close

ప్ర‌త్యేక క‌థ‌నం

దేశం... నవ యవ్వనాశ్వం!   

అద్భుత అవకాశం!

దేశం... నవ యవ్వనాశ్వం!   

ఈ భూమండలం మీద మరే దేశానికీ దక్కని అపూర్వమైన అవకాశం మన సొంతమవుతోంది. ఉరకలెత్తే ఉత్సాహంతో, ఎగసిపడే ఆకాంక్షలతో నవశక్తికి మారుపేరుగా నిలబడే యువత.. ప్రపంచంలో మరెక్కడా లేనంతగా మన దేశంలోనే ఉండబోతున్నారు! దేశంలో ఇప్పుడు 50% పైగా జనాభా 25 ఏళ్లలోపువారే. 2020 నాటికల్లా 35.6 కోట్ల మంది యువతీ యువకులతో ప్రపంచం మొత్తమ్మీద యువ జనాభా అత్యధికంగా ఉన్న దేశంగా మనం చరిత్ర సృష్టించబోతున్నాం. మరి ఈ అమోఘ యువశక్తిని పొదివి పట్టుకుని... దీన్ని సామాజికంగా, ఆర్థికంగా, సాంకేతికంగా సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుని.. దేశాన్ని నవ యవ్వనాశ్వంలా పురోగమన పథంలో పరుగులు పెట్టించేదెలా? ఈ నూతన సంవత్సర ఘడియల్లో ఇదే మన ముందున్న పెద్ద సవాల్‌!

యువత అంటే ప్రవహించే శక్తి. నవ యవ్వనంతో తొణికిసలాడే ఉత్తేజం. అందుకే దేశంలో యువ జనాభా ఎంత ఎక్కువగా ఉంటే ఉత్పాదకత అంత పెరిగే అవకాశం ఉంటుంది. దేశానికి వేగంగా పురోగమన పథంలో పయనించే శక్తి పెరుగుతుంది. ఈ అరుదైన అవకాశం ఇప్పుడు మనకు దక్కుతోంది!

దేశం... నవ యవ్వనాశ్వం!   

మన దేశం ప్రపంచంలోనే అత్యంత నవ యవ్వన దేశం కాబోతోంది. దేశంలో ఇప్పుడు 50% పైగా జనాభా 25 ఏళ్లలోపువారే. 35 ఏళ్ల లోపు వారు దాదాపుగా 65% వరకూ ఉన్నారు. వచ్చే ఏడాది (2020) కల్లా మన దేశ జనాభా సగటు వయసు 29 సంవత్సరాలు కాబోతోంది. అప్పటికి చైనా జనాభా సగటు వయసు 37, జపాన్‌ 48!

2020 నాటికి మన దేశంలో 35.6 కోట్ల మంది యువతీయువకులతో ప్రపంచంలో యువ జనాభా అత్యధికంగా ఉన్న దేశంగా అవతరించబోతున్నాం!

దేశం... నవ యవ్వనాశ్వం!   

నిన్నటి భారం.. నేడు శక్తి 
ఇన్నేళ్లుగా మనం అధిక జనాభాను భారంగా భావిస్తున్నాం. ఇప్పుడీ పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. దేశ జనాభాలో యువత పెరుగుతున్న నేపథ్యంలో ఇక మీదట మన జనాభానే మనకు కొండంత బలం కాబోతోంది. అయితే ఈ భారీ యువ బలాన్ని నిర్మాణాత్మకంగా వినియోగించుకోగలిగితేనే మనకు పురోగమన ఫలాలు దక్కుతాయి. ఎన్నో అసమానతలు, అవరోధాలు, అంతరాలు రాజ్యమేలుతున్న మన సమాజంలో ఈ యువశక్తి మొత్తాన్నీ ఒక్క తాటి మీదకు తెచ్చి, లక్ష్య సాధనకు వినియోగిస్తే మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా, అగ్రరాజ్యాల సరసన చేరటం కష్టమేం కాదన్నది అబ్దుల్‌ కలాం వంటి దార్శనికుల మాట. అందుకే ఈ నవ్యాబ్ది ఘడియల్లో దీనిపై మరింతగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

యువత ఎందుకు ముఖ్యం? 
సమాజంలో ఎప్పుడూ కూడా మార్పు వేగంగా ప్రతిఫలించేదీ, ప్రస్ఫుటంగా కనబడేది యువతలోనే! సాంకేతిక పురోగతి నుంచి సామాజిక తారతమ్యాలను అధిగమించటం వరకూ.. చాలా అంశాల్లో యువతే ముందుంటుంది. అందుకే ‘‘ప్రజల వైఖరిలో మార్పు వచ్చిన ప్రతిసారీ.. మెరుగైన సమాజాన్ని నిర్మించేందుకు కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ విషయాన్ని మనం విస్మరించకూడదు’’ అంటారు యువ మనస్తత్వ అధ్యయనవేత్త జేన్‌ బకింగ్‌హామ్‌.

ఇప్పటి నుంచే ప్రణాళిక 
యువత రాజకీయాల్లోకి వచ్చేలా, రాజకీయ చైతన్యంతో వ్యవహరించేలా చేయటం తక్షణావసరమని విశ్లేషకులంతా భావిస్తున్నారు. 2019లో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో దాదాపుగా 13 కోట్ల మంది యువతీయువకులు తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. వీళ్ల సంఖ్య జపాన్‌ దేశ జనాభా కంటే ఎక్కువ. అందుకే రాజకీయంగా కూడా యువతకు ఉపాధి, యువతలో రాజకీయ చైతన్యం అన్నది కీలకాంశం కాబోతోంది. కీలక విధాన రూపకల్పనలో యువతపై దృష్టి పెడితే ఆశక్తిని పూర్తిగా సద్వినియోగం చేసుకునే వీలుంటుందని ఐరాస హాబిటాట్‌ వంటి నివేదికలు నొక్కి చెబుతున్నాయి. ముఖ్యంగా తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదగటానికి ఇదో అపురూప అవకాశం. కేవలం దీని కారణంగానే మన జీడీపీ వృద్ధిరేటు కనీసం 2% పెరిగే అవకాశం ఉంటుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు.

అవకాశాల్లో అంతరాలు 
యువతకు విద్య, ఉపాధి అవకాశాల విషయంలో ప్రాంతీయ అంతరాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రకరకాల నైపుణ్యాల్లో తర్ఫీదు మెరుగ్గా ఉండటం వల్ల ఈ అవకాశాన్ని ఆ రాష్ట్రాలు ముందుగా అందిపుచ్చుకుంటాయి. అందుకే సమాజంలో వివిధ వర్గాల మధ్య, ప్రాంతాల మధ్య అంతరాలను తగ్గించటం, అందరికీ సమాన అవకాశాలు లభించేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.

కలాం స్వప్నానికి చేద్దాం సలాం!

దేశం... నవ యవ్వనాశ్వం!   

అబ్దుల్‌ కలాం ఓసారి 10 ఏళ్ల చిన్నపిల్లను ‘నీ కల ఏమిటి?’ అని అడిగారు. వెంటనే ఆ పాప ‘‘నేను అభివృద్ధిచెందిన భారతదేశంలో ఉండాలనుకుంటున్నా’’ అన్నది. ఆ మాటకు విస్తుబోయి, ఎంతో ముచ్చటపడిన కలాం.. వెంటనే ‘ఇండియా 2020’ పేరుతో పుస్తకం రాశారు. 1998లో వెలువడిన ఈ పుస్తకం, దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘బియాండ్‌ 2020’లలో అమెరికా, చైనా, మలేసియా వంటి దేశాల తరహాలో భారత్‌ కూడా ఒక విస్పష్ట దార్శనిక విధానంతో, సాంకేతికతనూ, యువశక్తినీ మేళవించటం ద్వారా అద్భుతమైన పురోగతి సాధించటం సాధ్యమేనన్న ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేయటం విశేషం.
1 నేటి ‘టెక్‌ సావీ’ యువత సమాజంలో ఎంతటి బలంగా ఉందో ‘సోషల్‌ మీడియా’లో అంతకంటే ప్రభావవంతంగా పని చేస్తోంది. అందుకే నేటి యువతను చేరుకోటానికి, నడిపించటానికి సోషల్‌ మీడియాను మరింత సమర్థంగా వినియోగించటం ఎలాగన్నది నేటి పరిశోధకుల ముందున్న పెద్ద సవాల్‌! వారిని నిర్మాణాత్మక బాట పట్టించేందుకు ప్రత్యేకంగా యాప్‌ల వంటివి ఉండాలి!

2 నానాటికీ సామాజికంగా, ఆర్థికంగా కలిగిన వారికీ - ఇతరులకూ మధ్య అంతరాలు పెరుగుతున్న మాట వాస్తవం. మత ఛాందసం, మహిళల పట్ల వివక్ష, సాంకేతిక అగాధాల (డిజిటల్‌ డివైడ్‌) వంటివి పెరుగుతున్నాయి. ఈ 
నేపథ్యంలో సమాజంలో ఐక్యత, కలుపుకుపోయే తత్వం పెరగటంలో యువతే కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

3 సతి, బాల్య వివాహాల వంటి కొన్ని మూఢాచారాలు తగ్గినా ఇప్పటికీ వరకట్నం, గృహ హింస, వృద్ధుల పట్ల నిరాదరణ, మాదకద్రవ్యాలు, సైబర్‌ నేరాలు, అవినీతి వంటి ఎన్నో సమస్యలు మన సమాజాన్ని పీడిస్తూనే ఉన్నాయి. ఒకరకంగా ఇవన్నీ ఏదో రూపంలో యువతతో ముడిపడినవే. అందుకే నేటి యువతలో సామాజిక స్పృహ, చైతన్యం పెంచే కార్యక్రమాలను ప్రోత్సహించాలి.

4  ఆర్థికంగానూ, సాంకేతికంగానూ దేశంలో వస్తున్న మార్పుల వల్ల యువత వైఖరిలో కూడా గణనీయమైన మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ విలువలు, నైతిక వర్తన వంటి విషయాల్లో తేడాలు సుస్పష్టం. ఈ విషయంలో యువతకు అవసరమైన మానసిక, సామాజిక మద్దతునిచ్చే వ్యవస్థలు మరింత పెరగాలన్న వాదన వినపడుతోంది.

- ఈనాడు ప్రత్యేక విభాగం

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.