close

ప్ర‌త్యేక క‌థ‌నం

నిట్టనిలువు వ్యవసాయం

వ్యవసాయ రంగంలో ఆధునిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. వాతావరణ మార్పులతో దిగుబడులు తగ్గిపోవడం, వ్యవసాయ యోగ్య భూముల లభ్యత క్షీణించడం వల్ల కొత్త విధానాలపై పరిశోధకులు చూస్తున్నారు. నియంత్రిత వాతావరణ వ్యవసాయ విధానాలపై దృష్టిసారించారు. ఇందులో ‘నిట్టనిలువు సేద్యం’ (వర్టికల్‌ ఫామింగ్‌) వేగంగా వృద్ధి చెందుతోంది. గల్ఫ్‌ దేశాల్లో ఇది ఆకర్షణీయంగా మారింది. యూఏఈ దీని విషయంలో ముందంజలో ఉంది. ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ప్రపంచంలోనే అత్యంత పెద్ద వర్టికల్‌ ఫామ్‌ను నిర్మిస్తోంది. ఆహారం, వ్యవసాయ ఆటోమేషన్‌ను అభివృద్ధి చేసేందుకు ఒక ‘ఆహార వేలీ’ని అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది.

ఏమిటీ విధానం?
నిట్టనిలువు సేద్యంలో ఎత్తయిన భవనాల్లో గదిలోపల, నియంత్రిత వాతావరణంలో ట్రేలు లేదా వేలాడే మాడ్యూళ్లలో ఆహార పంటలను సాగు చేస్తారు. కాంతి, తేమ, ఉష్ణం వంటి అంశాలను కృత్రిమంగా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అవసరం మేరకు వాటిని నియంత్రించొచ్చు. గదిలోపల మొక్కలను క్రమపద్ధతిలో ఒకదానిపై ఒకటి అమరుస్తారు.

ఎందుకు అవసరం?
700 కోట్లుగా ఉన్న ప్రస్తుత ప్రపంచ జనాభా 2050 నాటికి 900 కోట్లకు చేరుతుందని అంచనా. అందుకు అనుగుణంగా ఆహార అవసరాలు తీర్చాలంటే అభివృద్ధి చెందిన దేశాల్లో 70 శాతం మేర, వర్ధమాన దేశాల్లో 100 శాతం మేర ఆహార ఉత్పత్తి పెరగాలి. సాగునేల, సాగునీటి లభ్యత తగ్గిపోవడం, వాతావరణ మార్పులతో ప్రతికూల పరిస్థితులు వంటి కారణాల వల్ల కావాల్సినంత దిగుబడి కష్టమే. దీంతో ప్రత్యామ్నాయ సాగు  ఆవశ్యకత ఏర్పడింది.

 

బోలెడు ప్రయోజనాలు..

* ఏడాది పొడవునా కూరగాయలు, పండ్లు, ఆకు కూరలను పండించొచ్చు.

* నియంత్రిత వాతావరణం వల్ల క్రిమికీటకాలు, కలుపు మొక్కలు ఉండవు. ఫలితంగా క్రిమిసంహారక మందులు, హానికరమైన రసాయనాల వాడకం ఉండదు.

* వాతావరణంలో మార్పులు, చీడపీడల వల్ల సాధారణ సేద్యంలో దాదాపు 30 శాతం మేర దిగుబడిలో నష్టం ఏర్పడుతుంటుంది. ఈ విధానంలో దిగుబడులు తగ్గిపోయే పరిస్థితి ఉండదు.

* వర్టికల్‌ ఫామ్స్‌లో నీటిని శుద్ధి చేసి మళ్లీ వినియోగిస్తారు. మొత్తం మీద నీటి వినియోగం 70 శాతం తగ్గుతుంది. కూలీలూ తక్కువగానే అవసరమవుతారు.

* సాధారణ వ్యవసాయంలో 30 ఎకరాల్లో పండించిన పంటను.. వర్టికల్‌ సాగు విధానంలో ఒక ఎకరంలోనే పండించవచ్చు.

* పట్టణాలకు దగ్గర్లోనే వర్టికల్‌ ఫామింగ్‌ను చేపడితే తాజా ఉత్పత్తులను గంటల వ్యవధిలోనే ఉత్పత్తులను వినియోగదారుడి వద్దకు చేరవేయవచ్చు.

పలు విధానాలు..

వర్టికల్‌ ఫామింగ్‌లో చాలావరకూ హైడ్రోపోనిక్‌ లేదా ఏరోపోనిక్‌ విధానాలను అనుసరిస్తారు. హైడ్రోపోనిక్‌ విధానంలో మొక్కలను పోషకాలు పుష్కలంగా ఉన్న నీటి పాత్రలో సాగు చేస్తారు. ఏరోపోనిక్‌ ప్రక్రియలో వేళ్లపై నీరు, పోషకాలతో కూడిన తుంపర్లను సూక్ష్మస్థాయిలో వెదజల్లుతారు. ఈ రెండో విధానంలో చాలా తక్కువగా నీరు అవసరమవుతుంది. ఈ రెండు విధానాల్లోనూ మట్టి అవసరం ఉండదు.

కృత్రిమ మేధతో..

జపాన్‌ తదితర దేశాల్లో వర్టికల్‌ ఫామింగ్‌లో కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్‌, ప్రత్యేకంగా రూపొందించిన విద్యుత్‌, కమ్యూనికేషన్‌ పరిజ్ఞానాలను వినియోగిస్తున్నారు. దీనివల్ల ఖర్చులు మరింత తగ్గించుకుని దిగుబడులను రెట్టింపు చేసుకోవచ్చు.

ఇబ్బందులు..
* నేల, భవనం, మౌలిక వసతుల కోసం ఎక్కువ పెట్టుబడి అవసరం.
* కొన్ని రకాల పండ్లు, కూరగాయల సాగుకే ఈ విధానం పరిమితం.

* కీటకాల ద్వారా పరాగ సంపర్కానికి అవకాశం తక్కువ. తేనెటీగల సాగుతో దీన్ని అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఖర్చు తగ్గించుకోవచ్చు..
మౌలిక వసతుల ఏర్పాటుకయ్యే ఖర్చు ఏకకాల పెట్టుబడి. తర్వాత ఈ ఖర్చులు తగ్గుతాయి. నిరుపయోగంగా ఉన్న గోదాములను వాడుకోవచ్చు. సౌర విద్యుత్‌ వంటి సంప్రదాయేతర విధానాల ద్వారా ఇంధన ఖర్చు తగ్గుతుందటున్నారు.

  - ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.