Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

నిపుణా.. నీదే విపణి

నిపుణా.. నీదే విపణి

‘పాడిందే పాడరా..’ అనే రోజులు కావివి! ఈ అత్యాధునిక సాంకేతిక యుగంలో.. విద్య నుంచి ఉద్యోగాల వరకూ ప్రతిదీ క్షణక్షణానికీ మారిపోతోంది. ఇప్పుడు ఎవర్ని కదిపినా.. కృత్రిమ మేథ, మెషీన్‌ లెర్నింగ్‌, ఆటోమేషన్‌, బిగ్‌ డేటా, క్లౌడ్‌ టెక్నాలజీ, ఎడ్జ్‌ కంప్యూటింగ్‌ లాంటి కొత్త కొత్త మాటలే వినిపిస్తున్నాయి. ఇవి కూడా ఇవాళ ఉన్నట్టు రేపు ఉండటం లేదు. నేటి తరానికి రేపటి రోజు విసురుతున్న ‘సాంకేతిక’ సవాల్‌ ఇది! ఈ ప్రవాహంలో మనం నిలబడాలంటే.. ఎప్పటికప్పుడు కళ్లూ చెవులూ తెరచి పెట్టుకుని, ఆలస్యం చెయ్యకుండా కొత్త కొత్త నైపుణ్యాల్ని అందిపుచ్చుకోక తప్పదు. కొత్త సంవత్సరంలో ఇలాంటి వారికే ఉద్యోగ రంగం ఎర్ర తివాచీ పరుస్తుందని కెరీర్‌ విశ్లేషణ సంస్థలు నొక్కి చెబుతున్నాయి. ఈ దశలో మనం అలవరచుకోవాల్సిన నైపుణ్యాలేమిటి? దీని గురించి ప్రముఖ సంస్థలేం చెబుతున్నాయి?

‘‘ఎప్పటికప్పుడు సరికొత్త నైపుణ్యాల్ని ఒంటబట్టించుకుని.. వాటిని సృజనాత్మక రీతుల్లో ప్రదర్శించే వారిదే భవిష్యత్తు’’

- రాబర్ట్‌ గ్రీన్‌
(సుప్రసిద్ధ అమెరికా రచయిత)

మనిషి పనుల్ని మర మనుషులు ఎగరేసుకుపోతున్న సాంకేతిక యుగమిది. సంప్రదాయ ఉద్యోగాలు తెరమరుగై.. మేధతో, సాంకేతిక ప్రతిభతో చేసే పనులదే పైచేయిగా మారిన ఈ రోజుల్లో.. కొత్తగా పుట్టుకొస్తున్న ఉద్యోగ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే నైపుణ్యాలను ఆశ్రయించక తప్పదు. ప్రముఖ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ సంస్థ మెకెన్సీ, వృత్తి నిపుణుల సామాజిక వేదిక లింక్డిన్‌, మ్యాన్‌పవర్‌ గ్రూపు సర్వేలన్నీ ఈ విషయాన్నే కుండ బద్దలు కొట్టి చెబుతున్నాయి. మన దేశంలో 2010-16 మధ్య సంఘటిత రంగంలో అత్యధిక ఉద్యోగాల సృష్టి జరిగింది. 2017-18లో మాత్రం ఈ ఊపు కనిపించలేదు. 2019లో కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని, అయితే నిపుణులకు మాత్రం అన్ని వేళలా అవకాశాలు పుష్కలంగా ఉంటాయని మ్యాన్‌పవర్‌ గ్రూపు తాజా సర్వే చెబుతోంది. కొత్త ఉద్యోగాల వేట ప్రారంభించాలన్నా.. ఉన్న ఉద్యోగాల్లో వస్తున్న కొత్త మార్పులు మీ కెరీర్‌ను దెబ్బతీయకుండా ఉండాలన్నా కొత్త నైపుణ్యాలు తప్పనిసరి అన్నది ఈ సర్వేల విస్పష్ట హెచ్చరిక!

నిపుణా.. నీదే విపణి

భావోద్వేగ ప్రజ్ఞ (ఈక్యూ)
కొత్తకొత్త కంప్యూటర్‌ భాషలు నేర్చుకుని, కోడింగ్‌లు చేసే వారికి ఇప్పుడు కొదవ ఉండటం లేదు. అందుకే వీటితో పాటు పని ప్రదేశంలో, ఇతరులతో కలిసి ఎంత సమర్థంగా పని చేయగలరన్నది ఇప్పుడు కీలకంగా మారుతోంది. ప్రేమ, ద్వేషం, సంతోషం... వంటి రకరకాల భావోద్వేగాలను సమయానుకూలంగా నియంత్రించుకుని.. పని అవసరాలకు, బృంద అవసరాలకు తగ్గట్లుగా వాటిని ఎంత ప్రతిభావంతంగా వినియోగించగలుగుతున్నారన్నది కంపెనీలు చూస్తాయి. కేవలం మన భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవటమే కాదు.. ఇతరుల భావోద్వేగాల్ని కూడా గుర్తించి.. అందుకు తగ్గట్టుగా వాతావరణాన్ని నియంత్రిస్తేనే వృత్తిపరమైన విజయాలు సాధ్యమని ఈ సంస్థలు చెబుతున్నాయి. అందుకే పని ప్రదేశంలో భావోద్వేగ ప్రజ్ఞ(ఈక్యూ) అనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. దీన్ని చూసే కంపెనీలు ఉద్యోగాలిస్తున్నాయి.

డేటా విశ్లేషణ సామర్థ్యం
కంపెనీలన్నీ కూడా ఆటోమేషన్‌, డిజిటలైజేషన్‌ వైపు శరవేగంగా మళ్లుతున్నాయి. మీ సాంకేతిక పరిజ్ఞానం ఆటోమేషన్‌తో సరితూగుతోందా? మీకు డేటా విశ్లేషణ సామర్థ్యం ఎంతవరకూ ఉంది? దాన్ని ఇతరులకు అర్థమయ్యే రీతిలో ఏ మేరకు చెప్పగలుగుతున్నారు? అన్నది కంపెనీలు తరచి తరచి చూస్తున్నాయి. గుట్టలుగా వచ్చిపడుతున్న కంప్యూటర్‌ డేటాను విశ్లేషించే నేర్పరితనం తప్పనిసరి.

నిపుణా.. నీదే విపణి

సృజన
నైపుణ్యం లేకపోయినా ఉద్యోగంలో నెట్టుకురావొచ్చనే రోజులకు కాలం చెల్లింది. దానికి తోడుగా.. సృజన కూడా ఉంటేనే ఉద్యోగంలో మనుగడ! దూరదృష్టితో పనిచేసే కంపెనీ ఏదైనా ముందు.. మీరు ఎంత కొత్తగా ఆలోచిస్తున్నారు, దానికి ఎంత వినూత్నంగా ఆచరణరూపం ఇవ్వగలుతున్నారన్నదే చూస్తుంది. ముందున్న సమస్యలకు కొత్తగా, విభిన్న కోణాల్లో పరిష్కారాల్ని కనుగొనే సృజనశీలుర్నే ఉద్యోగ మార్కెట్‌ కాంక్షిస్తోంది. తమ ఉత్పత్తులు, సేవల విస్తరణ కోసం కొత్త ఆలోచనాపరుల కోసమే కంపెనీలు వెతుకుతున్నాయి.

భావ వ్యక్తీకరణ నైపుణ్యం
ఉద్యోగ మార్కెట్లో కనిపిస్తున్న అతిపెద్ద లోపం ఉద్యోగార్థుల్లో సరైన ‘కమ్యూనికేషన్స్‌ స్కిల్స్‌’ లేకపోవడమేనని లింక్డిన్‌ ఎమర్జింగ్‌ జాబ్స్‌ నివేదిక నొక్కిచెప్పింది. ఇతర వ్యక్తుల్ని ఆకట్టుకునేలా మాట్లాడి, మంచి నివేదికలు రాయగలిగి, సమావేశాల్లో చక్కటి ప్రజెంటేషన్‌లు ఇవ్వగలిగిన వారికి సంస్థలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. డేటా విశ్లేషణ, సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి, ఆర్ట్స్‌, డిజైన్‌ లాంటి ఉద్యోగాల్లో ఇది ఎంతో కీలకాంశం.

సునిశిత ఆలోచన
ఆటోమేషన్‌ పెరుగుతున్న కొద్దీ సునిశితంగా(క్రిటికల్‌) ఆలోచించే వారి అవసరం పెరుగుతోంది. మనిషి నిర్దేశాలకు అనుగుణంగా యంత్రం పనిచేస్తుంది. ఆ సాంకేతిక పరిజ్ఞానం సృష్టించిన ఉత్పత్తుల్లోని మంచి చెడుల్ని సునిశితంగా విశ్లేషించే, దానిని కంపెనీ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చగలిగే సామర్థ్యమున్న ఉద్యోగులకు గిరాకీ పెరుగుతోంది.

సమస్యల పరిష్కారం
సంక్లిష్ట సమస్యల్ని సైతం చాకచక్యంగా పరిష్కరించే నేర్పరితనాన్ని ఉద్యోగ మార్కెట్‌ అభిలషిస్తోంది. 2020 నాటికి ఇదే కీలక నైపుణ్యమవుతుందని.. దాదాపు 36 శాతం ఉద్యోగాలు దీని ఆధారంగానే ఉంటాయనేది ఓ నివేదిక సారాంశం.

ప్రేరణ, నాయకత్వ నైపుణ్యం

నిపుణా.. నీదే విపణి

* నీ బృంద సభ్యుల్లో ఎంత గొప్పగా స్ఫూర్తి నింపగలుగుతావు?
* నీ బృందాన్ని ఎంత సమర్థంగా నడపగలవు? నీ ఉన్నతోద్యోగులు,
* నీ చుట్టూ ఉన్న ప్రజలతో ఎంతటి ఉత్తమ సంబంధాల్ని నెరపగలుగుతావు? అనేవి నైపుణ్యాల మార్కెట్లో ముఖ్యాంశాలు. సంతోషంతో ఉండగలిగిన ఉద్యోగుల్ని నీవు సృష్టించగలిగితే.. నీ యజమానికి కూడా నీవు సంతోషకరమైన ఉద్యోగి అవుతావు!

2019.. ఉద్యోగ సంరంభం

నిపుణా.. నీదే విపణి

కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌)
మనిషి మేధస్సును అనుకరించి, లక్ష్యాల్ని చేరుకునేందుకు సృష్టించిన కంప్యూటర్‌ వ్యవస్థే ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌. మనుషుల కన్నా వేగంగా, కచ్చితంగా నిర్ణయం తీసుకుని, లక్ష్యాలు నెరవేర్చే వ్యవస్థ ఇది.

మెషీన్‌ లెర్నింగ్‌
ఇది కృత్రిమ మేధలో ఒక ఉప అంగం. సమాచారం లోతుల్లోకి వెళ్లి విశ్లేషించే గుణం దీని ప్రత్యేకత. 2022 నాటికి మెషీన్‌ లెర్నింగ్‌ మార్కెట్‌ 881 కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా.

రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌(ఆర్‌పీఏ)
అప్లికేషన్లను ప్రతిక్షేపించడం, కార్యకలాపాల ప్రాసెసింగ్‌, సమాచార నిర్వహణ, ఈ మెయిల్స్‌కు బదులివ్వడం కోసం సాఫ్ట్‌వేర్‌ను వినియోగించే ప్రక్రియ ఇది. దీనివల్ల 23 కోట్ల ఉద్యోగాలు పోతాయని అంచనా ఉన్నా.. కేవలం 5 శాతం ఉద్యోగాలు పూర్తిగా ఆటోమేటెడ్‌ అవుతాయని మెకెన్సీ చెబుతోంది.
- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.