close

ప్ర‌త్యేక క‌థ‌నం

సిక్కుల మనోభావాలను దెబ్బతీశారు

క్షమాపణలు చెప్పాలని అమరీందర్‌ సింగ్‌ డిమాండ్‌

సిక్కుల మనోభావాలను దెబ్బతీశారు

అమృత్‌సర్‌: సిక్కులు అత్యంత పవిత్రంగా భావించే ‘స్వర్ణ దేవాలయ’ బొమ్మలు ముద్రించి ఉన్న టాయిలెట్‌ సీట్‌ కవర్లు, డోర్‌మ్యాట్లను కొందరు విక్రేతలు అమెజాన్‌లో అమ్మకానికి ఉంచిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘శ్రీ దర్బార్‌ సాహిబ్‌ బొమ్మలను టాయిలెట్‌ సీట్లపై ముద్రించిన ఫిలిప్‌హోమ్‌ యూనివర్సల్‌ (అమెజాన్‌లో వీటిని అమ్మకానికి ఉంచిన సంస్థ) తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్కు వర్గ ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. అమ్మకానికి ఉంచిన ఆ సీట్లను వెంటనే వెనక్కి తెప్పించుకోవాలని, ఈ చర్యపై క్షమాపణలు చెప్పాలని ఆ సంస్థను డిమాండ్‌ చేస్తున్నాను’ అని ఆయన ట్వీట్‌ చేశారు. 

కాగా, స్వర్ణదేవాలయ బొమ్మలున్న టాయిలెట్‌ సీట్‌కవర్లతో పాటు పలు వస్తువులను ‘అమెజాన్‌’లో ఆ సంస్థ విక్రయానికి ఉంచింది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రముఖ సిక్కుల సంస్థ ‘ది సిక్‌ కొయిలేషన్‌’ ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిన్న ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ తరహా వస్తువుల విక్రయాన్ని తక్షణం నిషేధించాల్సిందిగా ఆ సంస్థ ‘అమెజాన్‌’కు విజ్ఞప్తి చేసింది. ఇటీవల అమెజాన్‌లో ఈ తరహా వస్తువులను అమ్మకానికి ఉంచడంతో సిక్కు వర్గ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వర్ణ దేవాలయం తమకు చాలా పవిత్రమని, ఆ బొమ్మను ఇలా ముద్రించడం ఏంటని నిలదీశారు. మరోవైపు శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ (ఎస్‌జీపీసీ) ఈ తీరును ఖండిస్తూ అమెజాన్‌కు చట్టపరంగా నోటీసులు పంపింది. తమ మనోభావాలను దెబ్బ తీశారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది. అలాగే, ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని ఎస్‌జీపీసీ.. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఓ లేఖ రాసినట్లు తెలిసింది.

ఈ వస్తువులు ‘అమెజాన్’లో అమ్మకానికి ఉంచిన తీరుపై శిరోమణి అకాలీదళ్‌ ‌ఎమ్మెల్యే మంజిందర్‌ సిర్సా కూడా ఖండించారు. ఈ చర్య దైవదూషణతో సమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వస్తువుల విక్రయానికి ఉంచిన సంస్థలపై ‘అమెజాన్‌’ నిషేధం విధించాలని, వీటిని వెంటనే వెనక్కి తెప్పించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ప్రపంచ వ్యాప్త నిరసనకు తాము సిద్ధమని హెచ్చరించారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.