Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

రైతు ఇంట పారిశ్రామిక పంట   

చైనాలో పొలం పనులు అత్యధికం యంత్రాలతోనే 
గ్రామాల్లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు అధికం 
విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై శ్రద్ధ 
సేద్యంతో పాటు ఇతర పనుల్లోనూ రైతులకు నైపుణ్యం 
గ్రామాల్లో చిన్న కమతాలన్నీ కలిపి సహకార సేద్యం 
పంటను బట్టి రైతులకు నిధులు... ఇతర రాయితీలు లేవు 
చైనాలో పంటల సాగుపై తెలంగాణ ఉద్యానశాఖ అధ్యయనం

రైతు ఇంట పారిశ్రామిక పంట 
 

చైనాలో ఒక వ్యవసాయ కూలీకి రోజుకు ఇచ్చే కూలీ సొమ్ము మన రూపాయల్లో దాదాపు 1000కి సమానం. కూలీ వ్యయం ఆకాశాన్నంటుతున్నందున చైనా వ్యవసాయంలో 90 శాతానికి పైగా పనులన్నీ యంత్రాలతోనే చేస్తున్నారు.
- రాష్ట్ర ఉద్యానశాఖ నివేదిక

ఈనాడు - హైదరాబాద్‌

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనా.. వ్యవసాయ పనులకు మానవ వనరుల కన్నా యంత్రాలపైనే అధికంగా ఆధారపడుతోంది. రైతులు ఒక్క పొలం పనులకే పరిమితం కాకుండా వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లోనూ నైపుణ్యాన్ని పెంచుకొని తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర ఉద్యానశాఖ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోనే మేలైన పట్టు ఉత్పత్తికి చైనా పెట్టింది పేరు. అక్కడ తయారవుతున్న పట్టుకు ప్రపంచ మార్కెట్‌లో మంచి ధర పలుకుతోంది. తెలంగాణలోనూ మల్బరీ సాగు, పట్టు ఉత్పత్తి క్రమంగా పెరుగుతోంది. ఇక్కడి పట్టుకు సైతం చైనాకు సరిసమాన స్థాయిలో నాణ్యత ఉందని ఉద్యానశాఖ గుర్తించింది. పట్టు ఉత్పత్తి ఇంకా పెంచాలనే ఉద్దేశంతో చైనాలో మల్బరీతో పాటు ఇతర పంటల సాగుతీరు, రైతుల కష్టనష్టాలపై ఉద్యానశాఖ సంచాలకుడు వెంకట్రాంరెడ్డి, ఉప సంచాలకుడు మదన్‌మోహన్‌లు ఇటీవల అధ్యయనం చేసి వచ్చారు. చైనాలోని షాంగై, టాంగ్జాంగ్‌, జోక్వునా, సుజోవ్‌ ప్రాంతాల్లో పంటల సాగును విస్తృతంగా పరిశీలించారు. అక్కడ వ్యవసాయ విధానాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వీరు ఇచ్చిన నివేదికలోని ముఖ్యాంశాలు...

చైనా గ్రామీణ మహిళలు అత్యధిక శాతం పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. 
వృద్ధులు గ్రామాల్లో తమ ఇళ్ల వద్ద ఉండే ఖాళీ స్థలాల్లోనే పంటల సాగు, పట్టు ఉత్పత్తి, కోళ్ల పెంపకం వంటి పనులు చేస్తున్నారు. 
పనిచేయగల వయసులో ఉన్న పురుషులే ప్రధానంగా పంటల సాగులో నిమగ్నమవుతున్నారు. 
ఇళ్ల వద్ద ఉండే ఖాళీ స్థలాల్లో పట్టు ఉత్పత్తి చేస్తున్న వారు నెలకు రూ.లక్ష వరకూ సంపాదిస్తున్నారు. 
తెలంగాణలో ఒక్కో సీజన్‌కు ఎకరానికి రూ.4 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తున్న మాదిరిగానే చైనాలో వ్యవసాయం చేసేవారికి పంటను, సాగు విస్తీర్ణాన్ని బట్టి ప్రభుత్వం నిధులను రైతు ఖాతాలో వేస్తోంది. ఇక ఇతర రాయితీలేమీ పెద్దగా ఇవ్వడం లేదు. వ్యవసాయ యంత్రం కొన్నవారికి దాని ధరలో 30 శాతం రాయితీగా ప్రభుత్వం భరిస్తోంది.

నదులు, కాల్వల ద్వారా నీటి పారుదల వ్యవస్థ పక్కాగా ఉంది. ప్రతీ కమతానికి నీరు చేరేలా ఏర్పాటుచేశారు. నీటి వృథా చాలా తక్కువ.

పంటల కాలనీ నిర్ణయం గ్రామసభలదే

రైతు ఇంట పారిశ్రామిక పంట 
 

రైతులకు చిన్న కమతాలున్నాయి. కానీ ఏ ఒక్కరూ వారికిష్టమైనట్లుగా పంట సాగుచేయరు. సీజన్‌కు ముందు గ్రామసభను పంచాయతీ ఏర్పాటుచేస్తుంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌ ధరల ప్రకారం ఏ పంటకు ధర వస్తుందనేది డిమాండు అంచనాల ప్రకారం నిర్ణయిస్తారు. అదే పంటను అన్నీ కమతాల్లో సాగుచేసేలా ‘పంటకాలనీ’ ఏర్పాటవుతుంది. చిన్న కమతాల రైతులంతా ఒక రైతుకు తమ భూమిని సహకార విధానంలో కౌలుకిస్తారు. వ్యవసాయాధికారి, గ్రామసభ నిర్ణయించిన పంటకాలనీ ప్రకారం ఒక ప్రాంతంలో ఒక పంటనే సాగుచేస్తున్నారు. సాగు పనులన్నీ యంత్రాలతోనే చేస్తున్నారు. నిలువుసేద్యం(వర్టికల్‌ ఫార్మింగ్‌), హైడ్రోఫోనిక్స్‌, హరితపందిరి తదితర అత్యాధునిక విధానాల్లో పంటల సాగు జరుగుతోంది.

తక్కువ భూమి...అధిక ఆదాయం...

రైతు ఇంట పారిశ్రామిక పంట 
 

చైనా రైతులు తక్కువ భూమిలోనే వివిధ రకాలుగా పంటలు సాగుచేస్తూ అనేక రకాలుగా ఆదాయం పొందుతున్నారు. హుజోవ్‌ గ్రామంలో షెన్‌ అనే రైతుకు మొత్తం 3500 చదరపు మీటర్ల పొలం ఉంది. ఇందులోనే పత్తి, మొక్కజొన్న, కమలాలు, వెదురు, మల్బరీ సాగు చేస్తున్నారు. ఈ పొలంలో ఒక అంగుళం స్థలం కూడా వృథా చేయకుండా ఏదో ఒక పంట మొక్క నాటడం విశేషం. ఇతను పంటల సాగుకే పరిమితం కాకుండా పట్టు ఉత్పత్తి పరిశ్రమ స్థాపించారు. ఇక్కడ ఉద్యోగులకు నెలకు రూ.30 వేల చొప్పున వేతనం సైతం ఇస్తున్నారు. ఇలా ప్రతీ రైతు వ్యవసాయంతోపాటు ఏదో ఒక చిన్నస్థాయి పరిశ్రమతో అనుబంధం కలిగి ఉన్నారు.

ఆదర్శం... ప్రతీ గ్రామ మార్కెట్‌

రైతు ఇంట పారిశ్రామిక పంట 
 

రైతులు తాము పండించిన పంటను శుద్ధి చేసి, ఆరబెట్టి, గ్రేడుల వారీగా బస్తాల్లో ప్యాక్‌ చేసి గ్రామ పంచాయతీ మార్కెట్‌కు తెస్తున్నారు. ప్రతీ పంచాయతీ అధికారికంగా నిర్వహించే ఈ మార్కెట్‌ పరిశుభ్రంగా ఉంది. ఇక్కడ పంట నాణ్యతను చూసి ధర నిర్ణయిస్తారు. పంటను నాణ్యంగా తెచ్చేలా వ్యవసాయాధికారి రైతులకు సాంకేతిక సహకారం అందిస్తున్నారు. గ్రామ మార్కెట్‌లో కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, చేపలు సహా స్థానికంగా దొరికేవన్నీ విక్రయిన్నారు.

ఖర్చు ఒక్కటే అయినా ఆదాయం ఎక్కువ

రైతు ఇంట పారిశ్రామిక పంట 
 

పలు పంటల సాగు వ్యయం తెలంగాణ స్థాయిలోనే చైనాలోనూ ఉంది. కానీ అక్కడ నాణ్యమైన పంటను అమ్ముతున్నందున రైతులకు అధిక ఆదాయం వస్తోంది. ఉదాహరణకు కిలో పట్టుగూళ్ల ధర తెలంగాణలో రూ.350 నుంచి 400 ఉంది. చైనాలోనూ రూ.400. కానీ పట్టుగూళ్ల నుంచి ఉత్పత్తి అయిన పట్టును చైనా రైతులు కిలోను రూ.4700కు అమ్ముతుంటే మనదేశంలో రైతులకు రూ.3100 నుంచి 4200 వరకే వస్తోంది.

పెరటి సాగుతో కుటుంబ పోషణ

రైతు ఇంట పారిశ్రామిక పంట 
 

చైనా గ్రామాల్లో అత్యంత ఆసక్తిదాయకమైన అంశం...ప్రతీ రైతు తన కుటుంబ పోషణకు అవసరమైన సొమ్ములో అత్యధిక మొత్తాన్ని ఇంటి పెరటిలో సాగుచేసే వివిధ రకాల పంట మొక్కల నుంచే పొందుతున్నారు. ప్రతీ పెరటిలో వంగ, టమాటా, ఆకుకూరలతో పాటు, మల్బరీ సాగు ద్వారా పట్టు ఉత్పత్తి చేస్తున్నారు. ఇంట్లో ఉండే వృద్ధులే ఈ పనులన్నీ చేయడం ద్వారా కుటుంబ పోషణకు కావాల్సిన ఆదాయాన్ని సమకూర్చుతున్నారు.

చదివింది డిప్లమో.. రూ.100 కోట్ల వ్యాపారం

రైతు ఇంట పారిశ్రామిక పంట 
 

లియు అనే యువతి మేనేజ్‌మెంట్‌ కోర్సులో డిప్లమో చేసింది. తొలుత చైనా ప్రభుత్వ పట్టు పరిశ్రమ ప్లాంటులో పనిచేసిన ఆమె ఆ తరవాత బ్యాంకు నుంచి రూ.20 లక్షల రుణం తీసుకుంది. దీనికి 4 శాతం వడ్డీ. పట్టు పరిశ్రమ యూనిట్‌ స్థాపించి కొద్దికాలంలోనే వ్యాపార టర్నోవర్‌ రూ.100 కోట్లకు చేర్చింది. చైనా ప్రభుత్వం తనకు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని తెలిపింది. తెలంగాణలో ఉత్పత్తవుతున్న పట్టుని కొని తమ బ్రాండుపై విక్రయించటానికి సిద్ధమని ఆమె సంసిద్ధత తెలిపింది.

రైతు ఇంట పారిశ్రామిక పంట 
 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.