Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఇక శత్రువు ఉక్కిరి బిక్కిరే

ఇక శత్రువు ఉక్కిరి బిక్కిరే

కాల్పనిక సాహిత్యంలో చూపే ‘స్టార్‌ వార్స్‌’ తరహా యుద్ధాలకు భారత్‌ సిద్ధమవుతోంది. 21వ శతాబ్దపు పోరాట రీతుల్లో కీలకమైన నెట్‌వర్క్‌ ఆధారిత పోరాట సామర్థ్యాన్ని సమకూర్చుకుంటోంది. సైనికుల కెమెరాలు, యుద్ధవిమానాలు, డ్రోన్లు రియల్‌టైమ్‌లో అందించే దృశ్యాలు, డేటా ఆధారంగా అప్పటికప్పుడు యుద్ధవ్యూహాలు మార్చి శత్రువును ఉక్కిరిబిక్కిరి చేసేందుకు దోహదపడే అధునాతన ఉపగ్రహాలను ఒక్కొక్కటిగా సాకారం చేస్తోంది. తాజాగా ప్రయోగించిన జీశాట్‌-7ఏ ఉపగ్రహం భారత వైమానిక దళానికి కొండంత బలాన్ని ఇవ్వబోతోంది. ‘ఇండియన్‌ యాంగ్రీ బర్డ్‌’గా పిలుచుకునే ఈ రోదసి యంత్రం మన యుద్ధవిమానాల ‘నెట్‌వర్క్‌ కేంద్రీకృత కార్యకలాపాల’ను పటిష్ఠపరుస్తుంది.

ఏమిటి ప్రత్యేకత..

ఇక శత్రువు ఉక్కిరి బిక్కిరే

నౌకాదళం కోసం ఇప్పటికే ఒక ప్రత్యేక ఉపగ్రహం ఉండగా, జీశాట్‌-7ఏను మొట్టమొదటిసారిగా వైమానిక దళ అవసరాలకు ప్రత్యేకంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపొందించింది. జీశాట్‌-7ఏ సామర్థ్యంలో 70 శాతాన్ని వైమానిక దళం, మిగతా భాగాన్ని సైన్యం వాడుకుంటాయి. 
వైమానిక దళ యుద్ధవిమానాలు, గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థ విమానాలు (అవాక్స్‌), డ్రోన్లు, నేల మీదున్న రాడార్‌ కేంద్రాలు, వైమానిక స్థావరాలను ఈ ఉపగ్రహం సంధానిస్తుంది. తద్వారా భద్రమైన ఒక కేంద్రీకృత నెట్‌వర్క్‌ను ఏర్పరుస్తుంది. 
దీనివల్ల శక్తిమంతమైన మరో కమ్యూనికేషన్‌ మార్గం వైమానిక దళానికి అందుబాటులోకి వస్తుంది. భూతల మౌలిక వసతులు లేని, సంకేతాలు అందని మారుమూల ప్రాంతాల్లో తలెత్తే కమ్యూనికేషన్‌ ఇబ్బందులు ఇక తప్పుతాయి. 
అప్పటికప్పుడు ఒక విమానం నుంచి మరో విమానానికి, నేలమీదకు కమ్యూనికేషన్‌ సేవలు అందిస్తుంది. నిఘా డ్రోన్లు సేకరించే వీడియోలు, చిత్రాలను భూ కేంద్రాలకు చేరవేస్తుంది. 
ప్రపంచంలో ఎక్కడైనా మరింత మెరుగ్గా ఆపరేషన్లు నిర్వహించగల సామర్థ్యాన్ని వైమానిక దళానికి అందిస్తుంది. 
యుద్ధసమయంలో పోరాట విమానాల మధ్య మరింత మెరుగైన సమన్వయానికి సాయపడుతుంది. నిర్దిష్ట విమానం శత్రువుదా.. మన దేశానిదా అన్నది గుర్తించడంలో తోడ్పాటు అందిస్తుంది.

ఇక డ్రోన్ల జోరు

ఇక శత్రువు ఉక్కిరి బిక్కిరే

జీశాట్‌-7ఏ ఉపగ్రహం డ్రోన్‌ కార్యకలాపాలకు ఊతమివ్వనుంది. ప్రస్తుతమున్న భూతల కేంద్రాల ద్వారా కాకుండా అంతరిక్షం నుంచి వీటిని నియంత్రించవచ్చు. ఫలితంగా వీటి పరిధి, సామర్థ్యం పెరుగుతుంది. అమెరికా నుంచి సాయుధ ప్రిడేటర్‌-బి లేదా సీ గార్డియన్‌ డ్రోన్లను భారత్‌ కొనుగోలు చేయనున్న నేపథ్యంలో దీనికి ప్రాముఖ్యం ఏర్పడింది. సుదూరం నుంచే శత్రు లక్ష్యాలపై క్షిపణులను ఈ డ్రోన్లు ప్రయోగించగలవు. 
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లపై దాడికి అమెరికా ఈ డ్రోన్లను ఉపయోగించింది. ఉపగ్రహాల సాయంతో 12వేల కిలోమీటర్ల దూరంలో నెవాడా నుంచే వీటిని నియంత్రించేవారు. ఆ తరహా సామర్థ్యం ఇప్పుడు భారత్‌కు లభిస్తుంది.

నిఘా కోసం..

ఇక శత్రువు ఉక్కిరి బిక్కిరే
 

దేశసరిహద్దులపై నిఘా కోసం భూమిని చిత్రీకరించే కార్టోశాట్‌, రాడార్‌శాట్‌, హైపర్‌స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహాలు భారత్‌ వద్ద ఉన్నాయి. 
కార్టోశాట్‌ ఉపగ్రహాలు తీసే ప్రతి చిత్రంలోని ఒక్కో పిక్సెల్‌ ఒక చదరపు మీటరు భూభాగాన్ని చూపిస్తుంది. అంతకన్నా మెరుగైన 25 సెంటీమీటర్ల రిజల్యూషన్‌ ఉపగ్రహాలను భారత్‌ రూపొందించబోతోంది. 
పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై 2016లో భారత సైన్యం జరిపిన మెరుపు దాడుల్లో కార్టోశాట్‌-2 శ్రేణి ఉపగ్రహం కీలక పాత్ర పోషించింది. ఇది పాక్‌లోని ట్యాంకులు, యుద్ధవిమానాలను గుర్తించగలదు. నిమిషం నిడివి ఉన్న వీడియోలనూ అందించగలదు. 
రిశాట్‌ ఉపగ్రహాలు రాత్రి, పగలు, తేడాలేకుండా 24 గంటల పాటు నిఘా వేసి ఉంచగలవు. మేఘాలూ వీటికి అడ్డుకావు. 
‘నావిక్‌’ అనే దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ ద్వారా క్షిపణులకు అత్యంత కచ్చితత్వంతో కూడిన మార్గనిర్దేశం చేయవచ్చు.

కమ్యూనికేషన్‌ కోసం..

ఇక శత్రువు ఉక్కిరి బిక్కిరే
 

సైనిక కమ్యూనికేషన్‌ అవసరాలకు జీశాట్‌-6, నౌకాదళం కోసం జీశాట్‌-7లను భారత్‌ ప్రయోగించింది. తాజా జీశాట్‌-7ఏ వీటి సరసన చేరుతుంది. వైమానిక దళానికి జీశాట్‌-7సి అనే మరో ఉపగ్రహం అందుతుంది. అది నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేస్తుంది. ఆర్మీ కోసం జీశాట్‌-7బిని ప్రయోగించనుంది. 
జీశాట్‌-7 (రుక్మిణి) హిందు మహాసముద్రంలో 2వేల నాటికల్‌ మైళ్ల ప్రాంతంలో భద్రమైన కమ్యూనికేషన్‌ సేవలను అందిస్తోంది. 
జీశాట్‌-6లో మల్టీమీడియా సామర్థ్యముంది. సైనికుల హెల్మెట్లపైనున్న కెమెరాలు చిత్రీకరించిన దృశ్యాలను అప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేయగలదు. 2016నాటి మెరుపు దాడుల దృశ్యాలను ఇది ఇలాగే ప్రసారం చేసింది.

పెరుగుతున్న సైనిక ఉపగ్రహాలు

 

మారుతున్న భద్రతా వాతావరణం దృష్ట్యా నిఘా, భద్రమైన సైనిక కమ్యూనికేషన్‌, కచ్చితత్వంతో ఆయుధాలకు మార్గనిర్దేశం వంటి అవసరాల కోసం అగ్రదేశాలు ఉపగ్రహాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. కక్ష్యలోని ఉపగ్రహాలను నేలకూల్చే (ఏశాట్‌) విధానాలను కొన్ని దేశాలు సమకూర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో అంతరిక్షమూ రణరంగమవుతోంది. అణ్వాయుధాలు పోగేసుకున్న చైనా, పాకిస్థాన్‌ల మధ్యలో భారత్‌ ఉంది. చైనా జోరుగా అంతరిక్షాన్ని సైనికీకరిస్తోంది. 2007లో ‘ఏశాట్‌’ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. దీంతో భద్రత కోసం రోదసిపై భారత్‌ ఆధారపడుతోంది. సైనిక ప్రయోజనానికి అంతరిక్ష ఆస్తులను వినియోగించడానికి ‘రక్షణ అంతరిక్ష సంస్థ’ను ఏర్పాటుచేసింది.

ఇక శత్రువు ఉక్కిరి బిక్కిరే

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.