనో, లేక జరిగిందంతా చెడ్డేననో తేల్చేయటం సరికాదు. మోదీ అంతా అద్భుతాలే చేశానని చెబితే.. రాహుల్‌గాంధీ జరిగిందంతా పనికిమాలినదే, మనం వెనక్కిపోతున్నామని చెప్పొచ్చు. చరిత్రకారులు జరిగిన వాస్తవ పరిస్థితులను మదింపు చేయటం కీలకం. ఇప్పుడు చూస్తే ఉత్తరాదిలో, ఈశాన్య భారతంలో తీవ్రమైన సామాజిక వెనుకబాటుతనం కనబడుతోంది. దక్షిణాది కొంత మెరుగ్గా ఉంది. మహిళలు, కింది కులాల వారి పరిస్థితి మెరుగైంది. ఇక్కడ మత ఘర్షణలు తక్కువ. కాబట్టి దేశమంతా ఒకేలా పురోగమించ లేదన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి.

విపక్షాల బలహీనతే మోదీకి అస్త్రం 

నేడు ఎన్నికల రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. ఇలా జరుగుతుందని రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉంటారంటారా? 
లేనేలేదు! రాజకీయాల్లో నేర స్వభావం, ధన ప్రభావం ఇంతలా పెరిగిపోతాయని వాళ్లు ఎన్నడూ ఊహించి ఉండరు. నిజానికి సిద్ధాంత పరంగా మనం ఎంతో ముందున్నాం. ఎన్నో పాశ్చాత్యదేశాల కంటే కూడా ముందే మనం ‘ఒక వ్యక్తికి ఒక ఓటు’ అన్నాం. కానీ ఆచరణలోకి వచ్చేసరికి చాలా అవకరాలు చోటుచేసుకున్నాయి. ప్రచారం ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం దీన్నింకా చీకటి వ్యవహారం చేసేసింది. ధనం, నేర చరితలు మన ప్రజాస్వామ్యంలో అంతర్భాగం కావటం ఆందోళన కలిగిస్తోంది. అంబేడ్కర్‌, నెహ్రూ, పటేల్‌ వంటివారెవరూ పరిస్థితులిలా మారతాయని ఊహించి ఉండరు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా, అవినీతి మయం చేసేలా ఎన్నికలు ఉంటున్నాయి. అయినాగానీ ఇప్పటికీ ప్రజాస్వామ్యానికి చోటు లేకపోలేదు. ప్రత్యర్థికంటే పెద్దగా డబ్బు పెట్టకుండానే దిల్లీలో ఆప్‌ అధికారంలోకి రావడమే దీనికి ఉదాహరణ. మనం వద్దనుకొంటే వాళ్లను ఒక్క ఓటు వేసి ఇంటికి పంపేయొచ్చు. ఎన్నికల ప్రచారం, ఖర్చులపై పారదర్శకత కోసం బెంగళూరుకు చెందిన ‘అసోషియన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రైట్స్‌ (ఏడిఆర్‌)’ ఎన్నో సూచనలు చేసింది, గానీ ఎన్నికల సంఘం వాటిని పట్టించుకోలేదు. భారీ ఎత్తున డబ్బు అవసరమైన రాజకీయాల్లో నైతిక విలువలు తేవటం క్లిష్టమైన పని. ఎన్నికల సంస్కరణలు రావాలని అందరూ అంటారుగానీ వీటిపై రాజకీయ పార్టీలకు ఆసక్తి లేదు.

భాజపా ప్రభుత్వం దేశంలోని ఉన్నత సంస్థలను నిర్వీర్యం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉంటుంది? 
చాలా తీవ్రంగా ఉంటుంది. ఒక సంస్థను నిర్మించాలంటే ఎన్నో ఏళ్లు పడుతుంది. కానీ ఆరు నెలల్లోనే ధ్వంసం చేసెయ్యొచ్చు. ఇలా సంవత్సరాల తరబడి, అనేక మంది కష్టపడి నిర్మించిన సంస్థలను ఇటీవలి కాలంలో ధ్వంసం చేశారు. 80 సంవత్సరాల చరిత్రగల రిజర్వుబ్యాంకును చూడండి. ఎంతో మంది ఉన్నతులు గవర్నర్లుగా పనిచేసి దాన్ని నిర్మించారు. ఇప్పుడు బాగు చెయ్యాలంటే చాలాఏళ్లు పడుతుంది. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంగానీ, దిల్లీలోని జేఎన్‌యూగానీ.. ఇవి చాలా మంచి సంస్థలు, వీటికోసం ఎంతోమంది కృషి చేశారు. వీటికిప్పుడు తీవ్ర నష్టం కలిగించారు. ఇవి మళ్లీ కోలుకోవడం చాలా కష్టం.

విపక్షాల బలహీనతే మోదీకి అస్త్రం 

వామపక్ష పార్టీల పరిస్థితి ఎలా ఉంది? 
దేశంలో వామపక్షాల ప్రభావం తగ్గు ముఖం పట్టింది. దీనికి వారి సొంత పొరపాట్లే కారణం. 2004లో ఎక్కువ మంది ఎంపీలున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో చేరి ఉండాల్సింది. వారు అవినీతిపరులు కాదు. మతోన్మాదులు కాదు. కానీ వారి వెనకబడిన ఆలోచనలే నష్టం చేస్తున్నాయి. ఇంకా లెనిన్‌ను పట్టుకునే ఉంటే ఏం ప్రయోజనం. భారతదేశంలోని ప్రస్తుత పరిస్థితులకు ఏమాత్రం సంబంధం లేదు కదా. వారి విధానాలు యువతను ఆకర్షించలేకపోతున్నాయి.

2019లో దళితులు, మైనారిటీల ఓటింగ్‌ సరళి ఎలా ఉండొచ్చు? 
దళితులు, మైనారిటీలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఎన్నికలు ఎంత స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతాయో చూడాలి. 2014లో దళితులు పెద్ద ఎత్తున భాజపాకు ఓట్లు వేశారు. ఇప్పుడు దళితులు, మైనారిటీలతో పాటు రైతులు కూడా కోపంగా, భాజపాకు వ్యతిరేకంగా ఉన్నారు. అయితే వీరి ఓటింగ్‌ శాతం ఎలా ఉంటుందో చూడాలి. కొన్ని సందర్భాల్లో కోపంగా ఉన్నా ఓటింగ్‌కు పోకుండా ఇంట్లోనే కూర్చునే పరిస్థితులు ఉంటున్నాయి. కొన్నిచోట్ల మైనారిటీల ఓట్ల నమోదులో లోపాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి.

2014 నుంచి దేశ రాజకీయాలు మోదీ చుట్టే తిరుగుతున్నాయి. రాజకీయాలు క్రమంగా మోదీ అనుకూల-వ్యతిరేక వర్గాలుగా విడిపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో భాజపాకు మోదీనే ప్రధాన అస్త్రం కానున్నారా? 
గతంలో ఇందిరాగాంధీకి అనుకూలం, వ్యతిరేక వర్గాలున్నట్టే ఇప్పుడూ! కొంతమంది మోదీ మంచి చేస్తున్నారంటే మరికొందరు దుర్మార్గంగా ఉందంటున్నారు. ఒకటి మాత్రం వాస్తవం. ఈ ప్రభుత్వం చాలా అభద్రతా భావంతో ఉంది. సర్దార్‌ పటేల్‌ విగ్రహమే దీనికి మంచి ఉదాహరణ. ఈ విగ్రహం దేశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం. ఆడ్వాణీ నరేంద్ర మోదీ గురించి చెప్పినట్లు ఇది మరో ‘ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌’. ప్రభుత్వానికి వేరే మాట్లాడటానికి లేదు. ఉపాధి, ఆర్థిక పురోగతి వంటివేం లేవు. పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి ఏమీ సాధించలేనప్పుడే పెద్ద విగ్రహాల్లాంటి వాటి మీద ఆధారపడాల్సి వస్తుంది. వివిధ రంగాల్లో మోదీ విఫలమయ్యారు. కానీ కలిసి కట్టుగా లేని విపక్షం, రాహుల్‌కి జనాకర్షణ లేకపోవడం వంటివి మోదీకి అనుకూలిస్తున్నాయి. దీన్ని పూర్తిగా వినియోగించుకొంటారు. మన ఎన్నికలను అధ్యక్ష తరహా ఎన్నికల్లా ప్రచారంలోకి తీసుకెళ్తారు. ఎన్నికలు తను సాధించిన పురోగతిపైన జరిగేలా చూడరు. చూడలేరు. తాను రాహుల్‌గాంధీ కంటే మెరుగని ప్రచారం చేసుకొంటారు. విపక్షానికి సమర్థ నాయకుడు లేకపోవడాన్ని మోదీ సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తారు.

విపక్షాల బలహీనతే మోదీకి అస్త్రం 

దేశంలో ఇప్పుడు ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు నెలకొన్నాయని కొందరు విమర్శిస్తున్నారు. నిజమేనంటారా? 
దీన్ని నేను అస్సలు అంగీకరించను. పరిస్థితి దారుణంగా ఉన్న మాట వాస్తవమేగానీ దాన్ని ఎక్కువ చేసి చూపటం సరికాదు. దానివల్ల విషయం పక్కదారి పడుతుంది. ఎమర్జెన్సీ రోజులను నేనూ చూశా. ఇందిర హయాంలో ఒక్క తమిళనాడు తప్పించి మిగిలిన దేశమంతా వాళ్ల నియంత్రణలో ఉంది. కానీ ప్రస్తుతం ఎక్కువ రాష్ట్రాలు భాజపా అధీనంలో లేవు. దక్షిణాది రాష్ట్రాలు చాలా లేవు. పంజాబ్‌, కొన్ని ఈశాన్య రాష్ట్రాలు లేవు. ఈ ఎన్నికల తర్వాత రాజస్థాన్‌ ఉండకపోవచ్చు. అలాగే ఎమర్జెన్సీ రోజుల్లో ఇప్పుడున్నట్టు సామాజిక మాధ్యమాలు లేవు. మీడియా అంతా ప్రభుత్వ నియంత్రణలోనే ఉండేది. కాబట్టి ఇప్పుడు ఎమర్జెన్సీ తలపిస్తోందనటం సరికాదు. అయితే పరిస్థితి దారుణంగా ఉన్న మాట వాస్తవం. మోదీ, షాలు ఇందిరాగాంధీ, సంజయ్‌ గాంధీలతో సమానంగా ప్రమాదకరం. వీరికి ఎలాగైనా అధికారం కావాలి. దానికి తోడు నియంతృత్వ పోకడలున్నవారు. అందుకే సంస్థలను నిర్వీర్యం చేయడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం వంటి పనులకు పాల్పడుతున్నారు. అయితే భారత ప్రజాస్వామ్యం ఎప్పుడూ కూడా పురోగమనంలోనే ఉంటుంది. ప్రజలు తేలికగా తలవంచరు.

ఇటీవల దేశంలో ‘అసహనం’ పెరిగిపోతోందని ఆందోళనలు వినపడుతున్నాయి. మరోవైపు సహనమన్నది భారత సమాజంలో ఎప్పుడూ ఉందనే వాదనాఉంది. చరిత్రకారుడిగా దీంతో అంగీకరిస్తారా? 
నేను ఒప్పుకోను. మనది సహనం గల సమాజమే అయితే దళితులు, మహిళలు ఎలా వివక్షకు గురవుతారు? సైద్ధాంతికంగా సహన భావనలు ఉన్న మాట నిజమే. కానీ దైనందిన సామాజిక జీవితాన్ని చూస్తే సహనం ఎక్కడ కనబడుతుంది? దళితులు బ్రాహ్మణుల బావి నుంచి నీళ్లు తీసుకువెళ్లే పరిస్థితి లేదు. శూద్రుడు పూజారి అయ్యే పరిస్థితి లేదు. ఒక మహిళ కుటుంబ పెద్ద కాలేదు. రోజువారీ సామాజిక జీవనంలో ఇంత తీవ్రమైన అసహనం ఉంది. దీన్ని సవరించేందుకు రాజ్యాంగం ప్రయత్నిస్తోంది. కొందరు మాట్లాడుతున్నట్లు దేశంలో సహనం, వివక్షలకు సంబంధించి ఘన చరిత్ర ఎప్పుడూ లేదు.

విపక్షాల బలహీనతే మోదీకి అస్త్రం 

చరిత్రకారులపైన ప్రత్యేకించి అభ్యుదయ భావాలు కలిగిన చరిత్ర కారులపై దాడులు పెరిగాయన్న దాంతో మీరు ఏకీభవిస్తారా? 
చరిత్రకారులే కాదు. స్వతంత్రంగా ఓ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అందరిపైనా దాడులు జరుగుతున్నాయి. ఆర్థికవేత్తలు, పాత్రికేయులు, కళాకారులు.. ఇలా అన్ని రంగాల వారిపైనా దాడులు జరుగుతున్నాయి. ఈ సంస్కృతి తెచ్చింది వాజపేయీ భాజపా కాదు.. అమిత్‌ షా భాజపా. వాజపేయీ భాజపాలో గూండాలకు చోటు, వీధుల్లో హింస ఉండేది కాదు. ప్రస్తుతం ప్రజాస్వామిక వాతావారణానికి తీవ్రంగా నష్టం కలిగిస్తున్నారు.

రాహుల్‌ ఇటీవల దేవాలయాలు సందర్శిస్తున్నారు. భాజపా తరహా హిందూత్వ రాజకీయాలను ఎదుర్కొనేందుకే ఇలా చేస్తున్నారంటారా? 
రాహుల్‌ ఈ పని ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదు. దేశంలో ఆర్థిక వృద్ధి లేదు. ఉద్యోగాల్లేవు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది. మహిళల సమస్యలున్నాయి. వీటిని అంశాలుగా చేసుకోవాల్సి ఉన్నా, ఇవన్నీ వదిలేసి అలా ఎందుకు చేస్తున్నారన్నది ప్రశ్నార్థకమే.

2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండొచ్చని భావిస్తున్నారు? 
అంచనా వేయడం అసాధ్యం. అయితే భాజపాకు గతంలో వచ్చినట్లుగా 282 అయితే రావు. తగ్గుతాయి. ఎన్ని తగ్గుతాయో చెప్పలేం. వారి భాగస్వామ్య పార్టీలకు 50 వస్తాయో 100 వస్తాయో చూడాలి. మాయావతి పార్టీని ముక్కలు చేయడం లేక తమవైపు తిప్పుకోవడం ఎలా అని భాజపా ఆలోచిస్తుంది. అఖిలేష్‌తో మాయావతి చేతులు కలిపితే భాజపాకు 30-40 సీట్లకు మించి రావు. ఉత్తర్‌ప్రదేశ్‌ కీలకమైంది. అక్కడ భాజపాకు గతంలో కంటే తక్కువ వస్తాయన్నది కచ్చితంగా చెప్పగలం, ఎన్ని తక్కువ అన్నదే చెప్పలేం.

విపక్షాల బలహీనతే మోదీకి అస్త్రం 

గాంధీ మహాత్ముడి 150వ జయంతి జరుపుకొంటున్నాం. కానీ వాస్తవంలో గాంధీ విలువల నుంచి పక్కకు జరిగినట్లు గుర్తిస్తున్నాం. దీన్నెలా అర్థం చేసుకోవాలి? 
గాంధేయ విలువలకు దూరం జరుగుతున్న మాట వాస్తవమే. కానీ గాంధీ ప్రపంచానికి చెందిన వారు. భారతదేశం కాదనుకొన్నా ప్రపంచం ఆయన్ను అక్కున చేర్చుకొంది. గతంలో బుద్ధుని విషయంలోనూ ఇదే జరిగింది. మనం కాదనుకొన్నా ప్రపంచం ఆయన్ను స్వీకరించింది. గాంధీజీ చెప్పినవి ఇప్పటికీ అనుసరణీయమే. ఆయన వ్యక్తిత్వం, ఆలోచనలు ప్రపంచానికి ఆదర్శం. ఇందులో అహింస ప్రధానమైంది. అన్యాయం జరిగితే అహింసా మార్గంలో పోరాడాలి తప్ప తుపాకీతో కాదు. భిన్న మతాల మధ్య సామరస్యమూ కీలకమే. భారతదేశంలో హిందూ-ముస్లింలు.. పాలస్థీనాలో యూదులు-ముస్లింలు.. అమెరికాలో క్రైస్తవులు-ముస్లింలు.. ఇలా మతాల మధ్య సామరస్యం అన్నది ఇప్పుడు ఎంతో అవసరం. గాంధీ దళితులు, మహిళలకు సమాన హక్కుల కోసం పోరాడారు. వినిమయ సంస్కృతి పెరుగుతుండటం వల్ల పర్యావరణ విధ్వంసం తప్పదని అప్పుడే హెచ్చరించారు. ప్రజాజీవితంలో పారదర్శకత ఉండాలన్నారు. ఆయన జీవితం తెరిచిన పుస్తకం. గాంధీని ఎవరైనా నేరుగా వెళ్లి ప్రశ్నించొచ్చు. కానీ ఇప్పటి నేతలు చూడండి. ప్రధాని మోదీ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లకు కూడా దూరంగా ఉంటారు. అందుకే గాంధేయ విలువల అవసరం నేడే ఎక్కువగా ఉంది. ఆ విషయాన్ని మనం విస్మరిస్తున్నా.. ప్రపంచం ఆయన విలువను గుర్తిస్తూనే ఉంది.

అంబేడ్కర్‌ ‘ఒక వ్యక్తికి ఒక ఓటు’ గురించి చెప్పారు. కానీ ‘ఒక ఓటు ఒకటే విలువ’ అన్నది మనం ఎప్పుడు సాధిస్తాం? 
దేశంలో ఇప్పుడు ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు నెలకొన్నాయంటే నేను అస్సలు అంగీకరించను 
మన చరిత్ర చాలా సంక్లిష్లమైంది, విభజనాత్మకమైనది. అది మనం పాత తప్పులు మళ్లీ చేయకుండా ఉపయోగపడుతుంది. భవిష్యత్తు నిర్మాణం కోసం మనం చరిత్ర కంటే కూడా మనం రాజ్యాంగం ఉద్బోధిస్తున్న ప్రజాస్వామ్యం, సమానత్వం, సౌభ్రాతృత్వమనే ఉమ్మడి విలువలను ఆధారం చేసుకోవటం ముఖ్యం. మన రాజకీయాలను, సామాజిక జీవితాలను మనం పురాతన చరిత్రలు, పురాణాల ఆధారంగా కాదు.. రాజ్యాంగంలోని విలువల ఆధారంగా నిర్మించుకోవటం ముఖ్యం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.