close

ప్ర‌త్యేక క‌థ‌నం

రాజకీయ మాంత్రికుడు!   

శరణార్థులకు సపర్యలు చేస్తూ ఇందిర దృష్టిని ఆకర్షించిన గహ్లోత్‌ 
విద్యార్థి నేతగా రాజకీయ జీవితం ఆరంభం 
రాజకీయ మాంత్రికుడు! 
 

రాజుల రాజ్యంలో పెళ్లి కొడుకు ఎవరో తేలిపోయింది! ‘గిల్లి బిల్లి’ మాంత్రికుడే రాష్ట్ర పగ్గాలు చేపట్టనున్నారు. అయితే... ముఖ్యమంత్రిగా ఆయన ఎంపిక మాత్రం అంత సులభంగా ఏమీ జరగలేదు. ఈ పదవి విషయంలో... పీసీసీ అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌ను కాదని చివరికి మాజీ ముఖ్యమంత్రి, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గహ్లోత్‌ వైపే కాంగ్రెస్‌ అధిష్ఠానం మొగ్గు చూపటం వెనక పెద్ద కథే ఉంది.
పెళ్లి కొడుకు లేకుండానే కాంగ్రెస్‌ పార్టీ బరాత్‌కు సిద్ధమైపోయింది. అసలు ఆ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు అవుతారో కూడా తెలియదు
- రాజస్థాన్‌ శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ విమర్శలు
స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచి రాజస్థాన్‌లో ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే సంప్రదాయం కాంగ్రెస్‌కు లేదు. రాహుల్‌గాంధీ ఏ బాధ్యతలు అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉన్నా...
- రాజ్‌నాథ్‌ విమర్శలను తిప్పికొడుతూ అశోక్‌ గహ్లోత్‌

67 ఏళ్ల గహ్లోత్‌కు ఇదేమీ కొత్త పదవి కాదు. తొలిసారిగా 1998లో, తదుపరి 2008లో చేపట్టిన ఆయన మళ్లీ ఇప్పుడు మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. సరిగ్గా పదేళ్లకోసారి ఆయన ఈ పదవిని అలంకరిస్తుండటం విశేషం. సామాన్య ఇంద్రజాలికుని కుటుంబంలో పుట్టిన ఆయన.. అంచెలంచెలుగా ఎదిగి రాజకీయ మాంత్రికునిగా పేరు తెచ్చుకున్నారు.

విద్యార్థి దశలోనే మహాత్మాగాంధీ బోధనలకు, రచనలకు ఆకర్షితుడైన ఆయన... 1971లో పశ్చిమ్‌ బెంగాల్‌లో పాకిస్థాన్‌ శరణార్థులకు సపర్యలు చేస్తూ నాటి ప్రధాని ఇందిర కంటికి చిక్కారు. ఆమె ప్రోత్సాహంతో కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం (ఎన్‌ఎస్‌యూఐ)లో చేరి గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడయ్యారు. తన తండ్రి వెంట గ్రామాల్లో తిరుగుతూ ఇంద్రజాల ప్రదర్శనలివ్వడంతో తోటివారంతా ఆయనను ‘గిల్లి బిల్లి’ అని సరదాగా పిలిచేవారు. రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజుల్లోనూ ఆయనకు అదే పేరుండేది. కానీ- మృదుస్వభావం, బీదాబిక్కితో కలిసిపోయే గుణం, అణకువ... కొద్దిరోజుల్లోనే ఆయనను ‘రాజస్థాన్‌ గాంధీ’గా మార్చేసింది.

ఇదీ ప్రస్థానం...

తోట‘మాలి’ సామాజికవర్గంలో పుట్టిన గహ్లోత్‌... సైన్స్‌ గ్రాడ్యుయేడ్‌. ఆర్థికశాస్త్రంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌తో పాటు న్యాయవిద్యను కూడా అభ్యసించారు. 1974-79 మధ్య ఎన్‌ఎస్‌యూఐ రాజస్థాన్‌ విభాగ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. 1979-82 మధ్య జోధ్‌పుర్‌ నగర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షునిగా పనిచేశారు. తర్వాత పీసీసీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1980లో తొలిగా పార్లమెంటులో అడుగిడిన ఆయన... ఆ తర్వాత నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1982-93 మధ్య కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. రాష్ట్ర రాజకీయాలపై మక్కువతో 1999లో సర్దార్‌పుర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అక్కడి నుంచే ఇప్పటివరకూ విధానసభకు ఎన్నికవుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే... నాలుగుసార్లు పీసీసీ అధ్యక్షునిగానూ పనిచేశారు. గత విధానసభ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలు కావడంతో ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారు. అప్పట్నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు.

చివరి నిమిషం మంత్రాంగం 
రాజస్థాన్‌ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న క్రమంలోనే గహ్లోత్‌ తన చతురతను ప్రదర్శించారు. సాధారణ మెజార్టీకి ఒక్క స్థానం తక్కువ పడుతోందని గ్రహించిన ఆయన... వెంటనే రంగంలోకి దిగారు. తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగి విజయం సాధించిన స్వతంత్రులను దారికి తెచ్చారు. ఫలితాలు పూర్తిగా వెలువడకముందే బల నిరూపణకు ఢోకా లేకుండా చూసుకున్నారు.

భాజపాకు ముచ్చెమటలు 
గుజరాత్‌ శాసనసభ ఎన్నికలకు కొద్ది నెలల ముందు... పార్టీ అధిష్ఠానం గహ్లోత్‌ను ఆ రాష్ట్ర బాధ్యునిగా నియమించింది. అక్కడ తన రాజకీయ చతురతను ప్రదర్శించిన ఆయన... ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో భాజపాకు వణకు పుట్టించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోయినా, తన వ్యూహ ప్రతివ్యూహాలతో కాషాయ పార్టీ నేతలకు సింహస్వప్నంగా మారారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల అనంతరం అక్కడ జేడీ(ఎస్‌), కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆవిష్కరింపజేయడంలోనూ ఆయన చాతుర్యం ప్రదర్శించారు.

ముందుంది మొసళ్ల పండుగ!

రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా సీనియర్‌ నేత అశోక్‌ గహ్లోత్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎంపిక చేసినా ఆయనకు మున్ముందు చిక్కుముళ్లు తప్పేలా లేవు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకోవాలంటే అవినీతి నిరోధక విభాగం సహా హోం శాఖను తప్పనిసరిగా తనకే ఇవ్వాలని, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగానూ కొనసాగించాలని యువనేత సచిన్‌ పైలట్‌ గట్టి షరతులు విధించారు. స్వయానా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఒత్తిడి తీసుకురావడంతో గహ్లోత్‌ వీటికి అంగీకరించారు. రాహుల్‌తో పాటు పైలట్‌తోనూ చర్చించాకే గహ్లోత్‌ తన మంత్రివర్గాన్ని కూర్చుకోవాల్సి ఉంటుంది. కేబినెట్‌ కూర్పులోనే కాకుండా డీజీపీ సహా సీనియర్‌ అధికారుల నియామకాల్లోనూ పైలట్‌కు తగిన విలువనివ్వాల్సి వస్తుంది. హోంశాఖలో పూర్తి స్వతంత్రత ఆయనకు లభిస్తుంది. గహ్లోత్‌ని సీఎంని చేయాలనేది రాహుల్‌ అభిమతం కాకపోయినా సోనియా, ప్రియాంకల మద్దతు ఆయనకు (గహ్లోత్‌కి) ఉండడంతో అన్ని షరతులకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇక ప్రభుత్వాన్ని నడపడంలో, అటు పార్టీ వ్యవహారాల్లో ఇద్దరూ అధికారాన్ని పంచుకోవాల్సిందే. అనేకమంది సీనియర్లు ఈసారి ఎన్నికల్లో నెగ్గినందున కేబినెట్‌ బెర్తుల నుంచి గహ్లోత్‌కు సవాళ్లు మొదలవుతాయి. ముఖ్యమంత్రి వైపు కొందరు మంత్రులు, ఉప ముఖ్యమంత్రి వైపు మరికొందరు ఉంటే పరిస్థితి సంక్లిష్టమేననేది స్పష్టమవుతోంది.
- జైపుర్‌ నుంచి ప్రకాశ్‌ భండారీ

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.