Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

అబ్బ.. అంత బిజీనా?

అబ్బ.. అంత బిజీనా?

ఎవరిని కదిపినా.. ఏం చెయ్యాలన్నా..
ఇప్పుడు వినిపించే మాట ఒకటే... ‘టైమ్‌ లేదు’

బిజీ, బిజీ.. నేటి మన జీవితం సమూలంగా మారిపోయింది. ఆధునిక జీవితం అంటేనే ‘క్షణం తీరిక లేకపోవటం’ అని చెప్పుకొనేంతగా తయారయ్యాయి పరిస్థితులు! చిన్నాపెద్దా తేడా లేకుండా ఎవర్ని పలకరించినా.. ఉరుకులు పరుగుల హడావుడి కథలే వినిపిస్తున్నాయి. అనుమానమేం లేదు. దీనివల్ల మనం ఆరోగ్యపరంగా కూడా భారీ మూల్యమే చెల్లిస్తున్నాం. అయితే నేటి మన జీవితాల్లో కనిపించే ఈ ‘హడావుడి’ నిజంగా, అనివార్యంగా వచ్చి చేరుతున్నదేనా? లేక దీన్ని మనమే కొని తెచ్చుకుంటున్నామా? అన్నది ఇప్పుడు కీలకం. కొంతకాలంగా పరిశోధకులను కూడా వేధిస్తున్న ప్రశ్న ఇది.
ఈ నూతన సంవత్సర ఆరంభ ఘడియల్లో మనల్ని మనం తరచి చూసుకుని.. మన జీవన శైలిని చక్కదిద్దుకోవటం చాలా అవసరమని, ఇది చాలా వరకూ మన ఆలోచనల్లోనే ఉందని నొక్కి చెబుతున్నారు మనస్తత్వ విశ్లేషకులు. అదెలా?

అబ్బ.. అంత బిజీనా?

గురి చూసి పనిబడదాం!

పని.. పని.. పని..

ఆధునిక జీవితం అంటే ‘ఒత్తిళ్ల మయం’ అన్నదే అందరి నమ్మకం. ఇళ్లలో, ఆఫీసుల్లో రకరకాల లక్ష్యాలు, గడువులు.. కాలంతో పాటు పరుగులు.. ఒకప్పటి కంటే నేడు మన జీవితం అనూహ్యమైన పని ఒత్తిడి మధ్య నలిగిపోతోందన్న భావన అందరిలోనూ బలంగా ఉంది. పారిశ్రామికంగా ముందున్న దేశాల్లో జరిగిన పలు సర్వేల్లో కూడా చాలామంది ఈ మాటే చెప్పారు. ఈ పని భారం వల్ల కుటుంబానికి కూడా ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నామనీ, జీవితంలో తమకు ‘పని-ఇల్లు’ తప్పించి మరో ప్రపంచమన్నదే లేకుండా పోతోందని ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అనుమానమేం లేదు. నేటి జీవితాల మీద ‘పని ఒత్తిడి’ అన్నది బలమైన ప్రభావం చూపిస్తున్న మాట వాస్తవం. అయితే నిజంగానే ఇలా ‘క్షణం తీరిక లేనంతటి పని’ ఉందా? లేక ఉద్యోగులే అలాంటి అభిప్రాయంలో కూరుకుని, ఆ ప్రభావంలో ఉండిపోతున్నారా?

అనుమానం ఇటీవలి కాలంలో మనస్తత్వ విశ్లేషకులకూ వచ్చింది. దీనిపై అధ్యయనాలూ ఆరంభమయ్యాయి. వీటిలో గుర్తించిందేమంటే.. ఉద్యోగులంతా క్షణం తీరిక లేకుండా పనితో సతమతమవుతున్నామని చెబుతున్నా గత కొన్ని దశాబ్దాలతో పోలిస్తే  ‘చేస్తున్న పనిలోగానీ, ఉత్పాదకతలోగానీ పెద్దగా తేడా ఏమీ లేదని’ ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ‘సెంటర్‌ ఫర్‌ టైమ్‌ యూజ్‌ రీసెర్చ్‌’  పరిశోధకులు జొనధన్‌ గర్‌షునే బృందం గుర్తించింది. అంతేకాదు.. పిల్లలతో సమయం గడపలేకపోతున్నామని ఆందోళన చెందుతున్న చాలామంది తల్లిదండ్రుల దైనందిన జీవితాలను పరిశీలించినా.. అది పూర్తి వాస్తవం కాదనీ, నిజానికి వీళ్లు కూడా మిగతా తల్లిదండ్రులతో సమంగానే సమయాన్ని గడుపుతున్నారని గుర్తించారు. దీనర్థం, ఉద్యోగులకు మానసికంగా ఒత్తిడి లేదని కాదు. నిజంగా తమకున్న పని కంటే కూడా ‘పని భారాన్ని’ ఎక్కువగా అనుభవిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.

ఎక్కడుంది మూలం?
ఉత్పాదకతలో పెద్దగా మార్పు లేకపోయినా ఉద్యోగులంతా తీరిక లేనంతటి పని ఒత్తిడిని అనుభవిస్తుండటానికి మూలం ఎక్కడుందని తరచి చూసినప్పుడు ఎన్నో ఆశ్చర్యకరమైన అంశాలు పరిశోధకుల దృష్టికి వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నూతన ఆర్థిక వ్యవస్థల్లో ‘సమయం’ అన్నది మరింత విలువైనదిగా తయారైంది. ఇప్పుడు చాలా ఉద్యోగాల్లో గంటలు, నిమిషాలు మరింత విలువైనవిగా మారటంతో అదే గంట సమయంలో మరింత ఎక్కువ పని చెయ్యాలన్న భావన ఉద్యోగుల్లో పెరుగుతోందని, ఇదే ఒత్తిడికి ఆస్కారమిస్తోందని పరిశోధకులు గుర్తించారు. అలాగే పని తీరు మారిపోవటం కూడా ఒక కారణం. ఒకప్పుడు వ్యవసాయ పనులు, పరిశ్రమల్లో పనుల వంటివి కేవలం నిర్దిష్ట సమయాల్లోనే చెయ్యాల్సి వచ్చేది. పొలం పనులైతే పగటి పూట మాత్రమే, అదీ పంట అదను వచ్చినప్పుడే చెయ్యాల్సి ఉండేది. అలాగే పరిశ్రమల్లో కూడా యజమానులు కార్మికులతో ఎక్కువ పని చేయించాలని చూసినా, నిర్దిష్టమైన పని గంటల తర్వాత, అందుబాటులో ఉన్న ముడిసరుకును మించి అది సాధ్యమయ్యేది కాదు. కానీ నేడు కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ వంటి సాంకేతిక విప్లవాల తర్వాత ఇప్పుడు ‘నిర్దిష్టమైన పని గంటలు’ అన్న భావన చెరిగిపోయింది.

ఉన్న పనిని మించి..
కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న మెయిళ్లు, మెసేజ్‌లు, గంటగంటకూ సమీక్షలు, మీటింగులు, అనూహ్యంగా వచ్చిపడుతున్న గణాంకాలు, నిరంతరం రకరకాల వ్యక్తులను సంప్రదిస్తూ పనులను పర్యవేక్షిస్తుండటం.. ఇలా ప్రతిదీ ఒకప్పటి కంటే, అవసరాని కంటే కూడా ఎక్కువగానే ఉంటోందని ఆధునిక ఉద్యోగ విశ్లేషకులు అంటున్నారు. ప్రతి చేతిలోనూ మొబైల్‌ వంటివి ప్రత్యక్షమైన తర్వాత ఇంట్లో, ఆఫీసుల్లో కూడా చెయ్యాల్సిన పనుల జాబితా అనూహ్యంగా పెరిగిపోతోంది. ఇలా అందుబాటులో ఉన్న సమయానికి మించి, పనులు పెరిగిపోవటం, అవీ సమయాన్ని హరించివేసేవి కావటం వల్ల ప్రతి ఒక్కరూ పని పెరిగిన భావనకు లోనవుతున్నారు.

ఆలోచనలూ మారాయి..
ఒకప్పుడు పని చెయ్యకుండా, కడుపులో చల్ల కదలకుండా కూర్చోవటం గొప్పగా భావించేవాళ్లు. అలాంటి వారి గురించి గొప్పగా చెప్పుకొనేవాళ్లు కూడా. కానీ ఈ ఆధునిక కాలంలో ‘ఎంత బిజీగా ఉంటే అంత గొప్ప’ అన్న భావన ప్రబలటం కూడా లేనిపోని ఒత్తిళ్లకు కారణమవుతోంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులున్న వాళ్లంతా తాము ‘చాలా బిజీ’ అని చెప్పుకోవటానికే ఇష్టపడుతుండటం గమనార్హం. కొత్తతరం ఆఫీసుల్లో జీతభత్యాల పెంపుదల విషయంలో కూడా ‘బిజీగా కనిపించే వారికే’ ప్రాధాన్యం లభిస్తోందని, ఈ కోణాన్ని విస్మరించటానికి లేదని ఆర్గనైజేషనల్‌ సైకాలజిస్టులు గుర్తు చేస్తున్నారు. ఒక దశకు చేరుకునే సరికి ‘బిజీగా ఉండటం’ అన్నది కూడా ఒక రకమైన వ్యసనంగా మారిపోతోందని, కాబట్టి క్షణం తీరిక లేకుండా ఉండాలన్న ధోరణిని వదులుకుని.. మనం చెయ్యాల్సిన పనులను ఒక ప్రాధాన్య క్రమంలో, పూర్తిగా మనసుపెట్టి చేయటం ముఖ్యమన్నది నిపుణుల విస్పష్ట సూచన!

బిజీగా లేకపోతే భయం!

అబ్బ.. అంత బిజీనా?

ప్పుడూ మన కన్ను గడియారం మీద ఉండటం వల్ల జీవితంలో తీరిక అన్న భావన కొరవడుతోంది. తీరిక దొరికినా కూడా దాన్ని ‘సద్వినియోగం’ చేసుకోవటం లేదన్న ఆందోళన, ‘పనికొచ్చే పని’ చేయటం లేదన్న ఒత్తిడికి లోనవుతుండటం మరో కీలకాంశం. అమెరికా వంటి అభివృద్ధి చెందిన సమాజాల్లో ‘ఉత్పాదకత (ప్రోడక్టివిటీ)’ను సమయంతో కొలవటం ఆరంభించటంతో ఉద్యోగులు, ప్రజలు తాము ఎంత బిజీగా ఉంటే సమయాన్ని అంతగా సద్వినియోగం చేసుకున్నామన్న ధోరణిలోకి వెళ్లిపోతున్నారు. అందుకే ఈ ‘పనికి రాని, పనికొచ్చే’ అన్న భావనను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవటం అవసరమని, దైనందిన జీవితంలో ప్రతి చిన్న అంశానికీ దీన్ని వర్తింపజెయ్యాలని చూడటం తగదని విశ్లేషకులు సూచిస్తున్నారు.

బిజీ బిజీ... యటపడేదెలా?

అబ్బ.. అంత బిజీనా?

* ఎంత బిజీగా ఉంటే అంత గొప్ప అన్న భావన వదిలించుకోవాలి.
* బిజీగా కనిపిస్తేనే ఉద్యోగానికి భద్రత ఉంటుందని భావించటం కూడా సరికాదు. నాణ్యమైన పని మీద దృష్టిపెట్టాలి.
* ఉద్యోగాల్లో పదోన్నతుల నుంచి మార్కెట్లో ఆఫర్ల వరకూ.. ‘దేన్ని చేజార్చుకుంటామో’ అన్న ఆతృత వదిలించుకోవాలి.
* సామాజిక మాధ్యమాలు మన సమయాన్ని తినేస్తూ.. పరోక్షంగా తీరిక లేకుండా చేస్తున్నాయన్న వాస్తవాన్ని గుర్తించి వాటిని పరిమితుల్లోనే ఉంచాలి.
* తీరికగా ఉండటం తప్పన్న మానసిక దౌర్బల్య భావన నుంచి బయటపడాలి.
* నిజమైన, ప్రాధాన్యం ఉన్న పనులను దాట వేయటానికో, లేక తప్పించుకోవటానికో మనల్ని మనం ‘బిజీగా ఉన్నామన్న’ భావనలోకి నెట్టుకోవటం కూడా సరికాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లోనూ, ఆఫీసుల్లోనూ కూడా మనం చెయ్యాల్సిన పనులకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి, ఆ క్రమంలోనే వాటిని నెరవేర్చటం వల్ల అనవసరపు ఒత్తిళ్లు దరిజేరవు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.