close

ప్ర‌త్యేక క‌థ‌నం

మత్స్యశాఖ కొత్తబాట   

కోల్‌కతా శాస్త్రవేత్తలతో శిక్షణ 
ఆరు జలాశయాల్లో ఇక ‘పైలట్‌’ పనులు 
వచ్చే జూన్‌ నుంచే ‘పెన్‌ కల్చర్‌’ అమలు 
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌ 

మీకృత మత్స్య అభివృద్ధి పథకం (ఐసీడీఎఫ్‌)లో భాగంగా తెలంగాణలో ‘పెన్‌ కల్చర్‌’కు ఆ శాఖ శ్రీకారం చుట్టనుంది. నూతన పద్ధతిలో చేపలను పెంచడంపై మత్స్యకారులకు శిక్షణ ఇచ్చేందుకు, సంబంధిత సిబ్బందిలో అవగాహన పెంచేందుకు కోల్‌కతా నుంచి శాస్త్రవేత్తలను రప్పించారు. అనుకూల వాతావరణం ఇప్పుడు ఎక్కడుందనే అంశంపై విస్తృత పరిశోధనలు సాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. నిపుణుల ఆధ్వర్యంలో ఇప్పటికే పదిహేను రిజర్వాయర్లను పరిశీలించి, చివరకు ఆరింటిని ఎంపిక చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

రూ.కోటితో ప్రతిపాదనలు 
ఇతర దేశాల్లో ఎక్కువగా కనిపించే పెన్‌ కల్చర్‌ మనదేశంలోని ఝూర్ఖండ్‌, అసోం, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనూ కొంతవరకు ఉంది. తడి నేలలు ఎక్కువగా ఉన్న ఆ ప్రాంతాల్లో అనేక ఆశాజనక ఫలితాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ వాతావరణం సైతం ఇందుకు చాలా అనుకూలిస్తుందని మత్స్యశాఖ చెబుతోంది. తొలుత ఆరు జలాశయాల్లోనూ ప్రయోగాత్మకం(పైలట్‌ ప్రాజెక్టు)గా ఈ సరికొత్త ప్రక్రియను మొదలుపెట్టేందుకు రూ.కోటి ఖర్చుచేయాలని సంకల్పించారు. నిధుల విడుదల కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు.

ప్రయోజనాలు అనేకం 
ఈ పద్ధతిలో ఎంపిక చేసిన చోట్ల చేపల పెంపకానికి ముందుకు వచ్చేవారికి 90శాతం రాయితీ ఇస్తారు. సర్వసాధారణంగా చేపలకు ఆహారం నిత్యమూ అందాల్సి ఉంటుంది. నూతన రీతిలో అవి జలాశయాల్లోనే ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. అవసరమైన సందర్భాల్లోనే బయటి నుంచి అందిస్తారు. చేపలను బాగా పెంచడంతో పాటు చేపపిల్లల ఉత్పత్తికీ ఇది ఎంతో ఉపయోగపడుతుందని కోల్‌కతా శాస్త్రవేత్తల్లో ఒకరైన డాక్టర్‌ బీకే ఝా (సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌) తెలిపారు. ఇందులో సాధారణ పెంపకానికి నాలుగు నుంచి పది రెట్లు ఎక్కువగా చేపల ఉత్పత్తి ఉంటుంది. దాదాపు 250 ఎకరాల్లో ‘పెన్‌ కల్చర్‌’ను అమలులోకి తేవచ్చు. హెక్టారుకు నాలుగు టన్నుల వరకు ఉత్పత్తి ఉండవచ్చని చెప్పారు.

‘పెన్‌ కల్చర్‌’ అంటే...

రిజర్వాయర్లు, పెద్దపెద్ద చెరువుల ప్రాంతాల్లో చేపలు ఎదిగేందుకు అనుకూలమైన చోట్ల పెన్‌ (కంచె) మాదిరి ఏర్పాటుచేస్తారు. వెదురు, చెక్కల సాయంతో నీటి అడుగు నుంచి వలలు నిర్మిస్తారు. ఇతర సామగ్రితోనూ వలయంలా రూపొందించి, ఆ పరిధిలోనే చేపలను పెంచుతారు.

తప్పక విస్తరిస్తాం 

జూన్‌లో ఎలాగైనా పెన్‌ కల్చర్‌ను ప్రారంభించి విస్తరణ పనులూ చేపడతాం. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో పైలట్‌ ప్రాజెక్టు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులు అన్నివిధాలా సానుకూలమే! ఇతర రాష్ట్రాలైన ఝూర్ఖండ్‌, అసోంలలో కొన్నేళ్లుగా ఫలితాలు బాగున్నందునే తెలంగాణలోనూ మొదలుపెట్టాలని నిర్ణయించాం. కొన్ని దేశాల్లో రెండున్నర ఎకరాల విస్తీర్ణంలోనే పలు టన్నుల వరకు చేపల ఉత్పత్తి ప్రక్రియ కొనసాగడాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తున్నాం.
- సువర్ణ, మత్స్యశాఖ కమిషనర్‌

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.