close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఎన్నికల వ్యయం.. ఏకగ్రీవాలపైనా నిఘా   

ముందుగానే పరిశీలకుల నియామకం 
ఒక్కో దశకు కనీసం నాలుగైదు రోజుల వ్యవధి 
పంచాయతీ ఎన్నికలపై ‘ఈనాడు’ ఇంటర్వ్యూలో 
రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్‌ 
ఈనాడు - హైదరాబాద్‌

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు తీరుపై గట్టి నిఘా పెట్టనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌ కుమార్‌ వెల్లడించారు. కొన్నిచోట్ల వేలం పాటలు నిర్వహించి ఏకగ్రీవాలను ప్రకటిస్తుంటారనే ఫిర్యాదులు ఉన్నందున ఈసారి కలెక్టర్‌ సమీక్ష తర్వాతే ‘ఏకగ్రీవ విజేత’లను ప్రకటించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో త్వరలో 12,751 సర్పంచి స్థానాలకు, 1.13 లక్షల వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో బుధవారం ఆయన ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఎన్నికల ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయి? 
మే నెలలోనే బ్యాలెట్‌ పత్రాల ముద్రణ, బ్యాలెట్‌ పెట్టెల సేకరణ వంటి ముఖ్యమైన పనులన్నింటినీ పూర్తి చేశాం. ఓటర్ల జాబితాలను గ్రామాలవారీగా తాజాపర్చడం వంటి పనులను మళ్లీ చేపట్టాం. అప్పట్లో ఎంపిక చేసిన స్టేజ్‌1, స్టేజ్‌2 రిటర్నింగ్‌ అధికారులు, పోలింగ్‌ సిబ్బందిలో కొంత మంది బదిలీ కావటంతో ఆయా స్థానాల్లో ఇప్పుడు కొత్తవారిని నియమించాం. ఈ నెల 25 నుంచి జనవరి 2 వరకు వీరందరికీ శిక్షణ ఇస్తాం.

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో అప్పట్లో ముద్రించిన బ్యాలెట్‌ పత్రాలు ఇప్పుడు సరిపోతాయా? 
అప్పట్లోనే మేము 20 శాతం అదనంగా బ్యాలెట్‌ పత్రాలను ముద్రించాం. అసెంబ్లీ ఎన్నికల్లో 22 లక్షల ఓటర్లు పెరగ్గా వారిలో దాదాపు 16 లక్షల మంది గ్రామీణ ప్రాంతాలవారు ఉంటారు. ఈ సంఖ్యకు అనుగుణంగా నెలాఖరులోగా మరిన్ని బ్యాలెట్‌ పత్రాలను ముద్రించాల్సిందిగా జిల్లాల ఎన్నికల అధికారులకు చెప్పాం.

పోలింగ్‌ ఎన్ని దశల్లో ఉండొచ్చు? 
పోలింగ్‌ను మూడు దశల్లో నిర్వహించాలని భావిస్తున్నాం. దీనిపై కలెక్టర్లు, ఎస్పీలు పంపే నివేదికలనూ పరిశీలిస్తాం. ఒక్కో దశకు గతంలో మూడేసి రోజుల వ్యవధి ఇచ్చినప్పటికీ ఇప్పుడు కనీసం నాలుగైదు రోజుల వ్యవధి ఇవ్వాలని యోచిస్తున్నాం.

ఎన్నికల వ్యయంపై నిఘాకు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? 
పెద్ద సంఖ్యలో ఎన్నికల వ్యయపరిశీలకులను నియమించి నోటిఫికేషన్‌ దశ నుంచే నిఘా పెడతాం. వివిధ ప్రాంతాల్లో వాహనాల తనిఖీ కేంద్రాలనూ ఏర్పాటు చేస్తున్నాం.

కొన్ని చోట్ల గ్రామ సంఘాల వారే అభ్యర్థుల నుంచి కొంత మొత్తాన్ని తీసుకొని ఏకగ్రీవాలను ప్రకటిస్తున్నారనే విమర్శలున్నాయి కదా? 
గ్రామాల్లో వర్గ తగాదాలు తలెత్తకూడదనే భావనతో ప్రజాస్వామ్య పద్ధతిలో.. అందరి సమ్మతితో కొన్ని చోట్ల సర్పంచి/వార్డు సభ్యుల ఎన్నికలను ఏకగ్రీవం చేసుకుంటుంటారు. ఇలాంటి ఏకగ్రీవాలతో ఇబ్బందేమీ ఉండదు. అయితే పదవులకు వేలం పాటలు నిర్వహించి ఎవరు ఎక్కువ చెల్లిస్తే వారిని విజేతలుగా ప్రకటించటం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. ప్రతి ఏకగ్రీవ ఎన్నికపైనా ఆరా తీస్తాం. ఇకపై నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఏకగ్రీవ విజేతను రిటర్నింగ్‌ అధికారి ప్రకటించే ముందు విధిగా కలెక్టర్‌ అనుమతిని పొందాల్సి ఉంటుంది.

2013 ఎన్నికల వ్యయ వివరాలను అందజేయని 11,150 మంది అభ్యర్థులను మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించారు. ఈ ప్రభావంతో ప్రస్తుత ఎన్నికల్లో మార్పు వస్తుందని భావిస్తున్నారా? 
ఆ ప్రభావం తప్పక ఉంటుంది. ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి ప్రతి అభ్యర్థి తమ వ్యయ నివేదికలను పోటీపడి మరీ మాకు సమర్పిస్తారు. ఈసారి వ్యయ నివేదికలను ఎంపీడీవోలకు అందజేస్తే సరిపోతుందనే వెసులుబాటు కూడా కల్పించాం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.