close

ప్ర‌త్యేక క‌థ‌నం

స్వైన్‌ఫ్లూ పంజా 

రోదసిలోకి ముగ్గురు భారత వ్యోమగాములు 
  సీఆర్‌జడ్‌ నిబంధనల సరళీకరణ 
  పిల్లలను లైంగికంగా వేధిస్తే మరణ శిక్షే 
  కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు 
ఈనాడు - దిల్లీ

భారత అంతరిక్ష ప్రస్థానంలో మరో ప్రతిష్ఠాత్మక దశ మొదలవుతోంది. భారత వ్యోమగాములను రోదసిలోకి పంపే మానవసహిత అంతరిక్ష యాత్రకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. ‘గగన్‌యాన్‌’ పేరుతో చేపట్టబోయే ఈ యాత్ర కోసం రూ.10వేల కోట్లను కేటాయించింది. ఈ ప్రాజెక్టు కింద 2022 నాటికి ముగ్గురు భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. వారు ఏడు రోజుల పాటు రోదసిలో గడుపుతారని చెప్పారు.

సీఆర్‌జడ్‌ నిబంధనల సరళీకరణ 
సాగర తీరంలో అభివృద్ధి మరింతగా పుంజుకోనుంది. ఎకో-టూరిజాన్ని ప్రోత్సహించడంతో పాటు, స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు వీలు కలిగించేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సరళీకరించింది. సముద్రానికి మరికొంత దగ్గర్లో నిర్మాణ పనులు చేపట్టే అవకాశం కలిగించింది. ఈ మేరకు తీరప్రాంత నియంత్రణ మండలం (సీఆర్‌జడ్‌)-2018 నోటిఫికేషన్‌కు శుక్రవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

ఎఫ్‌ఎస్‌ఐపై పరిమితుల ఎత్తివేత 
సీఆర్‌జడ్‌-2 (పట్టణ) ప్రాంతాల్లో ఫ్లోర్‌స్పేస్‌ ఇండెక్స్‌ (ఎఫ్‌ఎస్‌ఐ), ఫ్లోర్‌ ఏరియా రేషియో (ఎఫ్‌ఏఆర్‌)పై ఇంతవరకు ఉన్న పరిమితులను ఎత్తేస్తారు. అవసరాలకు తగ్గట్టుగా కొత్త నిబంధనల ప్రకారం అనుమతిస్తారు.

గ్రామీణ ప్రాంతాల్లో వెసులుబాటు: సీఆర్‌జడ్‌-3 (గ్రామీణ) ప్రాంతాలను ఇప్పుడు రెండు ప్రత్యేక కేటగిరీలుగా వర్గీకరించారు. సీఆర్‌జడ్‌-3ఏ కేటగిరీలోకి చదరపు కిలోమీటరుకు 2161 జనసాంద్ర]త ఉన్న గ్రామీణ ప్రాంతాలను తీసుకొస్తారు. ఈ ప్రాంతాల్లో గరిష్ఠ అలల తాకిడి నుంచి 200 మీటర్ల వరకు నో డెవలప్‌మెంట్‌ జోన్‌గా గతంలో గుర్తించగా దాన్ని ఇప్పుడు 50మీటర్లకు తగ్గించారు. సీఆర్‌జడ్‌-3బీ కేటగిరీలో 2161 కంటే తక్కువ జన సాంద్రత ఉన్న ప్రాంతాలను దీని పరిధిలోకి వస్తాయి. ఇక్కడ పాత నిబంధనల ప్రకారం 200 మీటర్ల వరకు అభివృద్ధి పనులు చేపట్టడానికి వీల్లేని నో డెవలప్‌మెంట్‌ జోన్‌ కొనసాగుతుంది.

పర్యాటకానికి ప్రోత్సాహకాలు: బీచ్‌ల్లో పర్యాటక రంగం ప్రోత్సాహానికి అనువైన తాత్కాలిక మౌలికవసతులు అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

అనుమతుల సరళీకరణ 
సీఆర్‌జడ్‌-1 (పర్యావరణ సున్నితమైన ప్రాంతాలు), సీఆర్‌జడ్‌-4 (సముద్రంలో 12 నాటికల్‌ మైళ్లు మధ్య ఉన్న ప్రాంతం)లో చేపట్టే ప్రాజెక్టుల అనుమతులను మాత్రమే కేంద్ర పర్యావరణ, అటవీశాఖ పరిశీలిస్తుంది. సీఆర్‌జడ్‌2, 3 పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో చేపట్టే పనుల అనుమతుల మంజూరు అధికారాన్ని రాష్ట్రాలకే అప్పగించారు. పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతాల సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చారు. సీఆర్‌జడ్‌-1బీ ప్రాంతాల్లో కాలుష్య శుద్ధి సౌకర్యాల ఏర్పాటుకు అవకాశం కల్పించారు.

ఎండుకొబ్బరి మద్దతు ధర పెంపు 
ఎండు కొబ్బరి మద్దతు ధర ప్రస్తుతం క్వింటాలుకు రూ.7,511 ఉండగా, 2019 సీజన్‌నాటికి రూ.9,521కి పెంచింది. కురిడీ కొబ్బరి (బాల్‌ కోప్రా) ధరను రూ.7750 నుంచి రూ.9,920కి పెంచింది.

వైద్య రంగంపై రెండు బిల్లులు 
జాతీయ హోమియోపతి కమిషన్‌ బిల్లు-2018కి కేబినెట్‌ సమ్మతి తెలిపింది. ఇప్పుడున్న సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోమియోపతి స్థానంలో ఈ కొత్త వ్యవస్థ వస్తుంది. దీని కింద మూడు స్వతంత్ర ప్రతిపత్తిగల పాలకమండళ్లు ఏర్పడుతాయి. భారతీయ వైద్య విధానాల జాతీయ కమిషన్‌ (ఎన్‌సీఐఎం) బిల్లు-2018కీ ఆమోదం తెలిపింది. ఆయుర్వేద, యునానీ, సిద్ధ, సోవా రిగ్పా (టిబెట్‌ వైద్యం) వైద్య విద్యల పర్యవేక్షణ కోసం జాతీయ కమిషన్‌, దాని ఆధ్వర్యంలో నాలుగు స్వతంత్ర ప్రతిపత్తిగల పాలకమండళ్లు ఏర్పాటవుతాయి. 


లైంగిక దాడుల నుంచి బాలలకు రక్షణ కవచం

లైంగిక దాడుల నుంచి బాలలకు రక్షణ (పోక్సో) చట్టం 2012లోని సెక్షన్‌ 4, 5, 6, 9, 14, 15, 42లకు మంత్రివర్గం సవరణలు ప్రతిపాదించింది. పిల్లలపై హేయమైన లైంగికదాడికి పాల్పడినవారికి మరణశిక్షతో సహా కఠినమైన శిక్షలు విధించేలా సెక్షన్‌ 4, 5, 6లకు సవరణలు చేసింది. పిల్లల కృత్రిమ ఎదుగుదల కోసం హార్మోన్లు, ఇతర రసాయన ప్రయోగాలు జరిపేవారిని శిక్షించడానికి వీలుగా సెక్షన్‌ 9కి సవరణలు ప్రతిపాదించింది. పిల్లల నీలిచిత్రాల నియంత్రణకు సెక్షన్‌ 14, 15లకు సవరణలు ప్రతిపాదించింది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.