Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

రుణమాఫీ తాత్కాలిక ఊరటే 

ఆధునిక సాంకేతికతను వారికి చేరువచేస్తే దీర్ఘకాలంలో సత్ఫలితాలు 
విపణులకు నేరుగా పంటలను చేర్చగలిగితేనే ఆదాయాలు పెరుగుతాయి 
దళారుల సంఖ్య పెరిగే కొద్దీ రైతుకు నష్టమే 
రైతుబంధు ఇతర రాష్ట్రాల్లోనూ ఇవ్వాలి 
భారత వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్‌ జనరల్‌ 
రాజ్‌ పరోడతో ‘ఈనాడు’ ముఖాముఖి 
ఈనాడు - హైదరాబాద్‌

రుణమాఫీ తాత్కాలిక ఊరటే 

‘‘తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం వాస్తవికంగా, వినూత్నంగా ఉంది. దీనిని ఇతర రాష్ట్రాల్లోనూ అమలుచేస్తే మంచిది. ఈ సొమ్మును వ్యవసాయ పనులకే వాడుతున్నారా లేక ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారా అనేది మనం శ్రద్ధగా చూడాలి. రైతులకిచ్చే రాయితీలను మధ్య దళారులు మింగేయకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తే సేద్యానికి ఉపకరిస్తాయి’’
- ఐసీఏఆర్‌ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ రాజ్‌ పరోడ

ధునిక పరిజ్ఞానాన్ని చేరువచేయటం ద్వారానే వ్యవసాయదారుల సమస్యలను చాలా వరకు పరిష్కరించగలమని భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్‌) మాజీ డైరెక్టర్‌ జనరల్‌(డీజీ) రాజ్‌ పరోడ స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తులను రైతు నేరుగా విపణులకు తరలించి విక్రయించుకోగలిగినప్పుడే వారి ఆదాయాలు పెరుగుతాయని తెలిపారు. పంటల రుణాల మాఫీ తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, ప్రతి ఏటా మాఫీ సాధ్యం కాదని తేల్చిచెప్పారు. దీర్ఘకాలం ఐసీఏఆర్‌కి డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేసిన రాజ్‌ పరోడ దేశంలో వ్యవసాయ విద్యారంగంలో అనేక మార్పులు ప్రవేశపెట్టారు. 30 వరకూ జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థల ఏర్పాటులో కీలకపాత్ర వహించారు. కేంద్ర వ్యవసాయ విద్య, పరిశోధన శాఖ కార్యదర్శిగా, హరియాణా రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ కమిషన్‌ ఛైర్మన్‌గా సేవలందించారు. హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ’ఈనాడు’తో రాజ్‌పరోడ ముఖాముఖి మాట్లాడారు. 
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2022ని గడువుగా విధించుకొని మూడేళ్లు పూర్తయ్యాయి. రైతుల ఆదాయం పెరగకపోగా ఇంకా తగ్గుతోంది! సమస్య ఎక్కడుంది? 
రైతుల ఆదాయం పెరగాలన్నదే ప్రధానం. అది నిజం కావాలి. అందుకు 2022 అనే గడువు ముఖ్యం కాదు. రైతుల ఆదాయం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలు, కార్యక్రమాలు ప్రారంభించింది. తక్కువ వడ్డీకి రుణాలిస్తోంది. పంటల బీమా, సాగునీటి పథకాలు, ఈనామ్‌ వంటివన్నీ రైతుల ఆదాయం పెంచాలన్న కోణంలో అమలవుతున్నవే. అవి ఎంత సమర్థంగా అమలవుతున్నాయనేది ముఖ్యం. వాటి ఫలితాల ఆధారంగా రైతుల ఆదాయం ఎంత పెరుగుతుందనేది చెప్పవచ్చు. 
ఇజ్రాయెల్‌ మాదిరి మార్కెటింగ్‌ వ్యవస్థ మనదేశంలో ఏర్పాటు సాధ్యమేనా? 
బాగా వెనుకబడిన రాజస్థాన్‌ రాష్ట్రంలో పుట్టి పెరిగాను. డిగ్రీ చదువుకునేటప్పుడు సైతం మా పట్టణంలో ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట మాత్రమే రెండు పండ్ల దుకాణాలుండేవి. బంధువులు ఎవరికైనా సుస్తీ చేస్తే ఆ దుకాణాలకు వెళ్లి పండ్లు కొని తెచ్చి ఇచ్చేవాళ్లం. ఇప్పుడు చూడండి. చిన్న గ్రామాల్లోనూ పండ్ల దుకాణాలుంటున్నాయి. మార్కెటింగ్‌ వ్యవస్థ విస్తరించడం అంటే అదే. కూరగాయలు, పండ్లు నేరుగా రైతుల నుంచి ప్రజలే కొంటున్నారు. బియ్యం, మొక్కజొన్నలు వంటివీ నేరుగా రైతుల నుంచి కొనే వ్యవస్థలు ఏర్పాటు కావాలి. ముగ్గురు, నలుగురు దళారుల చేతులు మారటం వల్ల రైతులకు రావాల్సిన ఆదాయం వారికే పోతోంది. 
ప్రభుత్వపరంగా ఏం చర్యలు తీసుకోవాలి? 
పొలాల నుంచి పంట వినియోగదారులకు చేరేలోగా నష్టాలు అధికంగా ఉంటున్నాయి. అక్కడ సరైన నిర్వహణ చాలా ముఖ్యం. ఈ విషయంలో యువత సేవలను బాగా ఉపయోగించుకోవాలి. వారిని మార్కెటింగ్‌ ఏజెంట్లుగా వాడుకోవాలి. రైతుల నుంచి పంటను నేరుగా తీసుకుని వినియోగదారులకు వారు సులభంగా చేర్చవచ్చు. మార్కెటింగ్‌ నైపుణ్యాలపై యువతకు శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించాలి. వ్యవసాయదారుల ఉత్పత్తుల కంపెనీ (ఎఫ్‌పీఏ) చట్టం వచ్చి చాలా రోజులైంది. వీటిద్వారా రైతులకు ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. కానీ ఇప్పటికీ మారుమూల గ్రామాలలోని పేద రైతులకు వీటి గురించి అంతగా తెలియదు. 
సేంద్రీయ వ్యవసాయంపై వ్యవసాయ డిగ్రీ కోర్సులు పెట్టకపోవడం ఐసీఏఆర్‌, వ్యవసాయ వర్శిటీల వైఫల్యం కాదా ? 
సేంద్రీయ వ్యవసాయం అనేది ప్రస్తుత వ్యవసాయానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రజల కొనుగోలు శక్తి ఎంత ఉందనేది చూడండి. ఇప్పటికీ దేశంలో 60 శాతం మందికి తక్కువ ధరలకు బియ్యం, గోధుమలను ప్రభుత్వాలు చౌకధరల దుకాణాల ద్వారా ఇస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో సేంద్రీయ బియ్యం పేరుతో కిలో రూ.200 చొప్పున అమ్ముతున్నారు. ఆ దేశాలతో  పోల్చి మన ప్రజల్నీ అలా కొనమనడం సాధ్యమవుతుందా. సేంద్రీయ పంటల సాగు మంచిదే. సేంద్రీయ వ్యవసాయం చేయమని చెప్పడం సులభమే. కానీ రసాయన ఎరువులు అందించినంత సులభంగా సేంద్రీయ, జీవన ఎరువులు, పురుగుమందులు ఎక్కడ నుంచి తెచ్చి ఇవ్వగలం. సేంద్రీయ పంటలపై వ్యవసాయ పరిశోధనలు జరుగుతున్నాయి. రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని నియంత్రించడానికి శాస్త్రవేత్తలు చురుగ్గా పరిశోధనలు చేస్తున్నారు. 
వ్యవసాయానికి యువత దూరంగా ఉంటోంది. వారిని ఇటువైపు మళ్లించడం సాధ్యమేనా? 
ఇటీవల దిల్లీలో యువతను వ్యవసాయంలోకి ఆకర్షించడం ఎలా అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించాం. త్వరలో జయశంకర్‌ యూనివర్శిటీలోనూ సదస్సు పెట్టబోతున్నాం. ఇప్పటికే ఉన్నత విద్యావంతులైన కొందరు వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా బాగా రాణిస్తున్నారు. ప్రతీ రైతు కుటుంబం కూడా తమ బిడ్డలు వ్యవసాయేతర రంగాల్లోకి వెళ్లాలనే కోరుకుంటున్నారు. యువత కూడా వ్యవసాయం కన్నా ఉద్యోగాలే మేలనుకుంటోంది. కానీ వ్యవసాయంలో అద్భుతాలు చేస్తున్న యువకులూ అనేక మంది ఉన్నారు. 
పంట రుణాల మాఫీకి దేశవ్యాప్తంగా డిమాండ్లు వస్తున్నాయి. ఇది రైతులకు ఉపకరిస్తుందా? 
పంట రుణ మాఫీకన్నా రైతులకు ఆధునిక పరిజ్ఞానం అందించడంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. పంట రుణాలు తీసుకున్న వారికి ప్రతీ ఏడాది మాఫీ చేయలేం కదా? ఒకసారి మేలైన పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తే వారికి ఎల్లవేళలా ఉపకరిస్తుంది.  పంటరుణాలను కొందరు వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు. దానిని మాఫీ చేయడం వ్యవసాయానికి మేలు చేయడం ఎలా అవుతుంది? 
పంటలకు సరైన ధరలు ఇవ్వకుండా రైతుల ఆదాయం పెôచడం సాధ్యమేనా? 
పంటలకు గిట్టుబాటు ధర రావాలంటే రైతులకు మార్కెటింగ్‌ వ్యవస్థ అనుసంధానం కావాలి. ఇజ్రాయెల్‌లో రైతు తోటలో పూలు కోసిన మరుసటి రోజుకల్లా నెదర్లాండ్స్‌ మార్కెట్‌కు పంపి విక్రయిస్తున్నారు. అతనికి రావాల్సిన సొమ్ము నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతోంది. ఇలా రైతులకు అంతర్జాతీయ, జాతీయ మార్కెటింగ్‌ వ్యవస్థ అందుబాటులోకి రావాలి. ఎలక్ట్రానిక్‌ జాతీయ వ్యవసాయ మార్కెట్‌(ఈ-నామ్‌) వంటివి ఇందుకు ఉపయోగపడతాయి. 
వ్యవసాయ పరిశోధనలు రైతులకు సులభంగా చేరడం లేదనే విమర్శలున్నాయి ? 
వ్యవసాయ పరిశోధనలు సరిగా జరకగపోతే, రైతులకు చేరకపోతే పంటల దిగుబడులు ఎలా పెరుగుతున్నాయి! ఉద్యాన పంటల దిగుబడులు ఆహారధాన్యాల కంటే అధికంగా వచ్చాయి. అన్నిచోట్లా కూరగాయలు, పండ్లు ఇప్పుడు లభిస్తున్నాయంటే ఇందుకు వ్యవసాయ పరిశోధనలే కారణం. మత్స్య ఉత్పత్తి కూడా బాగా పెరిగింది. దేశవ్యాప్తంగా ఒకప్పుడు ఏటా 50 లక్షల టన్నుల చేపలు మార్కెట్‌కు రాగా ఇప్పుడు కోటీ 10 లక్షల టన్నులు వస్తున్నాయి. చెరువుల్లోనూ చేపల ఉత్పత్తి పెరిగింది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.