close

ప్ర‌త్యేక క‌థ‌నం

మట్టి నుంచి మాణిక్యాల సృష్టి

వినూత్న ఆలోచనలతో సమర్థంగా   పాఠశాల నిర్వహణ
చదువుపై ఆసక్తి పెంచేలా కార్యాచరణ
నలుగురు ప్రధానోపాధ్యాయుల  చొరవకు జాతీయ స్థాయి గుర్తింపు

సర్కారు బడిలో అసౌకర్యాలు ఉన్నాయి.. వాటిని  పరిష్కరించే సామర్థ్యమున్న ఉపాధ్యాయులూ ఉన్నారు.
పాఠాలు చదవమంటే పారిపోయే పిల్లలున్నారు.. కానీ వారికి చదువుపైన ఆసక్తి రేకెత్తించేలా పాఠాలు చెప్పే మాస్టార్లూ ఉన్నారు.
ప్రభుత్వ పాఠశాల అంటే తల్లిదండ్రుల్లో అపనమ్మకం ఉంది.. దాన్ని పారదోలేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్న అయ్యవార్లున్నారు.

ఇవన్నీ అతిశయోక్తులు కాదు.. కళ్ల ముందు కనిపిస్తున్న నిజాలు.
ఉపాధ్యాయ వృత్తి అంటే ఉద్యోగమే కాదని.. భావి పౌరుల్ని తీర్చిదిద్దే బృహత్తర బాధ్యత అని మనసా వాచా నమ్మి ఆచరిస్తున్న ఉపాధ్యాయులు కొందరిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మీ విజయానికి కారణాలేమిటో చెప్పండని వారిని దేశ రాజధానికి పిలిచింది. ఈ నెల 22 నుంచి 24 వరకు జాతీయ విద్యా ప్రణాళిక, పరిపాలన సంస్థ (న్యూపా) దిల్లీలో నిర్వహించే పాఠశాల నాయకత్వ జాతీయ సదస్సుకు దేశంలో 100 మంది ఉపాధ్యాయులను ఆహ్వానించింది. అందులో తెలంగాణ నుంచి నలుగురు చోటు సంపాదించారు. వినూత్న ఆలోచనలు, సమర్థ కార్యాచరణతో తల్లిదండ్రుల నమ్మకాన్నీ, ప్రభుత్వ ప్రశంసలనూ అందుకుంటున్న ఆ నలుగురి పనితీరుపై ప్రత్యేక కథనం.

దాతల సాయం.. సమస్యలు మాయం

మట్టి నుంచి మాణిక్యాల సృష్టి

పేరు: ఏనుగు ప్రభాకర్‌ రావు
పనిచేసే పాఠశాల: కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం ఒద్యారం
అనుభవం: 28 సంవత్సరాలు

మట్టి నుంచి మాణిక్యాల సృష్టిఏం చేశారంటే?: గ్రామంలో ప్రజాప్రతినిధులు, దాతలను గుర్తించారు. వారిని ఒప్పించి విద్యార్థులకు బూట్లు, సాక్సులు, ఆట వస్తువులు సమకూర్చారు. దాతల సహాయంతో మధ్యాహ్న భోజనంలో వారానికి ఒక రోజు కోడి మాంసం అందిస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. పిల్లలు ఆకలి అనకూడదని ఉదయం, సాయంత్రం అల్పాహారం ఇస్తున్నారు. బడిలోనే కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటు చేసి కొత్తిమీర, కరివేపాకు, ఇతర ఆకుకూరలను పండిస్తూ వాటిని భోజనంలో వినియోగిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి ఒక మొక్క దత్తత ఇచ్చి సంరక్షణ బాధ్యతలు అప్పగిస్తారు. అక్కడ విద్యార్థి ట్యాగ్‌ కూడా ఏర్పాటు చేస్తారు. ఉపాధ్యాయులే తెల్లవారుజామున ఫోన్‌ చేసి విద్యార్థులను నిద్రలేపి చదివిస్తారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాలతో విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. బాసర ఆర్‌జీయూకేటీలో గత రెండేళ్లలో ఐదు సీట్లు సాధించారు.

చిన్నారి మంత్రులు.. చక్కటి ఫలితాలు

మట్టి నుంచి మాణిక్యాల సృష్టి

పేరు: పి.శ్రీహరి
పనిచేసే పాఠశాల: నల్గొండ జిల్లా వేములపల్లి మండలం అమనగల్‌
అనుభవం: 22 సంవత్సరాలు

మట్టి నుంచి మాణిక్యాల సృష్టిఏం చేశారంటే?: పాఠశాలలో ప్రతి తరగతిలో ముగ్గురు పిల్లలతో మంత్రివర్గం (చైల్డ్‌ క్యాబినెట్‌) ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులతోపాటు నిర్వహించే విద్యాపరమైన సమావేశాలకు 15 మంది పిల్లలు కూడా హాజరవుతారు. సమస్యలు చెప్పి పిల్లలనే పరిష్కారం అడుగుతారు. ఉదాహరణకు విద్యార్థులు ఎందుకు వెనకబడుతున్నారని అడిగితే.. ఇంటికి వెళ్లిన తర్వాత పుస్తకాలు తెరవడం లేదని పిల్లలే చెప్పారు. దాంతో ప్రతి ఉపాధ్యాయుడు 10 నిమిషాలపాటు చదివించడం ప్రారంభించారు. ఉపకారవేతనాల కోసం కేంద్రం ఏటా నిర్వహించే నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్షకు నెల రోజులపాటు ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తారు. దాంతో ఏటా ముగ్గురి నుంచి అయిదుగురు ఎంపికవుతున్నారు. విద్యార్థులు బయటకు వెళ్లాలంటే కార్డుపై సంతకం చేయించుకోవాలి. దాంతో మధ్యాహ్న భోజనం తర్వాత బయటకు వెళ్లడం తగ్గింది. పాఠశాలకు ప్రత్యేకంగా జెండా రూపకల్పన చేశారు. గణితం దినోత్సవం రోజు లెక్కల ఉపాధ్యాయుడు, సైన్స్‌ డే రోజు ఆ సబ్జెక్టు బోధించే వారు జెండా ఎగరవేస్తారు.

వారెవ్వా.. మొబైల్‌ యాప్‌

మట్టి నుంచి మాణిక్యాల సృష్టి

పేరు: పయ్యావుల రామస్వామి
పనిచేసే పాఠశాల: ఇందిరానగర్‌, సిద్దిపేట
అనుభవం: 20 సంవత్సరాలు

మట్టి నుంచి మాణిక్యాల సృష్టిఏం చేశారంటే: 2015లో ఈ పాఠశాలకు రామస్వామి వచ్చినప్పుడు 400 మందికిపైగా విద్యార్థులుండగా ఇప్పుడు 850 మందికి చేరింది. పదో తరగతిలో 95 శాతానికిపైగా ఉత్తీర్ణత సాధిస్తోంది. చదువుతోపాటు విలువలతో కూడిన విద్య, విద్యేతర కార్యక్రమాలకూ పెద్దపీట వేస్తున్నారు. పాఠశాల వివరాలన్నీ కంప్యూటరీకరించారు. జడ్పీహెచ్‌ఎస్‌ ఇందిరానగర్‌ పేరిట మొబైల్‌ యాప్‌ రూపొందించి పాఠశాలలో జరిగే కార్యక్రమాలను అందులో ఉంచుతారు. వాటిని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. దీంతో బడిపై నమ్మకం పెరిగింది. బడిలో మట్టి నుంచి మాణిక్యాల సృష్టిచేరేందుకు భారీగా విద్యార్థులు వస్తుండడంతో సీట్లు లేవు అని బోర్డు పెట్టాల్సి వస్తోంది. అందుకే గతేడాది ప్రభుత్వం రామస్వామికి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందజేసింది.

వెన్నంటి నిలిచి ప్రతిభను గెలిపించి..

మట్టి నుంచి మాణిక్యాల సృష్టి

పేరు: ఎం.అపర్ణ
పనిచేసే పాఠశాల: నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ కేజీబీవీ (ప్రత్యేకాధికారి)
అనుభవం: 5 సంవత్సరాలు

మట్టి నుంచి మాణిక్యాల సృష్టిఏం చేశారంటే? : ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుందని నమ్మే అపర్ణ అలాంటి వారిని గుర్తించి ప్రోత్సహించారు. వారి సమస్యలు ఏమున్నాయో ఆరా తీసి పరిష్కార మార్గాలు సూచించారు. కృషి చేస్తే చదువులోనూ రాణిస్తావని వెన్నుతట్టారు. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంచేలా నిత్యం కృషి చేస్తున్నారు. రెండేళ్లుగా పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. పాఠాలు సులభంగా అర్ధమయ్యేలా బోధించడంలో తోటి ఉపాధ్యాయులకు సాయపడుతున్నారు. ఫలితంగా 2016-17 విద్యా సంవత్సరానికి జిల్లా స్థాయిలో ఏకలవ్య ప్రతిభా పురస్కార్‌కు అపర్ణతోపాటు విద్యార్థులు ఎంపికయ్యారు. నిరుడు జిల్లా స్థాయి స్వచ్ఛ పాఠశాల పురస్కారానికి కేజీబీవీ ఎంపికైంది. కరాటే, హస్తకళలు తదితర వాటిల్లో జాతీయ స్థాయిలో ముగ్గురు విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు.

 - ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.