Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

త్వరలోనే లాజిస్టిక్స్‌ జోన్‌ పనులు

భూమి అప్పగించిన వెంటనే ప్రారంభం
మచిలీపట్నంలో వెయ్యి ఎకరాలు గుర్తించాం
కృష్ణపట్నం, కాకినాడల్లో ఇన్‌ల్యాండ్‌ కంటైనర్‌ డిపోలు
ఏపీలో సరకు రవాణా రంగానికి ఉజ్వల భవిష్యత్తు
‘ఈనాడు’ ఇంటర్వ్యూలో కాంకార్‌ ఛైర్మన్‌, ఎండీ వి.కల్యాణ రామ
ఈనాడు - అమరావతి

త్వరలోనే లాజిస్టిక్స్‌ జోన్‌ పనులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భూమిని అప్పగించిన వెంటనే మచిలీపట్నంలో వెయ్యి ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్స్‌ మాన్యూఫాక్చరింగ్‌ జోన్‌ (ఐఎల్‌ఎంజెడ్‌) పనులు ప్రారంభిస్తామని కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (కాంకార్‌) ఛైర్మన్‌, ఎండీ వి.కల్యాణ రామ చెప్పారు. దీనికి సంబంధించి గతేడాది ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, జోన్‌ ఏర్పాటు కోసం స్థలం గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. పారిశ్రామికవాడల్లో సాధారణంగా రోడ్లు, ఇతర మౌలిక వసతులతో పాటు విద్యుత్తు, నీరు వంటి సదుపాయాలు కల్పిస్తారని, ఐఎల్‌ఎంజెడ్‌ల్లో ఈ అంశాలతో పాటు లాజిస్టిక్స్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. తయారీదారులకు అవసరమైన ముడి సరుకులు చేరవేయడం, తయారైన వస్తువులను మార్కెట్‌కు తరలించడం వంటి కార్యకలాపాలన్నీ చూసుకుంటామన్నారు. దీంతో తయారీదారులకు సరకు రవాణా అత్యంత సులభతరం అవుతుందన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడకు విచ్చేసిన ఆయన ‘‘ఈనాడు’’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఐఎల్‌ఎంజెడ్‌ ప్రారంభమైతే మచిలీపట్నంలో 50 నుంచి 100 యూనిట్లు వచ్చే అవకాశముందన్నారు. ఏపీతో పాటు చెన్నై, గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ఆరు చోట్ల ఐఎల్‌ఎంజెడ్‌లు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

2020 నాటికి 100 ఇన్‌ల్యాండ్‌ కంటైనర్‌ డిపోలు
కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 83 ఇన్‌ల్యాండ్‌ కంటైనర్‌ డిపో (ఐసీడీ)లు ఉన్నాయి. 2020 నాటికి ఈ సంఖ్యను 100కు పెంచాలనుకుంటున్నాం. అందులో భాగంగా దేశవ్యాప్తంగా త్వరలో ఏడు ఐసీడీలు ఏర్పాటు చేయనున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణపట్నం, విశాఖపట్నంలలో కూడా వీటిని నెలకొల్పుతాం. కృష్ణపట్నంలో 153 ఎకరాల్లో, కాకినాడలో 90 ఎకరాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో చోట తొలిదశలో రూ.50 కోట్లు చొప్పున వెచ్చిస్తున్నాం. ప్రస్తు తం ఆ పనులు జరుగుతున్నాయి. మరో ఆరు నెలల వ్యవధిలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తాం.

దేశవ్యాప్తంగా 20 డిస్ట్రిబ్యూటరీ లాజిస్టిక్స్‌ నోడ్లు
డిస్ట్రిబ్యూటరీ లాజిస్టిక్స్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా 20 నోడ్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఇందులో భాగంగా కొన్ని చోట్ల మేమే సొంతంగా గిడ్డంగులు నెలకొల్పుతాం. మరికొన్ని చోట్ల స్థలాలు ఇచ్చి ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తాం. ఇంకొన్ని చోట్ల గిడ్డంగులను అద్దెకు తీసుకుని అద్దెతో పాటు ఆదాయంలోనూ వాటా ఇస్తాం. ఇలా మొత్తంగా 5 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో గిడ్డంగులు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కృష్ణపట్నంలో ఈ తరహా నోడ్‌ ఒకటి ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. అక్కడ భూమి లభ్యత ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం.

రూ.7,200 కోట్ల ఆదాయం లక్ష్యం
గత ఆర్థిక సంవత్సరంలో రూ.6,500 కోట్ల ఆదాయం ఆర్జించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.7,200 కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏటా ఆదాయంలో వృద్ధి సాధిస్తున్నాం. కీలకమైన పనితీరు సూచీలన్నింటిలోనూ ముందంజలో ఉన్నాం. మా సంస్థల్లో ఉద్యోగులు దాదాపు 1500 మంది. వారితోనే రూ.6,500 కోట్ల ఆదాయం ఆర్జించాం. వినియోగదారుల సంతృప్తి సూచీల్లోనూ ముందున్నాం.

ప్రభుత్వ ఆలోచన అద్భుతం
ఆంధ్రప్రదేశ్‌లో సువిశాల తీరప్రాంతాన్ని ఉపయోగించుకుని అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ ఆలోచన అద్భుతం. సరకు రవాణా రంగానికి రాష్ట్రంలో మంచి భవిష్యత్తు ఉంది. ఏపీలో ఇప్పటికే కాంకార్‌కు సంబంధించిన పలు సదుపాయాలున్నాయి. తాజాగా విశాఖపట్నంలో రూ.420 కోట్లతో మల్టీమోడల్‌ లాజిస్టిక్స్‌ అభివృద్ధి చేశాం. ఇప్పటికే కార్యకలాపాలు కూడా ప్రారంభించాం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.