close

ప్ర‌త్యేక క‌థ‌నం

స్థిరాస్తి చట్టం.. సత్వర న్యాయం   

కొనుగోలుదారుల కొంగు బంగారమైన   మహారాష్ట్ర రెరా 
79 శాతం తీర్పులు వినియోగదారుల పక్షమే 
ఫిర్యాదు నమోదైన నెలలోపే సమస్యల పరిష్కారం 
స్థిరాస్తి రంగంలో సమగ్ర సమాచారం 
పూర్తి పారదర్శకంగా సేవలు 
సాంకేతిక పరిజ్ఞానంతో ముందడుగు

స్థిరాస్తి చట్టం.. సత్వర న్యాయం 
 
 

దేశంలోనే ఆదర్శం 
ముంబయిలోని ఓ నిర్మాణ సంస్థలో ఒక వ్యక్తి ఫ్లాట్‌ కొనుగోలు చేశారు. మూడుచోట్ల ప్రాజెక్టులు చేపట్టిన నిర్మాణదారు అందులో ఒకచోట పనులు నెమ్మదిగా కొనసాగిస్తుండగా.. మిగిలిన రెండుచోట్ల వేగంగా చేపడుతున్నారు. తాను కొనుగోలు చేసిన ప్రాజెక్టులో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయంటూ సదరు వ్యక్తి రెరాను ఆశ్రయించారు. వేగంగా పనులు జరుగుతున్న దాంట్లో ఫ్లాట్‌ ఒకటి ఈయనకు కేటాయించాలని రెరా ఆదేశించింది. 

స్థిరాస్తి చట్టం.. సత్వర న్యాయం 
 


ఒకరు 2012లో ఫ్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. సెప్టెంబరు 2015లో బ్యాంకు రుణంతో విక్రయ ఒప్పందం చేసుకున్నారు. బిల్డర్‌కు రూ.కోటిన్నర చెల్లించారు. ప్రతి నెలా రూ.1.10 లక్షలను బ్యాంకుకు ఈఎంఐ చెల్లిస్తున్నారు. మార్చి 2016లో ఫ్లాట్‌ను కొనుగోలుదారుడికి అప్పగించాలి. కానీ ప్రాజెక్టులో పురోగతి లేకపోవడంతో రెరాను ఆశ్రయించారు. దీనిపై కొనుగోలుదారుడికి అతను చెల్లించిన మొత్తం, అదనంగా 10.33 శాతం వడ్డీతో వెనక్కి ఇవ్వాలని రెరా తీర్పు ఇచ్చింది.

స్థిరాస్తి చట్టం.. సత్వర న్యాయం 
 స్థిరాస్తి రంగంలో పూర్తి పారదర్శకత.. కొనుగోలుదారుల ప్రయోజనాలే పరమావధిగా తీసుకువచ్చిన స్థిరాస్తి నియంత్రణ చట్టం (రెరా) అమలులో మహారాష్ట్ర దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. కొనుగోలుదారులు, స్థిరాస్తి వ్యాపారుల మధ్య సుహృద్భావ వాతావరణం కల్పించడం, వీరి మధ్య విశ్వసనీయత పెంచడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఏడాదిన్నర మహా-రెరా ప్రయాణంలో వేలాది మంది కొనుగోలుదారుల పక్షాన నిలిచి వారికి న్యాయం జరిగేలా వ్యవహరించింది. రెరా చట్టాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తూ వీరికి సత్వరమే మహా స్థిరాస్తి నియంత్రణ అథారిటీ న్యాయం చేస్తోంది.

నెలలోనే సమస్య పరిష్కారం 
సాధారణంగా రెరాకు వచ్చే ఫిర్యాదులను రెండు నెలల్లో అథారిటీ పరిష్కరించాలి. కానీ మహా-రెరా సగటున నెల రోజుల్లోనే కొనుగోలుదారుల ఫిర్యాదులను పరిష్కరిస్తుండటం విశేషం. ఇందులో 70 నుంచి 80 శాతం కేసుల్లో తీర్పు బాధితుల తరఫునే లభిస్తుండటం ప్రత్యేకాంశం. మహా-రెరా కార్యదర్శి నేతృత్వంలో కన్సిలేషన్‌ ఫోరం ఏర్పాటైంది. వినియోగదారుల సంఘం సభ్యులు, క్రెడాయ్‌, నెరెడ్‌కో సభ్యులతో ఉన్న ఈ ఫోరం కొనుగోలుదారుల ఫిర్యాదులను పరిష్కరిస్తుంది.

వెబ్‌సైట్‌లో సమగ్ర సమాచారం 
మహా-రెరా వెబ్‌సైట్‌ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహాఆన్‌లైన్‌, టీసీఎస్‌ సంస్థలు కలసి ఈ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నాయి. రెరా కింద ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి ఈ వెబ్‌సైట్‌ ఉపయోగపడుతోంది. స్థిరాస్తి వ్యాపారులు, స్థిరాస్తి ఏజెంట్లు ఆన్‌లైన్‌లోనే నమోదు చేసుకుంటున్నారు. వీరి వివరాలన్నీ వెబ్‌సైట్‌లోని గూగుల్‌ మ్యాప్‌లలో స్పష్టంగా ఉంటాయి. ఒక క్లిక్‌తో రియల్టర్‌ పూర్తి సమాచారం కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తోంది. దీనివల్ల నిర్మాణ సంస్థ వివరాలు, అనుభవం, సంస్థ నిర్మించిన ఇతర ప్రాజెక్టులు, తాజాగా చేపట్టిన ప్రాజెక్టు సమగ్ర సమాచారం, ఎప్పటిలోగా పూర్తవుతుంది, కల్పించే సౌకర్యాలు సహా తదితర సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తోంది. దీంతో కొనుగోలుదారులు నిర్మాణదారు వద్దకు వెళ్లకుండానే నచ్చిన ప్రాజెక్టును ముందుగా గుర్తించేందుకు.. దీనిపై తగిన నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటోంది.

స్థిరాస్తి చట్టం.. సత్వర న్యాయం 
 

ప్రారంభం నుంచి పక్కాగా అమలు

దేశవ్యాప్తంగా మే1, 2017 నుంచి రెరా అమల్లోకి వచ్చింది. చట్టబద్ధమైన అథారిటీ, పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ రెరా సమర్థంగా అమలవుతోంది. ఇది అమలులోకి రావడానికి 4 నెలల ముందే మహారాష్ట్ర ప్రభుత్వం స్థిరాస్తి నియంత్రణ అథారిటీని ఏర్పాటు చేసింది. ఎలాంటి జాప్యం లేకుండా ఏప్రిల్‌ 30 అర్ధరాత్రికి పక్కాగా ఏర్పాట్లు చేసుకుని మే ఒకటో తేదీ నుంచి మహా-రెరా ప్రారంభమైంది.

మచ్చుకు మరికొన్ని తీర్పులు

క కొనుగోలుదారుడు ఓ స్థిరాస్తి సంస్థ నుంచి ఫ్లాట్‌ కొన్నారు. ఆ నిర్మాణదారు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి రెరాకు, ఆ సంస్థ వెబ్‌సైట్‌లో ఒక తేదీ నమోదు చేశారు. నిర్మాణదారు ఆ కాంప్లెక్స్‌ పూర్తి చేయడానికి అగ్రిమెంట్‌లో వేరే తేదీ ఇచ్చారు. దీనిపై కొనుగోలుదారులు రెరాకు ఫిర్యాదు చేశారు. రెరాకు ఇచ్చిన తేదీ మేరకే ప్రాజెక్టును పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఏదైనా కారణాలతో ప్రాజెక్టు ఆలస్యమైతే పొజిషన్‌ ఇచ్చేంతవరకూ కొనుగోలుదారుడు చెల్లించిన మొత్తానికి వడ్డీ ఇవ్వాలంది.

ఒక వ్యక్తి పుణెలో ఫ్లాట్‌ కొనుగోలుకు 4.9.2013న అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నారు. రూ.23,32,800 చెల్లించారు. ఆ అగ్రిమెంట్‌లో ఎప్పటికి పూర్తి చేస్తారనే అంశంలేదు. ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి పనులూ జరగడం లేదు. రెరాకు ఫిర్యాదు చేయగా రెండు వారాల్లో ఫిర్యాదుదారుడి వినతిని పరిష్కరించి నిర్మాణదారు నుంచి కొనుగోలుదారుడికి రూ.46,65,600 ఇప్పించేలా చేశారు.

ఒక నిర్మాణ సంస్థలో రూ.1.08 లక్షలు చెల్లించి ఫ్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. అనంతరం కొనుగోలును రద్దు చేసుకున్నారు. అయినా డబ్బులు వెనక్కి ఇవ్వలేదు. రెరా జోక్యంతో చెల్లించిన మొత్తం కొనుగోలుదారుడికి చెల్లించారు.

ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.