close

ప్ర‌త్యేక క‌థ‌నం

రేపటి కాలానికి...

రేపటి కాలానికి...

 

ఒకవైపు..
దేశంలో ప్రైవేటు రంగం, ప్రైవేటు ఉద్యోగాలు అనూహ్యంగా విస్తరిస్తున్నాయి. సర్కారీ కొలువులు, వాటితో పాటు వచ్చే భరోసా, భద్రతలను ఇప్పుడు ఊహించటం కూడా కష్టం. ముఖ్యంగా ‘ఉద్యోగం చేసినంత కాలం జీతం, ఆ తర్వాత జీవించి ఉన్నంత కాలం పింఛన్‌’ అన్న భావన కనుమరుగైపోతోంది.

మరోవైపు...
ప్రజల ఆయుర్దాయం గణనీయంగా పెరుగుతోంది. ఇవాళారేపూ పదవీ విరమణ చేస్తున్న వాళ్లను ఎవరిని చూసినా..  58, 60 ఏళ్లు వచ్చేశాయని అధికారికంగా తప్పనిసరి విరమణలు తీసుకోవటమేగానీ.. వాళ్లలో వృద్ధాప్య ఛాయలు మచ్చుకు కూడా కనబడటం లేదు. విరమణ తర్వాత కూడా 2-3 దశాబ్దాల పాటు హాయిగా, అన్ని బాధ్యతలతో జీవితం గడపాల్సిన పరిస్థితి!

మరి ఉద్యోగం లేక, పింఛన్‌ లేక.. ఆ వయసులో 20-25 ఏళ్ల పాటు నిశ్చితంగా బండిలాగాలంటే ఎలా?
ఇప్పుడు దేశంలో ఎంతోమంది ప్రైవేటు ఉద్యోగులను పలకరిస్తున్న పెద్ద సమస్య ఇది! ఎవరైనా అప్పటికప్పుడు చెయ్యగలిగిందేం ఉండదు. నేటి నుంచే రేపటి కోసం ప్రణాళిక వేసుకోకపోతే.. ఎంత కలిగిన వారికైనా విరమణ తర్వాత జీవితం కష్టాల మయం కావటం తథ్యం. అందుకు ఈ కొత్త సంవత్సర ఘడియల్లో మనం ఏం చేస్తే మేలు?

చివర్లో చింతలేల?

రేపటి కాలానికి...

కొత్త సంవత్సరం..
పాతగా గడిపేస్తామా? అర్థం లేదు.
కొత్త ఆశలతో.. జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపుకొనేందుకు..
ముఖ్యంగా మారుతున్న కాలానికి తగ్గట్లుగా అందమైన
రేపటి కోసం.. కొత్త ప్రణాళికలు వేసుకునేందుకు..
ఇదో మహదవకాశం!

కాలం మారిపోయింది. ‘‘షష్టిపూర్తి కూడా అయిపోయింది.. ఆ వచ్చే పింఛను డబ్బులతో నేడో, రేపో.. అంటూ కాలం వెళ్లదీస్తున్నానురా’’ అన్న మాటలు ఇప్పుడు పాత సినిమాల్లో తప్పించి మనకు బయట వినిపించే పరిస్థితే లేదు. ఎటు చూసినా ఆరు పదులు దాటిన తర్వాత కూడా నిశ్చింతగా, ఉత్సాహంగా కనిపించేవాళ్లే ఎక్కువగా కనబడుతున్నారు. కారణం.. మన సగటు ఆయుర్దాయం గణనీయంగా పెరిగింది. దీని ఫలితంగా ఇప్పుడు చాలా రంగాల్లో మన ప్రణాళికలు తల్లకిందులవుతున్నాయి.

1994 వరకూ కూడా మన సగటు ఆయుర్దాయం 60 ఏళ్లలోపే. కాబట్టి అప్పట్లో ఉద్యోగ విరమణ తర్వాత జీవితం బహు స్వల్పం. దానికి తగ్గట్టుగా ఏదో కొద్దిగా నాలుగు రాళ్లు వెనకేస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు సగటు ఆయుర్దాయం 69 ఏళ్లకు చేరుకుంది, ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగటం,
వైద్యరంగంలో వచ్చిన అనూహ్య పురోగతి కారణంగా నేడు చాలామంది 80-85 ఏళ్ల వరకూ కూడా హాయిగానే జీవిస్తున్నారు. దీనర్థం ఉద్యోగ విరమణ తర్వాత కూడా దాదాపు మరో 20 - 25 ఏళ్లు భరోసాగా బండి లాగించాల్సిన అవసరం ఉందనే! విరమణ తర్వాత కూడా ఇప్పుడు చాలామంది అదే వృత్తిలో కొనసాగటమో.. లేక మరో ఉపాధి మార్గం చూసుకోవటమో చేస్తున్నారు. దీన్నే ఇప్పుడు ముద్దుగా ‘సెకండ్‌ ఇన్నింగ్స్‌’ అంటున్నారు. కాలక్షేపానికో, ఆసక్తితోనో ఇలా ఉద్యోగం చేస్తుంటే మంచిదేగానీ కేవలం రోజు గడవటం కోసమో, ఆర్థిక భరోసా కోసమో ఆ వయసులో కూడా ఉపాధి వెతుక్కోవాల్సి వస్తే మాత్రం పెద్ద ఇబ్బందే. ముఖ్యంగా పింఛన్లు ఉండని ప్రైవేటు రంగంలో పనిచేసిన వారి పరిస్థితి ఒక్కసారిగా అయోమయం అయిపోతుంది. ఆ మాటకొస్తే ప్రభుత్వ రంగంలో కూడా పింఛన్లు ఇప్పుడు గతంలోలా ఉండడం లేదు. అందుకే కొత్త సంవత్సరం వంటి ఇలాంటి ప్రత్యేక ఘడియల్లో.. ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుని, విరమణ తర్వాత ఆదాయం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికను సిద్ధం చేసుకోవటం చాలా అవసరం.

రేపటి కాలానికి...

75% అవసరం

చాలామంది ఉద్యోగం మానేశాక ఏం ఖర్చులు ఉంటాయి? తగ్గుతాయి కదా అని అనుకుంటారు. కానీ, వ్యక్తిగత  ఆర్థిక ప్రణాళిక నిపుణులు చెప్పేదాన్ని బట్టి చూస్తే.. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా.. ఇదే తరహా జీవనశైలి కొనసాగించాలంటే ప్రస్తుతం వస్తున్న  ఆదాయంలో కనీసం 75% వరకూ నగదు అవసరం అవుతుంది. దీన్ని ఎలా పొందాలన్నదే చిక్కు ప్రశ్న. అందుకే, ఆర్జన ప్రారంభం కాగానే పింఛను పాలసీలు, ఇతర మార్గాల్లో మదుపు చేయటం ఆరంభించాలి.

పింఛన్‌ బాధ్యత మనదే

కుటుంబాలు చిన్నవవుతున్నాయి
పిల్లలంతా కలిసికట్టుగా పెద్ద కుటుంబంగా ఉంటున్నప్పుడు ఇంట్లో పెద్ద వయసు వారికి జీవిక భరోసా ఉండేది. చిన్నకుటుంబాలు పెరిగిన తర్వాత పెద్ద వారికి ఆ భరోసా కరువవుతోంది. పెద్దవయసులోనూ సొంతగా జీవించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్న కీలక విషయం ఇది.

ప్రైవేటు కొలువులే ఎక్కువ
2030 కల్లా భారత్‌ జనాభాలో 12% అంటే దాదాపుగా 18.33 కోట్లమంది 60 ఏళ్ల పైబడిన వాళ్లే ఉంటారు. 2012 నాటికే దేశంలోని మొత్తం ఉద్యోగాల్లో ప్రభుత్వ రంగ వాటా 28.86% కాగా, ప్రైవేట్‌ రంగానికి 71.14%. ఈ ఆరేళ్లలో ప్రైవేటు రంగం మరింతగా విస్తరించింది. ఉపాధి కల్పన పెరగటం మంచిదేగానీ ప్రైవేటు రంగంలో వారికి మలి వయసు భరోసా కోసం ఎలాంటి పింఛను నిధి, రక్షణ ఉండటం లేదు. అందుకే ఎవరి భరోసా వారు చూసుకోవాల్సిందే.

ద్రవ్యోల్బణం, పరిస్థితి అనూహ్యం
ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ నగరాలకు, పట్టణాలకు వస్తుండటంతో ఆకాశాన్నంటే అద్దెలు, పిల్లల చదువులు, వైద్యం ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఆ స్థాయిలో ఆదాయాలు మాత్రం పెరగటం లేదు. పైగా మూలిగే నక్క మీద తాటిపండులా ద్రవ్యోల్బణం ఒకటి! వీటివల్ల ఉద్యోగం చేస్తున్నవాళ్ల పరిస్థితే కనాకష్టంగా ఉంటోంది. ఇక నికరమైన నెలవారీ జీతం లేని వారి పరిస్థితి ఊహించటం కూడా కష్టం. సొంతగా ఉండలేక, పిల్లలకు భారం కావటం ఇష్టం లేక.. ముందు నుంచే పింఛన్‌ ప్రణాళిక వేసుకుని ఉంటే బాగుండేదని చింతిస్తున్న వాళ్లు ఎంతోమంది!

రేపటి కోసం నేడే!

ఎప్పుడో విరమణ గురించి ఇప్పటి నుంచే ఆలోచించటం ఎందుకన్న ధోరణి ఇప్పుడు సరికాదు. విరమణ ప్రణాళికను ఎంత చిన్న వయసు నుంచి ఆరంభిస్తే అంత మేలు జరుగుతుందని, భారం కూడా తగ్గి భరోసా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న వయసులోనే పొదుపు ఆరంభిస్తే.. ఆ మొత్తం వృద్ధి చెందడానికి ఎక్కువ సమయం ఉంటుంది, విరమణ తర్వాత చేతికందే మొత్తం కూడా ఎక్కువ ఉంటుంది. చిన్న ఉదాహరణ చూద్దాం. రమేశ్‌ వయసు 25. సురేశ్‌కు 35 ఏళ్లు. ఇద్దరూ 60 ఏళ్ల ఉద్యోగ విరమణ నాటికి ఆర్థిక భరోసా కోసం ఒకేసారి పొదుపు చేయటం ఆరంభిస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం.

* 25 ఏళ్ల రమేశ్‌ ఇప్పటి నుంచి నెలకు రూ.35,133 చొప్పున పెట్టుబడి పెడితే ఏటా 10% రాబడి అంచనాతో విరమణ నాటికి చేతికి వచ్చేది రూ.12.56 కోట్ల వరకూ ఉంటుంది. అదే 35 ఏళ్ల సురేశ్‌ ఇప్పటి నుంచీ నెలకు రూ.46,976 చొప్పున మదుపు చేసినా కూడా విరమణ నాటికి చేతికి దక్కేది రూ.6.09 కోట్లే! ఇక్కడ సురేశ్‌ నెలవారీ పొదుపు చేసింది ఎక్కువగానే ఉన్నప్పటికీ విరమణ తర్వాత అతనికి అందే మొత్తం తక్కువ ఉంది. అదే రమేశ్‌ 25 ఏళ్ల వయసులో ప్రారంభించటం వల్ల విరమణ తర్వాత ఏకంగా రూ.12.56 కోట్లు అందుకుంటాడు. ఇద్దరూ పొదుపు చేసిన మొత్తంలో వ్యత్యాసం ఎక్కువ లేకున్నా అందుకునే మొత్తంలో మాత్రం భారీ తేడా ఉంటుంది. అందుకే ‘వీలైనంత త్వరగా.. వీలైనంత ఎక్కువగా’ అన్న సూత్రం గుర్తుంచుకోవాలి!

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.