
ప్రత్యేక కథనం
కొత్త సంవత్సర ప్రణాళిక
ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
పొద్దున్నే లేచి, రోజూ కచ్చితంగా వ్యాయామం చేస్తా.. ఆరు నూరైనా.. ఫస్ట్ నుంచి సిగరెట్లు మానెయ్యాల్సిందే.. రోజూ కనీసం రెండు పండ్లైనా తింటా..
కొత్త సంవత్సరం వస్తోందంటే చాలు.. చాలామంది రకరకాల తీర్మానాలు చేసుకుంటూనే ఉంటారు. ఒకట్రెండు రోజులు ఇవి ఉక్కు సంకల్పాల్లాగే ఉంటాయిగానీ..వారం తిరిగే లోపే వాటి విషయం పూర్తిగా మర్చి పోతుంటారు. నెల తర్వాత అసలు వాటి ఊసే ఉండదు. సరిగ్గా ఇదే వద్దంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. పండంటి ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ ఈ కొత్త సంవత్సరం నుంచే ప్రతి నిత్యం కచ్చితంగా 5 సూత్రాలు పాటించాలని తాజాగా పిలుపిచ్చింది. ఏ వయసు వారైనా, ఆహారపరంగా ఈ పంచ సూత్రాలను పాటిస్తే జబ్బుల గుప్పిట చిక్కుకోకుండా ఆనందంగా జీవించటానికి ఆస్కారం ఉంటుందని, దీనికి ఈ 2019 నుంచే శ్రీకారం చుట్టాలని నొక్కి చెబుతోంది సంస్థ.
ఆహారమే ఆధారం
మన ఆరోగ్యానికి నిత్యం మనం తినే, తాగే పదార్థాలు ఎంతో కీలకం. మన శరీరానికి వ్యాధులతో, రకరకాల సూక్ష్మక్రిములతో పోరాడే శక్తినివ్వటం దగ్గర నుంచి.. గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం, క్యాన్సర్ల వంటి సమస్యలు దరిజేరకుండా చూడటం వరకూ.. ప్రతిదీ మనం తీసుకునే ఆహారంతో ముడిపడి ఉందనే విషయం మర్చిపోకూడదు. ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉండేవారైనా, ఏ వయసు వారైనా ఈ సూత్రాలను పాటించటం ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చనీ, వీటిని అమల్లో పెట్టేందుకు ఈ కొత్త సంవత్సర ఘడియలే సరైన సమయమని సంస్థ నొక్కి చెబుతోంది.
1 రకరకాల పదార్థాలు తినాలి! * రోజువారీ ఆహారంలో- ప్రధానంగా ఉండే బియ్యం, గోధుమలు, జొన్న వంటివాటికి తోడు బీన్స్, దుంపలు, కాయధాన్యాలు, చిక్కుళ్లు, తాజా కూరగాయలు, పండ్లు, జంతు సంబంధ పదార్థాలు (చేపలు, గుడ్లు, మాంసం, పాలు) వంటివి కొన్నైనా ఉండాలి. * వీలైనంత వరకూ ముడి బియ్యం, ముడి జొన్నలు, ముడి గోధుమలు, చిరుధాన్యాలు, ఓట్స్ వంటి వాటినే ఎంచుకోవాలి. వీటిలో పుష్కలంగా ఉండే పీచు చాలా మేలు చేస్తుంది. * వేపుళ్లకు బదులు ఉడికించటం, ఆవిరి పెట్టడం వంటి విధానాలను పాటించాలి. |
2 ఉప్పు తగ్గితేనే మేలు * వంటల్లో ఉప్పు తక్కువగా వేయండి. అలాగే ఉప్పు ఎక్కువగా ఉండే.. సోయా సాస్, ఇతర సాస్‌లు, మసాలాలు, ఊరగాయ పచ్చళ్లు, వడియాలు, అప్పడాల వంటివి తగ్గించండి. * డైనింగ్ టేబుల్‌పై ఉప్పు లేకుండా చూసుకోండి. ఉప్పు తగ్గించినపుడు కొద్దిరోజులు కష్టంగా ఉన్నా.. తర్వాత మన రుచిమొగ్గలు వాటంతట అవే సర్దుకుపోతాయి. అప్పుడు మనం తినే ఆహారాన్ని ఉప్పు లేకున్నా ఆస్వాదించగలం. |
3 కొవ్వులు, నూనెలు తగ్గించాలి * వెన్న, నెయ్యి వంటి వాటికి బదులు.. సోయా, కనోలా, జొన్న, కుసుమ, ప్రొద్దుతిరుగుడు నూనెలకు మారటం మంచిది. * మటన్ వంటి వాటికంటే కొవ్వు తక్కువగా ఉండే కోడి మాంసం, చేపలు వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వండి. మాంసం పైన కనబడే కొవ్వు తీసేసి వండుకోండి. శుద్ధిచేసిన మాంసం వాడకాన్ని వీలైనంత వరకూ తగ్గించాలి. * పారిశ్రామికంగా ఉత్పత్తిచేసే కొవ్వు పదార్థాలు (ట్రాన్స్ ఫ్యాట్లు) అధికంగా ఉండే శుద్ధి చేసిన, వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. |
4 తీపి కూడా చేదే సుమా.. * మిఠాయిలు, చక్కెర పానీయాలు, శీతల పానీయాలు, సోడాలు, ఫ్లేవర్డ్ పాలు వంటివి వీలైనంత తక్కువగా తీసుకోవాలి. నిజానికి అసలు తీసుకోకపోవడం ఉత్తమం. * చిన్నపిల్లలకు తీపి పదార్థాలు ఇచ్చే అలవాటు విడనాడాలి. రెండేళ్లలోపు పిల్లలకు బయట లభ్యమయ్యే, ఉప్పు-చక్కెరలు ఎక్కువగా ఉండే, ఆహారపదార్థాలు అస్సలు ఇవ్వకూడదు. ఆ తర్వాత కూడా ఇవ్వాల్సి వస్తే.. అతితక్కువగా ఇవ్వాలి. * ఏవైనా ఆహార పదార్థాలు కొనేటప్పుడు ఆ డబ్బాల మీద ఉండే చీటీలను చూడండి. వాటిలో సుగర్, సోడియం స్థాయులు తక్కువగా ఉండే వాటినే ఎంచుకోండి. |
5 మద్యానికి ‘సురక్షిత స్థాయి’ లేదు * స్వల్పంగా మద్యం తీసుకోవటం మంచిదని వైద్యపరమైన అధ్యయనాలు కొన్ని చెబుతుండొచ్చుగానీ అసలు తాగకపోవడం అత్యుత్తమం. * అనారోగ్యంతో ఉండి.. ఔషధాలు తీసుకుంటున్న వాళ్లు, అలాగే గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే తల్లులు అస్సలు మద్యం జోలికి పోవద్దు. ఇప్పటికే అలవాటుపడితే వదిలించుకొనేందుకు వైద్యసహాయం తీసుకోవచ్చు. |
మరిన్ని

దేవతార్చన
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’