close

ప్ర‌త్యేక క‌థ‌నం

‘రెరా’.. రమ్మంటే రారా!   

గడువు ఇచ్చినా ముందుకు రాని స్థిరాస్తి వ్యాపారులు 
లేఅవుట్‌లూ రెరా కింద నమోదు చేసుకోవాల్సిందే 
నమోదు చేసుకోకుంటే చర్యలు తప్పవన్న అథారిటీ 
ఈనాడు - హైదరాబాద్‌ 

స్థిరాస్తి వ్యాపారమంటేనే లక్షలు, కోట్లలో వ్యవహారం.. మోసాలకు ఆలవాలం. ఇస్తానన్న సమయానికి ఫ్లాటును అప్పగించకపోవడం.. అవసరమైన సదుపాయాలతో ఇళ్లను నిర్మించకపోవడం.. భూ రికార్డుల్ని సవ్యంగా నిర్వహించకపోవడం.. తదితర కారణాల వల్ల నష్టపోతుండే సామాన్యులు ఎందరో! ఇలాంటి సమయంలో వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడానికి, స్థిరాస్తి వ్యాపారంలో అక్రమాలకు చెల్లు చీటీ కోసం తీసుకువచ్చిన చట్టం.. స్థిరాస్తి నియంత్రణ అథారిటీ (రెరా). ప్రతీ స్థిరాస్తి వ్యాపారీ, ఏజెంటు ఈ అథారిటీలో నమోదు చేసుకోవాలి. ప్రాజెక్టు ఎప్పటికి పూర్తిచేస్తారు.. ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు.. విలువ ఎంత.. అమ్మకపు ఒప్పందంలోని వివరాలు, భూ రికార్డులు తదితర వివరాలన్నీ ఈ అథారిటీ ముందు ఉంచాలి. ప్రభుత్వం ఏర్పరచిన నియమ నిబంధనలను పాటించాలి. ఇవన్నీ ఎవరు పడతారనుకుంటున్న వ్యాపారులు రెరా వద్ద నమోదుకు సిద్ధపడడంలేదు.

రాష్ట్రంలో వేలాదిగా భూములు, ఇళ్లు, ఫ్లాట్ల అమ్మకాలు సాగుతున్నాయి. ఇప్పటికే కొన్నివేల అపార్ట్‌మెంట్లు, ఇళ్ల నిర్మాణానికి అనుమతులు జారీ అయ్యాయి. కాని అనుమతి పొందిన ప్రాజెక్టుల్లో సగం కూడా రెరా వద్ద నమోదు చేయించుకోలేదు. మూడు నెలలు గడువు ఇచ్చినా వ్యాపారులెవరూ పట్టించుకోవడంలేదు. నవంబరు 30 గడువు ఇచ్చిన అథారిటీ దానిని మరికొన్ని రోజులు పొడిగించినా 2,400 మంది స్థిరాస్తి వ్యాపారులు, ఏజెంట్లు మాత్రం నమోదు చేసుకున్నారు. 2017 జనవరి 1 నుంచి అనుమతి పొందిన నిర్మాణాలు (8 ఫ్లాట్లు అంతకంటే ఎక్కువ) రెరా అథారిటీ వద్ద రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5,000 నిర్మాణాలు నమోదు కావాల్సి ఉందని రెరా అథారిటీ గుర్తించింది.

ఏమిటి కారణం? 
నమోదు చేసుకోకున్నా ఏమీ కాదనే ఉదాసీనతే అసలు కారణమని అధికారులు గుర్తించారు. నమోదుకు పలు నిబంధనలు పాటించాల్సి ఉండటంతో పాటు భూమి వివరాలు, ప్రాజెక్టు ఎప్పటిలోపు పూర్తి చేయాలి అనే అంశాలను స్పష్టం చేయాల్సి ఉంటుంది. అందుకే చాలామంది ముందుకు రావడంలేదని సమాచారం. రూ. 50,000 జరిమానాతో ఈనెల 15వ తేదీ వరకూ గడువు పొడిగించినా 40 మంది మాత్రమే స్పందించడం గమనార్హం.

లేఅవుట్‌లకూ నమోదు తప్పదు 
అపార్ట్‌మెంట్లే కాకుండా లేఅవుట్‌లు కూడా రెరా చట్టం పరిధిలోకి వస్తాయి. వాటిని కూడా రెరా చట్టం కింద నమోదు చేసుకోవాల్సి ఉండగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కటి కూడా నమోదు కాకపోవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా పలువురు వ్యాపారులు అనేక లేఅవుట్‌లు వేసి వందలు, వేల సంఖ్యలో ప్లాట్లను విక్రయిస్తున్నారు. వీటిలో అనేక అక్రమాలు సాగుతుండడంతో కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు. భూ రికార్డులు సక్రమంగా లేకపోవడం, లేఅవుట్‌లో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం సహా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. రెరాలో నమోదు వలన జవాబుదారీతనం పెరిగి కొనుగోలుదారులకు సమస్యలు తప్పే అవకాశం ఉన్నా స్థిరాస్తి వ్యాపారులు దీని జోలికి వెళ్లడంలేదు.

చర్యలు తప్పవంటున్న అథారిటీ 
స్థిరాస్తి నియంత్రణ అథారిటీ వద్ద ప్రాజెక్టులు విధిగా నమోదు చేసుకోవాల్సిందే అని అథారిటీ కార్యదర్శి, డీటీసీపీ విద్యాధర్‌ స్పష్టం చేశారు. భవన నిర్మాణాలకు పొందిన అనుమతుల వివరాలు తమ వద్ద ఉన్నాయని వాటి ఆధారంగా ఎవరెవరు నమోదు చేసుకోలేదో గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం నాలుగు ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తాయన్నారు. ఈనెల 15 వరకూ నమోదుకు గడువు ఉందన్నారు. అప్పటికీ నమోదు చేసుకోకుంటే ఇప్పుడున్న జరిమానా రూ. 50,000 మరింత పెరుగుతుందని వివరించారు. లేదంటే స్థిరాస్తి ప్రాజెక్టులో 10 శాతం వరకూ జరిమానా విధించే అవకాశం కూడా ఉందని తెలిపారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.