close

ప్ర‌త్యేక క‌థ‌నం

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఆశాజ్యోతి 

పదిహేనేళ్ల ప్రతిపక్ష పాత్ర.. 
నీరసించిన పార్టీ శ్రేణులు.. 
అగ్రనేతల మధ్య విభేదాలు.. 
సార్వత్రికం ముంగిట జీవన్మరణ పోరు..

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఆశాజ్యోతి 

ఇన్ని సమస్యల వలయంలో మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌కు ఆశా‘జ్యోతి’ ఆయన.. 
వృద్ధ నేతలను తోసిరాజని కీలకమైన పార్టీ ప్రచార కమిటీ సారథ్యాన్ని భుజాలకెత్తుకున్న ‘గ్వాలియర్‌ రాజు’ ఆయన.. ఆ యువనేతే జ్యోతిరాదిత్య సింధియా

ముఖ్యమంత్రి రేసులో..
ఈ దఫా రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలిస్తే.. ముఖ్యమంత్రి ఎవరన్న ఓ సర్వేలో కమల్‌నాథ్‌, దిగ్విజయ్‌ కన్నా ముందువరుసలో జ్యోతిరాదిత్య పేరే ఉంది. 
జ్యోతిరాదిత్య 2002, 04, 09, 14 ఎన్నికల్లో గుణ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా విజయం సాధించారు. 
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, జ్యోతిరాదిత్య సమవయస్కులు.. మంచి స్నేహితులు..

మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో మమేకమైన యువనేత.. హస్తానికి ఆధిక్యత వస్తే ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులోనూ ముందు వరుసలో ఉండబోయే యువ కెరటం.. 
తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పదవిని చేపట్టి..  ఆ తర్వాత తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న జ్యోతిరాదిత్య సింధియా.. 
ఓ వైపు సొంత పార్టీ సీనియర్‌ నేతలతో విభేదాలు.. వారసత్వ ‘రాజ’కీయాల ప్రతినిధంటూ భాజపా నుంచి తీవ్ర విమర్శలు.. బోలెడు సవాళ్లను అధిగమించి కాంగ్రెస్‌ను మధ్యప్రదేశ్‌ గట్టెక్కించగలిగితే నిజంగా ఆయన విజయజ్యోతిరాదిత్యుడే..

గ్వాలియర్‌ రాజకుటుంబ ప్రతినిధి అయిన జ్యోతిరాదిత్య సింధియా గుణ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014లో కాంగ్రెస్‌ జాతీయస్థాయిలో తీవ్ర ప్రజావ్యతిరేకతను చవిచూసినప్పటికీ ఆయన ఎంపీగా గెలుపొందారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీపై పట్టుసాధించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ ఏడాది మొదట్లో జరిగిన ముంగోళి, కొలారస్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల గెలుపు బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకున్న సింధియా ఆ రెండు చోట్ల పార్టీని విజయతీరాలకు చేర్చడంలో సఫలీకృతుడయ్యారు. పార్టీలో పట్టు సాధించేందుకు, పార్టీకి పట్టం కట్టేలా చూసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

కాంగ్రెస్‌ సీఎం సింధియా! 
ఇటీవల ఓ టీవీ చర్చా కార్యక్రమంలో సింధియా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటించడంతోనే పార్టీకి లాభిస్తుందని, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని అభిప్రాయపడ్డారు. అయితే, ‘ఆ ముగ్గురి’లో తనకే మార్కులు ఎక్కువగా ఉన్నాయనే భరోసాతోనే ఆయన ఈ వ్యాఖ్య చేశారని వినికిడి. ఓ మీడియా సంస్థ సర్వే ప్రకారం.. ‘మధ్యప్రదేశ్‌ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకుంటున్నారు?’ అన్న ప్రశ్నకు కమల్‌నాథ్‌, దిగ్విజయ్‌ల కంటే జ్యోతిరాదిత్యకే ఎక్కువ మద్దతు లభించింది. ఆ సర్వేలో 32 శాతం మంది యువనేతకు జై కొట్టగా, కేవలం 8 శాతం మంది కమల్‌నాథ్‌కు, 2 శాతం మంది మాత్రమే దిగ్విజయ్‌కి బాసటగా నిలిచారు. మరోవైపు ఇదే సర్వేలో చౌహాన్‌ 46 శాతం మంది మన్ననలు పొందడం కొసమెరుపు.

తండ్రి మరణంతో రాజకీయాల్లోకి 
1971, జనవరి 1న ముంబయిలో జ్యోతిరాదిత్య సింధియా జన్మించారు. తల్లిదండ్రులు మాధవరావు సింధియా, మాధవి రాజె సింధియా. తొలినాళ్లలో ముంబయిలో చదివిన ఆయన ఆ తర్వాత డెహ్రాడూన్‌లోని డూన్‌ స్కూల్‌లో విద్యను అభ్యసించారు. హార్వర్డ్‌ వర్సిటీలో పట్టభద్రుడైన జ్యోతిరాదిత్య స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీలో ఎంబీఏ పూర్తిచేశారు. న్యూయార్క్‌, హాంకాంగ్‌లలో వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు చేశారు. 2002లో తండ్రి మాధవరావు సింధియా మరణంతో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన గుణ పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో గెలిచారు. 2004, 09, 14 ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధించిన ఆయన మన్మోహన్‌ మంత్రి వర్గంలో వివిధ శాఖల సహాయ మంత్రిగానూ పనిచేశారు. రాహుల్‌గాంధీ చేతికి పార్టీ పగ్గాలు వచ్చాక యువనాయకత్వాన్ని ప్రోత్సహించే క్రమంలో జ్యోతిరాదిత్య ప్రాధాన్యం పెరిగింది. రాహుల్‌గాంధీకి ఆయన అత్యంత సన్నిహితుడు.

రాచరికం.. వారసత్వం.. 
రాజకుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య వారసత్వ రాజకీయాలకు చిరునామా అంటూ భాజపా నేతల నుంచి తరచూ విమర్శలను ఎదుర్కొంటున్నారు. ప్రధాని మోదీ సైతం సింధియా రాచరికంపై పలు సభల్లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే, ఆ విమర్శలను సమర్థంగా తిప్పికొట్టడంలో జ్యోతిరాదిత్య చురుగ్గా స్పందించడంలేదనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను గెలుపు తీరాలకు చేర్చడం జ్యోతిరాదిత్యకు నిజంగా పెద్ద పరీక్షే.

గ్వాలియర్‌ సంస్థానం నుంచి.. 

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఆశాజ్యోతి 

గ్వాలియర్‌ సంస్థానాన్ని ఏలిన మరాఠా హిందూ రాజవంశీయులే సింధియాలు. 
19, 20 శతాబ్దాల్లో ఈ సంస్థానం ఓ వెలుగు వెలిగింది. జ్యోతిరాదిత్య తాత, ముత్తాతలంతా ఈ సంస్థానం రాజులే. 
మాధవరావు సింధియా తండ్రి జివాజీరావు అధికారికంగా గ్వాలియర్‌ చివరి రాజు. 
జ్యోతిరాదిత్య సతీమణిదీ రాజకుటుంబమే. బరోడాలోని గైక్వాడ్‌ రాజకుటుంబానికి చెందిన ప్రియదర్శినిని ఆయన వివాహం చేసుకున్నారు. 
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఆశాజ్యోతి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక సింధియా రాజకుటుంబ పెద్దలంతా క్రమంగా రాజకీయ నాయకులుగా అవతరించారు. 
రాజమాత విజయరాజె సింధియా (మాధవరావు సింధియా తల్లి) తొలిసారిగా ఈ కుటుంబం నుంచి క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1962లో ఆమె కాంగ్రెస్‌ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత భాజపాలో చేరి శక్తిమంతమైన నాయకురాలిగా అవతరించారు. జ్యోతిరాదిత్యకు స్వయానా మేనత్తే ప్రస్తుత రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజె.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఆశాజ్యోతి బలాలు 
యువనాయకుడు, మంచి వాక్పటిమ 
ఉప ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి 
వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చినా ప్రజలతో మమేకం 
రాహుల్‌గాంధీతో మంచి చనువు

బలహీనతలు 
వృద్ధ నేతలతో సమన్వయంలో తడబాటు 
పార్టీ కార్యక్రమాల్లో ఒంటెత్తు పోకడలతో వెళ్తారనే విమర్శలు 
రాచరికం, వారసత్వం విమర్శలను సమర్థంగా తిప్పికొట్టడంలో విఫలం 
క్షేత్రస్థాయిలో చిన్న నేతల్ని పట్టించుకోరన్న విమర్శలు

 

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.